Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుప్రియ ! 21 ఏళ్ల ఈ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ కథ తెలుసా మీకు..?

September 7, 2026 by M S R

.

మెదళ్లన్నీ కమర్షియల్ వాల్యూస్ పేరిట కుళ్లిపోయిన మన సినిమా తలకాయలన్నీ కాస్త మనసుపెట్టి  చదవాల్సిన కథనం ఇది… కాదు, అందరూ చదవాలి ఈ 21 ఏళ్ల విద్యాధికురాలు, యంగ్ నిర్మాత సంకల్పం గురించి… ఆమె పేరు అనుప్రియా నగర్! సంచలనం సృష్టిస్తున్న హనుమాన్ అంశ్ నిర్మాత ఆమె!

ఆమెకు సినిమా తీయాలన్న ఆలోచనే లేదు. బాలీవుడ్‌లోకి రావాలన్న కోరిక అసలే లేదు. చేతిలో ఎకనామిక్స్ డిగ్రీ. మంచి ఉద్యోగం. స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉంది. ఆమె కొలువు, ఆమె ప్లాన్, ఆమె చదువు, ఆమె మార్గం వేరు… కానీ ఇప్పుడు? అదే కాస్త వివరంగా చెప్పుకుందాం…

Ads

ఎకనామిక్స్ చదివిన అమ్మాయి… అనుప్రియా ముంబైలో పుట్టింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లింది. యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్ చదివింది. ఆమె స్వయంగా చెప్పుకున్న వివరాల ప్రకారం, కళలంటే కూడా చిన్నప్పటి నుంచే ఆసక్తి.

ఆమె కుటుంబం ఆర్ట్ కలెక్టర్ల కుటుంబం. పెద్ద పెద్ద కళాకారుల మధ్య పెరిగారు. జగదీష్ స్వామినాథన్, ఎం.ఎఫ్. హుస్సేన్, గైటోండే, రజా వంటి కళాకారుల పనులను చూస్తూ పెరిగినట్టు ఆమె చెబుతుంది.  పన్నెండేళ్ల వయసులోనే తొలి గ్రూప్ ఎగ్జిబిషన్‌లో పాల్గొంది. అంటే సినిమా ఆమె జీవితంలోకి అకస్మాత్తుగా వచ్చినా… కథలు చెప్పడం, కళతో అనుబంధం మాత్రం కొత్తవి కావు. ఆమె స్వంత ప్రొఫైల్ ప్రకారం, పదేళ్లకు పైగా ఆర్ట్‌తో అనుబంధం ఉంది.

యూనివర్సిటీలో కూడా కళా కార్యక్రమాలతో పాటు బిజినెస్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. ‘విమెన్ ఇన్ బిజినెస్ సొసైటీ’తో అనుబంధం ఏర్పడింది. అంటే  ఒకవైపు…  ఎకనామిక్స్.  మరోవైపు… ఆర్ట్.

anupriya

చదువు పూర్తయ్యాక స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో ఆర్ట్ ఇండస్ట్రీలో ఉద్యోగం చేయాలనుకుంది. ఉద్యోగం కూడా దాదాపు ఖరారైంది. అప్పుడు ఆమె వయసు 20–21. ఇంతలో ఒక యూనివర్సిటీ అసైన్‌మెంట్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ అసైన్‌మెంట్ పేరు స్టీవ్ జాబ్స్ ప్రస్థానం…

కాలేజీలో టెక్నాలజీ కంపెనీలు, వాటి వ్యవస్థాపకులు, వారు ఆలోచనలను ఎలా పొందారు అన్న అంశాలపై ఆమె పరిశోధన చేస్తోంది… ఆ క్రమంలో స్టీవ్ జాబ్స్ గురించిన అధ్యయనంలో ఆమె దృష్టిని ఆకర్షించిన పేరు… నీమ్ కరోలి బాబా.

స్టీవ్ జాబ్స్ భారతదేశానికి వచ్చినప్పుడు నీమ్ కరోలి బాబా ఆశ్రమమైన కైంచీ ధామ్‌కు వెళ్లిన విషయం ఆమె పరిశోధనలో కనిపించింది. అక్కడే అనుప్రియకు ఒక విచిత్రమైన ప్రశ్న వచ్చింది. “ఒక భారతీయ సాధువు గురించి నాకు ఒక విదేశీయుడి ద్వారా ఎందుకు తెలుస్తోంది?” అంతే. ఆ ప్రశ్న ఆమెను వదల్లేదు.

మరింత చదివింది. మరింత వెతికింది. నీమ్ కరోలి బాబా గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆసక్తి పెరిగింది. ఆ పరిశోధన చివరకు ఒక ఏడాది పాటు సాగిన అన్వేషణగా మారింది. ఆమె  ఆలోచనల నుంచి స్టీవ్ జాబ్స్ పేరు ఎగిరిపోయి ఆ బాబా అధ్యయనమే సాగింది…

మొదట ఆమె ఆ విషయంపై ఒక పుస్తకం రాయాలని అనుకుంది… లేదంటే కామిక్ బుక్ చేయాలనుకుంది. అంతే తప్ప… సినిమా ఆమె ఆలోచనల్లో అస్సలు లేదు… చదువు పూర్తయింది. ఇండియాకు వచ్చింది. అక్కడ దర్శకుడు విశాల్ చతుర్వేది పరిచయం అయ్యాడు… అతను అప్పటికే నీమ్ కరోలి బాబాపై సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

కరోలీ బాబా

ఇద్దరి ఆలోచనలు కలిశాయి. అలా… ఒక యూనివర్సిటీ అసైన్‌మెంట్ → పరిశోధన → పుస్తకం/ కామిక్ ఆలోచన → దర్శకుడి పరిచయం → సినిమా. అంతా అనుకోకుండా జరిగినదే. ఇక్కడే అసలు సాహసం ఉంది.

అనుప్రియకు సినిమా నిర్మాణంలో ఎలాంటి అనుభవం లేదు. అయినా వెనక్కి తగ్గలేదు. బ్రిటన్‌లో మూడేళ్లు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన, కూడబెట్టిన డబ్బంతా తన తొలి సినిమా నిర్మాణంలో పెట్టింది. మరో ఒకరిద్దరు జతకలిశారు…

ఆమె డబ్బు కోసం ఈ సినిమా చేయలేదు, సినిమా ఆమె కెరీర్ కూడా కాదు, తన తరం వాళ్లకు నీమ్ కరోలి బాబా గురించి చెప్పాలనేది ఆమె ఉద్దేశం. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, Gen Zకి మహరాజ్‌జీ కథను చేరవేయాలనుకుంది.

“విదేశీయుల ద్వారా మనం ఇలాంటి విషయాలు తెలుసుకుంటున్నాం. నేను కూడా ఒక విదేశీయుడి ద్వారా ఆయన గురించి తెలుసుకున్నాను. మన దేశంలోని యువతగా మన స్వంత కథ మనకే తెలియకపోవడం బాధగా అనిపించింది” అనే భావనతోనే ఈ సినిమా వైపు వచ్చానని ఆమె చెప్పింది.

ఈ ప్రాజెక్ట్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అనుప్రియా, సినిమా నిర్మాణానికి ముందు ప్రేమానంద మహారాజ్‌ను కలిసింది. సినిమా ద్వారా సమాజానికి మంచి విషయం చెప్పాలనుకుంటున్నామని ఆమె చెప్పినప్పుడు, ఆయన కూడా మంచి ఉద్దేశంతో సినిమా చేయడం కూడా సేవే అన్నాడు. కానీ ఓ సూచన చేశాడు.

movie

‘సాధుసంతుల జీవితాన్ని ఓ మసాలా డ్రామాగా మార్చొద్దు. కథను వక్రీకరించొద్దు. నిజం కానిది ఏదీ కలపొద్దు. నీ సంకల్పం డబ్బు కాదు కాబట్టి ఫెయిర్‌గా, నీట్‌గా సినిమా తీయి’ అని చెప్పాడు… అక్షరాలా పాటించింది ఆమె… తగిన దర్శకుడు సరేసరి…

సినిమా విడుదలైంది. మొదట పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రేక్షకులు నెమ్మదిగా సినిమాను ఒకరి నుంచి మరొకరికి తీసుకెళ్లారు మౌత్ టాక్ ద్వారా… చిన్న సినిమా కాస్తా పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు అనుప్రియా మాత్రం ఈ విజయాన్ని తన తెలివితేటలకో, పెట్టుబడికో ఆపాదించుకోవడం లేదు.

“మహరాజ్‌జీ మమ్మల్ని మొదటి నుంచీ ఆశీర్వదించాడు, మా ద్వారా సినిమా తీయించాడు” అనేదే ఆమె సమాధానం. సినిమా ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని పేద పిల్లలకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని అనుకుంటున్నానని కూడా ఆమె చెబుతోంది. ఆమెకు సేవా కార్యక్రమాలు కొత్తేమీ కాదు… ఈ సినిమాకు సీక్వెల్ ఆలోచిస్తోంది ఆమె ఇప్పుడు…

ఇంత డబ్బు నేనస్సలు ఊహించలేదు, ఏం చేయాలి దీన్ని? వక్రమార్గం పట్టకుండా, మరింత సద్వినియోగం చేయాలి… ఇదే ఆమె ఆలోచన ఇప్పుడు…

ఇక కథలో అసలు ట్విస్ట్… ఈ సినిమాను సినిమా ఇండస్ట్రీ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఓటీటీ వాళ్లు కూడా తిరస్కరించారు. కథ చెబితే ఓటీటీ తలకాయలు అడ్డంగా తలూపి వెక్కిరించాయి… “ఇది ఆడదు” అన్న భావనతోనే సినిమా థియేటర్లలోకి వచ్చింది. మొదటి వారం షోలు దారుణంగా పడిపోయాయి. ఇండస్ట్రీ సినిమా ఫలితాన్ని దాదాపు ప్రకటించేసింది. ఫ్లాప్!

కానీ ప్రేక్షకులు ఆ తీర్పును ఒప్పుకోలేదు. నెమ్మదిగా సినిమా పుంజుకుంది. చివరకు… రూ.2 కోట్లలోపు డబ్బు పెట్టిన సినిమా రూ.100 కోట్ల మార్క్ దాటింది… హిందీ బెల్ట్‌లో టాక్సిక్ అర్జెంటుగా ఎత్తిపారేసి హనుమాన్ అంశ్ సినిమాను ఆడిస్తున్నాయి చాలా థియేటర్లు ఇప్పుడు… ఇది సక్సెస్  స్టోరీ కాదు, అంతకు మించి !!

ఇదంతా రాశాక... మరోసారి ఫస్ట్ నుంచీ చదువుతుంటే... ఒక టాక్సిక్ ఆలోచనల గీతా మోహన్‌దాస్‌కూ ఒక అనుప్రియా నగర్‌కూ నడుమ ఎంత కంట్రాస్టో కదా అనిపించింది !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నా చిన్నప్పటి ప్రియురాలు… ఈరోజుకూ కలలో పలకరిస్తుంది…
  • ప్రహార్ ! బాలీవుడ్ మరో మేలిమి కథ ! కసబ్ విచారణలో కొత్త కోణాలు !!
  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!
  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!
  • ప్రధాని ఎవరైతేనేం..? టరమ్స్ శాసించేది అంబానీ..! ఇదీ జియో పుట్టుక !!
  • కవిత చెప్పింది ! సాయం చేసిన చేతులనే కాటేసే కేటీయార్ !!
  • వీథుల్లో అల్లర్లు – అలజడి … వీటితో ప్రభుత్వాన్ని మార్చడం అసాధ్యం !!
  • నోబెల్ విజేత – తండ్రి కోరిక కోసం, మూలాలు వెతుక్కుంటూ వచ్చింది !
  • అయ్యా నరేష్ గారూ… బాగా నటించగలరు, ఎటొచ్చీ యాసతోనే తిప్పలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions