.
అవును, కాలంలోపాటు కళ కూడా మారాలి, మార్కెటింగ్ నేర్చుకోవాలి, జనం నాడి పట్టుకోవాలి, జనరంజకం చేస్తేనే ఏ కళకైనా మనుగడ… గరివిడి లక్ష్మి ! ఈ బుర్రకథకురాలు చేసిందీ అదే… నానాటికీ జనానికి దూరం అవుతున్న కథలోకి కాస్త శృంగారాన్ని పట్టుకొచ్చింది… మోటు సరసాన్ని అద్దింది… ఆట, పాట ఛమక్కులు… బుర్రకథ బతికింది…
ఆమె తన కడుపు నింపుకోవడం కోసమే చేయవచ్చుగాక… కానీ ఉత్తరాంధ్ర జానపద పాటలకు ప్రాచుర్యం తెచ్చింది… మళ్లీ బుర్రకథలకు జనాన్ని రప్పించింది, రక్తికట్టించింది… కానీ ఆమె బుర్రకథను చెడగొట్టిందట… ఒక కరాటే కల్యాణి కావచ్చు, ఒక కుంగ్‌ఫూ కామేశ్వరి కావచ్చు, ఒక బాక్సర్ బంగారమ్మ కావచ్చు… ఎవరో వాయించేస్తోంది…
Ads
అదేమంటే… బుర్రకథ సంప్రదాయం కల్తీ అయిపోయిందట, అసలు గరివిడి లక్ష్మి చెప్పేది బుర్రకథే కాదు అంటోంది… రొటీన్ ఛాందస ఫార్ములా ఫ్రేమ్‌లోనే ఉండిపోవాలట… మరి హరికథలోకి సినిమా పాటలెలా వచ్చాయమ్మా..? అంతెందుకు..? పాత సంప్రదాయానికే అలా కట్టుబడిపోతే, మడి కట్టుకుంటే, ఎవరూ ఆదరించక ఇక ఆ కళే అంతర్ధానమైపోతే..? ఈ ప్రశ్నకు మాత్రం జవాబు దొరకదు…

కళ స్టాటిక్ కాదు, కళ డైనమిక్… ఒకేచోట ఆగదు, మారాలి, పారాలి, అప్పుడు దానికి ఉనికి… ఈ సబ్జెక్టు డిబేటబుల్…
ఇక్కడ ఆర్పీ పట్నాయక్ ఆమె పాటల్ని కాపీ కొట్టాడా..? చాలామంది ఆమెను మోసం చేశారా..? వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో భంగపాటు ఆమె స్వయంకృతమా..? పాట, పద్యం వివాదాల జోలికి వెళ్లడం లేదిక్కడ… నిజానికి ఏళ్లుగా జనం పాడుకునే జానపద గీతాలకు కాపీరైట్స్ ఎవరికీ ఉండవు… గరివిడి లక్ష్మికి ఉండవు, ఆర్పీ పట్నాయక్‌కు ఉండవు… ఆ రాద్దాంతం ఓ శుష్క వేదాంతం…

దాన్నలా వదిలేస్తే… కళ కాలానుగుణంగా మారాల్సిందేనా..? ఇదీ అసలు చర్చ… మారితే బతుకుతుంది, కానీ పరిమితులు అవసరం… మారలేకపోతే మాయం అయిపోతుంది, చాలా జానపద కళలు- కథలు అలా అంతరించిపోయాయి… బుర్రకథలో మోటుసరసం, శృంగారం ఏమిటసలు అని ఛాందసం గుడ్లురిమినా మార్పు అనివార్యం…
అంతెందుకు..? మన తెలుగు సినిమాల ఉదాహరణలే చూద్దాం… అన్నమయ్యలో అస్మదీయ మగటిమి పాట, శ్రీరామదాసులో చాలు చాలు పాట చిత్రీకరణ చూడండి ఓసారి… భక్తి చిత్రంలోకి రక్తి ఎలా జొరబడింది… పాండురంగడు సినిమా మాటేమిటి..? అన్నమయ్య సినిమాలోనే పదహారు కళలకు అనే పాట సంగతి..? స్వామి వారి శోడషోపచారాలకూ, అంగాంగ వర్ణనకు ముడిపెట్టిన ప్రయోగం మాటేమిటి..? అవన్నీ ఆమోదనీయాలేనా..?
- (నిజానికి లక్ష్మి బుర్రకథను పాడుచేయలేదు, ఆధునీకరించుకుంది… కానీ లక్ష్మి పేరిట చాలామంది డూప్లికేటుగాళ్లు బయల్దేరి అశ్లీలం దట్టించారు… కొందరైతే జాతరల్లో బూతు షోలుగా మారిస్తే, ఇక ఈ ఒరిజినల్ లక్ష్మి తన పాట ఆపేసింది, తన గొంతుకు తనే గొళ్లెం పెట్టుకుని, తెర వెనక్కి వెళ్లిపోయింది…)

అసలు ఒక పేద గ్రామీణ బుర్రకథ కళాకారిణి జీవితకథను సినిమాగా తీయడమే ఓ సాహసం… మెప్పించడం కష్టసాధ్యమైన ఓ పరీక్ష… బతుకుపోరులో ఆమె సాధించిన విజయంలాగే ఈ చిన్న సినిమా కూడా విజయం సాధించినట్టే లెక్క… ప్రొఫెషనల్ ఫెయిడ్ రివ్యూయర్లు పట్టించుకోకపోయినా సరే, మౌత్ టాక్, సోషల్ మీడియా రసజ్ఞుల మద్దతులో బ్రేక్ ఈవెన్ అయినట్టేనని చెబుతున్నారు…
గుడ్, ఈ సినిమా సక్సెస్ తెరమరుగైన మరికొందరు కళాకారుల కథల్నీ తెరకెక్కించడానికి ఉపయోగపడితే మంచిదే కదా…!!
Share this Article