.
బాగా డబ్బు చేసిన వాళ్ల కొడుకులు సినిమా హీరోలు కావాలని తాపత్రయపడటం సహజమే కదా… మరో కుర్రాడు కొత్తగా లాంచ్ అవుతున్నాడు… చాలామంది వస్తుంటారు, పోతుంటారు, కొందరు మాత్రమే నిలబడతారు… సరే, ఈ కొత్త కుర్రాడి సినిమాను ఏకంగా నాగార్జున సమర్పించాడు… రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్ ప్రమోషన్… ఛలో, భీష్మ సినిమాల దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాత… బాగా హైప్ క్రియేటైంది…
అబ్బో, ఓ కొత్త కుర్రాడికి ఇంత హైప్ ఏమిటి..? అసలు ఎవరు ఈ కొత్త కుర్రాడు అనీష్ రెడ్డి..? చాలామంది రాశారు… ఇతను ప్రముఖ వ్యాపారి ఎఎంఆర్ గ్రూపు ఓనర్ ఎ.మహేశ్ రెడ్డి కొడుకు అని… హైదరాబాద్ కేంద్రం… మైనింగు, కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రా రంగాల్లో పెద్ద గ్రూపే… బిగ్ షాట్… నాగార్జునతో గతంలో రెండు సినిమాలు కూడా తీశాడు ఎఎంఆర్… అందుకే నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించాడు, సత్సంధాల నేపథ్యంలో… ఉప్పల మహేశ్ దర్శకుడు…
Ads
కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్నాడు కాబట్టి బాగా ఖర్చు పెట్టారు… థమన్ కంపోజర్, అనస్వర రాజన్ హీరోయిన్… టైటిల్ ‘ఇట్లు అర్జున… ఈ ఎఎంఆర్ గురించి ఈమధ్యే కొన్ని వార్తలు చదివినట్టు గుర్తు, ఏమిటబ్బా అని వెనక్కి తిరిగి చూస్తే… మొన్నటి సెప్టెంబరులోనే ఈడీ ఈ గ్రూపు హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోని కార్యాలయాలు, మహేష్ రెడ్డి నివాసాలపై సోదాలు నిర్వహించింది…
ఆరోపణ… కోల్‌కతాకు చెందిన SREI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ (SIFL), SREI ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ (SEFL) సంస్థల నుండి తీసుకున్న భారీ రుణాలను (సుమారు ₹1,111 కోట్ల మేర ఎగవేత ఆరోపణలు) తిరిగి చెల్లించకపోవడంపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది…
రుణాల రూపంలో తీసుకున్న నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం (Diversion of funds), రౌండ్ ట్రిప్పింగ్ (Round-tripping) వంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ దాడుల్లో భాగంగా పలు విలాసవంతమైన కార్లను, కీలక ఆర్థిక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు ₹6.35 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేసింది…

సినిమా కథ కూడా ఇలాంటిదే దాదాపు… 1000 కోట్ల హవాలా డబ్బు, ఓ పెన్ డ్రైవ్, దానికి ఓ పాస్‌వర్డ్… అది హీరో మెడకు పడుతుంది… సమాంతరంగా హీరోకు ఓ ప్రేమకథ… లేకపోతే తెలుగు సినిమాల్లో కుదరదు కదా… పైగా కొత్త హీరో అంటే ఫైట్లు, డాన్సులు గట్రా చేయాల్సిందే కదా, బాగానే కష్టపడ్డాడు అనీష్… పర్లేదు, కాకపోతే మొహంలో ఎమోషన్స్ పలకడం లేదు, కొత్త కదా, అనుభవం వస్తే సర్దుకుంటుంది, అసలు పెద్ద పెద్ద తోపు హీరోలకే చేతకావడం లేదు, తనను తప్పుపట్టొద్దు, తప్పుపడితే తప్పు…
హీరోకు ఏదో ఓ మైనస్ పాయింట్ ఉండటం ఓ ట్రెండ్ కదా… రంగస్థలం నుంచీ… ఇందులో హీరోకు మాటలు రావు… తెలుగు హీరో అంటే ఖచ్చితంగా చిన్నాచితకా దొంగతనాలు గట్రా చేసే జులాయి కేరక్టర్ అయి ఉండాలనేది కూడా ఓ దిక్కుమాలిన ట్రెండే కదా… సేమ్… కాకపోతే సినిమాలో చాలావరకు లాజిక్‌రాహిత్యాలున్నా సరే, కొత్త హీరోను లాంచ్ చేస్తున్నాం కదాని భారీ ఎలివేషన్లు, ఫేక్ ఇమేజ్ బిల్డింగ్ జోలికి పోలేదు పెద్దగా… హీరోయిన్ అందంగా ఉంది, నటించే స్కోప్ ఏమీ రాలేదు పాపం…
కామెడీ అస్సలు వర్కవుట్ కాలేదు… రాను రాను వెన్నెల కిషోర్ మొహం చూసీ చూసీ మొనాటనీ వచ్చేస్తోంది… థమన్ కూడా పెద్దగా కష్టపడకుండా ఓజీ, సాహో బీజీఎం దింపేశాడు… మొత్తానికి సినిమా మరీ తీసిపారేసేది ఏమీ కాదు… మరీ థియేటర్లకు ఉరకాల్సిన పనీ లేదు, ఓటీటీలో వచ్చేదాకా ఆగినాా పర్లేదు..!!
Share this Article