Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకరోజు బిచ్చగాడి వేషంతో – ఆ ప్రచారంతో సాదాసీదాతనం రాదు !

September 16, 2026 by M S R

·
దొంగ బిచ్చగాళ్ల నాటకాలు నమ్మొద్దు!  Srinivas Ganjivarapu

సబ్బ పాపస్స అకరణం,
కుశలస్స ఉపసంపదా |
సచిత్త పరియోదపనం,
ఏతం బుద్ధానుశాసనమ్ I

ప్రజల మంచి కోసం సర్వస్వాన్నీ త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు నడిచిన నేల మనది. గౌతమ బుద్ధుడు రాజభోగాలను వదిలేసి సత్యం కోసం వెతికారు. గాంధీ సామాన్యుడితో కలిసిపోయి నిరాడంబరంగా బతికారు. అంబేడ్కర్ పేదల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. వారి త్యాగాలు చట్టాలను మార్చాయి, కోట్ల మంది బతుకుల్లో వెలుగులు నింపాయి. కానీ నేడు రాజకీయాల్లో సేవ పేరుతో జరుగుతున్న నాటకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

Ads

  • ముంబయి ఘాట్కోపర్ తూర్పు ఎమ్మెల్యే పరాగ్ షా, తన గురువు చెప్పారని అహంకారాన్ని పోగొట్టుకోవడానికి చిరిగిన బట్టలతో నడిరోడ్డుపై భిక్షాటన చేయడం ఇప్పుడు పెద్ద చర్చ. ఎవరి అంతర్మథనం వారిది కావొచ్చు; కానీ ఒక ప్రజాప్రతినిధి కెమెరాల ముందు పేదరికాన్ని నటిస్తే అది ఆత్మశుద్ధి ఎలా అవుతుంది? కేవలం ప్రచారం కోసమే కదా!

​వ్యాపారంలో రాణించి డబ్బు సంపాదించడం తప్పు కాదు, అది వ్యక్తిగత ప్రతిభ. 2017 బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పరాగ్ షా ఆస్తులు ₹690 కోట్లు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి తన సంపద ₹550.62 కోట్లుగా చూపించారు. ఇక 2024 ఎన్నికల నాటికి ఆయన కుటుంబ ఆస్తుల విలువ ఏకంగా ₹3,383.06 కోట్లకు చేరింది. కేవలం 5 ఏళ్లలోనే దాదాపు 575% సంపద పెరిగి, మహారాష్ట్రలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. వ్యాపారవేత్తగా ఆయన సాధించిన అభివృద్ధి పెద్దదే. అయితే వేల కోట్ల ఆస్తులను పదిలంగా కాపాడుకుంటూ, ఒక్క పూట మాసిన బట్టలు వేసుకుని రోడ్డుపై తిరగడాన్ని సాదాసీదాతనం అని ఎలా అంటాం?

ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన నిజమైన నిరాడంబరత ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటంలో, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడటంలో కనిపించాలి తప్ప ఇలాంటి వేషాల్లో కాదు. పేదరికం అనేది ఒక రోజు వేషం వేసి సరదాగా చూసొచ్చే ఆట కాదు; అది ప్రతిరోజూ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ సాగించే కష్టమైన బతుకు పోరాటం.

​ఇలాంటి నాటకాలను నిలదీయాల్సిన మీడియా.. అసలు పని వదిలేసి భజన చేయడం మరీ బాధాకరం. ముంబయి మురికివాడల్లో ఆకలితో అలమటించే వేలాది మంది పేదల బాధలను చూపించని కెమెరాలు, వేల కోట్ల ఆస్తిపరుడి వేషాన్ని ‘గొప్ప నిరాడంబరత’ అంటూ పొగడటం సబబేనా?

ప్రజల పన్నుల డబ్బుతో జీతాలు, కార్లు, సదుపాయాలు అనుభవిస్తున్న నేతల నుంచి ప్రజలు ఇలాంటి ప్రదర్శనలు కోరుకోవడం లేదు. తమ కష్టాలు తీర్చే నిర్ణయాలు, సభల్లో తమ తరుపున మాట్లాడే నిజాయితీని మాత్రమే వారు కోరుకుంటున్నారు.

ఒక్క పూట పక్కన బిచ్చగాడిగా అడుక్కున్నంత మాత్రాన ఆత్మశుద్ధి రాదు, పేదల ఆకలి తీరదు. తనతో పాటు రోడ్డుపై కూర్చున్న ఆ అభాగ్యుల కడుపు నింపడానికి, వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి ఈ ఎమ్మెల్యే గారు తన వేల కోట్ల ఆస్తుల్లో ఏమైనా కొంత పంచారా? అదీ చేయలేదు. పోనీ, చేతిలో ఉన్న శాసనసభ్యుడి అధికారంతో వారి జీవితాలను మార్చేందుకు ఏదైనా శాశ్వత పథకం తెచ్చారా? అదీ లేదు.

సంపదనూ వదులుకోకుండా, అధికారంతో సమస్యనూ పరిష్కరించకుండా… కేవలం కెమెరాల కోసమే ఈ వేషాలు వేస్తే అది పేదరికాన్ని వెక్కిరించడమే అవుతుంది. అసలైన నిరాడంబరత రోడ్డుపై నాటకాలు ఆడటంలో ఉండదు; అట్టడుగు వర్గాల కన్నీళ్లు తుడిచి, వారిని గౌరవంగా బతికేలా చేసే పాలనా నిర్ణయాల్లోనే ఉంటుంది. అది చేయనంత కాలం, ఈ విన్యాసాలన్నీ ప్రజలను మోసం చేసే చవకబారు ప్రచారాలుగానే మిగిలిపోతాయి.. అంతే!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకరోజు బిచ్చగాడి వేషంతో – ఆ ప్రచారంతో సాదాసీదాతనం రాదు !
  • హెరిటేజ్ ఆనవాళ్ల పరిరక్షకుడు- ఈ ఆగాఖాన్ ఎవరో తెలుసా?
  • KTR ట్వీట్లు, ఆరోపణలు సరే… ఇంతకీ ఠాణాలో దాడి ఘటన జరిగిందా?
  • ట్రూ కామ్రేడ్ వెళ్లిపోయాడు – ఆ ఎరుపు రంగూ వెలిసిపోయింది !!
  • అచ్యుతం కేశవం … బాగున్నట్టే ఉంది… కానీ ఏదో తెలియని అసంతృప్తి !!
  • GDN – మాధవన్ మరో మంచి పాత్ర! చూడదగిన ఓ బయోపిక్ !!
  • 72 వేల మందికి పీఆర్సీ కట్?… అపోహలేమిటి – నిజాలేమిటి?
  • ‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?
  • తెలంగాణ రెడ్లు, కోమట్లు – వందల తరాలుగా ఓ జన్యులోప వారసత్వం!!
  • కొరగాని వారసులు! ఘోషిస్తున్న బాల్ ఠాక్రే ఆత్మ! – అసలెవరు ఈ దిశా ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions