Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొరగాని వారసులు! ఘోషిస్తున్న బాల్ ఠాక్రే ఆత్మ! – అసలెవరు ఈ దిశా ?

September 15, 2026 by M S R

.

ఏకంగా ఓ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… తన కొడుకు,  మాజీ మంత్రి… తన హోం మంత్రి… ఓ అమ్మాయి మరణం కేసులో నిందితులు… అందుకే ఓ సంచలనం… ఒకసారి వివరంగా ఈ కథలోకి వెళ్దాం…

(ఒకప్పుడు బాల్ ఠాక్రే అంటే స్పురించే ఇమేజ్ వేరు- ఇప్పుడు తన వారసుడు ఉద్దవ్ ఠాక్రే పూర్తి భిన్నం- అసమర్థ, పిరికి ధోరణి… పైగా నిలువెల్లా దురాశావాదం, మోసం… తన వారసుడు ఆదిత్య ఠాక్రే మరింత దిగజారుడు… చివరకు అమ్మాయి హత్యాచారం కేసులో నిందితుడు!! పాపం బాల్ ఠాక్రే ఆత్మవిలాపం !!!

Ads


ఒక అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది… ఆమె పేరు దిశా సాలియన్. ఆమె బాలీవుడ్‌లో పెద్ద స్టార్ కాదు. కానీ సినిమా తారలతో పనిచేసే టాలెంట్ మేనేజర్. కొంతకాలం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు కూడా మేనేజర్‌గా పనిచేసింది. 2020 జూన్ 8 రాత్రి ముంబైలోని మలాడ్‌లో ఓ ఎత్తైన భవనం నుంచి పడిపోయి దిశా చనిపోయింది.

ఆరు రోజులు కూడా గడవకముందే… జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన బాంద్రా నివాసంలో చనిపోయాడు. రెండు మరణాల మధ్య ఇంత తక్కువ వ్యవధి. ఒకరు సినిమా నటుడి మేనేజర్. మరొకరు దేశం మొత్తం అభిమానించిన యువ నటుడు.

మామూలుగానైతే అక్కడితో ఈ కథ ముగిసిపోవాలి. కానీ ముగియలేదు. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ మొదలైంది. అదీ మామూలుగా కాదు…  CBI FIRతో…

disha

దిశా ఎవరు? దిశా సాలియన్ వయసు కేవలం 28 ఏళ్లు. సెలబ్రిటీ టాలెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ సినీ పరిశ్రమలో పరిచయాలు సంపాదించుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కూడా ఆమె కొంతకాలం పనిచేసింది.

2020 జూన్ 8న మలాడ్‌లోని ఓ హై-రైజ్ భవనం నుంచి ఆమె కిందపడిపోయింది. అప్పట్లో ముంబై పోలీసులు దీనిని Accidental Death Reportగా నమోదు చేశారు. తర్వాత దర్యాప్తు కొనసాగి, దిశ ఆత్మహత్య చేసుకున్నదనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. కానీ దిశ తండ్రి సతీశ్ సాలియన్ దీన్ని అంగీకరించలేదు.

“నా కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదు. అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత నిందితులను కాపాడేందుకు వ్యవస్థ మొత్తం కదిలింది” అన్నది ఆయన ఆరోపణ. ఆరోపణల జాబితాలో ఒక్క పేరు కాదు… ఆదిత్య ఠాక్రే, డినో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తి, మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్, సచిన్ వాజే తదితరుల పేర్లు వచ్చాయి. ఇక్కడి నుంచే ఈ కథకు రాజకీయ రంగు వచ్చింది.

ఎందుకంటే ఆదిత్య ఠాక్రే అంటే… మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు… ఇద్దరి పేర్లూ తాజా ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావనకు వచ్చాయి… అంటే మరింత లోతుగా దర్యాప్తు జరిపి, మాజీ సీఎం పాత్రను నిర్ధారించాల్సి ఉంది…  ఇదే ఈ కథను రాజకీయంగా మరింత పేలుడు పదార్థంగా మార్చింది.

అసలు దిశాకు ఏం తెలుసు? ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. దిశాకు ఆదిత్య ఠాక్రేకు సంబంధించిన కొన్ని కీలక, గుప్త విషయాలు తెలుసు, వాటికి సంబంధించిన ఆధారాలు ఆమె సుశాంత్‌కు ఇచ్చిందని దిశా తండ్రి తరఫు న్యాయవాది నీలేశ్ అంటున్నాడు… ఆయన కథనం ప్రకారం…

దిశా దగ్గర ఉన్న సమాచారం సుశాంత్‌కు చేరింది. సుశాంత్ ఆ విషయాన్ని రియాకు చెప్పాడు. రియా ద్వారా ఆ సమాచారం మరికొందరికి చేరిందన్నది ఆరోపణ. ఆ తర్వాత… దిశా చనిపోయింది. ఆరు రోజుల తర్వాత… సుశాంత్ కూడా చనిపోయాడు.

అందుకే సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది… దిశాకు నిజంగా ఏం తెలుసు? ఆదిత్య ఠాక్రే చీకటి జీవితం ఏమిటి..? దానిపై ఆమె దగ్గర ఏ ఆధారాలున్నాయి? ఆ ఆధారాలు నిజంగా సుశాంత్‌కు చేరాయా? సుశాంత్ దగ్గరున్న ఆ సమాచారం తమకు ప్రమాదముందని ఆదిత్య ఠాక్రే ఎందుకు భయపడ్డాడు..? అందుకే దిశా మరణం చోటుచేసుకుందా..? ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తు తేల్చాల్సిన ప్రశ్నలు.

దిశా జూన్ 8న చనిపోయింది. సుశాంత్ జూన్ 14న చనిపోయాడు. మధ్యలో కేవలం ఆరు రోజులు. దిశా మరణం, సుశాంత్ మరణం ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయన్న ప్రచారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై పోలీసులు ఈ రెండు మరణాల మధ్య లింక్ ఏమీ లేదని తేల్చేశారు…  కానీ…

తర్వాత సుశాంత్ కేసును CBI దర్యాప్తు చేసింది. 2025 మార్చిలో ఈ కేసులో ఫౌల్ ప్లే ఏమీ లేదని పేర్కొంటూ సీబీఐ కోర్టుకు క్లోజర్ రిపోర్ట్ సమర్పించింది. ఆ నివేదికలో సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా పేర్కొంది. అయినా దిశా కేసులో ఇప్పుడు మళ్లీ సుశాంత్ పేరు వినిపిస్తోంది. అందుకే ఆరు సంవత్సరాల క్రితం మూసుకుపోయినట్టు కనిపించిన తలుపు… మళ్లీ తెరుచుకుంది.

మరి ఈ కేసులో మాజీ సీఎం ఏంటి?  CBI ప్రస్తుతం దిశా మరణం, దాని వెనుక ఏదైనా కుట్ర జరిగిందా, కొడుకును కాపాడటానికి మాజీ సీఎం ఠాక్రే దిశా మరణం తాలూకు ఆధారాలు మాయం చేశారా, దర్యాప్తును ప్రభావితం చేశారా వంటి అంశాలపై విచారణ చేయనుంది. ఉద్ధవ్ ఠాక్రే పాత్ర కవర్‌అప్ లేదా కుట్ర కోణంలో పరిశీలనకు రావచ్చని CBI వర్గాలు చెబుతున్నాయి…

అంటే కథ ఇప్పుడు కేవలం “ఒక యువతి ఎలా చనిపోయింది?” అనే ప్రశ్న కాదు. “ఆమె మరణం తర్వాత ఏం జరిగింది?” అనే ప్రశ్న కూడా. ఆరు ఏళ్లుగా ఒక్క FIR కూడా ఎందుకు లేదు? ఇది బాంబే హైకోర్టును కూడా కలవరపరిచిన అంశమే.

దిశా మరణంపై పోలీసులు సంవత్సరాల పాటు దర్యాప్తు చేసినా, cognizable offenceకు సంబంధించిన FIR ఎందుకు నమోదు చేయలేదన్న దానిపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే CBIకి కేసును అప్పగిస్తూ FIR నమోదు చేయాలని ఆదేశించింది…


ముంబై అంటేనే రకరకాల మాఫియాలు, గ్యాంగ్‌స్టర్లు… బాలీవుడ్, ఉగ్రవాదం, నేరసామ్రాజ్యం, రాజకీయం, ఉన్నతాధికారగణం… అన్నీ కలగలిసిపోయిన ఓ పెద్ద పెంట వ్యవహారం… అందులో ఏకంగా ఓ మాజీ సీఎం, తన కొడుకు, హోం మంత్రి, పోలీస్ కమిషనర్ తదితరుల పేర్లు… సీబీఐ త్వరగా ఈ కథను కొలిక్కి తీసుకొస్తుందా..? కోర్టు మాత్రం విడిచిపెట్టేట్లుగా లేదు…!! ఏ మాఫియాల పట్ల ఠాక్రే టెర్రర్ అనిపించుకున్నాడో ఆ మాఫియా లింక్ కేసుల్లో ఠాక్రే వారసులు… ఇదీ అసలు ఐరనీ!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొరగాని వారసులు! ఘోషిస్తున్న బాల్ ఠాక్రే ఆత్మ! – అసలెవరు ఈ దిశా ?
  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?
  • జస్ట్, సెక్యూరిటీ కాదు- రాష్ట్రపతి పక్కన నడక అంత ఈజీ కాదు!
  • సంపన్నుల లగ్జరీ కొనుగోళ్లు – సిస్టమ్‌కు నష్టమా? లాభమా?
  • ఒకప్పటి తిరుగులేని సామ్రాజ్యం- ఇప్పుడు 4 ముక్కల విచ్ఛిన్నం అంచుల్లో!!
  • దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!
  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions