.
ఒక సినిమా హిట్ అయితే అభినందించాలి.. మరో సినిమా ఫ్లాప్ అయితే విమర్శించాలి. అంతేకానీ, ఒకే ఒక్క విజయంతో హీరో అయిపోయాడని, ఇంకో సినిమా రాకపోతే అతడెవరో కూడా గుర్తుండడని ఎగతాళి చేయడం దేనికి సంకేతం? ‘లిటిల్ హార్ట్స్’తో హీరోగా పరిచయమై తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న మౌళికి ఇటీవల ఎదురైన అనుభవం ఇదే.
ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో యాంకర్ రోషన్ చేసిన వ్యాఖ్యలు మౌళిని తీవ్రంగా బాధించాయి. ‘మౌళి ఎవరు? మౌళి, జాలి, బాలి..’ అంటూ సాగిన ఆ ఎగతాళిపై అతడు తన ఆవేదనను కూడా బయటపెట్టాడు. పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చిన నటుడిని ఇలాగే మాట్లాడగలరా? అన్నది అతడి ప్రశ్న. ఒక కొత్త నటుడిని ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు.. కనీసం కించపరచకూడదన్నది ప్రేక్షకుల అభిప్రాయం కూడా.
Ads
ఇక విషయంలోకి వెళ్దాం… ఆ వివాదం నేపథ్యంలోనే మౌళి రెండో సినిమా ‘దొంగ నా కొడుకు’ (డీఎన్‌కే) ప్రేక్షకుల ముందుకొచ్చింది. పేరు విషయంలో సెన్సార్ అభ్యంతరాలు ఎదుర్కొని డీఎన్కేగా మారిన ఈ సినిమా.. మౌళి మీద వచ్చిన విమర్శలకు సమాధానం చెబుతుందా? తొలి సినిమా విజయాన్ని నిలబెట్టుకుంటాడా? అన్న ఆసక్తి సహజంగానే ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా మౌళికి జరిగిన అవమానాలకు, నటుడిగా అతడి సినిమా ఎలా ఉందన్నదానికి సంబంధం లేదు. ఆ కోణంలో చూస్తే..
కథేంటంటే? విశాఖపట్నానికి చెందిన ఈశ్వర్ (మౌళి) బీటెక్ మధ్యలోనే ఆపేసి బెట్టింగ్‌లకు బానిసవుతాడు. లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేయడమే కాకుండా, తన లవర్ దీపు (సుష్మిత శెట్టి) దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాడు. ఈ వ్యవహారం ఆమె తండ్రికి తెలియడంతో సమస్యలు మొదలవుతాయి. అప్పులు తీర్చడానికి స్నేహితుడితో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంటాడు.
(తెలుగు సినిమాల్లో హీరోలు అంటే జులాయి కేరక్టర్లు, చిల్లర దొంగతనాలు, మోసాలే వాళ్ల కేరక్టర్లు… ఇదొక దరిద్రం… రీసెంటుగా వచ్చిన ఇట్లు అర్జున, గోట్, డీఎన్‌కే అన్నీ అవే… అఫ్కోర్స్, మరీ పుష్ప స్థాయి భారీ స్మగ్లర్లు కారు వీళ్లు పాపం…)

ఓ జ్యూవెల్లరీ షాపులో దొంగతనంతో ఈ సినిమాలో కథ మలుపు తిరుగుతుంది. ఈశ్వర్ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అతడు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు? జ్యూవెల్లరీ షాపు దొంగతనం వెనుక అసలు కథేంటి? చివరకు ఏమైంది? అన్నది మిగతా సినిమా.
ఎలా ఉందంటే? క్రైమ్ కథకు కామెడీని జోడించాలనే ఆలోచన బాగుంది. కానీ ఆ రెండింటినీ సమతూకంలో నడిపించడంలో దర్శకుడు శ్రీను కంబాల పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఫస్ట్ హాఫ్‌లో ఈశ్వర్ చేసే పనులు, బెట్టింగ్‌లు, లోన్ యాప్‌లతో వచ్చే ఇబ్బందులు, ప్రేమ వ్యవహారం వంటి కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. మౌళి కామెడీ టైమింగ్ కూడా అక్కడక్కడా ఆకట్టుకుంటుంది.
అయితే కథ ముందుకు వెళ్లేకొద్దీ కామెడీ కంటే గందరగోళమే ఎక్కువగా కనిపిస్తుంది. వరుసగా ట్విస్టులు వస్తుంటాయి కానీ అవి ప్రేక్షకుడిని పెద్దగా ఆశ్చర్యపరచవు. కొన్ని చోట్ల కామెడీని బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. క్రైమ్ కథలో ఉత్కంఠ ఉండాలి.. కామెడీ కథలో నవ్వులు పండాలి. ఈ రెండింటిలోనూ సినిమా స్థిరంగా సాగదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనం మరింత బలహీనపడుతుంది.
కామెడీ సినిమా తీస్తున్నప్పుడు ప్రేక్షకుడిని నవ్వించాలన్న తపన కనిపించాలి. కానీ ఈ సినిమాలో దర్శకుడు ఎక్కడా నవ్వు రాకుండా ఉండేందుకు చాలా ‘జాగ్రత్త’ పడినట్లు అనిపిస్తుంది. అదే సినిమాకు ప్రధానమైన మైనస్.
ఎవరెలా చేశారంటే? మౌళి తన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌తో ఈశ్వర్ పాత్రకు సరిపోయాడు. కొన్ని సన్నివేశాల్లో అతడి నటన బాగానే నవ్విస్తుంది. అయితే పాత్రలో మరింత వైవిధ్యం చూపించే అవకాశం ఉన్నా, కథనం సహకరించలేదు. బబ్లూ హీరో స్నేహితుడి పాత్రలో ఆకట్టుకుంటాడు. అలీ, రజిత తమ పరిధిలో మెప్పించారు. హీరోయిన్ సుష్మిత శెట్టికి పాత్ర పరిధి తక్కువగా ఉండటంతో పెద్దగా గుర్తుండిపోయే అవకాశం లేదు.
మౌళిని యాంకర్ రోషన్ ఎగతాళి చేసినంత మాత్రాన అతడి నటనను తక్కువ చేయలేం. అదే సమయంలో ‘లిటిల్ హార్ట్స్’ హిట్ అయిందని ప్రతి సినిమా హిట్ కావాలన్న నిబంధన కూడా లేదు. మౌళి విషయంలో వ్యక్తిగత దూషణలు అనవసరం. కానీ సినిమాకు వస్తే మాత్రం విమర్శలు తప్పవు.
‘దొంగ నా కొడుకు’లో మౌళి తన వంతు ప్రయత్నం చేసినా, దర్శకుడు రాసుకున్న కథ, కథనం ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో నవ్వించలేకపోయాయి. తొలి సినిమా ఇచ్చిన విజయాన్ని రెండో సినిమాతో కొనసాగించలేకపోయాడు. మౌళి మీద విమర్శలు చేసినవాళ్లకు సమాధానం చెప్పాలంటే మరో మంచి సినిమా చేయాల్సిందే!
Share this Article