Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రేక్షకుడి సహనంపై ‘సవారీ… మసాలాలు ఎక్కువై రుచి కుదరని ‘బిర్యానీ’…

September 24, 2026 by M S R

.

విపరీతమైన వివక్షకు గురైన ఒక జాతి, సామాజికంగా గుర్తింపునకు నోచుకోని ఓ సమూహం ఒక నాయకుడి నేతృత్వంలో పోరాడిన కథను ఓ సినిమాగా తీయాలనుకుంటే… ఆ కథనంలో ఆత్మ ఉండాలి, చూసే ప్రేక్షకుడు ఆ జాని అనుభవించిన పెయిన్‌ను ఫీలవ్వాలి… ఉద్వేగం ప్రధానంగా కథ సాగాలి… ప్రజెంటేషన్ అలా ఉండాలి… కానీ..?

దాన్ని సగటు తెలుగు సినిమా కమర్షియల్ లెక్కల్లో ఇరికిస్తే, కథ చిన్నదైపోతుంది, ప్రభావహీనం అవుతుంది… కథనం కొండెక్కుతుంది… ఐటమ్ సాంగ్ ఇప్పసారా వాసన, హీరోయిజం ఎలివేషన్, కేకలు, అర్థం కాని డైలాగ్స్, అతకని రియల్ టైమ్ పొలిటికల్ మసాలా, విపరీతమైన హింస, నెత్తురు… ఇవన్నీ అద్దడంతో సవారీలు అనబడే ఓ బాధిత జాతి ఆత్మకథను ఒకరకంగా శ్రీకాంత్ ఓదెల పొల్యూట్ చేసి వదిలాడు… స్థూలంగా ప్యారడైజ్ అనబడే జడల్ షేర్ సినిమా ఇదీ…

Ads

ఏ సినిమాకైనా కాస్త ప్రచారం, కాస్త హైప్ అవసరమే… అది పరిచయానికి మాత్రమే, అంతేతప్ప సినిమాను నిలబెట్టేది ఆ సినిమా కథాకథనాల్లో ఉన్న దమ్ము మాత్రమే… కానీ విపరీతమైన ప్రచారం, ఏదో గొప్ప సినిమా రాబోతోంది అనే భ్రమాత్మక వాతావరణం క్రియేట్ అయ్యాక, తీరా దమ్ము కాదు, దుమ్ము మాత్రమే కనిపిస్తే..? ప్చ్, ఇదేంటి ఇలా ఉంది అనే నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది…

దాదాపు ఏడాదిన్నరగా సా-గు-తు-న్న ప్రచారం నుంచి సంధ్య థియేటర్‌లో సినిమా చూస్తాను అనే నాని మార్క్ ప్రచారం జస్ట్, అతి.., అది బెడిసికొట్టింది… అతి సర్వత్రా వర్జయేత్ అనే వాక్యం దర్శకుడు, హీరో, నిర్మాతకు తెలిసినట్టు లేదు… సరే, మరి సినిమా..?

– మోహన్‌బాబు పాత్ర, తన నటన, తన అప్పియరెన్స్ (శిఖంజా మాలిక్)  సినిమాకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయి ఉండాల్సింది… కానీ మరీ భారతీయుడులో కమలహాసన్ టైప్ విన్యాసాలు అతకలేదు, నప్పలేదు, దాంతో మోహన్‌‌బాబు పాత్ర చిన్నబోయింది…

– కాయదు లోహర్‌తో ప్రేమకథ నీరసంగా సాగింది… నిజం చెప్పాలంటే ఈ సినిమా కథలో ఆ ప్రేమకథ ఇమడలేదు… కాదు, దర్శకుడికి సమర్థంగా ఇరికించలేకపోయాడు…

– కేసీయార్‌ను గుర్తుచేసేలా ఓ నాయకుడి పాత్ర శంకర్ (ప్రియదర్శి)… కేసీయార్‌కు మాటలకు అనుకరణ… తాత్కాలికంగా థియేటర్లలో కొందరి కేకలకు, జేజేలకు పనికొచ్చినా… స్థూలంగా ఆ పాత్ర సవారీల విముక్తి పోరాటవీరుడి కథకు ఆకర్షణ కాదు, జస్ట్ ఓ అట్రాక్షన్ జిమ్మిక్ మాత్రమే… రియల్‌టైమ్ అంశాల్ని సవారీల కథకు కలిపి కుట్టాలనుకున్నప్పుడు ‘మంచి టైలరింగ్ నైపుణ్యం’ అవసరం, శ్రీకాంత్‌కు అది చేతకాలేదు…

– నాని డైలాగ్స్, అరుపులు భీకరం, తను ఏమంటున్నాడో కూడా అర్థం కాదు సరిగ్గా… దీనికితోడు సెకండాఫ్‌లో విపరీతమైన హింస, నెత్తురు, తలలు, మొండేల బరువుతో ఓ కమురు వాసన…

– ఫస్టాఫ్ కథను, పాత్రల్ని కాస్త పద్దతిగానే, సజావుగా, ఇంట్రస్టింగుగా మలిచిన దర్శకుడు సెకండాఫ్‌లో పూర్తిగా దారితప్పి, చివరకు ప్రేక్షకుడికి నీరసాన్ని, తలనొప్పిని ప్రసాదించి వదిలాడు… ఫస్టాఫ్ శ్రద్ధ సెకండాఫ్‌లో చూపించి ఉంటే, మరీ మితిమీరిన సగటు తెలుగు సినిమా పైత్యాల్ని కలపకుండా ఉంటే… నిజంగా ఈ సినిమా గుర్తుండిపోయేది కొన్నాళ్లు…

– కథానాయకుడు తన తల్లిని ద్వేషించి, తరువాత అర్థం చేసుకోవడం మంచి పాయింటే, కానీ సరిగ్గా ప్రొజెక్ట్ కాలేదు, అలాగే మోహన్‌బాబు బిర్యానీ చోరీ చేశాడని ఓ పిల్లాడిని జైలుకు పంపి, ‘లంజకొడుకు’ అని పచ్చబొట్టు వేయించడం అనేది కూడా అసాధారణం అనిపించింది…

– కలెక్టర్ సీన్ మరీ నవ్వొచ్చేలా… గుర్తింపు కార్డ్ కోసం సంతకాలు పెడతారా పెట్టరా అంటూ పీకల్లోతు నీళ్లల్లో కూర్చుని గొడవ చేస్తాడు…. ఒక దశలో హీరో సొంత దేశం ప్రకటిస్తాడు. అవును… సొంత పార్టీ కాదు… ఏకంగా దేశమే. డాక్టర్ ని, టీచర్ ని కిడ్నాప్ చేసి ఆ దేశంలో పని చేయించుకుంటారు… పాపం, శ్రీకాంత్ ఓదెల…

– సినిమాకు కాస్త బలం కాసర్ల శ్యామ్ రాసిన పాటలు, ప్రత్యేకించి ఏషనాగుల కట్ట మీద, సమ్మక్క పాట… వీటికి అనిరుధ్ ట్యూన్లు భలే కుదిరాయి, కానీ బీజీఎం సోసో… జూనియర్ మాలిక్ పాత్రలో రాఘవ్ జుయెల్, బిర్యానీగా సంపూర్ణేష్, సోనాలీ కులకర్ణి, ఈశ్వరీరావు పర్లేదు… వెరసి, ఇది రుచికరమైన ‘ప్యారడైజ్ బిర్యానీ’ కాదు, అదోరకం వంటకం మాత్రమే…

– హైదరాబాదీ డయలెక్ట్ వేరు, తెలంగాణ రూరల్ మాండలికానికి కూడా భిన్నంగా ఉంటుంది… తెలుగు నడుమ నాలుగు ఉర్దూపదాలు కాదు, ఉచ్చరనే సపరేటు… దాన్ని ఈ సినిమా పట్టుకోలేకపోయింది,, అది తీవ్రంగా నిరాశపరిచే విషయం…

– ఓచోట సత్యరాజ్ పాత్ర “ప్యారడైజ్ ఈజ్ గోయింగ్ టు బి హెల్” అంటాడు… నిజమే, డైలాగ్ అక్షరసత్యం… this is not a paradise, just Hell…

చివరగా… ఒకప్పుడు నేచురల్ నాని… తరువాత గంగ చంద్రముఖిలా మారినట్టు… మారుతూ మారుతూ… ఇదుగో సగటు తెలుగు స్టార్ హీరోలకు ఉండాల్సిన అన్నిరకాల ‘లక్షణాల’ను వంటబట్టించుకుని… చివరకు జడల్ షేర్‌గా రూపాంతరం చెందిన తీరు… నాని ట్రూ ఫ్యాన్స్‌కు జీర్ణం కాదు..!! మాస్ అంటే వయెలెన్స్ కాదు, ప్రతిదీ కేజీఎఫ్ కాదు, నానికి ఈ నిజం అర్థమయ్యేలోపు ఇదుగో ఈ ధగడ్ వేషాలు తప్పవు…

అఫ్‌కోర్స్, తను మంచి నటుడు, ఇందులోనూ బాగా నటించాడు… ఎటొచ్చీ శ్రీకాంత్ ఓదెల ‘మంచి చెఫ్’ అనిపించుకోలేదు, అందుకే బిర్యానీ టేస్ట్ కుదరలేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దమ్మున్న జర్నలిస్టు – ప్రకంపనలు – అసలు ఎవరు ఈ రితికా చోప్రా !?
  • ప్రేక్షకుడి సహనంపై ‘సవారీ… మసాలాలు ఎక్కువై రుచి కుదరని ‘బిర్యానీ’…
  • జేడీ చక్రవర్తి ఎవరికీ అర్థం కాడు – అర్థమైతే ఆ దోస్తీ వదలలేం…
  • దిక్కుమాలిన సంత – యాణ్నుంచి పట్టుకొచ్చార్రా వీళ్లను ?
  • ఆ సంధ్య థియేటరే దేనికి..? సొంత హైటెక్ థియేటర్లు ఉన్నాయిగా..!!
  • నాని పైత్యం ! పెంటపెంట… జవహర్‌నగర్ డంపింగ్ యార్డు దుర్వాసన !!
  • ఒవైసీ చెప్పిన ఈ పేరు వెనుక ఓ చరిత్ర’… అసలెవరు ఈ ‘మౌల్వీ?
  • బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!
  • చిన్న సినిమా అంటే చిన్నతనం కాదు… చిల్లరతనం అసలే కాదమ్మా…
  • హీరో నాని ఓ వెర్రి ట్వీట్ ! ప్రజాప్రభుత్వమా ఇక సాగిలబడు ఓ నటుడి ఎదుట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions