.
మెల్లిమెల్లిగా సమాజం మారుతోంది… క్షుద్ర అభిమానంతో సినిమా హీరోలను ఆరాధించే ధోరణి నుంచి రియల్ లైఫ్ హీరోలను ప్రేమించడం ఆరంభించింది… మొన్నటికిమొన్న హైజాకర్‌ను నెత్తురోడుతూ ఎదుర్కున్న స్మిత్ పాన్ వరల్డ్ హీరో అయిపోయాడు… సరే, తనను అభినందిస్తే మైనారిటీ వోట్లు పోతాయనే శుష్కవాదంతో కునారిల్లే కొన్ని పార్టీలను వదిలేస్తే, జాతి తనను జాతీయ హీరోగా అభిమానించింది…
అంతకుముందు వింగ్ కమాండర్ అభినందన్‌ను ఇలాగే అభిమానించింది… ధూర్త పాకిస్థాన్ చెర నుంచి బయటపడాలని ప్రార్థించింది… హీరోగా పరిగణించింది… ఓ విమాన ప్రయాణికుడికి అనుకోకుండా అభినందన్‌ను కలిసే అవకాశం వచ్చినప్పుడు. తనెంత ఆనందోద్వేగానికి గురయ్యాడో తనే చెప్పుకున్నాడు… అదేమిటో ఈ సోషల్ పోస్టులో చదువుదాం…
Ads
ఆకాశంలో ఎదురైన అపరిమిత గర్వం: వింగ్ కమాండర్ అభినందన్‌తో ఒక అనిర్వచనీయ క్షణం…
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి గోవా వైపు రెక్కలు విప్పుకున్న Fly91 ATR-72 విమానంలో వాతావరణం ఎప్పటిలాగే సాధారణంగా ఉంది. సీటు బెల్టుల శబ్దాలు, ప్రయాణికుల సన్నటి సంభాషణలు, కిటికీ వెలుపల తేలియాడే మేఘాలు… మధ్యలో జల్గావ్లో ఒక చిన్న విరామం. అంతా మామూలు దినచర్యలాగే సాగిపోతోంది.
మూడో వరుస సీటులో కూర్చున్న ఆ దంపతులకు అది ఒక విహారయాత్ర మాత్రమే. కానీ, విమానం ల్యాండింగ్‌కు చేరువవుతున్న వేళ ఎయిర్ హోస్టెస్ స్పష్టమైన స్వరంతో చేసిన ఆ ప్రకటన వారి ప్రపంచాన్ని ఒక్కసారిగా స్తంభింపజేసింది… వాళ్లకు అది అనూహ్యం…
“ఈరోజు మన విమానాన్ని నడిపిన కెప్టెన్… వీరచక్ర గ్రహీత, గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్!”
ఆ పేరు వినగానే ప్రయాణికుడి గుండె ఒక క్షణం ఆగినంత పనైంది. 2019 ఫిబ్రవరి నాటి ఆ చారిత్రక ఘట్టం కళ్లముందు కదిలింది. మిగ్-21 బైసన్ విమానంలో శత్రుదేశపు ఎఫ్-16ను కూల్చివేసి, నింగిలోనూ నేలపైనా భరతమాత ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టిన ఆ ధీరుడు… సరిగ్గా తమ కాక్‌పిట్‌లోనే, కొద్దిపాటి దూరంలో ఉన్నారనే నిజం అతనిలో విపరీతమైన ఆరాటాన్ని నింపింది.
కాక్‌పిట్ యంత్రాలను చూడాలనే కుతూహలం అతనికి లేదు. కేవలం దేశానికి గుండెధైర్యాన్ని నేర్పిన ఆ వీరుడికి ఒక్కసారి చేతులు జోడించి నమస్కరించాలి… అంతే! ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత, ఆ కాంక్షను క్రూ సిబ్బందికి తెలియజేశాడు. కాసేపటికి ఫస్ట్ ఆఫీసర్ చిరునవ్వుతో బయటకు వచ్చి “కాక్‌పిట్ చూస్తారా?” అని అడిగినా, “నాకు కాక్‌పిట్ అక్కర్లేదు సార్, కెప్టెన్ అభినందన్ గారిని ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలి” అని మనస్ఫూర్తిగా సమాధానమిచ్చాడు.
ఆ మాటల్లోని ఆర్ద్రత సిబ్బందిని కదిలించింది. ల్యాండింగ్ పూర్తయ్యాక టార్మాక్ (రన్‌వే) వద్ద కలుస్తానని కెప్టెన్ స్వయంగా కబురు పంపాడు. విమానం దిగి టార్మాక్ వద్ద నిలబడి ఎదురుచూస్తున్న ఆ క్షణాలు శతాబ్దాల్లా అనిపించాయి. అంతలోనే… నిరాడంబరమైన యూనిఫాంలో, ప్రశాంతమైన నడకతో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నడుచుకుంటూ వచ్చాడు… తెలుసు కదా, తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీడి ప్రైవేటు విమాన సర్వీసులో కెప్టెన్‌గా చేరాడు…

ఆ పాత వీరప్పన్ మీసాల్లేవు… తనను చూసిన ప్రయాణికుడు ఆనందంతో ముందుకు వంగి, తడబడుతున్న గొంతుతో తనను, తన భార్యను పరిచయం చేసుకుంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు… కానీ, ఆ చేతి స్పర్శ తగలగానే అతనిలోని భావోద్వేగాలు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. శత్రువు ముందు కొండంత ధైర్యంతో నిలబడిన దేశ వీరుడు తన ముందే నిలబడి ఉన్నాడనే గర్వం, గౌరవం అతని కాళ్లను వణికించాయి. కళ్ల నుంచి ఆనందబాష్పాలు ధారాపాతంగా జారాయి. కాళ్లపై పడబోయాడు.
సరిగ్గా అప్పుడే ఆ అసలైన హీరో నిరాడంబరత వెలుగు చూసింది. తన చేతిలో ఉన్న క్యాబిన్ బ్యాగ్‌ను వెంటనే కిందపెట్టి, ఆ ప్రయాణికుడి భుజాలు పట్టుకుని పైకి లేపాడు అభినందన్. ఏమాత్రం హడావుడి లేకుండా, ఎంతో ఆప్యాయంగా ఆ ప్రయాణికుడిని తన గుండెలకు హత్తుకున్నాడు. ఆపై ప్రయాణికుల బస్సులోనూ, లగేజ్ బెల్ట్ దగ్గర సామాన్లు తీసుకునే సమయంలోనూ… ఒక ఇంట్లో మనిషిలా, ఎంతో ఆత్మీయంగా ముచ్చటించాడు.
సైనిక దుస్తులు మారినా, పౌర విమానయాన రంగానికి వచ్చినా… గుండెల్లోని దేశభక్తి, తోటి భారతీయుడి పట్ల చూపించే గౌరవం ఏమాత్రం మారవని ఆ క్షణం రుజువైంది. ఒక సామాన్య ప్రయాణికుడి జీవితంలో అది ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం!
అర్థమైంది కదా... ఎవరిని హీరోలుగా ప్రేమించాలో... ఎవరు రియల్ హీరోలో...
ఒక సైంటిస్టు, ఒక వింగ్ కమాండర్, ఒక ఎంటర్‌ప్రెనూర్, ఒక ప్రజాసేవకుడు.... అంతేగానీ పగటి వేషగాళ్లు కాదు
Share this Article