.
ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ కేడర్‌లో జోష్ రావడం లేదు, కేసీయార్ పట్ల ఆదరణ పెరగకపోగా… రోజుకో స్కాం బయటపడుతూ… నానాటికీ దిగజారుతోంది… దాంతో ఏవో సర్వేల పేరిట, రాబోయేది మన సర్కారే అనే భ్రమల్ని క్రియేట్ చేస్తూ, కేడర్ మరింత నీరసపడకుండా చూసుకోవడం బీఆర్ఎస్‌కు నానా యాతన ఇప్పుడు…
నిన్న నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీ వార్త చూస్తే ఇదే అనిపించింది… ఆమధ్య ఎవరో చాణుక్యుడు ఏదో సర్వే చేశాడంటూ… ‘అదుగో మళ్లీ నవలోకం’ అన్నతరహాలో కేసీయార్ పునరధికారం అని ఏవో పెయిడ్ కథలు చెప్పారు తెలుసు కదా… ఇప్పుడు మరో సర్వే… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీకి అధికారం అట…
Ads
కానీ పుట్టెడు సందేహాలు ఆ వార్త మీద, ఆ సర్వే మీద… ఓసారి వివరంగానే చెప్పుకుందాం… ప్రాపగాండాల తీరును ముచ్చటించుకుందాం…. (పాపం, సదరు సర్వేయర్లు ఇంకా 2019కు ముందురోజుల్లో తచ్చాడుతున్నారు, అదీ చూద్దాం…)

ఇదీ ఆ వార్త… కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం అన్నీ దిగజారిపోయి… ప్రజలు కేసీయార్‌కు బ్రహ్మరథం పడతారట… కానీ బీఆర్ఎస్‌కు వస్తాయంటున్న ఆ 65 సీట్లు ఎలా లెక్కపెట్టారు? 2028 తెలంగాణ ‘ఒపీనియన్ పోల్’పై ఇవిగో బలమైన సందేహాలు…
2028లో బీఆర్‌ఎస్‌దే ప్రభంజనం.. కనీసం 65, గరిష్ఠంగా 85 సీట్లు.. కాంగ్రెస్‌కు 42.. బీజేపీ, ఎంఐఎంకు చెరో 6… ఇదే కదా సర్వే చెబుతోంది… ఇది నిజమైన సర్వేనా..? లేక ఒక యూట్యూబర్ చేసిన రాజకీయ అంచనాలకు ‘ఒపీనియన్ పోల్’ అనే ముద్ర పడిందా?
ప్రశ్న బీఆర్‌ఎస్ వస్తుందా? కాంగ్రెస్ గెలుస్తుందా? అన్నది కాదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు ఈ సర్వే అసలు ఎంత శాస్త్రీయంగా జరిగింది? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న…
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్, జర్నలిస్టు అర్పిత్ శుక్లా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలపై సర్వే నిర్వహించినట్టు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలపై ఆయన అంచనాలు ఇచ్చినట్టు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది. అదీ జిల్లాల వారీగా…
ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది…. సర్వే చేసింది ఎవరు? సంస్థ పేరు ఏంటి? ఒక రాజకీయ పార్టీకి వచ్చే సీట్లపై శాస్త్రీయమైన ఒపీనియన్ పోల్ అంటే సాధారణంగా కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఉండాలి.
ఎంతమందిని ప్రశ్నించారు? ఎప్పుడు ప్రశ్నించారు? ఏ నియోజకవర్గాల్లో ప్రశ్నించారు? గ్రామీణ, పట్టణ ఓటర్ల నుంచి ఎంత శాంపిల్ తీసుకున్నారు? వయసు, లింగం, సామాజిక వర్గాలు, ప్రాంతాల ప్రాతినిధ్యం ఎలా ఉంది? Face-to-face సర్వేనా? ఫోన్ సర్వేనా? ఆన్‌లైన్ సర్వేనా? Margin of error ఎంత? ఏ ప్రశ్న అడిగి ఓటరు అభిప్రాయాన్ని నమోదు చేశారు? ఇవన్నీ ఒక సాధారణ పాఠకుడికి తెలియాలి… అది క్రెడిబులిటీ ఇష్యూ…
కానీ ఈ కథనంలో సర్వే సంస్థ పేరు కనిపించదు. ‘అర్పిత్ శుక్లా’ అనే వ్యక్తి పేరే ప్రధానంగా ఉంది. ఆయన యూట్యూబ్‌లో ఎన్నికలపై కంటెంట్ చేస్తున్నారన్నది వేరే విషయం. ఆయన పేరుతో తెలంగాణ 2028 ఎన్నికలపై సర్వే వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఒక వ్యక్తి యూట్యూబ్ సర్వే చేయడం, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన స్వతంత్ర opinion poll కావడం రెండూ ఒకటే కాదు….
ఇక్కడే పారదర్శకత అవసరం. దేశవ్యాప్త సర్వే అయితే తెలంగాణకే ఎందుకు ఇంత ప్రత్యేకత? మరో ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉంది.
ఈ సర్వేను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించినట్టు కథనం చెబుతోంది. మరి దాని పూర్తి methodology ఏమిటి? అన్ని రాష్ట్రాల్లో ఎంత sample? ప్రతి రాష్ట్రానికి ఎంత sample? రాష్ట్రాలవారీగా ఏజ్ గ్రూపులు, ప్రాంతాలు ఎలా తీసుకున్నారు? ఏ రాష్ట్రానికి ఏ ఎన్నికను ప్రాతిపదికగా తీసుకున్నారు?
సాధారణంగా జాతీయ స్థాయి ఎన్నికల ఒపీనియన్ పోల్ అంటే లోక్‌సభ ఎన్నికల కోసం జాతీయ స్థాయిలో చేయడం సహజంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక సర్వే చేస్తే ఆయా రాష్ట్రాన్ని target populationగా తీసుకుని నియోజకవర్గాల స్థాయిలో sampling వివరాలు ఇవ్వడం మరింత ముఖ్యం.
కానీ ఇక్కడ మాత్రం దేశవ్యాప్త సర్వేలో తెలంగాణ 2028 అసెంబ్లీకి 119 సీట్ల లెక్క ఎలా వచ్చింది? అన్నది స్పష్టంగా లేదు….

మరి 31 జిల్లాలేంటి? తెలంగాణలో 33 జిల్లాలు కదా! ఇక్కడ మరో విచిత్రమైన విషయం కనిపిస్తుంది. కథనంలోని జిల్లాలవారీ పట్టికను చూస్తే 31 జిల్లాల పేర్లే కనిపిస్తున్నాయి. తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాల రాష్ట్రం కాదు. ములుగు, నారాయణపేట జిల్లాలు 2019లో ఏర్పడ్డాయి….
ములుగు, నారాయణపేటల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే ఉండటంతో వాటిని సమీప జిల్లాల్లో కలిపి చూపించామని కథనం చివర్లో పేర్కొంది… ఏ జిల్లాతో ఏ జిల్లాను కలిపారు? ఎందుకు కలిపారు? ఆ aggregation ఎలా జరిగింది? నియోజకవర్గాల స్థాయిలో ఓటర్ల అభిప్రాయాన్ని ఎలా లెక్కించారు? అంతా మాయ!
ఇంకో కీలకమైన విషయం — 2028లో 119 సీట్లేనా? ఇది కూడా విస్మరించలేని అంశం. ఈ సర్వే మాత్రం ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలనే ప్రాతిపదికగా తీసుకుంది. కానీ 2028 నాటికి నియోజకవర్గాల పునర్విభజన (delimitation) అంశం రాజకీయ చర్చలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా భవిష్యత్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగవచ్చనే అంటున్నాడు…
అందువల్ల 65-42-6-6 అనే లెక్కకు మరో assumption ఉంది. ప్రస్తుత 119 స్థానాల నిర్మాణమే కొనసాగుతుందనే assumption. ఇది కూడా సర్వే methodologyలో స్పష్టంగా చెప్పాల్సిన అంశమే. అసలు ‘65’ అనే సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే అన్నింటికంటే పెద్ద ప్రశ్న.
ఒక సర్వే నిజంగా ప్రజాభిప్రాయాన్ని కొలిచిందంటే, ఆ అభిప్రాయం ఎలా సేకరించబడిందో తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉండాలి… అది లేదంటే, ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా చివరి సీట్ల సంఖ్యలను చూసి “తెలంగాణ ప్రజల తీర్పు ఇదే” అని చెప్పడం మాత్రం పక్కా తొందరపాటు….
జాతీయ మీడియాలో ఎందుకు కనిపించలేదు? మరో ఆసక్తికరమైన అంశం — ఈ సర్వేకు సంబంధించి ప్రధాన జాతీయ మీడియా సంస్థల్లో విస్తృతంగా ప్రచురితమైన స్వతంత్ర వార్త కనిపించలేదు… ఇక నిజానిజాలేమిటో సదరు యూట్యూబ్ సర్వేయర్లు మాత్రమే చెప్పాలి… లేదా కేసీయార్ మైక్ చెప్పాలి..!!
Share this Article