.
రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం ఓ సీన్‌లో ప్రకాశ్ రాజ్‌ను ఈడ్చి చెంప మీద ఒకటిస్తాడు… “రేయ్… నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా!” అని డైలాగ్, బాగా పేలింది… నిజానికి ప్రకాశ్ రాజ్ మంచి నటుడే… కానీ కొన్ని పాత్రలు తనకు నప్పవు, ప్రత్యేకించి రీమేకుల్లో ఒరిజినల్స్‌లోని పాత్రల్ని రీక్రియేట్ చేయలేడు, మెప్పించలేడు…
చిరంజీవి బిడ్డ సుస్మిత హిందీ నుంచి తెలుగులోకి రీమేక్ చేసిన ఓ వెబ్ సీరీస్‌లో ప్రకాశ్ రాజ్‌ను చూస్తే జాలేసింది… వివరాల్లోకి వెళ్దాం… రీమేక్ చేయకూడని కథలుంటాయి… ఎందుకంటే కొన్ని ఒరిజినల్ సినిమాల్లోని ఆత్మను రీమేక్ చేయలేం, వాటిని వేరే భాషలోకి బదిలీ చేయలేం…
Ads
సినిమా కథను రీమేక్ చేయడం చాలా సులువు అనుకుంటారు…. కథ తీసుకున్నారు… పాత్రల పేర్లు మార్చారు… ప్రాంతం మార్చారు… నటీనటులను మార్చారు… పాటలు కొత్తగా చేయించారు… అయిపోయింది. కానీ కథలోని ఆత్మను రీమేక్ చేయడం అంత సులువు కాదు.
కొన్ని కథలు కేవలం కథలు కావు. అవి ఒక నేలకు, ఒక సంస్కృతికి, ఒక జీవన విధానానికి, ఒక సంగీత సంప్రదాయానికి, ఒక ఆరాధనా పద్ధతికి పుట్టినవి. వాటిని ఆ మట్టిలోంచి పెకిలించి మరో నేలలో నాటితే మొక్క బతకవచ్చు. కానీ అదే పువ్వు పూయకపోవచ్చు. ఇదే విషయం ఇప్పుడు వచ్చిన ‘జగమే సంగీతం’ చూస్తే మరోసారి గుర్తుకొస్తుంది.
హిందీలో ప్రేక్షకాదరణ పొందిన ‘బందిష్ బండిట్స్’ స్ఫూర్తితో రూపొందిన ఈ తెలుగు సిరీస్‌ను సుస్మిత కొణిదెల నిర్మించింది. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మధుబాల తదితరులతో, ఎనిమిది ఎపిసోడ్ల మ్యూజికల్ డ్రామాగా ఇది వచ్చింది. అయితే ఇది యథాతథ రీమేక్ కాదని, తెలుగు మూలాలు, కర్ణాటక సంగీత నేటివిటీతో కథను మార్చామని నిర్మాతలు కూడా చెప్పారు. కానీ..?
అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక సంగీత కథను మరో సంగీత సంప్రదాయంలోకి మార్చినప్పుడు… కథ మాత్రమే మారుతుందా? లేక ఆ కథకు ఊపిరినిచ్చిన సంగీత ఆత్మ కూడా మారిపోతుందా?
‘శంకరాభరణం’ ఒక సినిమా కాదు… ఒక సంస్కృతి …. ఇందుకు మన దగ్గరే తిరుగులేని ఉదాహరణ ఉంది. ‘శంకరాభరణం’. కథను విడదీసి చూస్తే అది ఒక సంగీత విద్వాంసుడి కథ. సంప్రదాయ సంగీతం పట్ల గౌరవం, మారుతున్న తరంతో వచ్చే సంఘర్షణ, కళాకారుడి అంతర్మథనం, ఒక కళా సంప్రదాయాన్ని కాపాడుకోవాలన్న తపన. ఇంతే కదా?
కానీ కాదు. ‘శంకరాభరణం’లో కథకంటే చాలా పెద్దది ఆ వాతావరణం. ఆ ఇల్లు… ఆ దేవాలయం… ఆ సంగీతం… ఆ కర్ణాటక రాగాలు… వేటూరి సాహిత్యం… కేవీ మహదేవన్ స్వరాలు… ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి వంటి గొంతులు… జేవీ సోమయాజులు ముఖంలో కనిపించే ఆ సంగీత గాంభీర్యం… ఇవన్నీ కలిసే ‘శంకరాభరణం’…
అందుకే దాన్ని మరో భాషలోకి తీసుకెళ్లి, అక్కడి ప్రేక్షకుడికి అదే అనుభూతిని కలిగించడం అంత సులువు కాదు. అదే విశ్వనాథ్ దాన్ని హిందీలో ‘సుర్ సంగమ్’గా తీశాడు. 1985లో వచ్చిన ఆ చిత్రం ‘శంకరాభరణం’కు హిందీ రీమేక్. గిరీష్ కర్నాడ్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతాన్ని లక్ష్మీకాంత్– ప్యారేలాల్ అందించాడు… కానీ ‘శంకరాభరణం’ సృష్టించిన వైబ్స్ ను ఇది సాధించలేకపోయింది…
ఎందుకు? విశ్వనాథ్ మారలేదు. కథలోని భావం కూడా పెద్దగా మారలేదు. అయినా ఏదో మారిపోయింది. ఆత్మకు సంబంధించిన భౌగోళికత మారిపోయింది.
సంగీతం కూడా నేటివిటీయే! సినిమా నేటివిటీ అంటే మనం సాధారణంగా భాష, యాస, ఇళ్లు, బట్టలు, పండుగలు అనుకుంటాం. కానీ సంగీతం కూడా నేటివిటీయే. అంతకంటే బలమైన నేటివిటీ. ఉత్తరాదిలో హిందుస్థానీ సంగీత సంప్రదాయం బలంగా ఉంది. దక్షిణాదిలో కర్ణాటక సంగీతానికి ప్రత్యేకమైన శ్రవణ సంస్కృతి ఉంది.
రెండూ భారతీయ శాస్త్రీయ సంగీతాలే. రెండూ గొప్పవే. కానీ ఒక ప్రేక్షకుడు ఏ స్వరానికి చిన్నప్పటి నుంచీ అలవాటు పడ్డాడో, ఏ రాగం అతని ఇంట్లో, దేవాలయంలో, రేడియోలో, పండుగలో వినిపించిందో… అతని భావోద్వేగ స్పందన కూడా దానిపైనే పెరుగుతుంది. అందుకే ఒక రాగం గొప్పదా కాదా అనేది ప్రశ్న కాదు. ఆ రాగం ఆ ప్రేక్షకుడి గుండెకు ఏ మేరకు పరిచయమో అన్నదే ప్రశ్న. ‘శంకరాభరణం’లోని సంగీతం కథకు బ్యాక్‌గ్రౌండ్ కాదు. అదే కథ. అందుకే దాన్ని కేవలం మరో భాషలోకి మార్చడం సరిపోదు.
మరి డబ్బింగ్ ఎందుకు పనిచేసింది? ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది. ‘శంకరాభరణం’ను ఇతర దక్షిణాది భాషల్లోకి డబ్ చేసి విడుదల చేసినప్పుడు, సినిమా తన అసలు పాటలు, ఆ సంగీతంతోనే ప్రేక్షకుల దగ్గరకు వెళ్లింది. తెలుగు పాటల బాణీలు అలాగే ఉన్నాయి. ఆర్కెస్ట్రేషన్ అలాగే ఉంది. సంగీతపు ఆత్మ అలాగే ఉంది. పాత్రల డైలాగుల భాష మాత్రమే మారింది. అంటే… సినిమా తన ఆత్మను కోల్పోకుండా ప్రేక్షకుడి భాషలో మాట్లాడింది.
అదే సినిమాను హిందీలోకి వెళ్లేటప్పుడు కొత్త సంస్కృతిలోకి రీమేక్ చేయాల్సి వచ్చింది. అక్కడ కథకు కొత్త భాష వచ్చింది. కొత్త నటులు వచ్చారు. కొత్త సంగీత రూపకల్పన వచ్చింది. కొత్త సాంస్కృతిక సందర్భం వచ్చింది. ఫలితం? విశ్వనాథ్ అనే అదే దర్శకుడు. అదే మూలకథ. అయినా ‘సుర్ సంగమ్’కు ‘శంకరాభరణం’ మంత్రం రాలేదు. ఇదే రీమేక్‌ల అసలు సమస్య.
జల్లికట్టు కథను తెలంగాణలో పెడితే? ఒకసారి ఊహించండి. జల్లికట్టు నేపథ్యంలో ఒక అద్భుతమైన తమిళ సినిమా వచ్చింది అనుకోండి. ఆ కథలో ఎద్దు కేవలం ఎద్దు కాదు. అది ఆ ఊరి గౌరవం. కుటుంబ ప్రతిష్ఠ. పండుగ. పురుషత్వానికి సంబంధించిన ఒక సామాజిక భావన. తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం. ఆ మొత్తం ప్రపంచాన్ని తీసుకుని… “తెలుగులో కూడా బాగుంటుంది” అని హైదరాబాద్‌లోని ఏదో ప్రాంతానికి మార్చేస్తే? కథ అదే ఉండొచ్చు.
కానీ అది జల్లికట్టు కాదు. అదే విధంగా కర్ణాటకలోని కంబాళకు ఒక ప్రత్యేకమైన సామాజిక, భౌగోళిక, సాంస్కృతిక నేపథ్యం ఉంది. దాన్ని యథాతథంగా తీసుకొచ్చి తెలుగులో పెట్టేస్తే ప్రేక్షకుడు చూస్తాడు. కానీ అదే భావోద్వేగంతో చూస్తాడా? అదే ప్రశ్న. ఎందుకంటే ప్రేక్షకుడికి కేవలం సన్నివేశం కనిపించదు. ఆ సన్నివేశం వెనుక ఉన్న జీవితం కూడా కనిపించాలి.
‘బందిష్ బండిట్స్’ దగ్గర కూడా అదే చిక్కు … ఇప్పుడు ‘జగమే సంగీతం’ విషయానికి వస్తే… హిందీ ‘బందిష్ బండిట్స్’కు బలం కేవలం దాని కథ కాదు. సంగీతమే దాని కథలో ఒక పాత్ర. రాజస్థానీ వాతావరణం, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ప్రపంచం, ఆ కుటుంబాల సంగీత వారసత్వం, గురు- శిష్య సంబంధం, సంప్రదాయానికి ఆధునికతకు మధ్య సంఘర్షణ… అన్నీ కలిసే ఆ ప్రపంచాన్ని నిర్మించాయి.
అందుకే దాన్ని తెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు (Prime Video కోసం) నిర్మాతలు కూడా “కేవలం రీమేక్ చేయకుండా, కర్ణాటక సంగీతం, తెలుగు మూలాలతో కథను రూపొందించాం” అని చెప్పాల్సి వచ్చింది. అంటే వాళ్లకూ సమస్య ఎక్కడుందో తెలుసు. అదే కథను కాపీ కొట్టడం కాదు. దాని DNAని మార్చాలి. కానీ DNA మార్చిన తర్వాత అది ఒరిజినల్‌కు ఎంత దగ్గరగా ఉంటుంది? అదే మరో ప్రశ్న.
ప్రకాశ్ రాజ్ నసీరుద్దీన్ షా కాలేడు- కాలేదు… ఇక్కడ నటన గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం. ప్రకాశ్ రాజ్ మంచి నటుడే, అందులో సందేహమే లేదు. కానీ కొన్ని పాత్రలకే, తను కొన్ని పాత్రల్లో అస్సలు నప్పడు, ఒరిజినల్ సినిమాలతో పోలిస్తే వెలవెలబోతాడు… కానీ ఒక గొప్ప నటుడు ఏ పాత్రలో పడితే ఆ పాత్ర గొప్పదైపోతుందని లేదు. పాత్రకు సరిపోయే సాంస్కృతిక శరీరభాష కూడా కావాలి.
‘బందిష్ బండిట్స్’లో నసీరుద్దీన్ షా పోషించిన గురువు పాత్రకు అతని ముఖం, వయసు, గొంతు, విరామాలు, శరీర భాష, ఆ పాత్రలోని అంతర్గత కాఠిన్యం అన్నీ ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని ఇచ్చాయి. ప్రకాశ్ రాజ్ ఆ పాత్రను చేశాడు, కానీ బాగా చేయలేదు, చేయలేకపోయాడు, చేయలేడు…
అన్ని సినిమాలూ రీమేక్ చేయాల్సిన అవసరం లేదు… ఇదే మన సినిమా పరిశ్రమలు నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం. ప్రతి హిట్ సినిమా మరో భాషలో కూడా హిట్ అవ్వాలి అనేది నియమం కాదు. సాధ్యమూ కాదు… కాంతార అంటే కాంతార మాత్రమే, అదీ కన్నడనాట ఒక ఏరియాకు సంబంధించిన కథ మాత్రమే, దాన్ని హిందీలోకి రీమేక్ చేస్తే నాలుగు రోజులు నడవదు…
కొన్ని సినిమాలు ప్రాంతీయమైనవి కావడం వల్లే గొప్పవి. కొన్ని కథలు అక్కడి మట్టిలోనే పుడతాయి. కొన్ని పాటలు ఆ ప్రాంతపు భాషలోనే అర్థం పొందుతాయి. కొన్ని ఆచారాలు, పండుగలు, జానపద కళలు, ఆరాధనా పద్ధతులు, సంగీత సంప్రదాయాలు మరొక ప్రాంతంలోకి వెళితే వాటి అర్థమే మారిపోతుంది…
Share this Article