Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!

October 3, 2026 by M S R

.

Bharadwaja Rangavajhala …. అన‌గ‌న‌గా ఓ దొరైస్వామి
దొరైస్వామి అనే పేరుతో ఆ రోజుల్లో ఓ న‌టుడు ఉండేవారు. … దేవ‌దాసులో పార్వ‌తి తండ్రి పాత్ర గుర్తుండే ఉంటుంది క‌దా … అలాగే మ‌ల్లీశ్వ‌రి సినిమాలో కూడా నార‌ప్ప పాత్ర‌లో న‌టించారు క‌దా …
వాస్త‌వానికి వీరిది చెంగ‌ల్ప‌ట్టు …. త‌మిళులు.

కానీ … తెలుగు చాలా స్ప‌ష్టంగా మాట్లాడేవారు. ఎందుక‌లా అంటే … ఈయ‌న తండ్రి గారు రంగాచారిగారు చెంగ‌ల్ప‌ట్టు నుంచీ నెల్లూరు చేరుకుని అక్క‌డ స్కూలు మాస్ట‌రు ఉద్యోగంలో కుదురుకున్నారు.
రంగాచారి గారికి మొద‌టి బిడ్డ దొరైస్వామి గారే.
ఈయ‌న 1887 న‌వంబ‌ర్ 14న ఆయ‌న జ‌న్మించారు.

Ads

పండిత పుత్రులు ప‌ర‌మ …. అంటారు గానీ ఈయ‌న అలా కాలేదు. బాగా చ‌దువుకునేవారు. అయితే ఇంట‌ర్ త‌ర‌వాత చ‌దివించే స్తోమ‌త వీరి తండ్రి గారికి లేక కుటుంబ పోష‌ణ కోసం ఉద్యోగంలో చేరాల‌ని నిర్ణ‌యించి రోజూ పేప‌ర్లలో ఉద్యోగావ‌కాశాలు అనే కాలం చూస్తూ కాలం గ‌డుపుతూ ఉండ‌గా మిల‌ట్రీలోకి వ‌స్తారా అని ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

అవి మొద‌టి ప్ర‌పంచ యుద్ద కాల‌పు రోజులు.
ఆయ‌న వెంట‌నే అప్లై చేసి అందులో గుమాస్తా ఉద్యోగం సంపాదించుకోగ‌లిగారు.
మిల‌ట్రీలో చేరిన సంద‌ర్బంగా ఆయ‌నకు దేశ‌మంతా తిరిగే అవ‌కాశం దొరికింది. అలాగే మెస‌ప‌టోమియాకు వెళ్లాల్సి వ‌చ్చింది. వెళ్లారు.
ఆన‌క 1924 లో తిరిగి ఇండియా వ‌చ్చారు.

యుద్ద రంగంలోంచీ బ‌య‌టప‌డ్డాక బ‌య‌ట ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాల్సి వ‌చ్చింది.
నెల్లూరులో ఈయ‌న‌కు ఓ ప్రెండు ఉండేవారు. ఆయ‌న పేరు కూడా దొర‌స్వామి. ఆయ‌న నాట‌కాలు ఆడేవారు. దాంతో ఆయ‌న నువ్వు కూడా నాట‌కాలు ఆడొచ్చు క‌దా డ‌బ్బులొస్తాయి అని చెప్పే స‌రికి స‌రే అనేసారు ఈయ‌న‌.
ఆయ‌న దొర‌స్వామి ఈయ‌న దొరైస్వామి. దొర‌స్వామితో దొరైస్వామి చ‌లో బెజ‌వాడ అనేశారు.
అలా బెజ‌వాడ చేరారు.

బెజ‌వాడ గాంధీన‌గ‌ర్ లో ఓ నాట‌క స‌మాజంలో చేరి రామ‌దాసు నాట‌కంలో న‌వాబు పాత్ర‌లో న‌టించ‌డం మొద‌లుపెట్టారు.
అంటే తానీషా పాత్ర అని తాత్ప‌ర్యం.
ఈయ‌న బెజ‌వాడ చేర‌గానే న‌వాబు పాత్ర‌లో కాస్త హిందీ తెలిసిన వాడెవ‌రైనా దొరుకుతారేమో అని చూస్తున్నాం అన్నారుట వారు.
మిల‌ట్రీలో ఉండ‌గా దొర‌స్వామికి హిందీ వ‌చ్చు. అలా ఆ క్వాలిపికేష‌న్ తో తానీషాగా మారిపోయారు.

అయితే అదే స‌మ‌యంలో నెల్లూరులో నాట‌క స‌మాజాల నుంచీ పిలుపు రావ‌డంతో అక్క‌డ‌కు చేరిపోయారు.
అక్క‌డ అంటే నెల్లూరులో ఇంగ్లీషు నాట‌కాలు కూడా ఆడేవారు.
దొర‌స్వామి గారికి ఇంగ్లీషు డైలాగు చెప్ప‌డం కూడా రావ‌డంతో ఇంక వెనుదిరిగి చూసే అవ‌కాశం రాలేదు.
ఇలా న‌డుస్తూ ఉండ‌గా ఓ విదేశీ ఉద్యోగావ‌కాశం రావ‌డంతో చ‌లో ఇంగ్లాండు అనేశారు.
అక్క‌డ ప‌దేళ్లు ఉద్యోగం చేసి మ‌ల్లీ నెల్లూరు చేరుకున్నారు.

అప్ప‌టికి ప్ర‌పంచం 1936లోకి ప్ర‌వేశించింది.
అప్పుడే తండ్రి గారు కాలం చేయ‌డంతో కుటుంబ భారం భుజాన వేసుకున్నారు.
మ‌ద్రాసులో ఆంధ్ర‌ నాట‌క స‌భ‌ అనే నాట‌క స‌మాజం ఉండేది.
అందులో చేరి న‌టించ‌డం మొద‌లుపెట్టారు.
అప్పుడే బిఎన్ రెడ్డి గారితో ప‌రిచ‌యం ఏర్పడింది.

అవి రోహిణీ సంస్ద కోసం గృహ‌ల‌క్ష్మి తీస్తున్న రోజులు. అందులో ఓ తాగుబోతు పాత్రలో న‌టించారు దొరైస్వామి.
హెచ్ ఎమ్ రెడ్డి గారు ద‌ర్శ‌కుడు.
అదే సినిమాలో ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ పాత్ర ఒక‌టి ఉంది. గెట‌ప్ మార్చేసి దొరైస్వామితోనే ఆ పాత్ర‌ కూడా చేయించేశారు రెడ్డిగారు.
వార్నీ డ‌బుల్ ఫొటో అనేశార‌ట బిఎన్ రెడ్డి గారు.

ఆ సినిమా త‌ర్వాత రోహిణీ నుంచీ బిఎన్ విడిపోయి వాహినీ మొద‌లుపెట్టారు. వందేమాత‌రం తీశారు.
అందులో దొరైస్వామి న‌టించారు.
ఆ త‌ర్వాత సుమంగ‌ళిలోనూ న‌టించారు.
జ‌గ‌దీష్ సంస్థ వారు తీసిన విశ్వ‌మోహినిలోనూ రాయ‌ల్ టాకీసు వారి స‌తీ సావిత్రిలోనూ ఇలా వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు రావ‌డం మొద‌లైంది.

doraiswamy

నాగ‌య్య గారి స్వంత సినిమాలు భాగ్య‌ల‌క్ష్మిలోనూ కె.వి రెడ్డి తొలి చిత్రం యోగి వేమ‌న‌లోనూ ఇలా వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి.
త్యాగ‌య్య త‌ర్వాత బొంబాయి వెళ్లి బొంబాయి టాకీసులో చేరే ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మై తిరిగి మ‌ద్రాసు చేరుకున్నారు.
అప్పుడు గుమ్మ‌డి తొలి చిత్రం అదృష్ట దీపుడు మొద‌ల‌వుతోంది.
అందులో వేషం ఇచ్చారు హెచ్ ఎమ్ రెడ్డి గారు.

స‌రే వాహినీ వారు ఎలానూ ఉన్నారు. స్వ‌ర్గ‌సీమలో ఛాన్స్ వ‌చ్చింది.
ఇక వ‌ర‌సగా మ‌ల్లీశ్వరి, దేవ‌దాసు, చంద్ర‌హారం, బీద‌ల ఆస్తి ఇలా వ‌ర‌స‌గా అవ‌కాశాలు.
1918 లోనే వీరికి వివాహం అయ్యింది. అయితే సంతానం క‌ల‌గ‌లేదు.
1939 లో మ‌ద్రాసులో బిజీగా సినిమాలు చేస్తున్న కాలంలోనే ఇల్లాలు క‌న్నుమూశారు.

ఒంట‌రిగానే …
అలా సినిమాల్లో న‌టిస్తూ అర‌వై ప్రాంతాల్లో సెల‌వంటూ ఈ లోకాన్ని వీడి వెళ్లి పోయారు.
ఈయ‌న డైలాగ్ డెలివ‌రీ కాస్త డిఫ‌రెంటుగా ఉండేది. అలాగే చేసే ప్ర‌తి పాత్ర ఆడియ‌న్స్ కు గుర్తుండిపోయేలా ఏదో మేన‌రిజం పెట్టుకునేవారు.
అది డైరెక్ట‌ర్లు చెప్పేవారా లేక ఈయ‌నే అడాప్ట్ చేసుకున్నారో తెలియ‌దు. దేవ‌దాసు, మ‌ల్లీశ్వ‌రి రెండు సినిమాల్లోనూ ఆయ‌న డిఫ‌రెంట్ గా కనిపిస్తారు.
అలాగే చండీరాణిలోనూ కాలు ఎగ‌రేస్తూ … న‌డ‌వ‌డం ఇలా …

ఆడియ‌న్స్ అటెన్ష‌న్ గ్రాబ్ చేయ‌డం అనేది రంగ‌స్థ‌లం నుంచీ వ‌చ్చిన ల‌క్ష‌ణం కావ‌చ్చేమో …
ఆ రోజుల్లో చాలా మంది సినిమా న‌టుల్లో అది క‌నిపించేది.
ఏదేమైనా దొరైస్వామి గురించి ఎక్క‌డైనా స‌మాచారం దొరుకుతుందా అని వెతుకుతా ఉంటే …
సినిమా రంగం అనే ప‌త్రిక‌లో ఆయ‌న ఇంట‌ర్యూ దొర‌క‌బ‌డింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!
  • కన్నడనాట హిట్టే- తెలుగు వెర్షన్ సో సో… కారణాలు అనేకం…
  • ఓ సైనికుడు- చావుబతుకుల్లో ఓ తండ్రి- ఒక టచింగ్ స్టోరీ
  • ఒకే ఒక చిన్న ఇన్‌స్టా పోస్ట్… ఓ దివాలా జీవితాన్నే మార్చేసింది…
  • “పాపా… ఒక్కసారి నాకు ఫోన్ చేయండి… ప్లీజ్…”
  • వాష్‌రూంలోకి ఆ ఆరేళ్ల పాప… ఫ్లై దుబాయ్ కథలో అదే కీలకం !!
  • పార్టీలు చెప్పేవి శ్రీరంగనీతులు – అఖిలేషుడూ ఆ తానులో ముక్కే !!
  • Sigma – తమిళ సీఎం విజయ్ కొడుకు సంజయ్‌కు ఓ ఫ్లాప్ డెబ్యూ !!
  • ఆపదామపహర్తారం… ఆ ఆపదలో స్మిత్ ధైర్యం హనుమంతుడే!
  • ఏమిట్లు..? ఇంతకీ ఈ ఫ్లయింగ్ హీరో స్మిత్ మచ్చర్ మనోడేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions