.
ఓ మాజీ సీఎం, తన కొడుకు కమ్ మాజీ మంత్రి, ఓ హోం మంత్రి, పోలీస్ కమిషనర్, పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్న ఓ హైప్రొఫైల్ కేసును సీబీఐ ఆ లేడీ పోలీస్ అధికారిణికే ఎందుకు అప్పగించింది..? అసలు ఎవరు ఆమె..? ఏమిటి ఆమె విశిష్టత..?
దిశా సాలియన్ మరణం బాపతు సంచలన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది… ఆరు సంవత్సరాల తర్వాత సీబీఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది… బాంబే హైకోర్టు ఆదేశాలతో మొదలైన ఈ దర్యాప్తును ఇప్పుడు సీబీఐ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన ఎస్పీ సీమా పాహుజా పర్యవేక్షించబోతోంది… అయితే దిశా సాలియన్ కేసుకు సీమా పాహుజానే ఎందుకు? అసలు ఎవరామె?
Ads
ఇది తెలుసుకోవాలంటే ఆమె పేరు వెనుక ఉన్న దర్యాప్తు చరిత్రను చూడాలి… సీమా పాహుజా సాధారణంగా కనిపించే పోలీసు అధికారిణి కాదు… సంక్లిష్టమైన క్రిమినల్ కేసుల్లో ఆధారాలను ఒక్కొక్కటిగా కలిపి, అసలు కథను బయటకు తీయడంలో అనుభవం ఉన్న అధికారిణిగా ఆమెకు సీబీఐలో గుర్తింపు ఉంది…. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక నేరాల విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న ఆమెకు దర్యాప్తు రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది…
గుడియా కేసు…. సీమా పాహుజా పేరు బలంగా వినిపించిన కేసుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని గుడియా కేసు ఒకటి. 2017లో కోట్‌ఖాయ్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… ఈ కేసును హిమాచల్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ చేపట్టింది…
ఇది సాధారణ దర్యాప్తు కాదు… ఆధారాలు పరిమితంగా ఉండటం, కేసులో అనేక మలుపులు ఉండటంతో ఫోరెన్సిక్ ఆధారాలే కీలకంగా మారాయి… సీబీఐ దర్యాప్తు చివరకు ఒక నిందితుడిపై కేసును బలపరిచింది… అతడికి 2021లో జీవిత ఖైదు పడింది… సీబీఐ అధునాతన డీఎన్‌ఏ సాంకేతికతను ఉపయోగించి కేసును ఛేదించిందని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి…
అంటే సీమా పాహుజా పేరు కేవలం “హైప్రొఫైల్ కేసుల్లో పనిచేసిన అధికారి” అని మాత్రమే ఫోరెన్సిక్ సహా అన్నిరకాల మార్గాల్లో కీలక ఆధారాలను ఉపయోగించి క్లిష్టమైన కేసులను ముందుకు తీసుకెళ్లిన అనుభవం ఉన్న అధికారి అనే కోణం ముఖ్యం…
హత్రాస్.. దేశం మొత్తం చూస్తున్న కేసు… 2020లో హత్రాస్ యువతి మరణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. సీబీఐ కేసును చేపట్టినప్పుడు దర్యాప్తు బృందంలో సీమా పాహుజా కూడా ఉంది… అప్పట్లో ఆమె డిప్యూటీ ఎస్పీ స్థాయిలో ఉంది…
అంతకుముందు ఉన్నావ్ లైంగికదాడి కేసుతో పాటు మరికొన్ని అత్యంత సున్నితమైన కేసుల్లోనూ ఆమె పనిచేసింది… అంటే ఒకే తరహా కేసుల్లో కాకుండా, రాజకీయంగా, సామాజికంగా, ప్రజాభిప్రాయపరంగా అత్యంత సున్నితమైన దర్యాప్తుల్లో అనుభవం సంపాదించింది…
ఆర్జీకర్ కేసులోనూ … 2024లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులోనూ సీమా పాహుజా సీబీఐ బృందంలో ఉన్నారు.
ఆ కేసుకు సంబంధించి 2025లో ప్రచురించిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPR&D) పత్రంలో పాహుజా పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు… క్రైమ్ సీన్ నుంచి సేకరించిన ఆధారాల చైన్ ఆఫ్ కస్టడీ, డీఎన్‌ఏ పరీక్షలు, సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ డేటా, ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయాలు వంటి అంశాలను కలిపి దర్యాప్తు సాగించిన విధానాన్ని అందులో వివరించారు… ఇదే కారణంగా ఆమెకు “ఫోరెన్సిక్ అక్యుమెన్” ఉన్న అధికారిణి అనే పేరు వచ్చింది…

రెండు గోల్డ్ మెడల్స్.. మరో కీలక గౌరవం… సీమా పాహుజా దర్యాప్తు నైపుణ్యానికి రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి… ఇక 2021 సందర్భంగా కేంద్ర హోం శాఖ విడుదల చేసిన అధికారిక జాబితాలో సీమా పాహుజా, డిప్యూటీ ఎస్పీ, సీబీఐ పేరును President’s Police Medal for Distinguished Service అవార్డు గ్రహీతగా నమోదు చేశారు… అంటే ఆమెకు వచ్చిన గుర్తింపు కేవలం మీడియా కథనాల్లో కనిపించే ప్రశంసలే కాదు. ప్రభుత్వ స్థాయిలోనూ ఆమె సేవకు గౌరవం లభించింది.
ఇప్పుడు దిశా సాలియన్ కేసు …. ఇదే అనుభవంతో ఇప్పుడు సీమా పాహుజా ముందున్న కేసు దిశా సాలియన్ మరణం. 2020 జూన్ 8న ముంబైలోని ఓ భవనం 14వ అంతస్తు నుంచి దిశా పడిపోయి మరణించింది… అప్పట్లో పోలీసులు ప్రమాదం/ ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేశారు. కానీ ఇటీవల బాంబే హైకోర్టు పాత దర్యాప్తులో “అనేక స్పష్టమైన వ్యత్యాసాలు” ఉన్నాయని పేర్కొంటూ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది…
ఇప్పుడు సీబీఐ పరిశీలించబోయేది పాత పోలీసు రికార్డులు మాత్రమే కాదు. ఘటనాస్థలం, పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, దిశా మరణానికి ముందు జరిగిన పరిణామాలు, ఆ రాత్రి ఆమె ఫియాన్సీ ఇంట్లో ఉన్నవారి స్టేట్‌మెంట్లు.. ఇలా మొత్తం దర్యాప్తు వ్యవస్థను మళ్లీ పరిశీలించనుంది…
అందుకే ఈ కేసులో సీమా పాహుజా ఎంపిక ఆసక్తికరంగా మారింది… ఆమె ముందున్నది మరో హైప్రొఫైల్ కేసు మాత్రమే కాదు… ఆరు సంవత్సరాలుగా సమాధానం దొరకని ప్రశ్నల సమాహారం… దిశా సాలియన్ కేసును తిరిగి తెరిచిన సీబీఐ… ఆ కేసు ఫైల్‌ను సీమా పాహుజా చేతిలో ఎందుకు పెట్టిందో, ఆమె గత దర్యాప్తులను చూస్తే అర్థమవుతోంది కదా…
Share this Article