.
జియో 30 వేల కోట్ల భారీ ఐపీఓ… ఎలన్‌మస్క్ కంపెనీ స్టార్‌లింక్ రాకను అడ్డుకుంటున్న జియో స్పేస్ ఫైబర్… జియో కోసమే కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి అని మస్క్ తీవ్ర ఆరోపణలు… మస్క్‌తో పోటీకి మేం రెడీ అని అంబానీ సై… బీజేపీ- అంబానీ అక్రమ బంధాలు అని మస్క్ విమర్శలు… రచ్చ నడుస్తోంది… మరోవైపు భారీ ఐపీఓ…
నిజంగా జియో పుట్టుక, అక్రమాలకు బీజేపీకి మాత్రమే సంబంధమా..? కాదు, అంబానీకి ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా చుట్టాలే… మన్మోహనుడైనా, మోదీ అయినా తనకు ఒకటే… ఓసారి గతంలోకి వెళ్దాం… 2010 నుంచి మొదలు… జియో అక్రమాలను అప్పట్లో కాగ్ స్వయంగా బయటపెట్టింది… ది పయనీర్ కూడా సవివర కథనాల్ని ప్రచురించింది… వాటిల్లోకి ఓసారి తొంగిచూద్దాం… ముఖ్యాంశాలు…
Ads
2010లో ముఖేష్ అంబానీకి చెందిన సంస్థకు టెలికాం రంగంలోకి దొడ్డిదారి ద్వారా ప్రవేశం కల్పించేందుకు ప్రభుత్వం సహకరించిందని కాగ్ ప్రాథమిక పరిశీలన… 2011–13 మధ్య కాలంలో ప్రభుత్వానికి రూ.20,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా ఆడిట్ పరిశీలనల్లో ప్రస్తావన…
అంబానీకి సహకరించేందుకు బ్రాడ్‌బ్యాండ్, 4G రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలైన BSNL, MTNLలను పోటీ నుంచి తప్పించడం ద్వారా రిలయన్స్ జియోకు ఆధిపత్యం కల్పించారని కాగ్ అభ్యంతరం… Infotel Broadband Services Private Limited (IBSPL) అనే సంస్థ 2010 మధ్యకాలంలో BWA స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అనుమతి… దాని వార్షిక టర్నోవర్ ఎంతో తెలుసా..? 16 లక్షలు…
వేలంలో పాల్గొనేందుకు సమర్పించిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) / బ్యాంకు గ్యారంటీ… సుమారు రూ.252.50 కోట్లు… ఇంత అతి తక్కువ టర్నోవర్ ఉన్న సంస్థ వేలంలో రూ.12,750 కోట్లకు పైగా బిడ్ వేయడానికి అవసరమైన ఆర్థిక సామర్థ్యాన్ని ఎలా సమకూర్చుకుందనేది అసలు పాయింట్…
వేలం ముగిసిన వెంటనే రిలయన్స్ గ్రూప్ స్వాధీనం… 2010 జూన్ 11న జరిగిన వేలంలో IBSPL దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో స్పెక్ట్రమ్‌ను గెలుచుకున్నది… వేలం ముగిసిన కొద్ది గంటల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ఆ సంస్థలో 95 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అనుమతి పొందింది… అంటే, అర్థమైంది కదా…
ఈ స్వాధీన ఒప్పందం విలువ సుమారు రూ.6,000 కోట్లు… దీనివల్ల IBSPLకు రూ.4,800 కోట్లకు పైగా అనూహ్య ఆర్థిక ప్రయోజనం కలిగినట్లు కాగ్ ప్రాథమిక పరిశీలన…
టెలికాం రంగంలో విలీనాలు, కొనుగోళ్లపై వర్తించే మూడేళ్ల తప్పనిసరి లాక్-ఇన్ నిబంధనను ఈ వ్యవహారంలో ఉల్లంఘించారా అనే ప్రశ్నను కూడా కాగ్ లేవనెత్తింది…
స్పెక్ట్రమ్‌కు చెల్లించి వాయిస్ సేవలను పొందడం … రిలయన్స్ గ్రూప్ IBSPL ద్వారా దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ కార్యకలాపాల కోసం సుమారు రూ.12,750 కోట్లు చెల్లించింది… అయితే, తరువాత అదే సంస్థకు అదనపు మొత్తాన్ని వసూలు చేయకుండా వాయిస్ సేవలు అందించేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం…
దీనికి విరుద్ధంగా, అదే కాలంలో 3G స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్న సంస్థలు దేశవ్యాప్తంగా వాయిస్ సేవల కోసం రూ.33,000 కోట్లకు పైగా చెల్లించాయి… ఈ రెండు విధానాల మధ్య వ్యత్యాసం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.20,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది…
BSNL, MTNLలను పోటీ నుంచి తప్పించారా? ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNLలకు కూడా BWA స్పెక్ట్రమ్ కేటాయించబడింది… అయితే, 2014 ఫిబ్రవరిలో ఈ రెండు సంస్థలు తమ BWA స్పెక్ట్రమ్‌ను తిరిగి అప్పగించాయి… దీనితో దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే ప్రధాన సంస్థగా రిలయన్స్ జియో మిగిలింది… BSNL, MTNLలు అప్పట్లో దేశంలోని ఇంటర్నెట్ చందాదారుల్లో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉండేవి…
ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ నుంచి తప్పుకోవడం వల్ల బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రిలయన్స్‌కు ఆధిపత్యం ఏర్పడే పరిస్థితి కలిగింది…
యాక్సిస్ బ్యాంక్ రూ.252 కోట్ల బ్యాంకు గ్యారంటీపై అనుమానాలు… – బ్యాంకు గ్యారంటీలో లబ్ధిదారుడి పేరు చేతితో రాశారా?
2010 మార్చి 17న IBSPL BWA స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసింది… ఆ సమయంలో యాక్సిస్ బ్యాంక్‌లోని ముంబై, వర్లీ కార్పొరేట్ బ్యాంకింగ్ శాఖ రూ.252.50 కోట్ల బ్యాంకు గ్యారంటీని జారీ చేసింది…
కాగ్ ఆడిటర్లు పరిశీలించిన కంప్యూటర్ ద్వారా రూపొందించిన బ్యాంకు గ్యారంటీ పత్రంలో, లబ్ధిదారుడి పేరును తొలగించి, దాని స్థానంలో IBSPL పేరును చేతితో రాసినట్లు గుర్తించారని పయనీర్ కథనం…
విదేశీ నిధుల మూలంపై ప్రశ్నలు… వేలం ఫలితాలు ప్రకటించిన ఐదు రోజుల తరువాత, 2010 జూన్ 16న రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (RBS) సింగపూర్ శాఖ నుంచి సుమారు 500 మిలియన్ డాలర్ల నిధులకు సంబంధించిన లావాదేవీ జరిగినట్లు ఆడిటర్లు గుర్తించారు…
ఈ నిధులకు యాక్సిస్ బ్యాంక్ భద్రత కల్పించింది… ఇవి IBSPL లైసెన్స్ ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించారు… ఈ IBSPLను టెలికాం రంగంలో అనుభవం ఉన్న మహేంద్ర నహతా, ఆయన కుమారుడు అనంత్ నహతా ప్రమోట్ చేశారు…
వేలం రద్దు చేయాలనే సూచన… కాగ్ తన ముసాయిదా నివేదికలో 3G/BWA స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియలో అక్రమాలకు సంబంధించిన సంకేతాలు ఉన్నాయని పేర్కొంటూ… వేలం ఫలితాలను ఆమోదించిన ఉన్నతస్థాయి కార్యదర్శుల కమిటీ పాత్రను కూడా కాగ్ ప్రశ్నించింది… ఈ కమిటీలో క్యాబినెట్ కార్యదర్శితో పాటు ఆర్థిక, టెలికాం శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు…
వేలం ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే, స్పెక్ట్రమ్ కేటాయింపును రద్దు చేయడం, సంబంధిత సంస్థలపై సమగ్ర దర్యాప్తు జరపడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలను కాగ్ సూచించింది… (తరువాత ఏం జరిగింది..? ఇంకా ఏమేం బయటపడ్డాయి..? అవి ఈ కథనంలో లేవు, అంబానీ టెలికాం రంగప్రవేశం వరకే…)
అంటే అర్థమైంది కదా… జియో పుట్టుక వెనుక అంబానీ అక్రమాలు… సో, యూపీఏ సంపూర్ణ సహకారం… కేబినెట్ కార్యదర్శి దాకా మౌనం… సో, డియర్ మస్క్... బీజేపీ- అంబానీ బంధాలు కాదు... అంబానీయే ఎవరు ప్రధానిగా ఉన్నా టరమ్స్ తనే శాసిస్తాడు... అదీ లెక్క... ఊరికే నోరు పారేసుకోకు...!!
Share this Article