.
ఉండవల్లి అంటే ఉడుంపట్టు… అంత తేలికగా వదిలేసేరకం కాదు… ఇక న్యాయస్థానాల్లో రామోజీరావు వసూలు చేసిన డిపాజిట్లకు సంబంధించిన అన్ని కేసులూ ముగిసినట్టేననీ, ఆయన మరణంతో ఇక అన్నీ సమసిపోయినట్టేనని అనుకుంటున్నారు కదా… వెంకయ్య నాయుడైతే సైలెంటుగా ఉండకుండా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని ఎక్కడో వ్యాఖ్యానించాడనీ చదివినట్టు గుర్తు…
అక్కడ వెంకయ్యనాయుడికి కాస్త చురుకు పుట్టినట్టుంది… నో, నో, నేను వదిలేయడం లేదు, ఇంకా చాలా ఉన్నయ్ అంటున్నాడు… తన వాదనలో కొన్ని విలువైన పాయింట్లున్నాయి… గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ చెప్పిన కొన్ని ముఖ్యాంశాలు…
Ads
– మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఆ సంస్థ రూ.2,699 కోట్ల ఇన్‌కం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది… నేను 2007లోనే ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు చేశాను…
– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం రూ.20 వేల లోపు మాత్రమే నగదు తీసుకోవాలి. అంతకు మించితే చెక్కు రూపంలో లేదా ఆన్లైన్ లావాదేవీలే జరపాలి. అయినా మార్గదర్శిలో రూ.20 వేలకు మించి నగదు రూపంలో మొత్తం రూ.1,156 కోట్లు డిపాజిట్లుగా సేకరించారు.
– ఆర్బీఐకి చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థను రామోజీరావు నడిపాడు. ఇదే విషయమై నేను ఫిర్యాదు చేయడంతో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు రామోజీరావుకు నోటీసులు జారీ చేయగా, ఆయన వెంటనే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు.
– వాస్తవానికి జరిమానా విధిస్తే తప్ప, నోటీసు మీద స్టేకు అవకాశం లేదు. ఈ కేసులో నగదు రూపంలో వసూలు చేసిన రూ.1,156 కోట్లకు సాధారణ వడ్డీ లెక్కకట్టినా రూ.2,699 కోట్లు అవుతుంది… ఆ కేసు తాజా పరిస్థితిని తెలియజేయాలని గతేడాది ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు నేను లేఖ రాయగా.. ఆ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
– దీనిపై ఆర్టీఐ కమిషనర్‌కు అప్పీల్ చేశాను. ఐతే నోటీసు ఇచ్చే అర్హత జాయింట్ కమిషనర్‌కే ఉందని, అడిషనల్ కమిషనర్‌కు లేదనే కారణంతో ఇటీవల ఈ కేసును హైకోర్టులో కొట్టేశారు… దీనిపై ఇక ఆదాయ పన్ను శాఖ అప్పీల్కెే ఎందుకు వెళ్లలేదు?
– రామోజీ ఫిల్మ్ సిటీ కోసం ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి 2,200 ఎకరాలకు పైగా సేకరించారు. ఇందులో 1,364 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇవ్వగా… వెంటనే రామోజీరావు కోర్టుకెళ్లి అది వ్యవసాయ భూమి కాదని, కొండలు గుట్టలతో ఉందని చెప్పి స్టే తెచ్చుకున్నాడు.
– అయితే అంతకుముందే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలని కోరుతూ ఆర్ఎఫ్సీ నుంచి రంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చిన దరఖాస్తులను జాయింట్ కలెక్టర్ చూపించాడు. అనంతరం భూమి సరెండర్ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఆ కేసును ఇటీవల కోర్టులో కొట్టేశారు.
– రామోజీరావు చనిపోయాడనే.. మార్గదర్శిపై కేసు రద్దు చేశారు తప్ప మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై కేసు కొట్టేయలేదు. క్రిమినల్ లా ప్రకారం నిందితుడు చనిపోతే కేసు ఆటోమేటిక్ గా రద్దవుతుంది.
– మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రాసిక్యూషన్ చేసేందుకు నిరాకరించాయి. దీంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. సో, దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తున్నాననీ, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ఉల్లంఘనలపైనా కోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని ఉండవల్లి చెప్పుకొచ్చాడు…
కానీ, ఆయన చెబుతున్న కేసుల్లో ఆదాయపు పన్ను కేసు కొట్టేయబడింది… మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ కేసు క్లోజయింది… రామోజీ ఫిలిమ్ సిటీ కేసు కొట్టివేతకు గురైంది… సో, క్లీన్ చిట్ అని చెప్పలేకపోయినా సరే, ఇప్పుడు ఏ కేసులూ టెక్నికల్‌గా, లీగల్‌గా లేనట్టే కదా… మరి ఉండవల్లి ఏం చేయబోతున్నాడు..? ఇదీ ప్రశ్న… పోరాడతాడా..? ఇక ఒంటరిగా తాను ఎంత పోరాడినా ఫలితం లేదని చాలిస్తాడా..! పోరాటం కొనసాగించాలంటే తనకున్న మార్గాలేమిటి..? ఆసక్తికరమైన ప్రశ్నలివి!!
Share this Article