Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిగ్గర్ దేన్ హీరో ! అందుకే హీరోలు తన పక్కన చేయడానికి భయపడతారు !!

October 8, 2026 by M S R

.

Mohan Goteti  … ‘నానా’ విధాల అభినయానికి చిరునామా!
అది ‘క్రాంతి వీర్’ సినిమా..
సినిమా క్లైమాక్స్ కి వచ్చేసింది..
మామూలు క్లైమాక్స్ కాదు.. ఐకానిక్ క్లైమాక్స్ సీన్..
ప్రేక్షకులలో ఆసక్తి పెరిగిపోయింది..
ఏం జరుగుతుందా? అన్న కుతూహలంతో .. టెన్షన్ తో.. అలాగే తెరవైపు చూస్తున్నారు..
ప్రతాప్ తిలక్ చేసిన హత్యలకు కోర్టు అతనికి బహిరంగ ఉరిశిక్ష విధించింది..
ఆ రోజే అతనికి మరణశిక్ష అమలు..
అతనికి చావంటే భయం లేదు..
నిర్లిప్తంగా.. నిర్భయంగా నడుచుకుంటూ ఉరికంబం వద్దకు వచ్చాడు.

బహిరంగ ఉరిశిక్ష కదా.. చుట్టూ వేలాది మంది గుమికూడారు..
తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు..
వాళ్లందర్నీ చూస్తే అతనికి నవ్వొచ్చింది..
పెద్దగా నవ్వాడు.. ఇంకా పెద్దగా నవ్వాడు ..
ఆ నవ్వులో నిరాశ.. నిస్పృహ.. వ్యంగ్యం.. ఆక్రోశం కలగలిసి వున్నాయి!
ఎవరికీ అర్థం కావడం లేదు..
అటూ ఇటూ తిరుగుతూ అందర్నీ చూశాడు..

Ads

“ఆ గయే మేరీ మౌత్ కా తమాషా దేఖ్నే?” (నా చావును తమాషా చూడడానికి వచ్చేశారా?) అంటూ బిగ్గరగా అరిచాడు.
థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది..
ఊపిరి బిగపెట్టి కన్నార్పకుండా అలాగే చూస్తున్నారు..
కానీ.. ఆ సన్నివేశంలో వున్న జనంలో మాత్రం చలనం లేదు..
ఉదాసీనంగా వున్నారు.. తమాషా చూస్తూ..
ప్రతాప్ లో ఆవేశం అగ్నిపర్వతంలా పేలింది..
అతని కంచుకంఠం మాటల తూటాలు వదులుతోంది..

“..హసో.. ఖుషియా మనావో .. క్రాంతి కీ రాహ్ పర్ ఏక్ ఔర్ కత్తా మర్నే జా రహా హై..” (నవ్వండి.. సంబరాలు జరుపుకోండి.. విప్లవ పంథాలో మరొక ప్రాణం పోతోంది) అంటూ మాటల నిప్పుల వర్షం కురిపించాడు..
జనం చేతగానితనం.. పిరికితనం పట్ల అతని మాటల్లో ఏవగింపు వుంది!
వయసుడిగిపోయి.. వృద్ధాప్యంలో వున్న సమాజం పట్ల అతని ఆవేశపు మాటల్లో అసహ్యం కనిపించింది.
ప్రేక్షుల కరతాళ ధ్వనులతో థియేటర్ దద్దరిల్లింది..
అతని అద్భుత అభినయానికి సెల్యూట్ చేశారు..
ప్రతాప్ తిలక్ పాత్రలో ఒదిగిపోయిన ఆ మహానటుడే నానా పటేకర్!

నానా పటేకర్
ఆ క్యారెక్టర్ ని తన సహజ శైలిలో ఊదిపారేశాడు..
మామూలు అభినయం కాదు.. మహత్తరమైన నటన!
మళ్లీ మళ్లీ చూడాలనిపించే అమోఘమైన అభినయం!

అంతకు ముందు కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘పరిందా’ మరో అద్భుతం!
విలనీలో పీక్ .. ఇంకెవరూ అంతలా ఆ పాత్రను పోషించలేరేమో అనిపించే నటన!
ముంబై డాన్ ‘అన్నా సేథ్’ పాత్రలో నానా తినేశాడు..
హిందీ సినిమాలలోనే ఒక భయంకరమైన, విలక్షణమైన విలన్ పాత్రలలో అదొకటిగా చెప్పుకోవచ్చు!
అన్నా మామూలుగా మన సినిమాలలో కనిపించే విలన్ కాదు..
విలనీలో విపరీతం.. వింత.. క్రూరత్వం నిండిన పాత్ర.
ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో మనకు తెలియదు..
ఇట్టే మారిపోతుంటాయి అతని ముఖ కవళికలు.. హావభావాలూ.

సొంత భార్యా పిల్లలను కూడా సజీవ దహనం చేసిన నరరూప రాక్షసుడి పాత్ర అది.
అయితే, అతనికో బలహీనత ఉంది..
అదే ఫైరోఫోబియా .. నిప్పును చూస్తే గజగజా వణికిపోతాడు.
ఈ పాత్రలో నానా పటేకర్ అభినయం చూసి తీరాల్సిందే!
అలా మాట్లాడుతూ మాట్లాడుతూ.. మరోలా మారిపోతుంటాడు..
క్షణక్షణానికి ఎక్స్ ప్రెషన్స్ మార్చేస్తూ.. ఓ కొత్త అభినయాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరించాడు.
క్లైమాక్స్ లో తను భయపడే మంటల మధ్య చిక్కుకుని.. భయంతో.. అటూ ఇటూ చూస్తూ .. అతను ఒలికించిన హావభావాలు మార్వేలెస్.. నభూతో నభవిష్యతి!
అదీ అభినయం అంటే.. అదీ విలక్షణత అంటే!

నానా పటేకర్

‘అగ్నిసాక్షి’ మరో గ్రేట్ మూవీ..
భార్యని వేధించి, హింసించే సైకో భర్తగా నానా అభినయం మామూలు స్థాయి కాదు!
‘అబ్ తక్ చప్పన్’లో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా అభినయం చాలా సటిల్డ్ గా వుంటుంది.
‘నటసామ్రాట్’ నానా కెరీర్లో మరో ఆణిముత్యం.. ఇందులో ఆయన చూపిన భావోద్వేగపూరిత నటన మన చేత క్లాప్స్ కొట్టిస్తుంది. ఈ చిత్రాన్నే తెలుగులో ‘రంగమార్తాండ’గా తీశారు.

నానా అంటే అభినయం .. అభినయం అంటే నానా!
అది క్లాస్ టచ్ తో కూడిన అభినయం! .
ప్రత్యామ్నాయం లేని అభినయం!
ఈ పాత్ర నానా కోసమే పుట్టిందా? అన్నట్టుగా వుంటుందది.
తెరపై పాత్ర కనపడదు.. సమాజంలోని ఓ సజీవ మూర్తి కనిపిస్తాడు..
అంతలా ఆయన అభినయం సహజత్వానికి దగ్గరగా వుంటుంది.
రంగస్థలం నుంచి వచ్చాడేమో.. ఎక్కడ ఏ స్థాయిలో ఎంతగా నటించాలన్న కిటుకులు ఎంచక్కా తెలిసిన నటుడు తను.
గొప్ప కంఠం .. అందుకు తగ్గా డైలాగ్ డెలివరీ!

నానా పటేకర్

“దేశంలోని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అద్భుతమైన నటులు ముంబైలో తేలతారు. అందుకే నాకు కొందరు బాలీవుడ్ యాక్టర్లంటే చాలా ఇష్టం” అన్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓసారి నాతో మాట్లాడుతూ.
అది నిజమేననిపిస్తుంది!
ఓ ఓంపురి .. ఓ నసీరుద్దీన్ షా .. ఓ నానా పటేకర్..
ప్రత్యామ్నాయం లేని నటులు వీళ్లంతా.

  • నానా పటేకర్ అంటే చాలా మంది హీరోలు భయపడతారు.
    అతనితో చేయాలంటే సంకోచిస్తారు ..
    ఎందుకంటే ‘బిగ్గర్ దేన్ హీరో’ తను!
    నో డౌట్ .. తను ఎవరినైనా డామినేట్ చేసి పారేస్తాడు.
    నానా డైలాగ్ చెబుతుంటే పక్కనున్న ఆర్టిస్టు తన డైలాగ్ మర్చిపోతాడు.
    అందుకే, చాలా మంది హీరోలు నానాతో చేయడానికి ముందుకురారు!
    అతని ముందు తాము తేలిపోతామని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్.
    అతని రేంజ్ అటువంటిది.. ఆ రేంజికి ఎవరూ వెళ్లలేరు!

నానా కళ్లల్లోని తీవ్రత .. మాటల్లోని ఆవేశం, రౌద్రం మనల్ని కట్టిపారేస్తాయి.
అతను డైలాగ్ చెప్పే పధ్ధతి విలక్షణంగా వుంటుంది.
స్పీడుగా డైలాగ్ చెబుతూనే.. ఉన్నట్టుండి చిన్న విరామం ఇచ్చి.. మళ్లీ అందుకుంటాడు.
అది అతనిని విలక్షణ నటుడిగా ప్రోజక్ట్ చేసింది.
ఒక మామూలు మనిషి ఆయా సందర్భాలకు ఎలా స్పందిస్తాడో .. అలాగే సహజత్వంతో వుంటుంది అతని సంభాషణల తీరు!

పాజిటివ్ పాత్ర చేసినా.. నెగటివ్ పాత్ర చేసినా ఆతని మార్క్ సుస్పష్టం!
వచ్చింది కదా అని .. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పేసుకోడు..
కథ నచ్చాలి.. పాత్ర నచ్చాలి.. ఆ పాత్రలో ఏదైనా కొత్తదనం ఉందా? లేదా? అన్నది పదిసార్లు ఆలోచిస్తాడు.
డబ్బు కోసం కక్కుర్తిపడే ఆర్టిస్టు కాదు.. అలా అయితే, ఎన్ని వందల కోట్లు సంపాదించేవాడో!

రజనీకాంత్ తనకు మిత్రుడైనా.. ‘కాలా’ సినిమాలో నటించడానికి ముందు నానా నో చెప్పాడు..
అయితే, రజనీ స్వయంగా రంగంలోకి దిగి.. అతని క్యారెక్టర్ ను విపులంగా చెప్పి.. రిక్వెస్ట్ చేయడం వల్ల ఒప్పుకున్నాడట!
నానా సినిమా ప్రపంచంలోనే ఉన్నప్పటికీ .. ఇక్కడి వాతావరణం మాత్రం అతనికి వంటబట్టలేదు.
స్టార్ నటుడినని కాలర్ ఎగరేసుకుని తిరగలేదు.
ఎప్పుడూ .. ఎక్కడా ఎగస్ట్రాలు చూపించలేదు.
తను ఎలా ఉండాలో అలాగే వున్నాడు..
డబ్బు, కీర్తి తనను ఏమీ మార్చలేవని నిరూపించాడు.
ముంబైలోని సాధారణ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో అతి నిరాడంబరంగా జీవితాన్ని గడిపాడు.

పటేకర్

మామూలుగా సినిమాలలో చెప్పే నీతులకి ఆర్టిస్టులు బయట భిన్నంగా కనిపిస్తారు.
నానా మాత్రం ఎప్పుడూ ఒకేలా బ్రతికాడు.. తెర ముందూ, తెర వెనుకా ఒక్కడే.. ద్విపాత్రాభినయం లేదు!
తను నమ్మిన విలువలను, సామాజిక స్పృహను ఆచరణలో పెట్టి చూపించాడు.
ఒకరోజు తను కారులో వెళుతుంటే ముందుగా వెళుతున్న కారులోని వ్యక్తి ఓ వాటర్ బాటిల్ ను రోడ్డుపైకి విసిరేశాడు.
అది చూసిన నానాకు ఒళ్లు మండిపోయింది.
వేగంగా వెళ్లి .. అతని కారుని ఆపి.. అతనిని నిలదీసి.. క్లాస్ పీకాడు.
అదీ.. నానాకు తన సమాజం పట్ల వున్న బాధ్యత!

  • ఒకసారి ఆయన కోటిన్నర వెచ్చించి కారు కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నాడు.
    ఆ మర్నాడే షోరూమ్ కి వెళ్లి కారు తెచ్చుకోవాలి..
    అయితే అంతలోనే మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యల వార్త వచ్చింది.
    అది టీవీలో చూసిన నానా హృదయం ద్రవించిపోయింది.. మనిషి కదిలిపోయాడు!
    ‘ఓపక్క రైతులు అప్పులతో అలా ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. నేను కోటిన్నర పెట్టి కారు కొనుక్కుని విలాసంగా తిరగాలా?’ అని తనను తాను ప్రశ్నించుకున్నాడు.
    సిగ్గేసింది..
    “నో.. వున్న కారు చాలు.. కొత్తది అక్కరలేదు” అని నిర్ణయించుకున్నాడు.
    ఆ మర్నాడే ఆ కోటిన్నరతో ఒక్కో రైతుకు పదిహేను వేల చొప్పున చెక్కులు రాసి పంపించేశాడు.
    పైగా ఆ వితరణకు ప్రచారాన్ని కూడా కోరుకోలేదు..

నానా అంతటి మానవతావాది..
తన చుట్టూ వున్న వాళ్లు కష్టాలలో వుంటే చలించిపోతాడు.
అలాంటి సినీ నటులు ఎంతమంది వున్నారు?
ఒకసారి లెక్కేయండి.. చూద్దాం!

ఇప్పుడు నానా పటేకర్ అభిరుచికి, నిరాడంబరతకు, సంస్కారానికి సంబంధించిన ఇరవై ఏళ్ల క్రితం నాటి ఒక సంఘటన గురించి చెబుతాను.
అది రామోజీ ఫిలిం సిటీ.. సితార హోటల్.. రాత్రి ఏడు గంటల సమయం!
హిందీ సినిమా షూటింగు కోసం వచ్చిన నానా పటేకర్ రూమ్ లో రిలాక్స్ అవుతున్నారు.
ఈ లోగా విండో తెరచి చూస్తే.. మంద్ర స్థాయిలో.. ఒక మలయమారుతంలా.. మధురంగా.. సమ్మోహనంగా.. వేణుగానం వినిపిస్తోంది.
ఆ గానానికి నానా ఒళ్లు పులకించింది..
వెంటనే రిసెప్షన్ కి ఫోన్ చేసి “ఆ ఆల్బం ఎవరిది?” అనడిగారు.
“ఆల్బం ప్లే చేయడం లేదండీ .. పక్కనే లాన్ లో ఓ కాన్సర్ట్ జరుగుతోంది” అని చెప్పారు.
వెంటనే ఆయన కిందకు దిగి.. లాన్ లోకి వెళ్లారు..

స్టేజిపైన ప్రముఖ వేణుగాన సంగీత కళాకారుడు తాళ్లూరి నాగరాజు తన వేణుగానంతో సభుకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్నారు..
అందరూ ఆ వేణుగానంలో లీనమైపోయారు..
నానా ఒక సామాన్యుడిలా వెనుకనే నిలబడి.. ఆ గానాన్ని ఆస్వాదిస్తూ పారవశ్యం చెందారు.
కాస్సేపటికి కన్సర్ట్ అయిపోయింది..
నానా మెల్లగా ముందుకు వచ్చి “నా పేరు నానా పటేకర్.. మీ గానం అద్భుతం” అంటూ నాగరాజు గారిని పరిచయం చేసుకుని.. టక్కున ఆయన పాదాలకు నమస్కరించారు.
నానా పటేకర్ ఏమిటీ.. ఇలా రావడం ఏమిటీ.. నా కాళ్లకు నమస్కరించడం ఏమిటీ?
నాగరాజు గారికి ఏమీ అర్థం కావడం లేదు.. కలో.. నిజమో తెలియడం లేదు.

“సార్.. మీరు.. ఇలా..” అంటూ ఏదో చెప్పాలనుకుని.. సంభ్రమాశ్చర్యాలలో చెప్పలేకపోయారు నాగరాజు.
“చాలా గొప్పగా గానం చేశారు.. ఎంతో ఆస్వాదించాను.. ముంబై వస్తే తప్పకుండా నన్ను కలవండి” అంటూ నానా తన విజిటింగ్ కార్డు ఆయన చేతిలో పెట్టి .. నమస్కరించి వెళ్లిపోయారు.
నాగరాజు గారు ఇంకా షాక్ లోనే వున్నారు..
ఆయనకు ఏమీ అర్థం కాలేదు ..
అసలు నానా ఎవరికీ అర్థం కాడు..
ఎందుకంటే తను స్టార్ నటుడు అయినా స్టార్ గా ఫీలవ్వడు..
తన లాంటి ఆర్టిస్టు మరెవరూ లేరని లోకం కోడై కూస్తున్నా.. ఆయనలా ఫీలవ్వడు..
తను మామూలు మనిషి..
మామూలుగానే ఉంటాడు!
డాబులు, దర్పాలూ వుండవు!
అందుకే ఆ మహానటుడు ఎవరికీ అర్థం కాడు!
-మోహన్ గోటేటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బిగ్గర్ దేన్ హీరో ! అందుకే హీరోలు తన పక్కన చేయడానికి భయపడతారు !!
  • Evil Dead – నానా పటేకర్ మృతిపై ఓ చేదు స్పందన – ఎవరామె? ఏంటీ కథ?
  • నానా పేర్లన్నీ ఒకవైపు – నానా పేరొకవైపు..! వీరుడా సెల్యూట్ !!
  • … కల్కి భక్తులు రెచ్చిపోయి వార్త ఆఫీసులపై దాడులు చేశారు !!
  • పోలీసులే కాపాడారు… పోలీసులే ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు!!
  • ఆ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ 5 కోట్లు ఫీజు..? అదీ వ్యాపారమేనా..?
  • SIR – ఈ ఆందోళనల అసలు లక్ష్యం దేశంలో అశాంతి – కల్లోలం !!
  • నూకలు బాకీ ఉంటే… యముడే దిగొచ్చినా ప్రాణాలు తీయలేడు !!
  • బ్లడీ రోమియో – కాదు, బ్లడ్ రోమియో – మరో బ్లడీ ప్యారడైజ్ !!
  • నకిలీ బతుకులు … BRS సోషల్- ఫేక్ ప్రచారాలపై బిగ్‌టీవీ ఫైర్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions