.
Prasen Bellamkonda …. అంతర్గత విషాదం.. ఆహ్లాదంగా…. ఒకమ్మాయి ఒకర్ని ప్రేమించి మరొకర్ని పెళ్లి చేసుకోవల్సి వస్తుంది. తాళి కట్టిన వ్యక్తికి ఆ విషయం తెలుస్తుంది. లేదూ, ఆ అమ్మాయే చెప్పేస్తుంది. అప్పుడా భర్త ఆ అమ్మాయిని ప్రేమికుడికి అప్పగించేయడమో లేదూ ఆ అమ్మామే తాళి కట్టిన వ్యక్తితోనే కొనసాగడానికి నిర్ణయించుకోవడమో అయి శుభం కార్డు పడుతుంది. ఇది ఏ భాషలోనైనా వెండితెర సూపర్ హిట్ ఫార్ములా కథ.
1963 లో వచ్చిన ఈడూ జోడు మొదలు నాని నిన్నుకోరి… మధ్యలో మాంగల్యానికి మరో ముడి, రాధాకల్యాణం, సప్తపది, స్వయంవరం, కన్యాదానం, మెంటల్ కృష్ణ, ఇవన్నీ ఆ ఫార్ములా నకళ్లే. అన్నీ సూపర్ హిట్లే.
పెళ్లి భారతీయ సమాజంలో ఒక ఒప్పందంతో రెండు కుటుంబాల మధ్య జరిగే బహిరంగ ప్రదర్శన. ఆ ప్రదర్శనలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు తమ జీవితాలకు తామే నిర్దేశకులు కారు. వాళ్ల చుట్టూ వందల మంది, వందల అభిప్రాయాలు,సంప్రదాయాలు, పరువు ప్రతిష్ఠలుంటాయి.
Ads
వాళ్లిద్దరి మనసుల్లో ఏముందో తెలుసుకునే తీరిక ఎవరికీ ఉండదు. ఈ వైరుధ్యాన్ని ఒక గ్రామీణ వివాహ నేపథ్యంతో, ఒక రాత్రి సంఘటనలతో, హాస్యాన్ని ప్రధాన కథన సాధనంగా చేసుకున్న తమిళ చిత్రం మొద రాత్రి. అంటే మొదటి రాత్రి అని. ఇదీ ఆ సూపర్ హిట్ ఫార్ములాలోంచి పుట్టిందే.
రాజా కరుప్పసామి దర్శకత్వంలో రిషికాంత్, అనిష్మా అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సాధారణమైన కథను అసాధారణమైన కథన పద్ధతులతో చెప్పడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం మొద రాత్రి. సినిమా పేరు మొద రాత్రి. కానీ ఈ కథలో మొదటి రాత్రి అనేది శారీరక కలయికకు సంబంధించిన సందర్భం కాదు. ఇద్దరు అపరిచితులు మొదటిసారి ఒకరినొకరు మనుషులుగా అర్థం చేసుకోవడం ప్రారంభించిన రాత్రి.
సుదీర్ఘ సింగిల్ టేక్, సమూహ పాత్రల బ్లాకింగ్, జ్ఞాపకాల విభిన్న చిత్రీకరణ, రాత్రి ఛాయాగ్రహణం, ప్రాంతీయ వాద్యాలతో శబ్ద రూపకల్పన, హాస్యం విషాదం జమిలి ప్రయాణం వంటి అంశాల్లో మొదటి సినిమాయే అయినప్పటికీ దర్శకుడి ప్రయోగ తపన ఈ సినిమాను మంచి సినిమాగా మార్చింది.

మారుదు, ముత్తుసెల్విలకు పెళ్లవుతుంది. మారుదు పరిస్థితుల కారణంగా పెళ్లికి అంగీకరిస్తాడు. ముత్తుసెల్వి అప్పటికే మరొకరితో వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకుంటుంది. కానీ కుదరదు. కొత్త దంపతుల మొదటి రాత్రి సాధారణంగా సినిమాల్లో శృంగారానికి ప్రారంభం కావల్సిన సన్నివేశం. కానీ ఒక నైతిక సంకటం ప్రారంభానికి వేదిక అవుతుంది. తన భార్య మరొకరిని ప్రేమిస్తోందని మారుదుకు తెలుస్తుంది.
అప్పటివరకు ఒక సంప్రదాయంలో భాగస్వామిగా ఉన్న అతడు అకస్మాత్తుగా ఒక మనిషిగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.
భార్యను తన ఆస్తిగా భావించాలా? తనను ప్రేమించని వ్యక్తితో జీవితాన్ని కొనసాగించాలా? లేక ఆమె కోరుకున్న జీవితాన్ని ఆమెకు అందించడానికి ప్రయత్నించాలా? అనే సంకటంలో నలిగి మారుదు ఆమెను ప్రేమించిన వ్యక్తి దగ్గరకే తీసుకెళ్లాలనే నిర్ణయానికి వస్తాడు.
కథలోని ప్రధాన అందం ఏమిటంటే, ఒక వ్యక్తి జీవితంలో అత్యంత విషాదకరమైన సందర్భం మరొకరికి నవ్వులాట కావచ్చు. ఒకరి ప్రేమ మరొకరి అవమానం కావచ్చు. ఒకరి స్వేచ్ఛ మరొకరి కుటుంబ ప్రతిష్ఠకు ముప్పుగా మారొచ్చు. మొద రాత్రి కేవలం ఒక పెళ్లి రాత్రి కథ కాదు. వివాహం అనే వ్యవస్థలో మనుషుల వ్యక్తిగత ఆకాంక్షలకు ఎంత స్థానం ఉందనే ప్రశ్న కూడా.
పెళ్లింట్లో వెలుగు ఎక్కువ. మనుషులు ఎక్కువ. శబ్దం ఎక్కువ. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువ. బయట రాత్రి చీకటిగా ఉంటుంది. మనుషులు తక్కువగా ఉంటారు. కానీ భార్యాభర్తలు ఒకరితో మరొకరు మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం అక్కడే కలుగుతుంది. ఈ వైరుధ్యం ఒక దృశ్యాత్మక ప్రతీక.
గందరగోళాన్ని ఒక నిర్మాణంగా మార్చడం ఈ సినిమా రూప విన్యాసం. ఒకవైపు భార్యాభర్తల వ్యక్తిగత సంక్షోభం. మరోవైపు కుటుంబాల సామూహిక గందరగోళం. ఈ రెండింటినీ సమాంతరంగా నడిపిస్తూ దర్శకుడు హాస్యాన్ని సృష్టించాడు. కథ ఒకే కేంద్రం నుంచి సరళరేఖలా ముందుకు వెళ్లదు. అనేక చిన్నచిన్న సంఘటనలు, ఉపకథలు, పాత్రల వ్యక్తిగత చరిత్రలు ప్రధాన కథను చుట్టుముడతాయి.
పెళ్లింట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మరో మూలలో ఇంకో వివాదం మొదలవుతుంది. ఒక సమస్య
పరిష్కారమవుతుందనుకునేలోగా మరో సమస్య పుట్టుకొస్తుంది. ప్రేక్షకుడు ఒక పాత్రతో భావోద్వేగపరంగా మమేకమవుతున్న సమయంలోనే దర్శకుడు మరో పాత్ర దగ్గరకు తీసుకెళ్తాడు. సాహితీ పరిభాషలో దీన్ని కేయాస్ నేరేటివ్ అంటారు. అంటే గందరగోళమే కథ ముడిసరుకు కావడం.
- ఈ సినిమాలో చెప్పుకోవల్సింది ప్రారంభంలోని కట్ లేకుండా సాగే సుదీర్ఘ సింగిల్ టేక్ సన్నివేశం. సాధారణంగా ఒక కుటుంబాన్ని పరిచయం చేయాలంటే ఏ దర్శకుడైనా కొన్ని షాట్లు తీస్తాడు. పాత్రల ముఖాలను విడివిడిగా చూపిస్తాడు. వాటిని ఎడిటింగ్ ద్వారా కలుపుతాడు. కానీ ఇక్కడ కెమెరా ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి ప్రయాణిస్తూ, పాత్రలను, వాళ్ల మధ్య సంబంధాలను, పరిసరాలను ఒక నిరంతర దృశ్యప్రవాహంలో పరిచయం చేస్తుంది . ఈ వన్ షాట్ స్టేజింగ్ లో ఎక్కడా డిజిటల్ స్టిచింగ్ లేకపోవడం దర్శకుడి ప్రతిభ.
దీని ప్రత్యేకత కేవలం కెమెరా ఆపకుండా చిత్రీకరించడంలో లేదు. కెమెరా కదలికకు అనుగుణంగా నటీనటుల కదలికలు, సంభాషణలు, ప్రవేశాలు, నిష్క్రమణలు, నేపథ్య చర్యలు అన్నింటి సమన్వయంలో ఉంది. చాలా సందర్బాలలో ఈ సినిమాలో కెమెరాయే ఒక కథకుడు.
మొద రాత్రి హాస్యం వెనుక ఉన్నది సామాజిక విషాదం . ఒక అంతర్గత విషాదం. ఒక యువతి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోవడం విషాదం. ఒక యువకుడు తన ఇష్టానికి భిన్నంగా వివాహబంధంలో ఇరుక్కోవల్సిరావడం విషాదం. కానీ ఈ రెండు విషాదాలు కలిసినప్పుడు పుట్టే హాస్యం నవ్విస్తూనే గుండెను కలుక్కుమని కూడా అనిపిస్తుంది.
- అంతేకాదు, ముత్తుసెల్వి ప్రేమించిన వ్యక్తి కూడా ఆదర్శ ప్రేమికుడేం కాదు. ప్రేమ గురించి మాట్లాడతాడు. కానీ అవసరమైన బాధ్యతను స్వీకరించడానికి వెన్ను చూపుతాడు. ఇక్కడే ప్రేమ ఒక భావన మాత్రమేనా, లేక బాధ్యతతో కూడిన ఆచరణా అనే ప్రశ్న పుడుతుంది. మరోవైపు స్త్రీల అణగారిన ఆకాంక్షలను కూడా సినిమా ప్రస్తావిస్తుంది. తన జీవితంలో నెరవేరని కలలున్న తల్లి, కూతురి స్వేచ్ఛను నియంత్రించడానికి ప్రయత్నించడం ఒక విషాదకరమైన వైరుధ్యం.
ఒక తరం అనుభవించిన నిర్బంధం తరువాతి తరానికి వారసత్వంగా సంక్రమించడం ఇది సినిమాలోని ముఖ్యమైన సామాజిక ప్రస్తావనల్లో ఒకటి. కులం, కుటుంబ పరువు, పురుషాధిక్యత వంటి అంశాలు కూడా కథలో ప్రవేశిస్తాయి. వీటన్నింటినీ పెద్దపెద్ద ఉపన్యాసాలుగా కాకుండా పాత్రల ప్రవర్తనల ద్వారా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నిస్తాడు.
- ఇక్కడొక ఆసక్తికరమైన కథన రోలర్ కోస్టర్ ఉంది. మొదట రెండు కుటుంబాలు పెళ్లి జరగాలని పట్టుబడతాయి. పెళ్లి చేసుకోబోయే ఇద్దరికీ మాత్రం ఇష్టం ఉండదు. చివరికి కుటుంబాలు వాళ్లు విడిపోవాలని కోరుకునే పరిస్థితి వస్తుంది. అప్పటికి ఆ జంట మధ్య అవగాహన మొదలవుతుంది. అంటే పెళ్లి జరిగేటప్పుడు లేని అనుబంధం, పెళ్లి తరువాతి సంక్షోభంలోంచి పుడుతుంది. ఈ నిర్మాణమే సినిమా తాత్విక ప్రకటన.
ప్రేమించడమంటే ఒకరిని సొంతం చేసుకోవడం కాదు. ఒకరి గతాన్ని, గాయాలను, అసంపూర్ణతలను అర్థం చేసుకోవడం. వివాహమంటే ఇద్దరు మనుషులను ఒకే గదిలోకి పంపించడం కాదు. వాళ్లు ఒకరి జీవితంలోకి మరొకరు స్వేచ్ఛగా ప్రవేశించగలిగే పరిస్థితిని కల్పించడం.
పెళ్లి ఒక సంఘటన. అనుబంధం ఒక పరిణామం. ఈ రెంటి మధ్య ఉన్న దూరాన్ని ఒకే రాత్రిలో కొలవడానికి ప్రయత్నించిన సినిమా మొద రాత్రి. ఆ రాత్రి గడిచిపోతుంది. కానీ ఆ రాత్రి మనుషులు ఒకరినొకరు చూసుకునే కోణాన్ని మారుస్తుంది. బహుశా ఏ వివాహానికైనా నిజమైన మొదటి రాత్రి అదే… …ప్రసేన్
7013358154
Share this Article