.
పిల్లలు ఈ సినిమా చూడొద్దు అని చెప్పాడు హీరో కమ్ నిర్మాత యశ్ తన తాజా సినిమా టాక్సిక్ గురించి… పిల్లలే కాదు, పెద్దలూ చూడనక్కర్లేదు అన్నట్టుగా ఆ టాక్సిక్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పెంట పెంట చేసి జనంలోకి వదిలింది ఈ సినిమాను…
టాక్సిక్: పెద్దల కోసం ఒక అద్భుత కథ అనే టైటిల్, ట్యాగుతోనే వచ్చారు కదా… ప్చ్, పెద్దల వీక్షణాలకూ పనికిరాకపోతే ఇక ప్రయోజనం ఏమిటయ్యా యశ్..?
Ads
కటువుగా ఉన్నా సరే, ఇంకొన్ని చెప్పుకోవాలి నిజాల్ని… యశ్ కేజీఎఫ్ రెండు భాగాల సీరీస్ రాకముందు ఎవరికీ తెలియదు, తన టేస్ట్ ఏమిటో, తన రేంజ్ ఏమిటో మనకు తెలియదు… కేజీఎఫ్ తరువాత హఠాత్తుగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు… తప్పు లేదు, ఆహ్వానిద్దాం…
కేజీఎఫ్ వచ్చి మూడేళ్లు దాటింది కదా, ఈ టాక్సిక్ మీదే కాన్సంట్రేట్ చేశాడు, కానీ కథ, ప్రజెంటేషన్, పోకడ అంతా కేజీఎఫ్ హ్యాంగోవర్‌లోనే ఉంది… యశ్ అందులో నుంచి బయటికి రాలేకపోయాడు… దర్శకురాలు కూడా యశ్ టేస్టుకు, తన బేకార్ టేస్టును కూడా కలిపి అటూఇటూ కాని ఓ సినిమాను తీసింది… అఫ్‌కోర్స్, జననాయగన్ కూడా తీసిన ఈ సహనిర్మాత వెంకట్ కే నారాయణ టేస్టు కూడా అర్థమైపోయింది… అన్నట్టు, దీనికి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అటగా… ఫాఫం…

ఇంకా ఈ నిర్వాకానికి టికెట్ రేట్ల పెంపు, పవిత్రంగా ఉండాల్సిన కాలేజీల ప్రాంగణాన్ని ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు వాడటం… అంతా టాక్సిక్ యవ్వారమే… పైగా మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈమాత్రం ఉద్దరణకు ఐదుగురు ప్రముఖ హీరోయిన్లు… ఎందుకు ఇంతమంది అనే ప్రశ్న థియేటర్ వదిలాక కూడా పదే పదే ప్రేక్షకుడిని తొలుస్తూనే ఉంటుంది… నయనతార, కియరా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా మాత్రమే కాదు… అదనంగా సంజీదా షేక్ కూడా…
సినిమా నిర్మాణ విలువలు, ఖర్చు భారీగా కనిపిస్తాయి తెర మీద… మరి పాన్ ఇండియా సినిమా అంటే మజాకా..? స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లు, బీభత్సమైన యాక్షన్ సీన్లు మన్నూమశానం… ఒక పుష్ప, ఒక కేజీఎఫ్… ఇప్పుడు టాక్సిక్… ఇదీ అసలైన టాక్సిక్ ధోరణి… ఈ టాక్సిక్‌లో అదనంగా ఏమిటంటే బొచ్చెడు, బోలెడు బోల్డ్ సీన్లు… వెగటుగా, రోతగా… కనీసం ఆ మహిళా దర్శకురాలు అవైనా కాస్త కళాత్మకంగా క్రియేటివ్‌గా చూపినా బాగుండు… పచ్చిగానే దాదాపు…

స్క్రిప్టు, కథలో ఘర్షణ, డ్రామా మీద అసలు సినిమా టీమ్‌కు స్పష్టత లేదు… అంత ఖర్చు పెట్టారు కదా, ఎడిటింగ్ చూసుకోవాలి కదా… వదిలేశారు… దాంతో సుదీర్ఘమైన బోరింగ్ ఫలితం ప్రేక్షకుడికి… 3 గంటల 14 నిమిషాలు… మేం తీస్తాం, చచ్చినట్టు ప్రేక్షకుడు చూస్తాడు అనే టాక్సిక్ ధోరణి ఇది… తెలుగు డబ్బింగ్ కూడా నాసిరకం…
ఈ సినిమాను భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేయడానికి, ఆల్రెడీ హిట్ టాక్ ఉన్న ఇరుముడి సినిమాను చాలా థియేటర్ల నుంచి లేపేశారు… ఇది మరో టాక్సిక్ ధోరణి… యశ్ డబుల్ రోల్‌లో తనవరకూ బాగానే చేశాడు, కానీ ఆ అయిదుగురు హీరోయిన్లు ఎందుకొస్తున్నారో, ఏం చేస్తున్నారో పాపం ఆ దర్శకురాలికే క్లారిటీ లేనట్టుంది…

ఈ సినిమా గ్లింప్స్ వచ్చినప్పటి నుంచీ వివాదాలు, అభ్యంతరాలు… చివరకు ప్రధాన కథానాయిక కూడా కియారా అడ్వానీ కూడా ‘నాకు చెప్పింది వేరు, తీసింది వేరు, ఈ బోల్డ్ సీన్లను నేనొప్పుకోను’ అని పంచాయితీ కూడా పెట్టింది… తానేదో గొప్ప సినిమా తీసినట్టు ఫోజు కొట్టిన గీతూ మోహన్‌దాస్ ససేమిరా అంది, అందుకే రిలీజ్ లేటైంది…
మొత్తానికి ఇరుముడి సినిమాకు మరింత ఆదరణ పెరుగుతుంది…
రాయ్ (యష్), అతని చెల్లెలు (నయనతార) గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో చాలా కష్టమైన జీవితాన్ని గడుపుతుంటారు. రాయ్ జీవితంలోకి పలువురు మహిళలు ఎలా ప్రవేశించారు? అలాగే అతని కొడుకు టికెట్ (యువ వయసులోని యష్) తో వచ్చే ఘర్షణ ఈ చిత్ర కథాంశం…
ఏమాటకామాట… తెరపై ఎంతో మాస్ లుక్‌లో కనిపిస్తూ, ఒక నిజమైన పాన్-ఇండియా స్టార్‌కు తగిన ఆధిపత్య, గంభీరమైన అభినయాన్ని ప్రదర్శించాడు యశ్… కాకపోతే లుక్స్, కాస్ట్యూమ్స్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నింటిలోనూ కెజిఎఫ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది… (రామాయణంలో రావణుడి పాత్రకూ ఈ ధోరణే చూపించబోతున్నారు…)
ఇంటర్వెల్ వరకు జరిగే కథ అంతా ‘కేవలం స్టైల్ మాత్రమే ఉంది, సబ్ స్టాన్స్ (కంటెంట్) లేదు’ అనేలా సాగుతుంది… ప్రథమార్థం అంతా నాన్‌స్టాప్ యాక్షన్‌తో నిండి ఉంది, కానీ ఎక్కడా స్పష్టమైన సంఘర్షణ (కాన్‌ఫ్లిక్ట్) గానీ, ఆకట్టుకునే డ్రామా గానీ లేదు…
విచిత్రమేమిటంటే, సినిమాలో చాలా మంది మహిళా పాత్రలను, విలన్లను ప్రవేశపెట్టారు. తెరపై విపరీతమైన హడావుడి జరుగుతుంది, కానీ ఆ డ్రామాను అర్థం చేసుకోవడం కష్టం, దానితో కనెక్ట్ అవ్వడం అంతకంటే కష్టం. అంతులేని తుపాకులు, రక్తం, హింస, యాక్షన్ మరియు బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ, ప్రథమార్థంలో ఒక్కటంటే ఒక్క హై మూమెంట్ కూడా లేదు. ఈ అంశాల్లో ఏదీ సినిమాను నిస్సారమైన, పేలవమైన ప్రదర్శన నుండి బయటపడేయలేకపోయింది.
రుక్మిణి వసంత్ ఎంట్రీ, నీటిలో చిక్కుకున్న బిడ్డను యశ్ రక్షించే సన్నివేశం ఒక పాన్-ఇండియా సినిమాకు చెందిన ‘అన్ ఇంటెషనల్ పేరడీ’ లా అనిపిస్తుంది. ఈ సీక్వెన్స్ ఎంత ఓవర్-ది-టాప్‌గా ఉందంటే, దశాబ్దం క్రితమే విపరీతంగా ట్రోల్ అయిన సన్నివేశాలను ఇది గుర్తుకు తెస్తుంది…
అలాగే రవి బస్రూర్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి అందించిన సంగీతం తీవ్ర నిరాశను మిగిల్చింది. పాటలు ఎలాంటి ప్రభావం చూపవు… శుద్ద దండుగ యవ్వారం..!!
Share this Article