Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

September 9, 2026 by M S R

.

మీకు ముందుగా ఓ కథ చెబుతాను… ద్రౌపది సౌగంధికా పుష్పాలు కావాలని అడిగితే భీముడు వాటిని తీసుకొస్తానని వెళ్తాడు… మార్గమధ్యంలో హనుమంతుడు ఓ ముసలికోతిలా కూర్చుంటాడు… బాటకు అడ్డంగా తోక ఉంటుంది… ఏయ్, తోక తియ్, వెళ్లాలి అని ఉరుముతాడు భీముడు…

ముసలోడిని, ఇబ్బందిగా ఉంది, కోతిని అటు పక్కకు జరిపి వెళ్లిపో అంటాడు హనుమంతుడు… ఓసోస్, ఇదెంత పని అనుకుని భీమబలుడు ప్రయత్నిస్తాడు… ఇంచు పైకి లేపలేడు, కదపలేడు… హనుమంతుడు అనుకుంటే అంతే మరి… అని ఆ కథ చెబుతుంది… కట్ చేస్తే…

Ads

అది ఉజ్జయిని… ఒక ఆలయాన్ని కూల్చేశారు. రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చింది. అందుకే ఆలయంలోని హనుమంతుడి విగ్రహాన్ని మరోచోటికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. భారీ యంత్రాలు వచ్చాయి. సిబ్బంది వచ్చారు. ప్రయత్నాలు జరిగాయి.

ఒక్కసారి కాదు… ఏకంగా నాలుగుసార్లు! కానీ విగ్రహం మాత్రం అంగుళం  కదల్లేదు! ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇదే హాట్‌టాపిక్. “హనుమంతుడు కదలడానికి ఇష్టపడటం లేదా?” అని భక్తులు అంటుంటే…

“అసలు విగ్రహం ఎందుకు కదలడం లేదు?” అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తలబద్దలు కొట్టుకుంటున్నారు… ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.

khadee hanuman

ఆలయం పోయింది.. హనుమంతుడు మాత్రం అక్కడే! ఉజ్జయినిలోని కాంతల్‌ చౌరాహా– ఛత్రి చౌక్‌ రోడ్డులో ఉన్న ఖడే హనుమాన్‌ ఆలయం ఇది. సింహస్థ్‌ 2028 కోసం ఉజ్జయిని నగరాన్ని భారీగా సిద్ధం చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్‌ సదుపాయాలు, ఇతర మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

అందులో భాగంగానే ఈ రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. ఆలయ నిర్మాణంలో ఎక్కువ భాగాన్ని తొలగించారు. అక్కడ నిలబడి ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని తరలించాల్సి ఉంది. దాని కోసం టాంకీ చౌక్‌ దగ్గర కొత్త స్థలం కూడా నిర్ణయించారు. అంతా అనుకున్నట్టే జరిగి ఉంటే కథ అక్కడితో ముగిసిపోయేది.

కానీ… హనుమంతుడు కదల్లేదు! ఎన్నోసార్లు ప్రయత్నం.. ఫలితం శూన్యం! విగ్రహాన్ని తరలించేందుకు భారీ యంత్రాలతో నాలుగైదుసార్లు ప్రయత్నించారు… ప్రతిసారీ అదే పరిస్థితి. విగ్రహం కదలలేదు. దీంతో అధికారులు భారీ యంత్రాల వినియోగాన్ని తాత్కాలికంగా ఆపేశారు.

ఇప్పుడు విగ్రహం అడుగుభాగాన్ని, చుట్టుపక్కల నిర్మాణాన్ని స్కాన్‌ చేసి అసలు విషయం తెలుసుకోవాలని నిపుణులు భావిస్తున్నారు. అంటే… ఇప్పటివరకు ఇది భక్తి వ్యవహారంలా కనిపించినా, ఇప్పుడు  ఇంజినీరింగ్‌, పురావస్తు, నిర్మాణ భద్రత వంటి కోణాలు కూడా తెరపైకి వచ్చాయి.

“బాబా ఇక్కడే ఉండాలనుకుంటున్నారు!” భక్తులకు మాత్రం సమాధానం చాలా సులభం. ఇది హనుమంతుడి సంకేతం! ఆలయ పూజారి మహేష్‌ బైరాగి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు… తనను ఉద్దేశించి హనుమంతుడు ప్రతిరోజూ ఏదో ఒక సంకేతం ఇస్తున్నాడని అంటున్నాడు…

“బాబా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు. పరిపాలన ఈ సంకేతాలను అర్థం చేసుకోవాలి. ఒకవేళ తరలించాల్సిందే అయితే, విగ్రహానికి ఎలాంటి నష్టం జరగకుండా, ఇప్పుడున్న విధంగానే తరలించాలి” అన్నది ఆయన అభిప్రాయం. ఇంతలో ఆలయం దగ్గర పెద్ద సంఖ్యలో కోతులు కనిపించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దాంతో భక్తుల నమ్మకానికి మరింత ఊపు వచ్చింది. “హనుమంతుడి రూపాలు వచ్చేశాయి…” అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆలయానికి సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు.  సింహస్థ్‌ 2028 కోసం రోడ్డు విస్తరణ అవసరం. లక్షలాది భక్తులు వచ్చే నగరంలో మెరుగైన రవాణా వ్యవస్థ కూడా అవసరమే.

అదే సమయంలో శతాబ్దాల చరిత్ర ఉందని చెప్పబడుతున్న ఒక ఆలయం, అందులోని విగ్రహం కూడా ముఖ్యమే. అందుకే  విగ్రహం ఎందుకు కదలడం లేదో శాస్త్రీయంగా తేల్చాలి. దాని కింద ఏముంది? పునాది ఎలా ఉంది? విగ్రహం ఎంత లోతు వరకు నిర్మాణంలో భాగమై ఉంది? తరలిస్తే పగుళ్లు వస్తాయా? విగ్రహానికి లేదా దాని చారిత్రక, పురావస్తు విలువకు నష్టం కలిగే అవకాశముందా? ఇవన్నీ నిపుణులు పరిశీలించాలి.

ఆ తర్వాతే నిర్ణయం. ప్రస్తుతం ఖడే హనుమాన్‌ అక్కడే కదలకుండా నిలబడి ఉన్నాడు. ఆలయం చుట్టూ ఉన్న నిర్మాణం దాదాపు తొలగిపోయింది. పైకి తాత్కాలిక కప్పు వేశారు… అన్నట్టు సింహాస్థ్ గురించి చెప్పలేదు కదూ…



  • సింహస్థ్ (Simhastha) అంటే ఉజ్జయినిలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా.  షిప్రా నదిలో పవిత్ర స్నానం కోసం కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చే భారీ ఆధ్యాత్మిక సమ్మేళనం. భారతదేశంలో జరిగే నాలుగు ప్రధాన కుంభమేళా క్షేత్రాల్లో ఉజ్జయిని ఒకటి. మిగిలినవి ప్రయాగ్‌రాజ్‌, హరిద్వార్‌, నాసిక్‌… ఉజ్జయినిలో 2028 సింహస్థ్‌ కోసం ఇప్పుడు నుంచే రోడ్లు, ఘాట్లు, ట్రాఫిక్‌, మౌలిక వసతులు భారీగా అభివృద్ధి చేస్తున్నారు…


simhasth(ఇది 2016 సింహాస్థ్ నాటి ఓ ఫోటో)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!
  • అగ్రవర్ణ దురహంకార మనువాద శుష్క బాష్యాలూ డౌన్ డౌన్ !!
  • హమారా హైదరాబాద్… ఓ కొత్త ముఖం! ఐటీ, ఫార్మా దాటేసి డిఫెన్స్ హబ్!!
  • బుల్లెట్ల భయాన్ని వదిలి- కాశ్మీరంలో సినిమా మళ్లీ ప్రాణం పోసుకుంది!
  • డామిట్, స్కెచ్ అడ్డం తిరిగింది ! బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ బొక్కబోల్తా !!
  • పుట్టపర్తి మిస్టరీ ! ఏకంగా సాయిబాబాపైనే ఎక్కుపెట్టిన ఓ సినిమా !!
  • కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి అంతే – అవి అనూహ్యం !!
  • ప్రకాశ్‌రాజ్ ఐతేనేం? కొన్ని రోల్స్ అస్సలు చేతకావు- కాలేదు !!
  • ఎవరీ తాతా మధు ? ఈ వికృత దూషణలు ఎక్కడ నేర్చాడు ?
  • యాంటీ దళిత్ ! ఒకరినే కాదు- ఆ ఇద్దరినీ బర్తరఫ్ చేస్తారా.?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions