.
పరిస్థితులను గమనిస్తుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందా? అన్న సందేహం కలుగుతోంది…. ఇదీ అచ్చంగా ఏబీఎన్ రాధాకృష్ణ తన వ్యాసంలో రాసుకొచ్చిన వ్యాఖ్య… జాలేసింది… సీఎం మీద కాదు, రాధాకృష్ణ మీదు… అసలు దీనికే కాదు… మరో అంశంలో కూడా… శుభం పలకరా అంటే అని ఏదో సామెత చెప్పినట్టు కాదు… చివరకు రాజగోపాల్‌రెడ్డి ఏదో విమర్శించడాని తను అర పేజీ సుదీర్ఘ వివరణను రాసుకోవడం చూసి!!
లీజుకు తీసుకున్న ఒక రాజ్ న్యూస్ చానెల్‌ను నాలుగు రోజులు నడిపించడం చేతకాలేదు రాజగోపాలరెడ్డికి… తను వంద చానెళ్లు, వంద పత్రికలు పెడతాను అని ఏదో బీరాలు పోగానే (తెలంగాణ భాషలో ఏతులకు పోవడం) రాధాకృష్ణ పాపం తను దిగజారిపోయి, అంత పెద్ద వివరణ ఇచ్చి, రాజగోపాలరెడ్డికి లేని ప్రాధాన్యం, విలువ కల్పించాడు…
Ads
మరి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో అయిదేళ్లూ ఉంటాడా అని అపశకునం పెట్టడం మాటేమిటీ అంటారా..? ‘‘దిష్టి అయినవాళ్లే తీస్తారు’’..!! అసలు ఇక్కడ విశేషాలు కొన్ని చెప్పుకోవాలి, పాపం, తను రాసిన వాటినే ఓ క్రమపద్ధతిలో క్రోడీకరించడం రాధాకృష్ణకు చేతకాలేదు…

1. కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిలో ఒక ముఖ్యమంత్రి మూడేళ్లూ సజావుగా పాలించడమే ఓ విశేషం… అంతర్గత కుమ్ములాటలు ఈ పార్టీలో సహజం… అవి లేకపోతేనే హాశ్చర్యపోవాలి… అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని వేర్వేరుగా ఏమీ ఉండవు… కాంగ్రెస్ అంటేనే ఓ సముద్రం, రకరకాల వర్ణాలు పాయిలుగా వచ్చి కలుస్తూ ఉంటాయి, పెంట పెడుతూ ఉంటాయి, ఉంటే ఉంటాయి, పోతే పోతాయి…
2. ఇప్పటికిప్పుడు హైకమాండ్‌కు రేవంత్ రెడ్డిని తప్పించే సాహసం ఉందా..? ఇప్పటికే ఆ మీనాక్షి శల్యసారథ్యం వీలైనంత చెడగొట్టింది పార్టీని… తీరా రేవంత్ కాడి కింద పడేస్తే… మరో మూడు టరమ్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు తెలంగాణలో… అప్పటికి రాహుల్ గాంధీ పార్టీని ఉండనిస్తే..!
3. రేవంత్ సీఎం పదవి మీద సందేహం ఎందుకయ్యా అంటే… పాలమూరు ఎమ్మెల్యేలు మీటింగు పెట్టుకుని బీఆర్ఎస్ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు, ఓ బీజేపీ ఎంపీ సంప్రదింపులు చేస్తున్నాడు, అందుకని డౌటొచ్చిందట… అంతేకాదు, కేసీయార్ ఫామ్ హౌజులో కూర్చుని కాంగ్రెస్ అసంతృప్తులను ఎగదోస్తున్నాడట…

4. కేసీయార్ నిజవైఖరి, బీజేపీ తాజా పొలిటికల్ పోకడలను బట్టి చూస్తే అవీ అసాధారణం ఏమీ కావు, అసలు సురేఖనే పార్టీలోకి తెచ్చుకుందామని అనుకునే బీజేపీ తాజా ధోరణిలో అది పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు… కానీ ఇతర పార్టీలేమీ సక్కగ లేవు మాస్టారూ…
5. కవిత పార్టీ నుంచి వెళ్లిపోయి రోజూ ఉతుకుతోంది… హరీష్ రావు బీజేపీ వైపు చూస్తూ తన పాత మెదక్ ప్రజాప్రతినిధులు, నాయకులతో భేటీలు వేశాడు.,. రెగ్యులర్ సంప్రదింపుల్లో ఉన్నాడు బీజేపీతో… కవితే చెప్పింది… కేటీయార్‌కు యాక్సెప్టెన్స్ రావడం లేదు, కేసీయార్ బయటికి రావడం లేదు… ఒకరిద్దరు ఆస్థాన అధికార ప్రతినిధులు తప్ప ఎవరూ ఏ జిల్లాలోనూ యాక్టివ్‌గా లేరు…
6. బీజేపీ సిట్యుయేషన్ కూడా అంతే… ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా భేటీలు… ఈటల వర్సెస్ సంజయ్… సంజయ్ వర్సెస్ ధర్మపురి… ఇలా బోలెడు ముఠాలు… అధిష్టానమే తలపట్టుకుని, జాతీయ కార్యవర్గంలో చోటు కూడా ఇవ్వకుండా కాలానికి వదిలేసింది తెలంగాణ బీజేపీని… సగటు బీజేపీ అభిమానే బూతులు తిట్టుకుంటున్నాడు పార్టీలో పెద్ద నేతల పోకడలు చూస్తూ..!

7. సో, ఏ పార్టీ వర్తమానం చూసినా ఇంతే… కాంగ్రెసే నయం, రాధాకృష్ణ డౌట్ పడ్డట్టు ఏదీ జరగదు, మొత్తం పదవీకాలం కొనసాగుతాడు… అసలు వచ్చేసారి కూడా నేనేే అంటున్నాడు తను.., పార్టీలో తన భరోసా, తనకున్న ధీమా అంత బయటపడే యవ్వారం కాదు…
8. నిజానికి తనను ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు… గుంభనంగా ఉన్నాడు… ఏమీ బయటపడడు… స్విచ్చులు ఏవి నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతుందో తెలుసు… పాలకస్థానంలో ఉన్నవాడు తొందరపడకూడదు… ఆ పరిణతి కనబరుస్తున్నాడు తన సహజ ధోరణికి భిన్నంగా… చివరకు బంగారు రాఖీ తెచ్చిన సురేఖ చెల్లెమ్మ దగ్గర కూడా ఏ ఉద్వేగమూ లేకుండా, నిర్వికారంగా వ్యవహరించాడు…
9. తనకు తెలియదా, సురేఖ తన బిడ్డతో ఏమేం తిట్టించిందో… ప్లాన్ ఏ, బీ అని మురళి ఏం మాట్లాడుతున్నాడో… ఎవరేం కుంపట్లు పెడుతున్నారో… బట్ కామ్… బీ సైలెంట్… నిజానికి గుత్తా, పోచారం, దానం, చిన్నారెడ్డి మహిపాల్, అనిరుధ్, రాజగోపాలరెడ్డి… వీళ్లెవరూ తన దరిదాపుల్లోకి రారు…

10. చివరగా… కొందరు గాయిగత్తర లేపుతున్నారు, కావాలనే… ఓ బీసీ బిడ్డను తీసేస్తావా అని… బీసీ బిడ్డ ఈటలను కేసీయార్ తరిమేసినప్పుడు ఒక్క గొంతూ లేవలేదు… విజయశాంతికి కావాలట, ఆమె ఏ కులమో తెలియదు గానీ తనతో కాంగ్రెస్ పార్టీకి జీరో ఫాయిదా… కేకే బిడ్డకు కావాలట… అదేమంటే కాపు కోటా అట… అదొకటి ఉందా..?
రేవంత్ రెడ్డి ఆలోచిస్తే… బస్వరాజు సారయ్య పేరు కరెక్టేమో… ప్రస్తుతం తెర మీదకు వస్తున్నవన్నీ కొంత బలమున్న బీసీ కులాలు… సారయ్య ఎంబీసీ… దెబ్బకు అన్ని నోళ్లూ మూయించొచ్చు..!!
Share this Article