.
సినిమా సమీక్ష రాద్దామనుకుంటే అది కాస్తా సినిమా వెనుక సైన్సయి కూచుంది. ఇదో కల్పిత కాకతాళీయం.
….. ( బెల్లంకొండ ప్రసేన్ )
కార్తీక్ సుబ్బరాజ్ తమిళ సినిమా డోరతీ ఒక ఆధునిక లైంగిక ప్రతిపాదన. దాని పట్ల అంగీకారం అనంగీకారం రెండూ ఉండొచ్చు. మనిషిని అతని దేహంతో నిర్వచించే సమాజం
ఎదుట దేహానికీ సామాజిక నిర్వచనానికీ మధ్య నలిగిపోయే ఒక అస్తిత్వాన్ని ఈ సినిమా నిలబెట్టి నిలదీసింది.
Ads
దర్శకుడి పేరు కార్తీక్ సుబ్బరాజ్. సినిమాలో ప్రధాన పాత్రలు కార్తీ, సుబ్బు. భలే కల్పిత కాకతాళీయం కదూ!
ఇలాంటి కల్పిత కాకతాళీయాలు సినిమాలో ఇంకొన్ని ఉన్నాయి. చిన్నప్పుడు కార్తీకి మగతనం నేర్పిన సుబ్బే చివరికి స్త్రీత్వాన్ని అర్థం చేసుకునే పాఠంగా మారుతుంది. ఒక
డోరతీ మరణిస్తే మరో డోరతీ జన్మిస్తుంది. సుబ్బును చంపేశానని ప్రకటించిన కార్తీయే డోరతీ కొత్త జీవితానికి సాక్షిగా నిలుస్తాడు. ఇవన్నీ కాకతాళీయాలుగా కనిపించే రచయిత
కల్పనలు. కథను నడిపించే సంఘటనలే కాదు, కథలోని వైరుధ్యాలను అర్థవంతంగా కలిపే శిల్పవిశేషాలు కూడా. ఒకే మనిషిలో పురుషత్వం, స్త్రీత్వం గురించిన విరుద్ధ
భావనలు, ఒకే పేరులో మరణం, పునర్జన్మ ఒకే సంబంధంలో స్నేహం, ప్రేమ ఇలా వైరుధ్యాలను కల్పిత కాకతాళీయాలుగా మలచడం కార్తీక్ సుబ్బరాజ్ కథన చాతుర్యం.
డోరతీ అంటే గ్రీకు భాషలో దేవుని కానుక అని అర్దమట. బహుశా జెండర్ డైవర్సిటీలో భాగంగా జరిగే పరిణామాలన్నీ దేవుని కానుకలే అనేది దర్శకుడి భావన కామోసు.
పైకి ఇద్దరు పురుషుల స్నేహంగా మొదలై, జెండర్ అస్తిత్వాన్నీ, ప్రేమ స్వభావాన్నీ, పురుషాధిపత్య నిర్మాణాన్నీ ప్రశ్నించే కథ. సాధారణంగా సినిమాల్లో ప్రేమకు సమాజం
అడ్డుపడుతుంది. ఈ సినిమాలో మాత్రం ప్రేమకు అడ్డుపడటానికంటే ముందు మనిషి తనను తాను గుర్తించుకోవడానికి సమాజం అడ్డుపడుతుంది. కనుక డోరతీని కేవలం
ట్రాన్స్జెండర్ ప్రేమకథగా చూడటం దాని తాత్విక విస్తృతిని కుదించడమే . ఇది మనిషి తనకు కేటాయించిన అస్తిత్వాన్ని తిరస్కరించి, తనదైన అస్తిత్వాన్ని నిర్మించుకునే
ప్రయత్నం. పురుషుడిగా పుట్టడం ఒక జీవసంబంధ వర్గీకరణ కావచ్చు. కానీ పురుషుడిగా ఎలా ప్రవర్తించాలో సమాజం నిర్ణయించడం మాత్రం రాజకీయ ప్రక్రియ. పురుషత్వ
నియమాలను తిరస్కరించే ప్రతి పురుషుడూ ట్రాన్స్జెండర్ కాదు. సున్నితత్వం, వంట చేయడం, ఏడవడం వంటి లక్షణాలు ఏ లింగానికీ ప్రత్యేకమైనవి కావు అనే వాస్తవాన్ని
తెలియచెప్పే ప్రయత్నం చేసే సినిమా ఇది.
తొంభయ్యవ దశకపు గ్రామీణ తమిళనాడు నేపథ్యంగా సాగే కథలో కార్తీ, సుబ్బు ఇద్దరూ బాల్యస్నేహితులు. సుబ్బు కుటుంబం పురుషాధిపత్యానికి ప్రతిరూపం. ఆ కుటుంబంలో
పురుషత్వమంటే అధికారం. అధికారం అంటే హింస. హింస అంటే గౌరవం. అక్కడ మగవాడు ఏడవకూడదు. సున్నితంగా ఉండకూడదు. వంట చేయకూడదు. ఆడవాళ్ల
పనులుగా సమాజం నిర్వచించిన పనులను చేయకూడదు. ఈ నియమాలన్నీ పురుషుడి సహజ లక్షణాలుగా ప్రచారం లో ఉంటాయి. వాస్తవానికి అవి అతనిపై రుద్దిన సామాజిక
ఆదేశాలు.
డోరతీ ప్రధాన విజయం ట్రాన్స్జెండర్ వ్యక్తిని కేవలం జాలి పొందాల్సిన మనిషిగా చూపించకపోవడం. ఆమె ప్రేమించగలదు. ప్రేమ పొందనూగలదు. తన జీవితాన్ని తనకు
నచ్చిన విధంగా నిర్మించుకోవాలని కోరుకోగలదు. ఈ దృక్పథం భారతీయ ప్రధాన స్రవంతి సినిమాలో ముఖ్యమైన ముందడుగు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ పాత్రలను తరచుగా
హాస్యానికి, విషాదానికి, సామాజిక సందేశానికి ఉపయోగించుకుంటూ వచ్చారు. ఈ సినిమాలో డోరతీకి ప్రేమను పొందే అవకాశం కల్పించడం ఆ సంప్రదాయానికి భిన్నమైన
ప్రయత్నం.
బాల్యంలో సుబ్బు ధైర్యవంతుడు. కార్తీ అతనిపై ఆధారపడేవాడు. యవ్వనంలో వాళ్ల స్వభావాలు తారుమారవుతాయి. కార్తీ హింసాత్మక పురుషత్వాన్ని అలవర్చుకుంటే,
సుబ్బు తనలోని సున్నితత్వాన్ని గ్రహించుకుంటాడు. పురుషత్వాన్ని ప్రదర్శించేవాడు తన నిజమైన స్వభావానికి దూరమవుతుంటే, ఆ ప్రదర్శనను తిరస్కరించేవాడు తన
అస్తిత్వానికి దగ్గరవుతుంటాడు. తన ప్రాణ స్నేహితుడిలో స్త్రీ లక్షణాలు మెలమెల్లగా పెరుగుతున్నాయని అసహ్యించుకున్న వ్యక్తి చివరకు ఆ స్త్రీకే దగ్గరవడం డోరతీలో ఇంకో
కల్పిత కాకతాళీయం.
ఇదొక గమ్మత్తయిన ప్రేమకథ. ఆ ప్రేమకథ చుట్టూ కులం, పురుషాధిపత్యం, లింగ వివక్ష, కుటుంబ గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అనేక అంశాలున్నాయి. అందువల్ల ఇది కేవలం
ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమకథగా మిగిలిపోలేదు. ఒక మనిషి తనకు నచ్చినట్టు జీవించడానికి సమాజంతో ఎంత పోరాడాలో చెప్పే కథగా మారింది. సుబ్బు నుంచి డోరతీ
అవడం అనేది మార్పు కాదు, ఆవిష్కరణ. ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన తాత్విక ఘట్టం సుబ్బు డోరతీగా తనను తాను ప్రకటించుకోవడం. దీన్ని ఒక పురుషుడు స్త్రీగా
మారడంగా మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు.
డోరతీ దృష్టిలో అది తనలో ఎప్పటినుంచో ఉన్న స్త్రీ అస్తిత్వాన్ని బాహ్య ప్రపంచానికి వ్యక్తం చేయడం.

కులం, పితృస్వామ్యం, పురుషత్వం మూడున్నూ అధికార నిర్మాణాలు. డోరతీలో కులం ఒక ఉపకథ కాదు. అది పురుషాధిపత్యంతో కలిసి పనిచేసే అధికార వ్యవస్థ.
కార్తీ పట్ల సుబ్బు కుటుంబం చూపే కుల వివక్ష, ఆ కుటుంబంలో స్త్రీలపై కొనసాగుతున్న అణచివేత, పురుషుల హింసాత్మక ప్రవర్తన ఇవన్నీ పరస్పర సంబంధం ఉన్న అంశాలే.
కులాధిపత్యం స్త్రీల లైంగికతను నియంత్రిస్తుంది. కుటుంబ గౌరవం ముసుగు వివాహాలను, సంబంధాలను, వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రిస్తుంది. అదే వ్యవస్థ పురుషత్వాన్ని ఒక
హింసాత్మక సామాజిక బాధ్యతగా నిర్మిస్తుంది. ఇక్కడ పురుషుడు కేవలం అధికారాన్ని అనుభవించేవాడు మాత్రమే కాదు. ఆ అధికారాన్ని నిరంతరం ప్రదర్శించాల్సిన ఒత్తిడికి
గురయ్యేవాడు కూడా. అయితే ఈ రెండు అనుభవాలు సమానమైనవి కావు. పురుషాధిపత్యం వల్ల పురుషుడు ఎదుర్కొనే భావోద్వేగ పరిమితులను, స్త్రీలు, ట్రాన్స్జెండర్
వ్యక్తులు ఎదుర్కొనే వ్యవస్థాగత అణచివేతతో సమానం అనలేం.
సినిమాలో కార్తీ, సుబ్బు మధ్య ఏర్పడే సంఘర్షణ ఈ సామాజిక నిర్మాణాల నుంచి విడిగా ఉద్భవించదు. ఒకరి అస్తిత్వ స్వేచ్ఛ మరొకరి సామాజిక శిక్షణను ప్రశ్నిస్తుంది.
అందువల్ల కార్తీ డోరతీని అంగీకరించడం వ్యక్తిగత ప్రేమ ప్రకటన మాత్రమే కాదు. తనలోకి ప్రవేశించిన పురుషాధిపత్య విలువలను సమీక్షించుకునే ప్రక్రియ కూడా.
ఒక మనిషి తన నిజమైన అస్తిత్వాన్ని ప్రకటించినప్పుడు, అతన్ని అప్పటివరకు ప్రేమించినవాళ్లు తమ జ్ఞాపకాల్లోని పాత మనిషిని వదులుకోగలరా? డోరతీ విషయంలో కార్తీ
ఎదుర్కొనే సంఘర్షణ ఇదే. అతడు ప్రేమించిన సుబ్బు ఎక్కడికీ వెళ్లిపోలేదు. కానీ సుబ్బును గురించి కార్తీ ఏర్పరచుకున్న భావన మారింది. ప్రేమలో అత్యంత కష్టమైన
పరిణామం ఇదే. ఎదుటి మనిషి మారడాన్ని అంగీకరించడం కాదు, ఆ మనిషి గురించి మనం ఏర్పరచుకున్న నిర్వచనాన్ని మార్చుకోవడం.
ప్రేమించడమంటే ఎదుటి మనిషి మనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకోవడం కాదు. ఆ మనిషి తనకు నచ్చినట్టుగా జీవించడాన్ని కూడా అంగీకరించడం.
కార్తీ ప్రేమలో గొప్పతనం ఇదే. మనిషి తనకు తాను ఇచ్చుకున్న గుర్తింపుకంటే, సమాజం అతనికి ఇచ్చిన గుర్తింపే ముఖ్యమని భావించడం ఎంత అన్యాయమో సినిమా
చెపుతుంది.
కార్తీ ప్రేమించేది తన బాల్యస్నేహితుడు సుబ్బునా? తన ఎదుట ఉన్న డోరతీనా? లేక సుబ్బు, డోరతీ అనే రెండు పేర్లకూ అతీతమైన వ్యక్తిత్వాన్నా?
మొదటిది మాత్రమే నిజమైతే, డోరతీ స్త్రీ అస్తిత్వాన్ని కార్తీ ఇంకా పూర్తిగా అంగీకరించలేదని భావించాలి. రెండోది నిజమైతే, అతని ప్రేమ తన స్నేహితురాలి నిజమైన అస్తిత్వాన్ని
గుర్తించిన ప్రేమగా మారినట్టవుతుంది. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నానని చెప్పడమంటే ఎదుటి వ్యక్తి జెండర్ అస్తిత్వాన్ని నిర్లక్ష్యం చేయడమే.
ప్రేమకు, ప్రేమలో జెండర్ లేదనేది వినడానికి అందమైన వాక్యం. కార్తీ తన స్నేహితుణ్ని కోల్పోయాననే భావన నుంచి, తన ఎదుట ఉన్న స్త్రీని గుర్తించే స్థితికి చేరుకోవడం ఈ
కథలోని ప్రధాన భావోద్వేగ పరిణామం. ఇంతకాలం స్నేహితుడిగా ఉన్నవాడు స్త్రీగా మారగానే అతని లేదూ ఆమె మీద కోరిక కలుగుతుందా అన్న ప్రశ్నకు కలుగుతుంది అనే
సమాధానం వచ్చేది ఇక్కడే.
గే ప్రేమ, ట్రాన్స్జెండర్ ప్రేమ ఒకటేనా? ఈ సినిమా చర్చలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇది. సాంకేతికంగా, లైంగికతకు సంబంధించిన శాస్త్రీయ పరిభాషలో గే ప్రేమ,
ట్రాన్స్జెండర్ వ్యక్తితో ప్రేమ ఒకటే కాదు. అయితే రెండూ పరస్పరం మినహాయించుకునే వర్గాలు కూడా కావు.
జెండర్ వ్యక్తీకరణ, జెండర్ అస్తిత్వం వేర్వేరు అంశాలు. చీర కట్టుకోవడం స్త్రీగా ఉండటానికి తప్పనిసరి ప్రమాణం కాదు. చీర కట్టుకోని ట్రాన్స్జెండర్ స్త్రీ కూడా స్త్రీయే. ఈ
సూక్ష్మమైన తేడా సినిమాలో మిస్సింగ్. డోరతీ ఒక స్త్రీ. కానీ ఆమె కేవలం ఒక స్త్రీ పాత్ర మాత్రమే కాదు. ఆమె తనకు సమాజం కేటాయించిన జీవితాన్ని తిరస్కరించి, తనదైన
జీవితాన్ని ప్రకటించుకునే మనిషి. ఆమె ఉనికి పురుషత్వానికి వ్యతిరేకం కాదు. పురుషత్వాన్ని ఏకైక అధికార ప్రమాణంగా ప్రకటించే వ్యవస్థకు వ్యతిరేకం. ఆమె ప్రేమ స్వలింగ
ప్రేమకు మరో పేరు కాదు. ఒక ట్రాన్స్జెండర్ స్త్రీ ప్రేమను పొందడానికి, ప్రేమను ఎంచుకోవడానికి, తన అస్తిత్వంతో జీవించడానికి ఉన్న హక్కుకు వ్యక్తీకరణ.
ఈ సినిమాను చూసిన తర్వాత మనం కార్తీని సుబ్బును ప్రేమించిన నువ్వు డోరతీని ఎందుకు ప్రేమించలేకపోయావు? డోరతీని ప్రేమించిన నువ్వు సుబ్బును పూర్తిగా
వదులుకున్నావా? డోరతీ తనను తాను ప్రేమించుకోవడానికి కార్తీ అంగీకారం ఎందుకు అవసరం కావాలి? అని ప్రశ్నించవచ్చు.
ఇక్కడే ఈ సినిమా తాత్విక గాఢత లోతు తగ్గింది.
ప్రేమ మనిషికి విముక్తిని ఇవ్వవచ్చు. కానీ ప్రేమను పొందడం మాత్రమే విముక్తికి ప్రమాణం కాకూడదు.

సుబ్బు తనను తాను డోరతీ అనే స్త్రీగా గుర్తించుకుంటుంది. తనకు పుట్టుకతో సమాజం ఇచ్చిన పురుష గుర్తింపుకూ, తనలో తాను అనుభవిస్తున్న స్త్రీ అస్తిత్వానికీ మధ్య ఉన్న
అంతరాన్ని తెలుసుకుంటుంది. ఆ అంతరాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది కేవలం దుస్తులు మార్చుకోవడం కాదు. పేరు మార్చుకోవడం కాదు. పురుషుడిగా
కనిపించిన వ్యక్తి స్త్రీగా కనిపించాలనుకోవడం మాత్రమే కాదు. తన గురించి ఇతరులు ఏర్పరచుకున్న అభిప్రాయాలకు భిన్నంగా, తాను నిజంగా ఎవరో ప్రకటించుకోవడం.
ఈ సినిమాలో చెప్పదలుచుకున్న భావజాలం ఎంత ప్రత్యేకమో దృశ్య నిర్మాణం కూడా అంతే ప్రత్యేకం. గతాన్ని రంగుల్లో, వర్తమానాన్ని నలుపు తెలుపుల్లో చూపించే నిర్మాణం
మరీ మరీ ప్రత్యేకం. సాధారణంగా గతాన్ని నలుపు తెలుపుల్లో, వర్తమానాన్ని రంగుల్లో చూపించడం సినిమా సంప్రదాయం. కార్తీక్ సుబ్బరాజ్ దాన్ని తలకిందులు చేసాడు. ఈ
తలకిందులతనానికి ఓ తాత్విక అర్థం ఉండి ఉండవచ్చు. గతం ముగిసిపోయినా జ్ఞాపకాల్లో రంగుల్ని నిలుపుకుంటుంది. వర్తమానం కొనసాగుతున్నా కొన్ని అనుభవాల వల్ల
రంగుల్ని కోల్పోతుంది. ఇక్కడ రంగు కాలాన్ని సూచించడం లేదు. అనుభవాన్ని సూచిస్తోంది. సినిమా మొదటి సగంలోని ఇరుకైన ఫ్రేములు, స్పీడ్ కట్స్, హింసాత్మక దృశ్యాల
నుంచి క్రమంగా విశాలమయే ఫ్రేములు, మెలమెల్లగా కదిలే దృశ్యాల లోకి సినిమా ప్రయాణిస్తుంది. ఇది కేవలం సాంకేతిక మేథస్సు కాదు. పాత్రల అంతర్గత ప్రపంచంలో
జరుగుతున్న పరివర్తనకు దృశ్యరూపం. మనిషి ఆలోచనల్లోని ఇరుకుదనం తొలగినప్పుడు కెమెరా కూడా విశాలమైన ప్రపంచాన్ని చూడటం మొదలుపెడుతుంది. ప్రత్యేకంగా
పొలంలో జరిగే ఘర్షణ దృశ్యం, ఇంట్లో కీర్తి సురేష్ మృతదేహం కనిపించే సన్నివేశాలలోని కెమెరా కదలికలు చిత్ర సాంకేతిక నైపుణ్యానికి ఉదాహరణలు. సినిమా చెప్పే భావాన్ని
సంభాషణలు మాత్రమే మోయనవసరం లేదు. కెమెరా, రంగు, కదలిక, సంగీతం కూడా ఆ భావాన్ని నిర్మించగలవు అనే ముఖ్యమైన సినీ సూత్రాన్ని దర్శకుడు చెపుతాడు.
ఎస్.
తిరునావుక్కరసు ఛాయాగ్రహణం, గణేశ్ శివ ఎడిటింగ్, ఇళయరాజా సంగీతం కథలోని భావోద్వేగ మార్పులను దృశ్యశ్రవణ అనుభవాలుగా మనకు అందిస్తాయి.
డోరతీగా కీర్తి సురేష్ పాత్ర ఈ కథలో కీలకం. ఆమె సుబ్బు జీవితంలోకి ప్రవేశించడం కేవలం కథను మలుపు తిప్పే సంఘటన కాదు. తనలోని అణచివేతకు గురైన స్త్రీ
అస్తిత్వాన్ని సుబ్బు గుర్తించడానికి తోడ్పడే పరిచయం.
ఒక ట్రాన్స్జెండర్ స్త్రీని ఒక పురుషుడు ప్రేమించినప్పుడే ఆమె అస్తిత్వానికి సంపూర్ణత లభిస్తుందనడం, మనం పురాతన పితృస్వామ్యానికి కొత్త ఉదారవాద రూపాన్ని ఇవ్వడమే.
డోరతీ కార్తీ ప్రేమకు ముందే ఒక సంపూర్ణమైన మనిషి. కానీ ఆమె అస్తిత్వానికి నైతిక అర్హతనిచ్చేది అతని ప్రేమ కాదు. ఆమె అస్తిత్వం ఆమెదే. ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడే
ప్రేమ అధికార సంబంధం నుంచి విముక్తి సంబంధంగా మారుతుంది. డోరతీ ఈ గమ్యాన్ని పూర్తిగా చేరుకోకపోయినా, ఆ దిశగా ఒక సాహసో పేత కదలిక.
Share this Article