Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు? ఎన్సీపీ వర్గాల పునఃకలయిక?

November 8, 2026 by M S R

.

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఎన్‌సీపీ విలీనంపై చర్చలు!
శరద్ పవార్ – ప్రఫుల్ పటేల్ ఆసుపత్రి భేటీతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ మధ్య జరిగిన భేటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అందులో శరద్ పవార్, “నవంబర్ 10వ తేదీ తర్వాత ఇద్దరం కలిసి కూర్చుందాం” అనగా, ప్రఫుల్ పటేల్ అందుకు అంగీకరిస్తూ ఆ తర్వాత ముంబైలోనే ఉంటానని చెప్పడం స్పష్టంగా వినిపించింది. ఇది కేవలం ఆరోగ్య పరామర్శే కాదని, రాజకీయ చర్చల కోసమేనని సంకేతాలు ఇస్తోంది. తరువాత దీన్ని ప్రఫుల్ పటేల్ ధృవీకరించారు.

Ads

ఈ భేటీపై ఆసక్తి పెరగడానికి కారణాలు ఇవే… 
➡️ పుణెలో చికిత్స అనంతరం శరద్ పవార్ ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉన్నారు.
➡️ అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్రా పవార్ అజిత్ వర్గ పార్టీ అధ్యక్షురాలిగా, డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. కానీ, ఆమె పెద్ద కొడుకు పార్థ్ పవార్ రాజకీయ జోక్యం, ఆధిపత్యం పెరుగుతుండటంపై ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్ వంటి సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. నవంబర్ 2న ప్రఫుల్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సీనియర్ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీకి సునేత్రా పవార్, పార్థ్ పవార్‌లకు ఆహ్వానం లేకపోవడం లేదా వారు హాజరుకాకపోవడం పార్టీలో పెద్ద చీలికను సూచిస్తోంది. పార్థ్ పవార్ వైఖరి నచ్చకే సీనియర్ నేతలు మళ్లీ శరద్ పవార్ వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల సమాచారం.

➡️ ఎన్‌సీపీ (అజిత్ పవార్ వర్గం), ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) విలీనంపై చాలాకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
రెండు ఎన్‌సీపీల విలీనంపై మళ్లీ వేడెక్కుతున్న చర్చలు!

sharad pawar

మీడియా వర్గాల సమాచారం ప్రకారం…
➡️ సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ నేతృత్వంలోని వర్గం రెండు ఎన్‌సీపీల విలీనాన్ని గట్టిగా కోరుకుంటున్నారు. అప్పటివరకు విలీన వార్తలను ఖండిస్తూ వచ్చిన ఎన్‌సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే నవంబర్ 6న సరికొత్త ప్రకటన చేశారు. “అజిత్ పవార్ (2026 జనవరిలో విమాన ప్రమాదంలో మరణించారు) బతికే ఉంటే, రెండు ఎన్‌సీపీ వర్గాల విలీనం ఈ ఏడాది ఫిబ్రవరి 12 నాడే పూర్తయ్యేది” అని ఆయన అంగీకరించారు. అజిత్ పవార్ స్వయంగా విలీన ఫార్ములాను తనకు వివరించారని ఆయన పేర్కొనడం విశేషం.
➡️ అయితే సునేత్రా పవార్, పార్థ్ పవార్ మాత్రం ఈ విలీనానికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

➡️ ఇటీవల సీనియర్ నేతలు అమిత్ షాను కలిసినప్పుడు సునేత్రా, పార్థ్ పవార్ గైర్హాజరు కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
➡️ పార్లమెంట్‌లో తన సంఖ్యాబలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావిస్తుండగా, విలీనం జరిగితే పార్టీలో తమ ఆధిపత్యం తగ్గిపోతుందనే ఆందోళన సునేత్రా– పార్థ్ వర్గంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అసలు రాజకీయ సమీకరణాలు ఏమిటి?
ఒకవైపు పార్లమెంట్‌లో సంఖ్యాబలం పెంచుకోవాలనే బీజేపీ వ్యూహం.. మరోవైపు ఎన్‌సీపీలో ఆధిపత్య పోరు.. ఇంకోవైపు శరద్ పవార్ రాజకీయ నిర్ణయం!
అధికారికంగా రెండు పార్టీల విలీన అంశానికి తెరపడిందని చెబుతున్నప్పటికీ, అనధికారికంగా మాత్రం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ రెండు ఎన్‌సీపీ వర్గాల (సునేత్రా పవార్ నేతృత్వంలోని NCP, శరద్ పవార్ నేతృత్వంలోని NCP-SP) విలీనం గనుక జరిగితే, కేంద్ర , రాష్ట్ర స్థాయిలలో పార్టీ లోపల అధికార సమీకరణాలు, పదవుల పంపకం ఏ విధంగా ఉండబోతుందనే దానిపై రాజకీయ విశ్లేషకులు, అంతర్గత వర్గాల ఫార్ములా ఆధారంగా ఒక స్పష్టమైన అంచనా ఉంది.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న , గతంలో అజిత్ పవార్ బతికున్నప్పుడు చర్చల్లోకి వచ్చిన అధికార పంపిణీ ఫార్ములా వివరాలు ఇవే…
1. కేంద్ర స్థాయిలో అధికార పంపకం…
కేంద్రంలో ఎన్‌సీపీ తన ఉనికిని చాటుకోవడానికి, సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి పటిష్టమైన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. విలీనం తర్వాత లోక్‌సభలో పార్టీ బలం 9 ఎంపీలకు చేరుతుంది.
– NDA కూటమిలో చేరిక & కేంద్ర మంత్రిపదవులు: ఈ విలీనం ద్వారా శరద్ పవార్ వర్గం కూడా NDA కూటమిలోకి వస్తుంది. ఇందుకు బదులుగా కేంద్ర క్యాబినెట్‌లో ఎన్‌సీపీకి రెండు కీలక కేంద్ర మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది.
– శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఢిల్లీలో పార్టీకి ప్రధాన ముఖచిత్రంగా మారనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఆమెకు కీలక మంత్రి పదవి లేదా లోక్‌సభలో ఎన్‌సీపీ పక్ష నేత బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.
• ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా, సీనియర్ నేతగా ఉన్న ప్రఫుల్ పటేల్ కేంద్రంలో పార్టీ సమన్వయకర్తగా లేదా కేంద్ర మంత్రిగా తన పట్టును నిలుపుకోనున్నారు. గతంలో ఈయన కేంద్ర మంత్రిగా చేశారు.

2. మహారాష్ట్ర రాష్ట్ర స్థాయిలో అధికార పంపకం…
రాష్ట్రంలో ప్రస్తుతం శివసేన (షిండే వర్గం), బీజేపీతో కలిసి సునేత్రా పవార్ ‘మహాయుతి’ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. విలీనం తర్వాత అసెంబ్లీలో ఎన్‌సీపీ బలం 51 మంది ఎమ్మెల్యేలకు పెరుగుతుంది.
• రాష్ట్ర అధ్యక్ష పదవి : పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరచడానికి జనాదరణ కలిగిన నాయకుడు, ఎంపీ అయిన అమోల్ కోల్హేను ఎన్‌సీపీ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే ఫార్ములా చర్చల్లో ఉంది.
• ప్రస్తుతం సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. విలీనం తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో తమకు కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ దక్కాలని సునేత్రా పవార్ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది.
• శరద్ పవార్ వర్గంలోని యువనేత రోహిత్ పవార్కు రాష్ట్ర క్యాబినెట్‌లో గానీ, లేదా పార్టీలో గానీ కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.

3. పార్టీ సంస్థాగత నియంత్రణ…
అధికార పంపిణీతో పాటు పార్టీపై పట్టు కోసం అంతర్గతంగా పెద్ద చర్చే నడుస్తోంది.
• జాతీయ అధ్యక్ష పదవి : పార్టీ జాతీయ అధ్యక్ష పదవి తమ వర్గానికే (సునేత్రా పవార్ లేదా వారి కుటుంబ సభ్యులకు) దక్కాలని అజిత్ పవార్ క్యాంప్ కోరుకుంటోంది. అయితే శరద్ పవార్‌ను పార్టీకి సుప్రీం లీడర్‌గా లేదా మార్గదర్శకుడిగా ఉంచుతూ, కూతురు సుప్రియా సూలేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.
• సీనియర్ నేతల భద్రత: ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్ వంటి సీనియర్ నేతలు.. పార్థ్ పవార్ ఒంటెద్దు పోకడల వల్ల తమ ప్రాధాన్యత తగ్గిపోకుండా ఉండేందుకే, అందరికీ సమాన ప్రాధాన్యత ఉండేలా సమిష్టి నాయకత్వ ఫార్ములాను తెరపైకి తెస్తున్నారు.

విలీనం జరిగితే కేంద్రంలో సుప్రియా సూలే – ప్రఫుల్ పటేల్ చక్రం తిప్పనుండగా, రాష్ట్రంలో సునేత్రా పవార్ వర్గం, రోహిత్ పవార్, సీనియర్ నేతల మధ్య మంత్రిపదవులు, పార్టీ బాధ్యతల సమతుల్యత ఉండేలా అధికారాన్ని పంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నవంబర్ 10 తర్వాత శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ భేటీలో ఏం తేలనుంది? రెండు ఎన్‌సీపీలు మళ్లీ ఒక్కటవుతాయా? లేక మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త కూటమి సమీకరణం తెరపైకి వస్తుందా?
— ఉపద్రష్ట పార్ధసారధి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు? ఎన్సీపీ వర్గాల పునఃకలయిక?
  • పది భారీ సైలోలు… ఆహారధాన్యాల నిల్వపై రేవంత్ ప్రభుత్వ కొత్త ఆలోచన భేష్…
  • కాలిపోయేది మా పర్సులు..! నీ గల్లాపెట్టె నిండకపోతే మాదా తప్పు..?!
  • సమాజం మారుతోంది- రియల్ హీరోలు ఎవరో గుర్తించి ప్రేమిస్తోంది !
  • రణ్‌బీర్‌ నోట తెలుగు పలికింది! బ్రహ్మ AI నేర్పిన ‘డబ్బింగ్ కళ !!
  • రాముడు తనే- సీత తనే..! మాటల్లేవ్… టాకీసులోనే లైవ్ బీజీఎం..!!
  • …. చివరకు మంత్రి ‘అక్షింతల’తో దత్తత వివాదానికి శుభం కార్డ్..!!
  • ఈ సీరియల్ కిల్లర్ ఓ క్రైమ్ రిపోర్టర్ – ఆ పత్రికకు ఎడిటర్- పబ్లిషర్…
  • ఈ ‘రామయణం’లో నాకు నచ్చిన నటుడు- వివేక్ విద్యుత్‌జిహ్వుడు!!
  • ఏం తక్కువైంది రెహమాన్ నీకు..? ఎందుకు ఈ సాకులు, ఈ శోకాలు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions