.
ఇరుముడిలో ఆ చిన్నపిల్ల మణెమ్మను చూసి మెచ్చాం… కానీ నటిగా నక్షత్రను మాత్రం కాపాడుకోవాలి! ‘ఇరుముడి’లో ఆ చిన్నారి నటన నిజంగానే ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఇప్పుడు మొదలైన ఇంటర్వ్యూల హడావుడిలో ఆమె సహజత్వం ఎక్కడో మాయమవుతోంది!
తెరపై రవితేజ కూతురు మణెమ్మగా కనిపించిన ఆ ముద్దొచ్చే చిన్నారి… నిజానికి సినిమాలో రవితేజతో పోటీ పడి నటించింది అనడం కంటే, నటిస్తున్నట్టు గాకుండా సహజంగా కనిపించింది అనడం కరెక్ట్. అదే ఆమె బలం.
Ads
ఏడో తరగతి చదువుతున్న ఈ కన్నూరు అమ్మాయికి నటనలో కనిపిస్తున్న ఆ ‘ఈజ్’ సాధారణంగా పిల్లల్లో కనిపించదు. ఏడవాల్సిన సీన్లో ఏడుపు, నవ్వాల్సిన చోట నవ్వు అన్నట్టు లెక్కలు వేసుకుని చేసిన నటన కాదు. కెమెరా ముందు ఉన్నానన్న స్పృహే లేనట్టుగా ఉంటుంది. అందుకే మణెమ్మ పాత్ర ప్రేక్షకులకు అంత దగ్గరైంది.
ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. నక్షత్రకు ‘ఇరుముడి’ తొలి సినిమా కాదు. తెలుగులో ఇదే మొదటి సినిమా అయినా, అంతకుముందే తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది. 2024లో వచ్చిన Petta Rapతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది, ఆ తర్వాత Ennum Swantham Punyalan, I, Nobody వంటి సినిమాల్లో కనిపించింది. శివరాజ్‌కుమార్‌తో చేస్తున్న కన్నడ చిత్రం Dad ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది.
అంటే ‘ఇరుముడి’తో ఒక్కసారిగా సినిమాల్లోకి వచ్చిన కొత్త పాప కాదు. చిన్న వయసులోనే దక్షిణాది నాలుగు భాషల సినిమా ప్రపంచాన్ని చూస్తున్న పిల్ల. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఆమె చేసిన Instagram Reels చూసి, ఈ పిల్ల ఇరుముడిలో ఆ పాత్రకు సూటవుతుందని అనుకుని, శివ నిర్వాణే వెతుక్కుంటూ వెళ్లాడు.
రవితేజ కూతురిగా కనిపించే అమ్మాయి ఎలా ఉండాలనే విషయంలో దర్శకుడికి ఒక స్పష్టమైన ఆలోచన ఉందట. ఆ ముఖంలో అమాయకత్వం ఉండాలి. అదే సమయంలో ధైర్యం కూడా కనిపించాలి. ఇంటి పిల్లలా సహజంగా ఉండాలి. అలా వెతుకుతున్న సమయంలో నక్షత్ర రీల్ కనిపించింది. లుక్ టెస్ట్, కొన్ని వీడియోలు తీసిన తర్వాత ఆమెనే మణెమ్మగా ఫిక్స్ చేశారు.

అది అదృష్టం కావచ్చు. కానీ ఆ అవకాశాన్ని తెరపై నిలబెట్టుకుంది మాత్రం నక్షత్రే. తెలుగు తెలియకపోయినా, శివ నిర్వాణ టీమ్ సహాయంతో డైలాగులు నేర్చుకుని తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పింది.
ఇంకా ఒక వ్యక్తిగత విషాదం కూడా ఈ చిన్నారి జీవితంలో ఉంది. శివ నిర్వాణ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం నక్షత్ర తండ్రి ఆమె చిన్నతనంలోనే మరణించాడు. తల్లి ఒక్కతే ఆమెను పెంచుతోంది. సినిమాకు ముందు కొన్ని యాడ్స్ చేసింది ఈ అమ్మాయి…
సినిమాలో తండ్రి పాత్రలో రవితేజతో ఉన్న భావోద్వేగ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఈ విషయం దర్శకుడికి తెలిసింది. నిజ జీవితంలో తండ్రి లేని ఒక చిన్నారి… తెరపై తండ్రి కోసం తపించే కూతురిగా ఇంత సహజంగా కనిపించడం వెనుక ఏదో తెలియని భావోద్వేగం కూడా ఉండి ఉండొచ్చని దర్శకుడు చెప్పాడు.

ఇదంతా చూస్తే నక్షత్ర భవిష్యత్తుపై అంచనాలు పెట్టడం తప్పేమీ కాదు. అందంగా ఉంది, మెరిట్ ఉంది, అనుభవం ఉంది, ఎదిగాక మంచి నటి అవుతుంది. పక్కా… డౌటేమీ లేదు… అదే సమయంలో ఒక చిన్న భయం కూడా ఉంది. ఇప్పుడే ఆమెను ‘స్టార్ కిడ్’లా తయారు చేయకండి.
ఆమె స్టార్ కిడ్ కాదు. స్టార్‌గా మారాల్సిన అవసరం కూడా ఇప్పుడే లేదు. ఆమెకు ఇంకా స్కూల్ ఉంది. ఏడో తరగతి చదువుతోంది. ఆమె వయసుకు తగ్గట్టుగా ఉండే స్వభావమే ఆమెకు ఉన్న అతి పెద్ద ఆస్తి. కానీ తాజాగా వస్తున్న కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటే… ఈ చిన్నారి వెనుక ఎవరో పీఆర్ పెద్దలు కూర్చుని ‘ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి’ అని నేర్పిస్తున్నారేమో అనిపిస్తోంది.
ఒక ఇంటర్వ్యూలో “తెలుగు అనే భాష ఉందని కూడా నాకు తెలియదు” అన్న తరహా మాటలు వినిపించడం అందుకు ఉదాహరణ. ఇది నిజంగా నక్షత్ర సహజమైన మాట అయితే ఫర్వాలేదు. కానీ PR టీమ్ తయారు చేసిన ‘క్యూట్ ఆన్సర్’ అయితే మాత్రం ప్రమాదమే.

ఎందుకంటే ప్రేక్షకులు ఆమెను ఇష్టపడింది ఆమె చెప్పిన డైలాగుల వల్ల కాదు. ఆమె డైలాగులు చెప్పే ముందు ఉన్న సహజత్వం వల్ల. ఇప్పుడే ఆమె చేత ‘నా ఫేవరెట్ హీరో ఎవరు’, ‘భవిష్యత్తులో హీరోయిన్ అవుతాను’, ‘తెలుగు నాకు చాలా ఇష్టం’, ‘రవితేజ సార్ నాకు నాన్నలాంటివారు’ అంటూ ఒకే తరహా ప్రమోషనల్ సమాధానాలు చెప్పిస్తే… ఆ పాపలోని అసలైన నక్షత్ర క్రమంగా కనిపించకుండా పోతుంది.
ఆమెను ‘బేబీ నక్షత్ర’గా ఉంచండి. ‘బేబీ స్టార్’ చేయడానికి తొందరపడకండి. ఇప్పటికే ఆమె నటనకు బయట నుంచి కూడా మంచి గుర్తింపు వస్తోంది. ఇరుముడి చూసిన ధనుష్ స్వయంగా శివ నిర్వాణకు కాల్ చేసి, నక్షత్రతో వీడియో కాల్లో మాట్లాడి ఆమె నటనను ప్రశంసించాడు. అంతేకాదు, ఆమె దగ్గర నటన నేర్చుకోవాలని ఉందంటూ ఓ అతిశయక్తి కూడా వదిలాడు.
ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఒక పదకొండో, పన్నెండో ఏట ఉన్న పిల్లకు ఇంకేం కావాలి? మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఆమె భవిష్యత్తులో హీరోయిన్ కావాలనుకుంటే తమ బ్యానర్‌పై లాంచ్ చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పుడామెకు కావాల్సింది హీరోయిన్ లాంచ్ కాదు. చదువు. నటన. మంచి సినిమాలు. మంచి గైడెన్స్. అంతే.

మిగతాది కాలమే చూసుకుంటుంది. ఎందుకంటే నక్షత్రలో ఏదో తెలియని మాయ ఉంది. కెమెరా ఆన్ చేసిన వెంటనే అది బయటకు వస్తోంది. దాన్ని ఏ మేనేజర్‌గానీ, PR టీమ్‌గానీ తయారు చేయలేదు. అదే ఆమె ఒరిజినాలిటీ.
ఆ ఒరిజినాలిటీని కాపాడితే… పెద్దయ్యాక మంచి నటిగా ఎదగడానికి ఈ చిన్నారికి కావాల్సిన మొదటి మెట్టు ఇప్పటికే దొరికినట్టే. మణెమ్మను ప్రేక్షకులు మర్చిపోవచ్చు. కానీ నక్షత్రను మాత్రం తొందరగా ‘మలచకండి’.
ఆమెను ఆమెగానే ఎదగనివ్వండి…
చివరగా… ఏదో ఫంక్షన్లో రవితేజ నక్షత్ర గురించి చెబుతూ ‘ముదురు ముం- ’ అని ఓ మూర్ఖపు వ్యాఖ్య వదిలాడు… ఇండస్ట్రీ భాష ఎలా ఉన్నా, ఆమెపై ప్రేమతోనే చెప్పినా… ఆ మాట మాత్రం అభ్యంతరకరం, ఏదేదో నేర్పి, ఇంటర్వ్యూయర్ల ముందు కూర్చోబెడుతున్నంతగా..!!
Share this Article