.
నాగార్జున నటించిన లాస్ట్ డిజాస్టర్ సినిమా పేరు గుర్తులేదు గానీ… తను హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ 10 సీజన్ గ్రాండ్ లాంచ్ షో మాత్రం అంతకుమించిన ఫ్లాప్… నిస్సారంగా, అనగా రసహీనంగా, వర్ణరహితంగా, వీసమెత్తు వినోదం గానీ, జోష్ గానీ లేకుండా… మధ్యమధ్య చూసే ప్రేక్షకుడికి బోర్ వస్తూ, 3.40 గంటల మారథాన్ షో అచ్చం టాక్సిక్ సినిమాను తలపించింది…
ఫాఫం నాగార్జున ! తన తప్పేమీ లేదు, కానీ గ్రాండ్ లాంచ్ షోలో ప్రధానంగా కనిపించేది తనే, తనకు చేతనైనంత పర్‌ఫామెన్స్ తను ఇచ్చాడు… బహుశా బిగ్‌బాస్ క్రియేటివ్ టీమ్ మారిపోయిందో, లేక సదరు నిర్మాతలకు షో మీద ఇంట్రస్టే పోయిందో గానీ… పేలవంగా సాగింది షో… నాగార్జునలో కూడా మునుపటి జోష్ కనిపించలేదు, డల్‌గా ఉన్నాడు…
Ads
ఒకటి మాత్రం గ్రేట్… ఎంత ఫ్లాప్ సినిమా అయినా సరే, చివరకు టాక్సిక్ సినిమా అయినా సరే, ఒక్కడో ఏదో ఓ నిమిషమో, ఓ సీనో హై ఉంటుంది… ఈ మూడున్నర గంటల గ్రాండ్ లాంచ్‌లో అదీ కొరవడింది, కరువైంది… సూపర్ ఎల్‌నినో బాధిత పంటపొలాల్లాగా నిస్సారంగా, ఎండిపోయి..!!

16 మంది… అందులో నలుగురు కామనర్లు… ఐనా ఒకసారి లోపలకు వెళ్లాక కామనర్లు ఏమిటి, సెలబ్రిటీలు ఏమిటి..? అవును, ఆ డజను మందిలో నిజంగా సెలబ్రిటీ స్థాయి ఉన్నవాళ్లు ఎవరు..? అదీ అసలు ప్రశ్న…
ఇన్‌ఫ్లుయెన్సర్లు, టీవీ సీరియళ్ల నటులు ఎట్సెట్రా… కాస్త తెలిసిన మొహాలు ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్, వర్షిణి సౌందర్‌రాజన్, కృష్ణుడు… నిజానికి కృష్ణుడు తెరమరుగై చాలా ఏళ్లయింది… నరేష్, రాంప్రసాద్, వర్షిణి దాదాపు ఒకే షోలు చేస్తుంటారు… వర్షిణి షోలలో చూస్తే తింగరి వేషంలా కనిపిస్తుంది కానీ గ్రాండ్ లాంచ్ వేళ న్యూమరాలజీ, ఫిలసాఫికల్ మాటలు కొన్ని బాగున్నాయి… తనకు మరో కోణం…
కామనర్లలో సింగర్ ఝాన్సీ ఈమధ్య రీల్స్‌తో ఫేమస్ అయింది… ఎవడో కూశాడు, ఏమ్మా, గత సీజన్లలో పల్లవి ప్రశాంత్‌లా రైతు కార్డుతో సింపతీ ప్రయోగిస్తున్నావా అని… నాన్సెన్స్, పల్లవి ప్రశాంత్‌తో ఎవరిని పోల్చినా దారుణంగా అవమానించినట్టే… పైగా వ్యవసాయం చేయడాన్ని ఆ పిల్ల గర్వంగా చెప్పుకుంటోంది, సింపతీ కోసం కాదు… ఫెయిర్‌గా కనిపిస్తోంది ఆమె…
పొట్టి నరేష్, లావు కృష్ణుడు టాస్కుల్లో ఏం పర్‌ఫామ్ చేస్తారో తెలియదు గానీ… ఇతర సెలబ్రిటీలు, కామనర్లలో ఇంప్రెసివ్ ఎవరూ కనిపించడం లేదు, తనెవరో వంశీ (?) గడ్డం ఇరిటేటింగ్… అమన్, శాలిని లవ్ ట్రాక్ స్టార్ట్ చేయిస్తాడేమో బిగ్‌బాసోడు… ఇద్దరు పిల్లల తల్లి, టీవీ నటి చైత్రా రాయ్ కథ కాస్త ఇంట్రస్టింగే… మరొకతను సింగపూర్ వెళ్లి, నమ్మినవాడే మోసం చేస్తే జీరో నుంచి కొత్త జీవితం స్టార్ట్ చేసిన కథ కూడా బాగుంది…
ఇంత పెద్ద షోలో జస్ట్, మూణ్నాలుగు నిమిషాలు దర్శకుడు సూర్య, హీరో కార్తి కనిపించి (సర్దార్ ప్రమోషన్?) వెళ్లారు, అంతకుమించి స్పెషల్ సాంగ్స్ లేవు, ఏ ఇతర అట్రాక్షన్సూ లేవు… సో, ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్, ఇది మహాపరీక్ష అంటూ మొదలెట్టారు, కానీ ఈ షో రేటింగ్స్ పొందడం మహాపరీక్షే అచ్చంగా…
అవునూ, అగ్నిపరీక్ష హోస్ట్ శ్రీముఖి, జడ్జిలు బిందుమాధవి, నవదీప్ వచ్చారు, అభిజిత్ ఏమయ్యాడు పాపం..!!
Share this Article