Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదేం పని..?! లేడీ సింగం ‘ఆయుధ పూజ’ తీరుపై సర్కారు నోటీసు !!

October 24, 2026 by M S R

.

కిరణ్‌ బేడీ స్ఫూర్తి.. అడవుల్లో ఏకే-47తో ఆపరేషన్లు..! ఇప్పుడు అదే తుపాకీతో వివాదం!!

అంకితా శర్మ.. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన ఐపీఎస్‌ అధికారి. మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ విజయం.. క్షేత్ర స్థాయిలో పోలీసింగ్‌.. మహిళా ఎస్పీగా ప్రత్యేక గుర్తింపు. ఇదీ ఆమె ప్రయాణంలో ఒక కోణం. కానీ విజయదశమి నాడు ఆయుధపూజ తర్వాత ఏకే-47తో కాల్పులు జరిపిన వీడియో ఇప్పుడు మరో చర్చకు తెరలేపింది. ఆయుధపూజలో తప్పేముంది? తుపాకీతో కాల్పులు జరపడంలోనే సమస్యా? మరి ఇతర పోలీసు అధికారులూ కాల్పులు జరిపినప్పుడు అంకితా శర్మకే సర్కారు షోకాజ్‌ నోటీసు ఎందుకు?

Ads

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లా నుంచి వచ్చిన అంకితా శర్మ 2018 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆమె తండ్రి వ్యాపారవేత్త. చిన్నప్పటి నుంచే సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలన్న ఆకాంక్ష ఉండేదని, మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ తనకు స్ఫూర్తి అని అంకిత గతంలో చెప్పినట్లు వార్తా కథనాలు…

అయితే లక్ష్యం పెట్టుకోవడం ఒక ఎత్తు.. దాన్ని సాధించడం మరో ఎత్తు. పాఠశాల స్థాయిలో తనను తాను సాధారణ విద్యార్థినిగానే అభివర్ణించుకున్న అంకిత, చదువులోనూ ముఖ్యంగా గణితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయని వెల్లడించింది. భిలాయ్‌లో ఉన్నత విద్య అభ్యసించిన ఆమె ఎంబీఏ చదువును మధ్యలో వదిలి సివిల్స్‌ సన్నద్ధతపై దృష్టి పెట్టింది.

మొదటి ప్రయత్నంలో మెయిన్స్‌ వరకు వెళ్లినా తుది జాబితాలో చోటు దక్కలేదు. రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ దశనే దాటలేకపోయింది. కానీ రెండు వైఫల్యాల తర్వాత లక్ష్యాన్ని వదులుకోలేదు. మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 203వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపిక…

ఈ ప్రయాణంలో భర్త వివేకానంద శుక్లా సహకారం కూడా ఉంది… ఆయన భారత సైన్యంలో అధికారి… పెళ్లి తర్వాత కూడా సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యాన్ని కొనసాగించేందుకు భర్త ప్రోత్సహించాడు…

ఆఫీసులో కూర్చుని ఆదేశాలివ్వడమే కాదు! ఐపీఎస్‌ అధికారిగా ఎంపికైనంత మాత్రాన ఎవరూ ప్రత్యేకమైన పోలీసు అధికారి అయిపోరు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా పనిచేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? ప్రజలతో, కిందిస్థాయి సిబ్బందితో ఎలా వ్యవహరిస్తారు? ఇవే ఒక అధికారికి వృత్తిపరమైన గుర్తింపును తీసుకొస్తాయి.

అంకితా శర్మ కెరీర్‌లో బస్తర్‌ ప్రాంతంలో పనిచేసిన కాలం ఈ కోణంలో ప్రాధాన్యం సంతరించుకుంది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసింగ్‌ అంటే… తానే ఓ ఏకీ47 పట్టుకుని అడవుల్లోకి వెళ్లిపోవడం కాదు… సాధారణ శాంతిభద్రతల నిర్వహణతో పోలిస్తే భిన్నమైన సవాళ్లు ఎదురవుతాయి. అడవులు, మారుమూల గ్రామాలు, స్థానిక భౌగోళిక పరిస్థితులపై అవగాహన, భద్రతా సమాచార సేకరణ, సిబ్బంది సమన్వయం.. ఇలా అనేక అంశాలు కీలకంగా మారతాయి…

తొలి మహిళా ఎస్పీగా బాధ్యతలు… సరే, ఆమె పనితీరు ప్రభుత్వానికి నచ్చింది… సాధారణంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో లేడీ ఐపీఎస్‌లు చాలా అరుదు… సో, ప్రభుత్వం ఆమెను తరువాత లా అండ్ ఆర్డర్‌కు మార్చింది… ప్రస్తుతం రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా ఎస్పీగా ఉంది…

కఠినంగా వ్యవహరించే పోలీసు అధికారిగా ఆమెకు గుర్తింపు రావడంతో కొందరు అభిమానులు ఆమెను ‘లేడీ సింగం’ అని పిలుస్తున్నారు… అయితే ఇలాంటి బిరుదులు ప్రజాదరణను, ప్రచారాన్ని సూచిస్తాయి తప్ప, ఒక అధికారి పనితీరును కొలిచే అధికారిక ప్రమాణాలు కావు…

ankitha sharma ips

ఆయుధపూజ తప్పా? అసలు వివాదం ఇక్కడే! విజయదశమి నాడు ఆయుధపూజ చేయడం భారతీయ సంప్రదాయంలో భాగం. సైన్యం, పోలీసు విభాగాల్లోనూ ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించడం కనిపిస్తుంది. ఆయుధాన్ని గౌరవించడం తప్పు కాదు. విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాల పట్ల బాధ్యతను గుర్తుచేసుకునే సందర్భంగానూ ఈ ఆచారాన్ని చూస్తాం…

కానీ ఆయుధపూజ చేయడం ఒకటి.. పూజ తర్వాత తుపాకీతో గాలిలోకి కాల్పులు జరపడం మరొకటి. అక్టోబర్‌ 20న రాజ్‌నంద్‌గావ్‌ పోలీస్‌ లైన్స్‌లో శస్త్రపూజ అనంతరం అంకితా శర్మ ఏకే-47తో పలుమార్లు గాలిలోకి కాల్పులు జరిపిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో వైరల్‌ కావడంతో ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయం ఆమెకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఆయుధాల వినియోగ నిబంధనలు, భద్రతా ప్రమాణాల విషయంలో వివరణ కోరింది…

మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆర్‌.కె. విజ్‌ కూడా ఆయుధపూజ సంప్రదాయం అంటే ఆయుధాలను పూజించడమేనని, కాల్పులు జరపడం అవసరం లేదని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి… అంటే ఇక్కడ చర్చ ఆయుధపూజపై కాదు. ఆచారం పేరుతో ఆయుధాన్ని ఉపయోగించే విధానం ఎంతవరకు సమర్థనీయం అన్నదానిపై…

మరి అంకితా శర్మకే ఎందుకు నోటీసు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం వెతకాల్సిందే. రాజ్‌నంద్‌గావ్‌లోనే అదనపు ఎస్పీ కీర్తన్‌ రాథోడ్‌ కాల్పులు జరిపిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి దృశ్యాలు బయటకు వచ్చాయి. అయినప్పటికీ అంకితకు మాత్రమే నోటీసు ఇచ్చినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.

lady singam

వైరల్‌ వీడియోపై వచ్చిన ప్రతికూల స్పందన, పోలీసు శాఖ ప్రతిష్ఠకు నష్టం కలగడం నోటీసుకు కారణాలుగా పేర్కొన్నారు. కానీ ఒక వీడియో ఎక్కువగా వైరల్‌ అయిందని ఒక అధికారిని మాత్రమే ప్రశ్నించడం, అదే తరహా చర్యకు పాల్పడిన ఇతరుల విషయంలో ఏం జరిగిందో చెప్పకపోవడం సహజంగానే సందేహాలకు తావిస్తుంది.

జనం లేడీ సింగం అని కీర్తిస్తుంటే… ఆ సినిమాటిక్ ఇమేజ్ మాయల్లోనే ఉండిపోయి, ఆయుధపూజ సమయంలో కాల్పులు జరపడం మీద ప్రభుత్వ అభ్యంతరమా..? లేక కేవలం ఆ వీడియోపై జనం నెగెటివ్‌గా స్పందించడంతోనే ఈ నోటీసు జారీ చేసినట్టా..? ఆయుధపూజలో తప్పు లేదు. కానీ ఆయుధాన్ని పూజించడం వేరు.. దాన్ని పేల్చడం వేరు. ఆ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడమే ఈ వివాదంలో అసలైన అంశం… ఆమె ఏమని జవాబు ఇస్తుందో చూడాలి..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇదేం పని..?! లేడీ సింగం ‘ఆయుధ పూజ’ తీరుపై సర్కారు నోటీసు !!
  • ప్రీతిరెడ్డి..! తెలంగాణ విద్యావ్యవస్థకు ఓ మణికిరీటం..!!
  • పాపం కేటీయార్… పాత తప్పుల్ని మరిచి… ఆకాశానికి మళ్లీ నిచ్చెనలు !!
  • వాట్సాప్, టెలిగ్రామ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ !!
  • మోహన్‌లాల్ బాడీ డబుల్ ! ఇదో దిక్కుమాలిన సోషల్ రాద్దాంతం !!
  • అమెరికాకు అంబానీ సాయం దేనికి..? ఈ సంప్రదింపుల మర్మమేంటి..?
  • అమెరికా చమురు దరిద్రం! ఆయిల్ పాలిటిక్స్‌లో ఉల్టా పల్టా !!
  • చర్చిద్దాం రండి… తుమ్మడిహెట్టి ఎత్తుపై మహారాష్ట్ర సీఎం సానుకూలత !!
  • దిక్కుమాలిన జర్నలిజం! చిన్న ఆర్టిస్టులంటే మరీ అంత లోకువా..?
  • పోటీయే కదా ప్రజాస్వామిక స్పూర్తి… నిర్బంధ ఏకగ్రీవాలు దేనికి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions