.
వరల్డ్ బ్యాంకు వేసే పిచ్చి లెక్కలను బట్టి… పేదరికానికి అది చెప్పే నిర్వచనాలు, కొలిచే కొలమానాలను బట్టి దేశంలో పేదరికం విపరీతంగా తగ్గిపోయిందనీ, దాదాపు నిర్మూలించబడినట్టేనని జబ్బలు చరుచుకుందామా..? జస్ట్, మరో 2.6 శాతం మంది మాత్రమే పేదలుగా మిగిలిపోయారనీ, 27.1 శాతం నుంచి పదేళ్లలో 2.6 శాతానికి పేదరికాన్ని తగ్గించేశామని భుజకీర్తులు తగిలించుకుందామా..?
ముందుగా… ఓ చిన్న మాట… 122 దేశాలకు గాను మన దేశపు హంగర్ ఇండెక్స్ 100 వ స్థానం… అంటే, ఆకలి మాత్రమే కాదు, పౌష్టికాహారం కొరత, ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, పిల్లల్లో బరువు, ఎత్తు, ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు, తల్లుల రక్తహీనత వంటి చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే…!
Ads
మరి తాజా వరల్డ్ బ్యాంకు రిపోర్టును నమ్ముదామా..? పేదరికం తగ్గిందా..? లేక పేదరికాన్ని కొలిచే కొలమానమే మారిందా? రోజుకు మూడు డాలర్లు సంపాదిస్తే పేదరికం లేనట్టేనా..? ద్రవ్యోల్బణం, వైద్యం, విద్య, వసతి మాటేమిటి? కూడు సరే, గూడు, గుడ్డ మాటేమిటి..? మనం నిజంగా పేదరికం నుంచి బయటపడ్డామా..? అసలు దరిద్రం మన లెక్కల్లో, కొలమానాల్లో ఉందా..?
భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని ప్రపంచబ్యాంకు తాజా నివేదిక చెబుతోంది… గత 12 ఏళ్లలో ఏకంగా 49.6 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, తీవ్ర పేదరికం 27.1 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయిందని వెల్లడించింది… వినడానికి చాలా గొప్పగా ఉంది… దేశ ఆర్థిక ప్రగతికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, పెరిగిన ఉపాధి అవకాశాలకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని చెప్పుకోవచ్చు… అయితే ఇక్కడో చిన్న ప్రశ్న… అసలు పేదరికాన్ని కొలిచే కొలమానం ఏమిటి..? ఆ కొలమానం భారతీయుల వాస్తవ జీవన పరిస్థితులకు ఎంతవరకు సరిపోతుంది..?
ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2011-12లో దేశ జనాభాలో 57.7 శాతం మంది రోజుకు 4.20 డాలర్ల అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు… 2023-24 నాటికి ఆ సంఖ్య 16.1 శాతానికి తగ్గింది… అంటే సుమారు 49.6 కోట్ల మంది ఈ పేదరికపు వర్గం నుంచి బయటపడ్డారు… ఇక తీవ్ర పేదరికాన్ని కొలిచే రోజుకు 3 డాలర్ల ప్రమాణం ప్రకారం చూస్తే, 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదల సంఖ్య 2023-24 నాటికి 2.6 శాతానికి పడిపోయింది… గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర పేదరికం 31 శాతం నుంచి 3.1 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 17.4 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గినట్లు నివేదిక చెబుతోంది…
ఈ ప్రగతికి మూడు ప్రధాన కారణాలను ప్రపంచబ్యాంకు ప్రస్తావించింది… కుటుంబాల వినియోగ వ్యయం పెరగడం, ముఖ్యంగా మహిళల ఉపాధి అవకాశాలు పెరగడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆహార సబ్సిడీల ద్వారా పేద కుటుంబాలకు అందిన సహాయం… 2017 నుంచి 2023 మధ్య దేశంలో సుమారు 13.4 కోట్ల ఉద్యోగాలు పెరిగినట్లు కూడా నివేదిక పేర్కొంది… అయితే ఉద్యోగాల సంఖ్య పెరిగినంత మాత్రాన ఆదాయాలు కూడా అదే స్థాయిలో పెరిగాయా? అన్నది మరో ప్రశ్న… వేతనాల వాస్తవ వృద్ధి అంతంతమాత్రంగానే ఉందని, తక్కువ ఉత్పాదకత కలిగిన ఉపాధి రంగాల్లోనే ఉద్యోగాల పెరుగుదల అధికంగా ఉందని ప్రపంచబ్యాంకు స్వయంగా పేర్కొనడం గమనార్హం…

మూడు డాలర్లతో పేదరికం పోతుందా? ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ప్రపంచబ్యాంకు నిర్దేశించిన రోజుకు 3 డాలర్ల పేదరికపు ప్రమాణం అంటే ప్రస్తుత డాలర్ మారకపు విలువ ప్రకారం మూడు డాలర్లు భారతీయుడి చేతిలో ఉండాలని కాదు… ఇది 2021 కొనుగోలు శక్తి సమానత్వం (Purchasing Power Parity – PPP) ఆధారంగా నిర్ణయించిన అంతర్జాతీయ ప్రమాణం… వివిధ దేశాల్లో వస్తువులు, సేవల ధరల్లో ఉండే వ్యత్యాసాలను సర్దుబాటు చేసి పేదరికాన్ని పోల్చడానికి ఉపయోగించే పద్ధతి ఇది…
ప్రపంచబ్యాంకు లెక్కల్లో 2021 ధరల ప్రకారం రోజుకు సుమారు రూ.58ను మూడు డాలర్లకు సమానమైన కొనుగోలు శక్తిగా పరిగణిస్తున్నారు… దిగువ మధ్య ఆదాయ దేశాలకు వర్తించే 4.20 డాలర్ల ప్రమాణం సుమారు రూ.82. అంటే ఒక వ్యక్తి రోజుకు ఈ మొత్తానికి సమానమైన వినియోగ వ్యయాన్ని కలిగి ఉంటే, ఆ అంతర్జాతీయ ప్రమాణం ప్రకారం అతను పేదరికపు రేఖకు పైన ఉన్నట్టే…
కానీ మన దగ్గర ఒక వ్యక్తి రోజుకు రూ.58 లేదా రూ.82తో ఎలాంటి జీవితం గడపగలడు? కనీసం రెండు పూటలా భోజనం చేయడం ఒక్కటే జీవితమా? ఆహారం కాకుండా ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, రవాణా, దుస్తులు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, మందులు, ఇతర నిత్యావసరాలు కూడా ఉంటాయి కదా! ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలు ఉంటే వారి అవసరాలన్నింటినీ ఈ లెక్కలో ఎలా అంచనా వేస్తారు? రోజువారీ కనీస ఖర్చులే తడిసి మోపెడవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రమాణం ఎంతవరకు వాస్తవికమైనది?
పన్నెండేళ్లలో పెరిగిన ధరల సంగతేమిటి? 2011-12తో పోలిస్తే 2023-24 నాటికి దేశంలో జీవన వ్యయం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఆహార పదార్థాలు, ఇంధనం, రవాణా, అద్దెలు, వైద్యం, విద్య.. ఏ రంగాన్ని తీసుకున్నా ధరల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది… మధ్యతరగతి కుటుంబాలకే నెలవారీ బడ్జెట్ భారంగా మారుతున్నప్పుడు, తక్కువ ఆదాయ వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు…
నిజమే, ప్రపంచబ్యాంకు PPP ప్రమాణం వివిధ దేశాల్లో ధరల వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుంటుంది… అలాగే దేశంలో ప్రాంతాల మధ్య, కాలానుగుణంగా ధరల వ్యత్యాసాలను సర్దుబాటు చేసే పద్ధతులనూ ఉపయోగిస్తుంది… అయితే అంతర్జాతీయ పోలిక కోసం రూపొందించిన ఈ ప్రమాణం, ఒక భారతీయ కుటుంబానికి వాస్తవంగా అవసరమైన జీవన వ్యయాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తుందా? అన్నది కీలకమైన ప్రశ్న…
ముఖ్యంగా వైద్య ఖర్చులను తీసుకుందాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుబాటులో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. కానీ అందరికీ అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా? ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే ఒక చిన్న అనారోగ్యమే కుటుంబ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయగలదు… పిల్లల చదువుల విషయంలోనూ ఇదే పరిస్థితి… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అయ్యే ఖర్చుల్లో ఎంతో వ్యత్యాసం ఉంది… అద్దె ఇళ్లలో నివసించే పట్టణ పేదలకు ఇంటి అద్దె ఒక పెద్ద భారం… ఈ ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అంతర్జాతీయ కొనుగోలు శక్తి ప్రమాణంతో పేదరికాన్ని అంచనా వేస్తే వాస్తవ పరిస్థితి పూర్తిగా బయటపడుతుందా?
ప్రపంచబ్యాంకు కూడా తన కొలమానానికి పరిమితులున్నాయని అంగీకరిస్తోంది! ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ప్రపంచబ్యాంకు 2025 జూన్‌లోనే తన అంతర్జాతీయ దారిద్ర్య రేఖలను సవరించింది… గతంలో రోజుకు 2.15 డాలర్లుగా ఉన్న తీవ్ర పేదరిక ప్రమాణాన్ని 3 డాలర్లకు పెంచింది… దిగువ మధ్య ఆదాయ దేశాల ప్రమాణాన్ని 3.65 డాలర్ల నుంచి 4.20 డాలర్లకు మార్చింది… 2017 PPP స్థానంలో 2021 PPPని తీసుకొచ్చింది… అంటే ప్రపంచవ్యాప్తంగా ధరల స్థాయులు, జాతీయ దారిద్ర్య రేఖల్లో వచ్చిన మార్పుల ఆధారంగా పేదరికాన్ని కొలిచే ప్రమాణాలే ఎప్పటికప్పుడు మారుతున్నాయి… కానీ ఫీల్డ్ రియాలిటీకి తగినట్టు మారుతున్నాయా..? లేదు..!
భారత్‌కు సంబంధించి ప్రపంచబ్యాంకు ఉపయోగించిన గణాంకాల్లోనూ కొన్ని పరిమితులున్నాయి… 2011-12, 2022-23 వినియోగ వ్యయ సర్వేలను పోల్చేటప్పుడు సర్వే ప్రశ్నావళి, సేకరణ పద్ధతులు, నమూనా ఎంపికల్లో వచ్చిన మార్పులు ప్రభావం చూపవచ్చని ప్రపంచబ్యాంకు తన సాంకేతిక నివేదికలో పేర్కొంది… సంపన్న కుటుంబాల ప్రాతినిధ్యం సర్వేల్లో తక్కువగా ఉండటం వల్ల ఆదాయ అసమానతలు కూడా వాస్తవం కంటే తక్కువగా కనిపించే అవకాశం ఉందని అంగీకరించింది…
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఆ దేశానికి సంబంధించిన జాతీయ దారిద్ర్య రేఖే మరింత సముచితమైన ప్రమాణమని ప్రపంచబ్యాంకు తన వివరణలో స్పష్టం చేసింది… అంతర్జాతీయ ప్రమాణాలు ప్రధానంగా వివిధ దేశాల మధ్య పోలికలకు ఉపయోగపడతాయని పేర్కొంది…
పేదరికం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడమేనా? నిజానికి పేదరికాన్ని కేవలం డబ్బుతోనో, రోజువారీ వినియోగ వ్యయంతోనో కొలవడం అసంపూర్ణమైన ప్రక్రియ… ఒక వ్యక్తికి రెండు పూటలా తిండి దొరుకుతున్నంత మాత్రాన అతను పేదరికం నుంచి బయటపడినట్లు కాదు… నివసించడానికి గౌరవప్రదమైన ఇల్లు, నాణ్యమైన విద్య, అందుబాటులో ఉండే వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఉపాధి భద్రత, ఆర్థికంగా అనుకోని కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం కూడా అవసరమే…
Share this Article