Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ బాలీవుడ్ హాస్యబ్రహ్మ- ఇక రిటైరయిపోతాడుట- ఆ నవ్వులకు ఇక ‘తెర’…

November 2, 2026 by M S R

.

Mohan Goteti
నో డౌట్.. ఆయన సినిమాలు హాయిగా.. నవ్వుకుంటూ.. చూసేయచ్చు!
ఒకే అమ్మాయిని ఇద్దరు కుర్రాళ్లు ప్రేమిస్తే ఏమవుతుంది?
వాళ్లల్లో వాళ్లకి పెద్ద పోటీ వచ్చిపడిపోతుంది కదా?
ఒకళ్ల మీద ఒకళ్లకి ద్వేషం పుట్టుకొస్తుంది కదా?
ఎవరికీ వాళ్లు తమ అడ్డు తొలగించుకోవాలని చూస్తారు కదా?
ఇక్కడా అదే జరిగింది..

అందగత్తె నేహాను బన్నూ గాఢంగా ప్రేమించేశాడు..
అదే సమయంలో ఆమెను రాజా కూడా ప్రేమించడం మొదలెట్టాడు.
మరి.. బన్నూకి మండిపోదూ?
తమ మధ్య మరో వ్యక్తి దూరితే ఎలా తట్టుకోగలుగుతాడు?
తట్టుకోలేకపోయాడు..
అసలు ఆ విషయం తెలిసినప్పటి నుంచీ మనిషి మనిషిలా లేడు..
ఏదో ఒకటి చేసి రాజాని సీన్ నుంచి తప్పించాలనుకున్నాడు.
ఆలోచిస్తే.. లోకల్ రౌడీ పప్పూ పేజర్ గుర్తొచ్చాడు..

Ads

ఎస్.. ఈ సమస్యని పరిష్కరించగలిగేది ఒక్క ఆ పప్పూగాడే అనుకుని.. అతని దగ్గరకి వెళ్లాడు.
పప్పూ పేజర్ ది పేద్ద బంగాళా..
ఇంటిలో చిన్న రౌడీల హడావిడి కూడా వుంది..
అంతలో మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు పప్పూ..
పువ్వుల చొక్కా వేసుకుని నల్లని కళ్లజోడు పెట్టుకుని.. ఓ చేతిలో పేజర్ పట్టుకుని.. ముంబై లోకల్ టపోరీ భాష మాట్లాడుతూ కనిపించాడు పప్పూ పేజర్!

అతన్ని చూడగానే బన్నూకి ప్రాణం లేచొచ్చింది..
వీడిని చూస్తుంటే.. తనకి అడ్డుగా వున్న రాజాని తొలగిస్తాడన్న నమ్మకం కుదిరింది.
విషయం విడమరచి చెప్పాడు..
డీల్ మాట్లాడుకున్నారు..
రాజా ఫొటో పప్పూకి ఇచ్చాడు..
తర్వాత మాట్లాడుకున్న అమౌంట్ ఇవ్వడానికి జేబులోంచి స్టయిల్ గా చెక్ బుక్ తీశాడు బన్నూ..

“కిత్నే కా ఫాడూ?” అనడిగాడు..
పప్పూ పేజర్ కి ఒళ్లు మండిపోయింది..
ఇంతవరకు తన డీల్ వ్యవహారంలో ఎవడూ ఇలా చెక్ ఇచ్చింది లేదు.. అలా అడిగిందీ లేదు మరి!
అందుకే.. ఆ కోపంలో.. ఫాట్ మని బన్నూని ఒక్కటి పీకాడు..
బన్నూకి అర్థంగాక అతని వైపే చూశాడు, అదో రకం ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ..

“అరే.. పప్పూ పేజర్ కే యహా చెక్ వెక్ కా లఫ్డా నహీ చల్తా.. క్యాష్ చాహీయే .. హార్డ్ క్యాష్.. ” అంటాడు పప్పూ తనదైన శైలిలో..
ఈ కామెడీ సీన్ కి థియేటర్లో ప్రేక్షకులు గొల్లున నవ్వుతారు..
ఈ సన్నివేశంలో బన్నూ పాత్రలో గోవిందా, పప్పూ పేజర్ పాత్రలో సతీష్ కౌశిక్ అభినయం చూసి తీరాలి..
అక్కడ వాళ్ల సంభాషణ సీరియస్ గా జరుగుతున్నా ప్రేక్షకులకు మాత్రం నవ్వుతెప్పిస్తుంది!
పడిపడి నవ్వుకుంటారు..
గోవిందా హావభావాలు.. సతీష్ కౌశిక్ రౌడీ భాష.. సినిమా చూస్తున్న మనకు చక్కిలిగింతలు పెట్టి మరీ నవ్విస్తాయి.
అదే టపోరీ కామెడీగా పేరుతెచ్చుకుంది..

david dhavan

ఈ సన్నివేశం 1997లో వచ్చిన ‘దీవానా మస్తానా’ హిందీ సినిమాలోది.
ఈ సినిమాలో రాజాగా అనిల్ కపూర్ .. నేహాగా జుహీచావ్లా కనిపిస్తారు.
అసలు ఈ సన్నివేశమనే కాదు..
సినిమా మొత్తం ఇలాగే కామెడీగా సాగుతూ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది.
మరి.. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనుకుంటున్నారు.. ఆయనే డేవిడ్ ధావన్!

సీరియస్ సినిమా.. పార్లల్ సినిమా .. హై బడ్జెట్ కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాలకు పేరుగాంచిన బాలీవుడ్ లో డేవిడ్ ధావన్ ఒక సైలెంట్ రివాల్యుషన్!
వస్తూనే తన కామెడీ సినిమాల ద్వారా ఓ సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చారు.
అది ప్రేక్షకులని మ్యాగ్నేట్ లా ఆకర్షించడం మొదలెట్టింది..
నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడం ప్రారంభించింది..

సినిమా అంటే కేవలం వినోదమే అని గట్టిగా నమ్మిన దర్శకుడు ధావన్!
ఆయన సినిమాలు సాదాసీదాగా వుంటాయి..
ఆయన సినిమాల కథలలో లాజిక్ కనపడదు..
వినోదాల మేజిక్ మాత్రం పుష్కలంగా కనిపిస్తుంది..
ఆయన సినిమాలలో సంక్లిష్టమైన సన్నివేశాలు వుండవు..
అందరికీ అర్ధమయ్యే తేలికైన సీన్స్ ఉంటాయి.
ఆయన సినిమాలలో కళాత్మకత.. గుండెల్ని పిండేసే సెంటిమెంటు.. మెలోడ్రామా కనపడవు..
హాయిగా నవ్వించి మనసుని తేలికపరిచే ఫీల్ గుడ్ హార్మోన్స్ కనపడతాయి.
ఆయన సినిమాలోని కథ, సన్నివేశాలే కాదు .. పాటలు కూడా నవ్వులపువ్వులు వెదజల్లుతాయి.

david dhavan

ఆయన సినిమాలలో హీరోహీరోయిన్లే కాకుండా సతీష్ కౌశిక్, కాదర్ ఖాన్, అనుపమ్ ఖేర్ వంటి సహాయ నటుల పాత్రలు కూడా ఫుల్ కామెడీ చేస్తాయి.
1989లో ‘తాఖత్వర్’ సినిమాతో ధావన్ దర్శకుడిగా పరిచయమయ్యారు.
అందులో హీరో గోవిందా..
ఆ సినిమా సక్సెస్ అవడంతో గోవిందాతో పదిహేడు సినిమాల వరకు చేశారాయన.
ఇద్దరికీ బాగా కుదిరింది..
ఇద్దరూ కామెడీ ప్రియులే..
ఒకరు కామెడీ బాగా తీసే దర్శకుడైతే..
మరొకరు కామెడీని కుమ్మేసే కథానాయకుడు..
మరింకేం… ఇద్దరి కాంబినేషన్లోనూ ఎన్ని హిట్లు?

షోలా ఔర్ షబ్నమ్..
ఆంఖే..
రాజాబాబు..
కూలీ నెంబర్ వన్..
సాజన్ చలే ససురాల్..
హీరో నెం.1
దీవానా మస్తానా..
బడేమియా చోటేమియా..
బనారసీ బాబు..
కున్వారా..
జోడీ నెం.1
పార్ట్ నర్..

ఇలాంటి హిట్లు ఎన్నో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి.
అన్నట్టు డేవిడ్ ధావన్ కి రీమేక్ స్పెషలిస్ట్ అన్న పేరు కూడా వుంది.
ఆయన చేసిన సినిమాలలో ఎక్కువగా రీమేకులే వున్నాయి మరి..
అయితే, మూల కథని తీసుకుని.. దానిని బాలీవుడ్ నేటివిటీకి అనుగుణంగా మార్చుకుని .. దానికి తనదైన శైలి కామెడీ జోడించి.. ఫ్రెష్ కథలా అవుట్ ఫుట్ ఇచ్చే దర్శకుడాయన.
అంతేకానీ, మక్కీకి మక్కీ సీన్లన్నీ కాపీ పేస్ట్ చేసేసే దర్శకుడు కాదు..

పలు తమిళ సినిమాలతో పాటు ‘అల్లరి మొగుడు’ (సాజన్ చలే ససురాల్), ‘ఆ ఒక్కటీ అడక్కు’ (మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడీ), ‘హలో బ్రదర్’ (జుడ్వా), ‘బావగారూ బాగున్నారా’ (కున్వారా) వంటి తెలుగు సినిమాలను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేశారాయన.
‘బడేమియా చోటేమియా’, ‘కున్వారా’ వంటి సినిమాల షూటింగులలో ఆయనని చాలాసార్లు కలిశాను.
ఎప్పుడు కలిసినా నవ్వుతూ విష్ చేసేవారు.. నిండుగా మాట్లాడేవారు.
“ఎప్పుడూ కామెడీ సినిమాలేనా.. ఎందుకని మీరు పంథా మార్చి సినిమా చేయరు?” అనడిగాను ఓసారి.
“సినిమా అనేది వినోద సాధనమనేది నా అభిప్రాయం సార్.. ప్రేక్షకులు సినిమాకి ఏవో నేర్చుకోవడానికి వస్తారని నేననుకోను.. ఆ కాసేపు వాళ్ల సమస్యలు మర్చిపోయి ఎంజాయ్ చేయడానికి వస్తారు. వాళ్లని కడుపుబ్బా నవ్వించి పంపించడమే నాకిష్టం” అన్నారు ధావన్.
ఆయన చెప్పింది నిజమే అనిపించింది!

ఆయనని చూస్తే నాకు మన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గుర్తుకొస్తారు.
అదే ఆయనతో అంటే. .”గొప్ప దర్శకుడు సార్ ఆయన.. నాకు మంచి ఫ్రెండ్ కూడా” అన్నారు.
“తెలుగులో మీరు ఏదైనా సినిమా చేయచ్చుగా?” అనడిగితే నవ్వారు.
తర్వాత చెబుతూ “ఎందుకండీ.. ఇక్కడ మన ఈవీవీ గారు ఉన్నారుగా.. ఇక నేనెందుకు?” అంటూ చమత్కరించారు ధావన్.
ఆ చమత్కారంలో ఈవీవీపై ప్రశంస వుంది!

అన్నట్టు, చాలామందికి ఆయన పేరు కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటుంది..
డేవిడ్ .. ధావన్.. ఈ రెండు పేర్లు ఎలా కలిశాయని అనుకుంటారు.
దానికో చిన్న కథ వుంది.
పంజాబీ దంపతులకు అగర్తలాలో పుట్టిన ధావన్ అసలు పేరు రాజిందర్ ధావన్.
అయితే, ధావన్ పెదనాన్నగారికి పిల్లలు లేకపోవడంతో రాజిందర్ ను కోల్ కతాలోని పెదనాన్న దంపతులకు పెంపకానికి ఇచ్చారు.
అక్కడ వీరింటి పక్కనే ఓ యూదు కుటుంబం ఉండేది.
రాజిందర్ వాళ్లింటికి ఎక్కువగా వెళ్లేవాడు.
ఆ యూదు దంపతులు ఇతనిని బాగా ముద్దు చేస్తూ.. ‘డేవిడ్’ అనే పెట్ నేమ్ తో పిలిచేవారు.
ఆలా అసలు పేరు మరుగున పడిపోయి ఆ పేరు స్థిరపడిపోయింది.. అదీ సంగతి!

అన్నట్టు, ఈమధ్యనే తనయుడు వరుణ్ ధావన్ తో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ధావన్.. ఇక ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు.
అంటే.. దర్శకునిగా ఇక రిటైర్ అవుతున్నానని చెప్పారన్నమాట!
బాలీవుడ్ ని వినోదాల బాట పట్టించిన డేవిడ్ ధావన్ సినిమాలు మనకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి.
బాలీవుడ్ లో ‘కింగ్ ఆఫ్ కామెడీ’గా పేరుతెచ్చుకున్న ధావన్ సినిమాలు నాకు బాగా ఇష్టం..

ముఖ్యంగా గోవిందా కాంబినేషన్లోని సినిమాలు మరీనూ!
డల్ గా వున్నప్పుడు ఆ సినిమాలు చూస్తే.. కాసేపు అన్నీ మరచిపోయి.. నాన్ స్టాప్ గా నవ్వుకుంటూ.. రీఛార్జ్ అయిపోతాం!
ఆయన సినిమాలలో ఏదో మ్యాజిక్ వుంది..
అది మనల్ని థియేటర్లో చైర్ లోంచి లేవకుండా కట్టిపారేస్తుంది.. ఇది నిజం!
-మోహన్ గోటేటి

#DavidDhawan
#varundhawan
#deewanamastana
#BadeMiyanChoteMiyan
.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ బాలీవుడ్ హాస్యబ్రహ్మ- ఇక రిటైరయిపోతాడుట- ఆ నవ్వులకు ఇక ‘తెర’…
  • అరబ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు- ఇజ్రాయిల్‌కు ఆత్మహత్యా సదృశం
  • సినిమా రక్త చరిత్ర… రాప్తాడు రంపం వెనుక దాగున్న ‘విషం’…
  • నో, నో… *కొత్త బొద్దింకలు- మోదీ సర్కారు’పై కథనం కానేకాదు ఇది!!
  • BiggBoss10… రేయ్, ఎవుర్రా మీరంతా..!! ఎంపికలు ఎవరి నిర్వాకం..!?
  • 5 స్టార్స్ !! రామాయణకు ఈ ప్రముఖ విశ్లేషకుడి అసాధారణ రేటింగ్ !!
  • A Journalist’s Journey Through Two Eras of Reporting
  • ఒక డోరతీ… కొంచెం సమీక్ష.. బోలెడు సైన్సూ…
  • మన పేదరికం నిజంగా తగ్గిందా..? జబ్బలు చరుచుకుందామా..?
  • ఒక సరస్వతీ పుత్రుడు – ఒక సరస్వతీ పుత్రిక – ఓ అదర్శ కుటుంబం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions