Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…

September 26, 2026 by M S R

.

టీవీలో హైపర్ ఆది ప్రవేశపెట్టిన వికృత భాష తెలుసు కదా… మింగడం, తినడం ఎట్సెట్రా… వాటి అసలు అర్థాలేమిటో సోషల్ మీడియాతో బాగా పరిచయం ఉన్నవాళ్లకు అర్థమవుతుంది… అది హైపర్ టేస్ట్… ఫాఫం, వదిలేయండి, ఆ చానెళ్లకు నివాళి అర్పిద్దాం… ప్రధానంగా ఈటీవీకి…

సోషల్ మీడియాకు వచ్చేసరికి… గువ్వ వంటి పదాలు బోలెడు వాడేస్తున్నారు, అసలు అర్థాలు చదివేవాళ్లకు తెలుసు… ఈమధ్య తెలుగు టీవీ సీరియల్స్‌లో, రియాలిటీ షోలలో, చివరకు బిగ్‌బాస్ షోలో కూడా ‘తిను, తినను’ అనే పదాలు పదే పదే వినిపిస్తున్నాయి… ఒరేయ్, ఎవుర్రా మీరంతా, అదేం తెలుగురా అని తిట్టుకునేలా…

Ads


“తనను కాదు… తినను…”

“తనను పిలవండి…”

“తినను దగ్గరికి రమ్మను…”

ఇలా ఎవరు ఎక్కడున్నారో చెప్పడానికి, దగ్గర– దూరం తేడా చూపించడానికి “తనను–తినను” అంటూ మాట్లాడటం ఎక్కువైపోయింది…

వినడానికి ఒకసారి వింతగా అనిపిస్తుంది. రెండుసార్లు వింటే నవ్వొస్తుంది. మూడుసార్లు వింటే అసలు ప్రశ్న మొదలవుతుంది—తెలుగులో “తినను” అంటే నిజంగా ఏమిటి?

“తినను” అంటే… నేను తినను. అంటే I don’t eat. లేదా సందర్భాన్ని బట్టి I won’t eat.

అంతే కానీ… “దూరంగా ఉన్న వ్యక్తి” అని కాదు! అదే సమయంలో “తిను” అంటే తెలుగులో సాధారణంగా “Eat” అనే అర్థం. “తిను” అని ఎవరినైనా పిలిస్తే—అది ఆ వ్యక్తిని దగ్గరగా సూచించే పదం కాదు. అది ఒక ఆజ్ఞ. ఒక ఆహ్వానం. ఒక క్రియ.

“తిను!” అంటే తినమని చెప్పడం. కానీ ఇప్పుడు కొన్ని టీవీ కార్యక్రమాల్లో “తనను” స్థానంలో “తినను” వచ్చేసింది. వ్యక్తిని సూచించే సర్వనామం, క్రియగా మారిపోయింది. భాషలో ఒక చిన్న అక్షరం జారితే అర్థం ఎలా తలకిందులవుతుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ.

తెలుగులో దూరంగా ఉన్న వ్యక్తిని సూచించాలంటే “అతను”, “ఆమె”, “వాడు”, “ఆవిడ”, “ఆయన” వంటి పదాలు సందర్భానుసారం ఉంటాయి. దగ్గరగా ఉన్న వ్యక్తిని సూచించడానికి “ఇతను”, “ఈమె”, “ఈయన” వంటి రూపాలు ఉన్నాయి.

మరి “తనను”? 

“తనను” అనేది కూడా మనకు బాగా పరిచయమైన పదమే. కానీ అది సాధారణంగా reflexive pronoun—అంటే సందర్భానుసారం “himself/herself” అనే భావంలో వస్తుంది.

ఉదాహరణకు: “అతను తనను తాను కాపాడుకున్నాడు.”

“ఆమె తనను తాను ప్రశ్నించుకుంది.”

అక్కడ “తనను”కి ఒక వ్యాకరణపరమైన పని ఉంది.

కానీ ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తిని చూపిస్తూ…

“తినను పిలవండి…” అంటే? తెలుగు వ్యాకరణం పక్కనే కూర్చుంటే బహుశా, “నన్నెందుకు భోజనంలోకి లాగుతున్నారు?” అని అడిగేదేమో!

ఇది కేవలం ఒక అక్షరపు పొరపాటు కాదు. టెలివిజన్ భాషలో ఒక పదం తప్పుగా వినిపించడం, మరొకరి నోటిలోకి వెళ్లడం, అక్కడి నుంచి మరొకరు అదే విధంగా వాడటం… చివరకు అది “ఇదే సరైన తెలుగు” అన్న స్థాయికి చేరిపోవడం కూడా భాష ఎలా మారుతుందో చూపిస్తుంది.

ముఖ్యంగా టీవీ యాంకర్లు, రియాలిటీ షోల్లో పాల్గొనేవారు, సినిమా నటులు ఒకరి మాటలను మరొకరు అనుకరించడం మొదలుపెడితే ఇలాంటి ప్రయోగాలు చాలా వేగంగా వ్యాపిస్తాయి.

బిగ్‌బాస్ లాంటి కార్యక్రమాల్లో అయితే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ రోజంతా జరిగే సంభాషణలు, వెంటనే ప్రసారమయ్యే మాటలు, సహజమైన మాట్లాడే భాష— ఇవన్నీ కలిసి ఒక పదం తప్పుగా వాడినా అది లక్షల మంది చెవుల్లోకి వెళ్లే పరిస్థితి. రేప్పొద్దున తరాలు ఇదే నిజమైన తెలుగు వ్యాకరణమేమో అనుకునే ప్రమాదం…

అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. టీవీ అంటే కేవలం వినోదం కాదు. అది రోజూ కోట్లాది మంది మాట్లాడే భాషను కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, యువత టీవీలో తరచూ వినే పదాలను ఎలాంటి సందేహం లేకుండా తమ మాటల్లోకి తీసుకువెళ్తారు.

భాష మారడం సహజమే. కొత్త పదాలు రావడం కూడా సహజమే. ప్రజలు మాట్లాడే విధానం మారడం కూడా సహజమే. కానీ కొత్త భాష పుట్టడం వేరు… ఉన్న పదానికి ఉన్న అర్థాన్ని తారుమారు చేయడం వేరు.

“తినను” అనే పదాన్ని “దూరంగా ఉన్న వ్యక్తి” అనే అర్థంలో ఎవరైనా కొత్తగా నిర్వచిస్తే తెలుగు వ్యాకరణ పుస్తకాలు కూడా ఒకసారి తిరిగి ముద్రించాల్సి వస్తుందేమో!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!
  • తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…
  • ఆటే సవాల్ అన్నాడు నాగార్జున – అంతే, ఆట చూడటమూ సవాలే !!
  • ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… కేసీయార్ మరో బిగ్ బ్లండర్…
  • మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!
  • రేచర్ల రుద్రుడి విగ్రహం ! గుడ్ డెసిషన్… ఐతే ఇంతకీ తనెవరంటే ?
  • ఓహో… తెలంగాణ నటులు తెలుగు ఇండస్ట్రీకి పనికిరాని మొహాలా..?!
  • నరుకుడు రోగం! మితిమీరిన హింస- మతిమాలిన దర్శకత్వ ప్రతిభ!!
  • The Paradise – దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను చరిత్ర క్షమించదు…
  • S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions