.
రెండు మూడు రోజుల తెలంగాణ రాజకీయాలు తీరు ఓ క్రమపద్ధతిలో పరిశీలించండి… బీఆర్ఎస్ స్కెచ్‌ను బట్టి బీజేపీ పనిచేస్తోందనీ… రెండు పార్టీలూ పరస్పర సహకారంతో అడుగులు వేస్తున్నాయని అర్థమవుతుంది… ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘రెండు దేహాలు- ఒక ఆత్మ’లా కనిపిస్తున్నాయి…
చాన్నాళ్లుగా అనుకుంటున్నదే… బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదా ఎన్నికల పొత్తు ఏదో ఒకటి తప్పనిసరి అని… ఆ రెండు పార్టీలూ పైకి ‘పొత్తులు గిత్తులు జాన్తానై’ అని చెబుతున్నా… లోలోపల సంప్రదింపులు ఇంకా సాగుతూనే ఉన్నాయి… ఇప్పుడైతే ఆల్రెడీ ‘అవగాహన’ కుదిరినట్టుగానే కదులుతున్నాయి…
Ads
మొన్న ‘సర్’ అక్రమాలపై పోరాటం, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ఎత్తున సభను నిర్వహించింది కదా… సభను ముందుగా బీజేపీ లైట్‌గా తీసుకుంది గానీ సభ విజయవంతం కావడంతో కంగుతిన్నది…
ఈ ‘వోట్ బచావో, దేశ్ బచావో’ సభకు సరైన ప్రచారం దక్కకుండా బీజేపీ అదేరోజు ప్రత్యేక నిరసన మార్చ్ తలపెట్టింది, కానీ అనుకున్నట్టుగా దాన్ని విజయవంతం చేయలేకపోయింది, ఢిల్లీలో బీజేపీ అధికారం ఉండి కూడా..! సరే, కాంగ్రెస్ ఢిల్లీ సభకు తెలంగాణ నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు కదిలాయి… రేవంత్ రెడ్డి కూడా బాగా హైలైట్ అయ్యాడు…
ఇది బీఆర్ఎస్కు తెలుసు… అందుకే ఓ స్కెచ్ వేసింది… కేటీఆర్, హరీష్ రావు డైవర్షన్ టాక్టిక్స్ ప్లాన్ చేశారు… వాళ్లు ఏం బురద చల్లుతున్నా జనం నమ్మడం మానేశారు కదా… ఈసారి గొంతు మారింది… సరిగ్గా నిన్న అమిత్ షా హైదరాబాదులో దిగాడు… మహాపాదయాత్ర పేరిట ఓ ప్రోగ్రామ్… బీఆర్ఎస్ కూడా బాగానే కోఆపరేట్ చేసినట్టుంది…

అమిత్ షా ప్రసంగంలో ఎక్కడా ఒక్క చిన్న ముక్క కూడా బీఆర్ఎస్పైన విమర్శ లేదు… ఈ రాష్ట్రంలో తాము రెండో స్థానంలోకి రావాలన్నా, కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా నిలబడాలని అనుకున్నా బీఆర్ఎస్ మీద కూడా దాడి అవసరం… అది ఎంత తగ్గితే, అది ఇంకెంత దెబ్బతింటే బీజేపీకి కాస్తో కూస్తో ఫాయిదా… కానీ అమిత్ షా కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాడు… తన ప్రసంగంలో ఎంతసేపూ రాహల్, రేవంత్… ఇవే పేర్లు…
ఆర్ఆర్ టాక్స్ అనీ, కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపణలు… సేమ్, అవే మాటలు గతంలో కేసీయార్ మీద చేశారు బీజేపీవాళ్లు… గుర్తుంది కదా… కాళేశ్వరం కేసీయార్‌కు ఏటీఎంలా మారిందని మోదీతో కూడా ఆరోపణలు చేయించారు… ఒకవైపు కేసీయార్ కుటుంబసభ్యుల అక్రమాల పుట్టలు రోజుకొకటి పగులుతున్నాయి…
కానీ బీజేపీ నుంచి నిల్ స్పందన… కాంగ్రెస్‌ను రాజకీయంగా ఎదుర్కోవడం, రేవంత్ రెడ్డి ప్రధానంగా టార్గెట్ కావడం ఓ ప్రతిపక్షంగా బీజేపీకి వోకే… కానీ బీఆర్ఎస్ పదేళ్ల పాలన అక్రమాల్ని ఎలా విస్మరించగలదు..? కేసీయార్ మైనస్ గాకుండా బీజేపీ ఎలా ప్లస్‌లోకి వస్తుంది..? అమిత్ షాకు అన్నీ తెలుసు… ఐనా సరే, బీఆర్ఎస్ పార్టీ మీద ఈగ కూడా వాలలేదు తన ప్రసంగంలో… కారణం… రెండు పార్టీల నడుమ సయోధ్య, పరస్పర సహకారం…
కేసీయార్‌కు ఇప్పుడు అమిత్ షాయే శ్రీరామరక్ష… కాళేశ్వరం, ఫార్ములా వన్, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ అక్రమాలు… విషయం ఏదైనా సరే, కేసీయార్ మీద చిన్న మరక పడకుండా బీజేపీ రక్ష… అందుకే సర్ మీద గానీ, వోట్ చోరీ మీద గానీ, జ్ఞానేశ్ కుమార్ మీద గానీ బీఆర్ఎస్ ఏమీ స్పందించదు… ఇద్దరిదీ ఒకే బాట… నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష..!! ఈ అడుగులు పొత్తు వైపా..? విలీనం వైపా..? లేదా ఎప్పటిలాగే లోపాయికారీ యవ్వారమా..?!
Share this Article