.
చట్టం గానీ, న్యాయం గానీ, ప్రభుత్వం గానీ… కష్టానికి కన్నీళ్లు తుడవాలే తప్ప, కన్నీటిపాలు చేయొద్దు… ఇది కామన్ సెన్స్… పెద్ద పెద్ద సంక్లిష్టతల బాష్యాలు అక్కర్లేదు… పాలక స్థానంలో ఉన్నవారికి కాస్త తడి కూడా ఉండాలి… జగిత్యాల దత్తత కేసులో అధికార యంత్రాంగం చేస్తున్న తప్పు పదే పదే అదే… ఈ మాట అనడానికి కారణం… సదరు జిల్లా కలెక్టర్ హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాడు..? దేనిపై అంటే..?
నిన్న మనం చెప్పుకున్నాం కదా… ఓ పిల్లాడిని ఓ జంట దత్తత తీసుకుంటే, నిర్బంధంగా ఆ పిల్లాడిని స్వాధీనం చేసుకుని, శిశుగృహలో బంధించి… ఆ తల్లిదండ్రులను వేధించి, చివరకు హైకోర్టు దాకా కొట్లాడి, విడుదల కోసం తీర్పు పొందితే, దాన్ని కూడా వెంటనే అమలు చేయకుండా అధికారులు Inhuman గా వ్యవహరించిన తీరు…
Ads
సీఎంవో, సీఎస్ కార్యాలయాల్లో కూర్చున్న వారికి అర్థమవుతుందో లేదో తెలియదు గానీ… ఇలాంటివి ప్రభుత్వం మీద వ్యతిరేక భావనల్ని పెంచడమే కాదు, కీలక సమస్యల్ని వదిలేసి, జనాన్ని అవస్థలపాలు చేసే ఇలాంటి కేసుల మీదే అధికార యంత్రాంగం కాన్సంట్రేట్ చేస్తున్నదని విమర్శించేందుకు చాన్స్ ఇస్తాయి…
అన్నట్టు… ఈ కేసు విషయంతో ముచ్చట ప్రచురించిన ఆర్టికల్ లింక్ ఇదుగో…
హైకోర్టు సూమోటోగా తీసుకుని- కలెక్టర్‌ను అడగాలి అసలు కథేమిటో…
హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కలెక్టర్ అప్పీల్‌కు వెళ్లాడట… ఎందుకు..? ఏం నిరూపించాలని అనుకుంటున్నాడు..? దత్తత హిందూ సంప్రదాయం, పద్థతి ప్రకారమే జరిగింది..? కానీ హిందూ సంప్రదాయం చెల్లదు అని నిరూపించడమా తన ఉద్దేశం..? అసలు తీర్పు అమలు చేయడానికే తాత్సారం చేసి, వేధించి, మళ్లీ ఇప్పుడు కోర్టుకెక్కడం వెనుక ఏముంది అసలు కారణం..? కలెక్టర్‌కు ప్రభుత్వం అనుమతించిందా దీనిపై పోరాడటానికి..?
దత్తత అంత పెద్ద నేరమా, అధికారులు వేటాడటానికి, వెంటాడటానికి..? అంత పాశవికంగా ప్రవర్తించడం దేనికి..? ఎవరో కుటుంబ సభ్యుడు ఫిర్యాదు చేయగానే, ఇక ప్రజల సమస్యలు ఏమీ లేనట్టు దీని మీదే ఇంత శ్రద్ధ దేనికి..? కోర్టులో తేల్చుకొమ్మని ఎందుకు చెప్పలేకపోయారు ఈ అధికారులు..? ఇంకా నయం, దత్తత చెల్లదు, నేరమే అని తల్లిదండ్రులపై కేసు పెట్టలేదు… అక్కడికి సంతోషం…
దత్తత మూడేళ్ల క్రితం చేసుకుంటే, ఇప్పుడు వేధించడం, వేటాడటం దేనికనే ప్రశ్నకు జవాబుల్లేవు… పోనీ, హిందూ సంప్రదాయం చెల్లదు అంటారేమో… హిందూ పద్ధతుల్ని నిరాకరించడం, హిందూ వ్యతిరేక ధోరణి అధికారగణానికి బాగా అలవాటైపోయిందా..? ఓసారి ఈ వివరాలు చూద్దాం…
భారతదేశంలో హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు సంబంధించి దత్తత ప్రక్రియ “హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం, 1956” (Hindu Adoptions and Maintenance Act, 1956) పరిధిలోకి వస్తుంది…
హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకున్న దత్తత చెల్లుతుంది… ఇది చట్టమే చెబుతోంది…
- దత్తత తీసుకునే దంపతులు లేదా వ్యక్తి మేజర్ (18 ఏళ్లు నిండినవారు) అయి ఉండాలి, మానసికంగా స్థిరత్వంతో ఉండాలి…
- దంపతులు దత్తత తీసుకుంటుంటే, భార్యాభర్తలిద్దరి అంగీకారం (Consent) తప్పనిసరి… కన్న తల్లిదండ్రులు మాత్రమే బిడ్డను దత్తత ఇచ్చే హక్కు కలిగి ఉంటారు…
- మగపిల్లాడిని దత్తత తీసుకోవాలంటే, ఆ కుటుంబంలో అప్పటికే కొడుకు గానీ, మనవడు గానీ, మునిమనవడు గానీ (సొంతం లేదా దత్తత) ఉండకూడదు…
- దత్తత తీసుకునే బిడ్డ వయస్సు సాధారణంగా 15 ఏళ్లలోపు ఉండాలి (ఆచారాలు మినహాయింపు ఇస్తే తప్ప)…
-
సాంప్రదాయ క్రతువు (Giving and Taking): హిందూ ఆచారం ప్రకారం బిడ్డను కన్న తల్లిదండ్రులు దత్తత తీసుకునే తల్లిదండ్రులకు “ఇవ్వడం, తీసుకోవడం” (Giving and Taking) అనే ప్రధాన ప్రక్రియ జరగాలి…
దత్తత ప్రక్రియకు సంబంధించిన ఒప్పంద పత్రాన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి… రిజిస్టర్డ్ డీడ్ ఉన్నప్పుడు, చట్టప్రకారం ఆ దత్తత చెల్లుబాటు అయ్యేదిగా భావించబడుతుంది… ఒకసారి చట్టబద్ధంగా దత్తత ప్రక్రియ పూర్తయితే, ఆ బిడ్డకు సొంత పిల్లలతో సమానంగా ఆస్తి, ఇతర అన్ని రకాల న్యాయపరమైన హక్కులు లభిస్తాయి… దత్తతను తర్వాత రద్దు చేయడం లేదా ఉపసంహరించుకోవడం సాధ్యపడదు…
ఈ కేసులో తెలియక కొన్ని లీగల్, టెక్నికల్ అంశాలను ఈ తల్లిదండ్రులు విస్మరించి ఉండొచ్చు… కానీ అదేమీ అంత పెద్ద నేరం కాదు కదా… దత్తత ఫోటోలు ఉంటే రిజిస్ట్రేషన్ పెద్ద కథేమీ కాదు, అది సూచిస్తే సరిపోదా..? ఎందుకు ఇలా ఓ మూడేళ్ల పిల్లాడి మీద పాశవికం..? కాస్త ఎల్‌నినో కష్టాలు పట్టించుకొండి, చాలు… హిందూ సంప్రదాయాల మీద పోరాటం తరువాత చేద్దురు గానీ…!!
Share this Article