.
Mohan Goteti …. 1976 జూన్ నెల..
రాఘవేంద్రరావు గారి ‘జ్యోతి’ సినిమా మ్యాటినీకి వెళ్లాను.
టైటిల్స్ పూర్తయ్యాయి..
కథ సీరియస్ గా మొదలైంది..
ఇంటి తలుపు తోసుకుంటూ.. ఓ అమ్మాయి బాగా చనువున్న దానిలా లోపలికి వచ్చేసింది.
కూర్చుని సైకిల్ తుడుచుకుంటున్న పెద్దాయన రాజయ్య తలపైకెత్తి.. కళ్లద్దాల పైనుంచి చూశారు..
ఎదురుగా అందమైన యువతి..
ఆమె భుజానికి ఓ బ్యాగ్..
“రాజయ్య గారంటే మీరే కదండీ?” అంటూ అడిగింది.
“ఆ.. ఆ..” అన్నారాయన, ఆమె ఎవరో.. ఏమిటో..అర్థంగాక అదోలా చూస్తూ..
ఆమె అక్కడే వున్న చాప పరచుకుని కూర్చుని.. మంచి నీళ్లు అడిగింది.
ఆయన లేచే లోపే .. తనే లేచి వెళ్లి తాగి వచ్చింది..
ఆమె ఎందుకు వచ్చిందో అర్థంగాక “ఏమ్మా.. మా అమ్మాయి కోసమా.. తను బయటకు వెళ్లింది” అన్నారాయన.
“లేదు మీ కోసమే” అంది .
ఆయనకేమీ అర్థంగాక .. “ఎందుకు.. నాతో పనేమిటమ్మా?” అన్నారు.
Ads
“మీ సహాయం కోసం వచ్చాను” అంది.
“ఏమిటి.. చెప్పమ్మా?” అన్నారాయన.. కంగారుపడుతూ..
“మాట తప్పరు కదా?” అంది ఆయన కళ్లలోకి చూస్తూ.
ఏం జరుగుతోందో ఆయనకు అర్థం కాలేదు..
“ఆ.. ఆ ” అన్నారాయన.
“మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?” అనడిగింది..
ఆ మాటకి ఆ పెద్దాయన అదిరిపడ్డాడు..
కింది భూమి కంపించినట్టయింది..
“ఏమిటమ్మా.. ఏమిటి.. నువ్వంటున్నది..” అన్నారు తడబడుతూ.. కళ్లజోడు సవరించుకుంటూ.. ఆదుర్దా చెందుతూ..
“వేళాకోళం ఆడడానికి నీకు నేను తప్ప మరెవరూ దొరకలేదామ్మా?” అనడిగారు.
“లేదండీ .. నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి” అంది.
ఆయన మళ్లీ అదిరిపడ్డాడు..
ఆయనే కాదు.. అదంతా అబద్ధమని తెలిసినా.. థియేటర్లో సినిమా చూస్తున్న నేను.. నాతో పాటు పక్కనున్న ప్రేక్షకులు కూడా అదిరిపడ్డారు..
ఇదెక్కడి కథరా బాబూ అనుకున్నామంతా ఒక్కసారిగా..
అందరం ఏం జరుగుతుందా? అని ఊపిరిబిగబట్టి చూస్తున్నాం..
కూర్చున్న వాడల్లా రాజయ్య పైకి లేచి “నీకేమైనా మతిపోయిందా .. ఏమిటీ అర్థం లేని మాటలు?” అన్నాడు కాస్త సీరియస్ గా.
“లేదండీ.. మీ కోసమే అందర్నీ వదులుకుని వచ్చేశాను” అంది ఖరాఖండీగా .
“ఏవో ట్యూషన్లు చెప్పుకుని బతుకుతున్నాను.. నీ ఈడు పిల్ల వుంది నాకు.. పైగా ‘పెళ్లాం లేచిపోయిన రాజయ్య’ అనే బిరుదుతో చావలేక బతుకుతున్న దౌర్భాగ్యుడ్ని” అన్నాడు నిస్సహాయంగా..
అలా అంటున్నప్పుడు ఆయన ముఖంలోని హావభావాలు.. ఆయన వాచకంలోని వైవిధ్యం చూసితీరాలి.
ఆ అభినయానికి హ్యాట్సాఫ్ చెబుతాం..
ఇక్కడ రాజయ్యగా ప్రముఖ నటుడు గుమ్మడి.. ఆ అమ్మాయిగా జయసుధ కనిపిస్తారు.
ఆ వయసులో గుమ్మడి గారికి అదొక చాలెంజింగ్ పాత్ర!
ఆయన అభినయం గురించి చెప్పేదేముంది?
ఆ పాత్రలో సహజంగానే జీవించేశారు..
ఇలాంటి పాత్రలు ఎన్నో అవలీలగా పోషించిన అనుభవం ఆయనది!
ఇదొక లెక్కా ఆయనకి..?

అసలు 1950లో ‘అదృష్టదీపుడు’ సినిమాలో విలన్ పాత్ర ద్వారా పరిచయమైన గుమ్మడి గారు పోషించని పాత్ర అంటూ ఏదైనా ఉందా?
అసలు గుమ్మడి గారిది హీరో మెటీరియల్..
మంచి స్పురద్రూపి.. మంచి పర్సనాలిటీ..
వెండితెరకు మంచి అందగాడైన మరో హీరో దొరికాడనుకున్నారంతా..
అయితే.. విధి ఆయనను మరోలా తీసుకువెళ్లింది!
అందుకు ఆయనేమీ దిగాలు చెందలేదు.
వచ్చిన అవకాశాలను మహాప్రసాదంలా భావించారు.
హీరోగా ఎదిగి.. రాణించవలసిన ఆ నటుడు తండ్రిగా.. అన్నగా.. విలన్ గా.. రకరకాల పాత్రలు పోషించేశారు.
చారిత్రకాలు, పౌరాణికాలు.. ఎన్నో చేసేశారు.
‘మహామంత్రి తిమ్మరుసు’లో తిమ్మరుసుగా.. ‘సంపూర్ణ రామాయణం’లో దశరథుడిగా.. ‘మాయాబజార్’లో బలరాముడిగా.. ‘హరిశ్చంద్ర’లో విశ్వామిత్రుడిగా.. ‘సతీతులసి’లో జలంధరుడిగా.. ఎన్ని పాత్రలు! ఎన్ని వైవిధ్యాలు! ఎంతటి అభినయం!
విశేషం ఏమిటంటే, మొదటి నుంచీ చిన్న వయసులోనే పెద్ద వయసు పాత్రలు జనరంజకంగా పోషించి మెప్పించిన మహా నటుడు గుమ్మడి!
పాతికేళ్ల వయసులో ఏఎన్నార్ గారికి తండ్రిగా .. తనకంటే సుమారు పదేళ్లు పెద్దయిన శాంతకుమారి గారికి భర్తగా అద్భుతంగా నటించి సెభాష్ అనిపించుకున్న నటుడాయన.
ఓ మంచి ‘సినిమా తండ్రి’ అంటే మనకి ఆయనే గుర్తొస్తారు..
గుండెపోటు వచ్చిన తండ్రి అన్నా ఆయనే గుర్తొస్తారు..
తన పాత్రల ద్వారా.. తన అద్భుతమైన వాచకం ద్వారా.. ప్రేక్షకుల్ని నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా.. ఆయనకే చెల్లింది!
గుమ్మడిగారితో మద్రాసులో ఉన్నప్పటి నుంచీ నాకు పరిచయం వుంది.
ఎక్కడ కనిపించినా.. నవ్వుతూ పలకరించేవారు..
ఎంతో పరిచయం వున్న చిన్న వాళ్లని సైతం ‘మీరు’ అంటూనే సంబోధించేవారాయన.
ఆయనను చాలా సార్లు ఇంటర్వ్యూ చేసినప్పటికీ.. 2001లో మా ‘సితార’ రజతోత్సవ సంచికకు చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా ఇష్టం.
అందులో చాలా విషయాలు చెప్పుకొచ్చారు.
మీకు సవాలుగా నిలిచిన సినిమాలు ఏవి? అనడిగితే.. “చాలా ఉన్నప్పటికీ ‘రాజమకుటం’ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఓపక్క కన్నాంబ గారు.. మరోపక్క రామారావుగారు.. వారిద్దరి మధ్య చేయగలగడం సవాలే నాకు. అలాగే ‘మహామంత్రి తిమ్మరుసు’! ఓపక్క రాయలుగా రామారావు గారు వుండగా, ఆయనకు ఏమాత్రం తగ్గకుండా చేయాల్సిన పాత్ర. అదీ కష్టమైనదే. అలాగే ‘రహస్యం’లో శ్రీకాంత ప్రభు పాత్ర. అటు ఎస్వీ రంగారావు గారితో పోటీ పడుతూ నటించాల్సి వచ్చింది. చెప్పుకుంటే, అలా చాలా పాత్రలు వున్నాయి” అంటూ చెప్పుకొచ్చారు.
ఎస్వీ రంగారావు గారంటే గుమ్మడి గారికి చాలా ఇష్టం.. ఆయన నటనను ఎంతో అభిమానిస్తారు.
అయితే, రంగారావు గారు మొదట్లో తనని అపార్థం చేసుకున్నారని, తాను ఆయనకు ప్రత్యర్థినని భావించి తనతో ముభావంగా వుండేవారనే గుమ్మడి గారు చెప్పుకొచ్చారు.
అయితే, ఒకసారి ఇద్దరూ తెలుగువారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లారు.
అక్కడ గుమ్మడి గారు వేదికపై మాట్లాడుతూ, “రంగారావు గారు తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం. ఆయనకు మాత్రం దురదృష్టం. మహానటులు పృథ్వీరాజ్, ఓంప్రకాష్, ప్రేమనాథ్, అశోక్ కుమార్.. వీళ్లందర్నీ కలిపితే ఒక రంగారావుగారు అవుతారు” అంటూ మనస్పూర్తిగా ప్రశంసించగానే.. సభికులంతా క్లాప్స్ కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారట.
వెంటనే వేదికపైనే వున్న రంగారావుగారు లేచి వచ్చి.. గుమ్మడి గారిని ఆలింగనం చేసుకుని, “నేనంటే మీకు ఇంతటి ప్రేమ ఉందా? ఇన్నాళ్లూ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను” అంటూ ఆనందబాష్పాలు రాల్చారట.
ఎదురుగా మనకి సరైన ప్రత్యర్థి ఉన్నప్పుడే మనం ఒళ్లు దగ్గర పెట్టుకుని నటిస్తామంటారు గుమ్మడి.
రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్లాక నాగేశ్వరరావు గారికి సరైన ప్రత్యర్థి లేనట్టే.. రంగారావు గారు పోయాక తనకీ ప్రత్యర్థి లేకుండా పోయారని గుమ్మడి వాపోయారు.
రంగారావు గారి భౌతిక కాయాన్ని చూస్తూ .. ప్రభాకర రెడ్డి గారు పక్కనే వున్న గుమ్మడి గారిని వాటేసుకుని.. “రంగారావు గారు మిమ్మల్ని ఒంటరి వాడిని చేసి వెళ్లిపోయారు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట.
“ఆ ఒంటరివాడ్ని అన్న పదానికి అసలైన అర్థం నాకు కాలక్రమంలో తెలిసొచ్చింది” అన్నారు గుమ్మడి.. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ.
గుమ్మడి గారు సాహిత్యాభిమాని.. పలువురి రచనలు చదివేవారు.. ముఖ్యంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారంటే మహా ఇష్టం.
ఆ ఇష్టం, ఆ అభిమానంతోనే తన ఆడ పిల్లలు ఇద్దరికి ఉదయశ్రే, విజయశ్రీ అన్న పేర్లు పెట్టుకున్నారు.
తెల్లటి పంచె.. లాల్చీలో తళతళా మెరిసిపోతూ కనిపించే గుమ్మడి గారు సహృదయుడు.
తన ఇంటికి ఎవరు వచ్చినా మంచి ఆతిథ్యం ఇచ్చి పంపించేవారు.
సాయంకాలాలైతే ఇక చెప్పేక్కర్లేదు!
జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి లాన్ స్నేహితులతో కళకళ లాడుతూ.. సందడి సందడిగా వుండేది!
కాస్త పరిచయం వున్న వాళ్లు ఎవరైనా వచ్చి .. కష్టాలలో వున్నాను అంటే చాలు.. కరిగిపోయేవారు.. “ఇంకేం చెప్పద్దు” అంటూ లోపలికి వెళ్లి.. కావలసిన డబ్బు తెచ్చి ఇచ్చి పంపించేవారు.
అలాంటి ఆయన మంచితనాన్ని కొందరు మోసం చేసి.. దుర్వినియోగం చేసిన సందర్భాలూ వున్నాయి.
గుమ్మడి గారు మంచి హాస్యచతురత వున్న మనిషి కూడా..
చాలా జోకులు వేసి నవ్వించేవారు..
ఒక్కోసారి తనమీద తనే జోకులు వేసుకునేవారు..
అలాంటిదే ఒక సంఘటన..
1943లో నాగయ్యగారు చేసిన ‘భక్తపోతన’ చిత్రాన్ని మళ్లీ 1966లో గుమ్మడి గారు చేశారు.
అయితే, నాగయ్య గారి సినిమాకు వచ్చినంత పేరు, ఆదరణ గుమ్మడి గారి సినిమాకు రాలేదు.
దీని గురించి ఓసారి నాగయ్య గారితో చెబుతూ “మీరు చేసిన భక్తపోతన సినిమా చూసి గోవుల కాపరి అయిన కుర్రాడు ముమ్మిడివరం బాలయోగి అయ్యారు. అదే ఆయనకు నా సినిమా చూపిస్తే తపస్సులోంచి బయటకు వచ్చేస్తారు.. మీ అభినయానికి, నా అభినయానికి అంత తేడా వుంది” అన్నారట గుమ్మడి గారు నవ్వేస్తూ.
దానికి నాగయ్య గారు నవ్వాపుకోలేకపోయారట!
అదీ గుమ్మడి గారి స్పోర్టివ్ నెస్!
అదీ గుమ్మడి గారి నిజాయతీ!
అదీ ఆ మహానటుడి అసలైన వ్యక్తిత్వం!
-మోహన్ గోటేటి
Share this Article