.
ఒక పెయిన్ రిలీఫ్ బామ్ అడ్వర్టయిజ్‌మెంట్… బుమ్రా బౌలింగులో స్మృతి మంధాన సిక్స్ కొడుతుంది… చూశారు కదా… అవును, నిజ జీవితంలో అలాంటి పోటీని చూడకూడదా..? Athletics, Tennis, Badminton, Archery, Shooting… ఇతర క్రీడల్లో మిక్స్‌డ్ టీమ్‌లు సాధ్యమైనప్పుడు, క్రికెట్‌లోనూ ఎందుకు ప్రయత్నించకూడదు…?
2026 నవంబర్ 14– 29 తేదీల్లో శ్రీలంకలోని కొలంబో వేదికగా Test Twenty పేరుతో పురుషులు, మహిళలు కలిసి ఆడే ఒక వినూత్న క్రికెట్ టోర్నమెంట్ జరగనున్నట్లు తాజా వార్తలు చెబుతున్నాయి… ఇందులో 13–21 ఏళ్ల యువ ఆటగాళ్లతో కూడిన నాలుగు ఖండాల జట్లు పాల్గొననున్నాయి… అంటే, ఇది భారత సీనియర్ జాతీయ జట్టు ప్రకటన కాదు; అంతర్జాతీయ స్థాయిలో మిక్స్‌డ్ క్రికెట్ ప్రయోగం…
Ads
2019లోనే విరాట్ కోహ్లీ, మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ఆటగాళ్లతో మిక్స్‌డ్ టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించాలనే ప్రయత్నం జరిగింది… అయితే అప్పట్లో బీసీసీఐ అనుమతి లభించలేదు… పైగా కొలంబోలో జరగబోతున్నట్టు చెబుతున్న పోటీల్లో నిజంగా గాళ్స్, బాయ్స్ కలిసి ఉండే టీమ్స్ కాదు పోటీపడేది…
మిక్స్‌డ్ జట్టంటే మహిళా బ్యాటర్‌లు పురుషుల 145–150 కి.మీ. వేగంతో వచ్చే బంతులను యథాతథంగా ఎదుర్కోవాలి, మహిళా బౌలర్లు పురుషుల బ్యాటర్లకు బౌలింగ్ చేయాలి అనే నిబంధన కాదు… కొలంబోలో జరగనున్న Test Twentyలో బాలికల XI బాలికల XIతోనే, బాలుర XI బాలుర XIతోనే ఆడతాయి… కానీ రెండు జట్ల స్కోర్లను కలిపి ఒకే ఫలితం నిర్ణయిస్తారు…
ప్చ్, అది మిక్స్‌డ్ జట్టు ఎలా అవుతుంది…? గాళ్స్, బాయ్స్ టీమ్స్‌తో రెండు వేర్వేరు మ్యాచ్‌లు ఆడించి, స్కోర్లు కలిపి విజేతను నిర్ణయిస్తే అది మిక్స్‌డ్ క్రికెట్ కంటే డబుల్ స్కోర్ క్రికెట్ అనిపిస్తుంది కదా! ప్రేక్షకులకు కావాల్సిన అసలు మజా అక్కడ ఉండదు…
ఉదాహరణకు మెన్, వుమెన్ వేర్వేరు ఐపీఎల్ పోటీలకన్నా మిక్స్‌డ్ పోటీలు స్టార్ట్ చేస్తే..? ఒక జట్టులో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే, మరో ఎండ్‌లో స్మృతి మంధాన ఉండాలి… బుమ్రా బౌలింగ్ చేస్తుంటే, ఎదురుగా షెఫాలీ వర్మ బ్యాటింగ్ చేయాలి… లేదా స్మృతి మంధాన బౌండరీ కొడితే, తర్వాతి ఓవర్లో దీప్తి శర్మ బుమ్రాకే బౌలింగ్ చేయాలి… అప్పుడు కదా ఆసక్తి!
పోనీ, ఐసీసీయే మిక్స్‌డ్ జట్ల పోటీలను ప్రకటిస్తే… భారత్ తరఫున 11 మందిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉండవచ్చు… బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ ఇద్దరూ కలిసే ఉండాలి… బౌలింగ్‌లోనూ ఇద్దరికీ అవకాశం ఇవ్వాలి… అయితే బౌలింగ్ వేగం, ఆటగాళ్ల భద్రత, సమాన పోటీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి…
టెన్నిస్ వంటి మిక్స్‌డ్ పోటీల్లో సమానంగానే పోటీపడుతున్నారు కదా… మరి క్రికెట్‌లో ఎందుకు సాధ్యం కాదు… నిజంగానే పురుషులు–మహిళలు ఒకే జట్టులో ఉండి, ఒకరితో ఒకరు పోటీపడేలా ప్రయోగం చేయాలి… అప్పుడే అది కొత్తదనం అవుతుంది; ప్రేక్షకులకూ ఆసక్తి పెరుగుతుంది… ఊహించండి… మన శ్రీచరణి బౌలింగులో జాయ్ హోప్ క్లీన్ బౌల్డ్ అయిపోతే..?!

ఒకవేళ టీమిండియా మిక్స్‌డ్ టీ20 జట్టు తయారుచేస్తే..! … మన మెన్, వుమెన్ ఆటగాళ్లతో ఒక కల్పిత జట్టును తయారుచేస్తే ఇలా ఆసక్తికరంగా ఉంటుంది… ఇందులో సీనియర్లు, జూనియర్లు… మెన్, వుమెన్… బ్యాటర్లు, బౌలర్లు… రియల్ మిక్స్…
ఇందులో విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రీచరణి, రేణుకా సింగ్ ఠాకూర్… రిజర్వ్‌లో సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రాధా యాదవ్… ఇంకా ఎవరెవరుంటే బాగుంటుంది..? నువ్వేమంటావ్ జైషా..? కాస్త ఆ గంభీర్‌ను పక్కన పెట్టి సీరియస్‌గా ఆలోచించు..!!
Share this Article