.
ఆ ‘స్వతంత్ర చేయి’ మనకు కొత్త కాదు.. ఎనిమిదేళ్ల క్రితమే ‘సవ్యసాచి’లో చూశాం! దుల్కర్ సల్మాన్ తాజా సినిమా ‘ఐయామ్ గేమ్’ చూస్తుంటే… ఎంతగా బుర్ర చించుకున్నా ఒకటి ఓపట్టాన గుర్తురాలేదు. దర్శకుడు ఏదో కొత్తగా క్రియేట్ చేశాను, ఫాంటసీలో ఓ కొత్త లైన్ పట్టుకున్నాను అనుకున్నట్టుంది. కానీ… ఎక్కడో చూశామే ఈ చేయిని! అనిపిస్తూనే ఉంది.
అదేనండీ… మన చేయి మన మాట వినకుండా, తన మానాన తాను ఓ వేరే మనిషిలా ప్రవర్తించడం! ఎట్ లాస్ట్… యాదికొచ్చింది!
Ads
ఎస్… దుల్కర్ సల్మాన్ తాజా సినిమా ‘ఐయామ్ గేమ్’లో ఈ విచిత్రమైన చేయి హీరో ఆలోచనకు, ఆదేశానికి సంబంధం లేకుండా… తనకంటూ ఓ ఆలోచన ఉన్నట్టుగా వ్యవహరిస్తుంది. అవసరమైనప్పుడు హీరో తరఫున రంగంలోకి దిగి యాక్షన్ కూడా చేస్తుంది.
సేమ్… కాస్త ఎక్కువ మెమరీ పవర్ ఉన్న తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చే సినిమా నాగచైతన్య ‘సవ్యసాచి’. 2018లో వచ్చిన ఆ సినిమాలోనూ హీరో ఎడమ చేయి అతని నియంత్రణలో లేకుండా స్వతంత్రంగా కదులుతుంది. కథలో దానికి Vanishing Twin Syndrome నేపథ్యాన్ని ఇచ్చారు.
అయితే అసలు ఆసక్తికరమైన విషయం ఇంకొంచెం వెనక్కి వెళ్తే కనిపిస్తుంది. ‘సవ్యసాచి’ కంటే ఏడాది ముందే… అదే తరహా కాన్సెప్ట్‌తో తమిళంలో ‘Peechankai’ (2017) వచ్చేసింది. అందులోనూ హీరో ఎడమ చేయి అతని నియంత్రణకు అందకుండా తనదైన రీతిలో ప్రవర్తిస్తుంది. ‘సవ్యసాచి’ వచ్చినప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోలికపై అప్పట్లో చర్చ కూడా జరిగింది.
అంటే… ఇప్పుడు ‘ఐయామ్ గేమ్’లో చేయి మళ్లీ ఓ పాత్రగా మారడం ఆసక్తికరమే. సినిమాల్లో కొన్ని ఐడియాలు కూడా ఇలాగే ప్రయాణిస్తుంటాయి. ఒక భాషలో పుడతాయి… మరో భాషలో కొత్త నేపథ్యం అందుకుంటాయి… ఇంకో సినిమాలో మరింత పెద్ద యాక్షన్ ప్రపంచంలోకి వెళ్తాయి.
అయితే ఇక్కడ ‘ఐయామ్ గేమ్’ దర్శకుడు చేసిన చిన్న ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ‘సవ్యసాచి’, ‘Peechankai’ల్లో చేయి తన నియంత్రణలో లేకపోవడం ఓ ప్రధాన కాన్సెప్ట్. కానీ ‘ఐయామ్ గేమ్’లో దర్శకుడు దానికి ఇంకొంచెం ఫాంటసీ జోడించాడు. ఆ చేయికి కేవలం ఓ సిండ్రోమ్ లక్షణాలనే కాకుండా… పగ, కోపం, ఉద్వేగం, ప్రతీకారం… అన్నిటికీ తోడు సొంత బుర్ర కూడా ఇచ్చేశాడు!
అంటే… చేయి హీరోది. కానీ ఆలోచనలు మాత్రం దానివి! అక్కడే ఫాంటసీ మరో మెట్టు ఎక్కుతుంది.
మనిషి తన చేతిని కంట్రోల్ చేయలేకపోవడం కొత్త కాదు.
కానీ ఆ చేతికి ఓ వ్యక్తిత్వం ఇచ్చి, కథలో మరో పాత్రగా నిలబెట్టడం మాత్రం ప్రతిసారీ కొత్త అనుభూతినే ఇస్తోంది!
తెలుగులో పుర్రచేయి అనే పదం ఎన్నాళ్లుగానో ఉన్నదే… ఇది బుర్ర చేయి అలియాస్ పుర్రచేయి…
Share this Article