.
తెరపై కనిపిస్తే చాలు.. నవ్వులు పూయించే కమెడియన్ వడివేలు! తనదైన హావభావాలతో, విచిత్రమైన మేనరిజమ్స్‌తో తమిళ ప్రేక్షకులనే కాదు, తెలుగు ప్రేక్షకులనూ కడుపుబ్బ నవ్వించిన నటుడు. ఒకప్పుడు ఆయన కామెడీ సన్నివేశాలు లేకుండా సినిమాలే వచ్చేవి కావంటే అతిశయోక్తి కాదు. అలాంటి వడివేలు మధురైలో వంద కోట్ల రూపాయల విలువ ఉంటుందని ప్రచారం జరుగుతున్న భారీ భవనాన్ని నిర్మించారన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ అంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టారు? అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? తమది పెద్ద ఉమ్మడి కుటుంబమని, దాదాపు 200 మంది కుటుంబ సభ్యులున్నారని, అందరూ ఒకచోట చేరి ఆనందంగా గడపాలన్నదే తన కోరికని చెప్పుకొచ్చారు. ప్రతి వారం అందరినీ పిలిచి విందు ఏర్పాటు చేసుకుంటామని, కుటుంబ సభ్యులంతా కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకుంటారని వివరించారు.
Ads
వినడానికి చాలా బాగుంది. కుటుంబ సభ్యులందరినీ కలిపి ఉంచాలనుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయమే. డబ్బు సంపాదించినవాళ్లు చాలామందే ఉంటారు. కానీ తమవాళ్లందరినీ గుర్తుపెట్టుకుని, వారితో అనుబంధాన్ని కొనసాగించాలనుకునేవాళ్లు ఎంతమంది?
అయితే ఇక్కడే ఓ చిన్న సందేహం! 200 మంది కుటుంబ సభ్యులు ఉన్నంత మాత్రాన వాళ్లంతా ప్రతిరోజూ ఒకే ఇంట్లో ఉంటారా? ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లలు, ఇతర బాధ్యతలతో ఎవరి జీవితాలు వాళ్లకు ఉంటాయి కదా! అందరూ ఎప్పుడో ఒకసారి కలుసుకోవడానికి, వారాంతాల్లో కుటుంబ సమ్మేళనాలు జరుపుకోవడానికి ఇంత భారీ భవనం అవసరమా? అందరూ కలుసుకునేందుకు ఒక మంచి ప్రాంగణం ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ దానికీ వంద కోట్ల రూపాయల విలువైన భవనానికీ మధ్య చాలా తేడా ఉంది.
మరి వడివేలు చెప్పిన కుటుంబ ప్రేమ వెనుక మరో కోణం కూడా ఉందా? అనిపిస్తుంది. సినిమాల్లో కమెడియన్‌గా ఎదిగి ఇంతటి సంపదను సంపాదించుకోవడం చిన్న విషయమేమీ కాదు. హీరోలకు కోట్ల రూపాయల పారితోషికాలు అందే పరిశ్రమలో, ప్రధానంగా హాస్యనటుడిగా తన కెరీర్‌ను నిర్మించుకున్న వడివేలు ఇంత ఆస్తిని కూడబెట్టుకోవడం విశేషమే. అయితే సంపాదించడం ఒక ఎత్తయితే, ఆ సంపదను నిలబెట్టుకోవడం మరో ఎత్తు.

సినిమా రంగంలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు అవకాశాలు వెల్లువెత్తవచ్చు. రేపు పరిస్థితులు మారిపోవచ్చు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నవాళ్లు కూడా కొన్నేళ్లపాటు తెరకు దూరమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులోనూ బాగా సంపాదించి, బిజీగా గడిపి సినిమా నిర్మాణాల్లో వేళ్లు పెట్టి, వేర్వేరు రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్లు చేసి చేతులు కాల్చుకున్న కమెడియన్లు ఉన్నారు… సేమ్, వడివేలు జీవితంలోనూ ఒడిదొడుకులు లేకపోలేదు. అలాంటప్పుడు సంపాదించిన డబ్బును ఎక్కడో ఒకచోట స్థిరమైన ఆస్తిగా మార్చుకోవాలనుకోవడం సహజమే కదా!
నా అనుమానం ఏమిటంటే… కుటుంబ సభ్యులందరినీ కలిపి ఉంచాలనే కోరిక ఒక కారణం కావచ్చు. అదే సమయంలో, కష్టపడి సంపాదించిన సంపదను చెల్లాచెదురు కాకుండా ఒక పెద్ద స్థిరాస్తి రూపంలో భద్రపరచుకోవాలనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు.
ఎందుకంటే, సినిమా అవకాశాలు తగ్గినా, పెరిగినా… భూమి, భవనం వంటి స్థిరాస్తులు ఒక ఆర్థిక భరోసాగా నిలవవచ్చు. అయితే ఏ ఆస్తి విలువైనా కాలంతో పాటు మారుతుంది. దాన్ని నిర్వహించడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.
ఏది ఏమైనా, వడివేలు సంపాదనను ఎలా వినియోగించుకోవాలన్నది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం. కుటుంబం కోసం ఖర్చు పెట్టాలనుకున్నా, ఆస్తులు కూడబెట్టాలనుకున్నా అది ఆయన ఇష్టం. కానీ వంద కోట్ల ఇల్లు కట్టడం వెనుక కుటుంబ ప్రేమ ఒక్కటే కారణమని చెప్పినప్పుడు, ప్రేక్షకులకు ఇలాంటి సందేహాలు రావడం మాత్రం సహజం.
తెరపై నవ్వులు పంచిన వడివేలు.. నిజ జీవితంలో తన సంపదను భద్రపరచుకోవడంలోనూ అంతే తెలివిగా వ్యవహరించారా? ఏమో.. అది ఆయనకే తెలియాలి!
Share this Article