.
Nethaji Kumaramangalam …. సైన్స్ పరిజ్ఞానమే లేని నాకు..వాయేజర్ 1 పై ఇష్టం ఏర్పడటానికి కారణం…. 38 సంవత్సరాలు క్రితం నేను చదివిన చీకట్లో సూర్యుడు (యండమూరి వీరేంద్రనాథ్ గారి సైన్స్ పిక్షన్ )నవల. అది నవలే అయినా అంతులేని అంతు చిక్కని అంతరిక్ష వినువీధుల్లో వింతలు విశేషాలతో స్పేస్ సైన్సు (అంతరిక్ష విజ్ఞానం లేదా ఖగోళ శాస్త్రం) ప్రాథమిక విషయాలు సరళంగా అర్థం అయ్యేలా ఆసక్తి కలిగే విధంగా సాగుతుంది.
లెక్కలు, ఫిజిక్స్ అంటే ఏంటో తెలీకుండా భట్టి కొట్టి 10 th లో పాస్ అవటం మినహా సైన్స్ గురించి అవగాహనే లేని నాలాంటి ఒకడికి ఒక స్పేస్ శాటిలైట్ గురించి చదివి భద్రంగా ఆ కటింగ్ లు తీసిపెట్టుకునేంతగా ఇష్టం కలిగించింది.
Ads
ఇక చీకట్లో సూర్యుడు – ఒక కంప్యూటర్ ఇంజనీర్, ఇంకొక మహిళ సైంటిస్ట్ మధ్య అంతరిక్షంలో స్పేస్ షటిల్ ప్రయాణంలో లవ్ ట్రాక్.. సూపర్ కంప్యూటర్… ఇద్దరు ఆస్ట్రోనాట్స్ మధ్య అంతరిక్షంలో లవ్ ట్రాక్, అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, ఏలియన్స్ ప్రస్తావన… సూపర్ కంప్యూటర్ తో మనుషుల అటాచ్మెంట్….
కాంతికి మూడు రెట్లు వేగంతో అంతరిక్షంలో ప్రయాణం చేస్తే మనిషి వయస్సు భూమిపై ఉన్నప్పుడులాగా పెరగదా…? భూమిపైన అంతరిక్షంలో ఉన్న వారిపై ఈ అంశం భిన్నంగా ప్రభావం చూపుతుందా అనే సంక్లిష్టమైన చర్చ కూడా ఈ నవలలో 38 సంవత్సరాల క్రితమే వీరేంద్రనాథ్ గారు చర్చకు పెట్టారు. ఈ నవల చదివేవారిని ఆద్యంతం పైసా ఖర్చు లేకుండా యండమూరి వీరేంద్రనాథ్ గారు అంతరిక్షంలోకి తీసుకెళ్ళిపోతారు.

ఊహ తెలిసిన నాటి నుంచి నేను క్లోజ్ గా ఫాలో అవుతున్నది… వాయేజెర్-1, 2… రెండూ మిషన్లే (యంత్రాలు) కావచ్చు.. అయినా అవి అంటే చాలా చాలా ఇష్టం … మానవ మస్తిష్కంకి అందని అంతు చిక్కని అనంత విశ్వ రహస్యాలను భూమికి చేరవేస్తూ సాగుతూనే ఉన్నది…. సాగుతూనే ఉంటుంది… తెలియని దూర తీరాలకు సాగి పోతున్నా మనుషులు భూమి నుంచి పంపే సిగ్నల్స్ కి స్పందిస్తూ ఇంకా ఇంకా తన సేవలు అలుపు లేకుండా కొనసాగిస్తూనే ఉంది…
మనకు తెలియని ఎన్నో అంతరిక్ష విజ్ఞాన రహస్యాలు తెలియజేస్తూనే ఉంది. 1988 లో నేను TPPM స్కూల్ లో 10 th class చదివేటప్పుడు డిటెక్టివ్ కథలు చదివే అలవాటు లెక్కలు, ఫిజిక్స్ వంటివి నా బుర్రకు ఎక్కని రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్ గారి సైన్స్ పిక్షన్ నవల చీకట్లో సూర్యుడు చదివి అంతరిక్ష పరిశోధన, విజ్ఞానంపై ఆసక్తి ఏర్పడి, ఈనాడు పేపర్ లో ఎడిటోరియల్ పేజీలో వాయేజెర్ -1 ఆర్టికల్ చదివి అప్పటి నుంచి ఆ పేపర్ కటింగ్ చాలా చాలా భద్రంగా సర్టిఫికెట్స్ సమానంగా దాచుకున్నా…
స్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర
NASA అంతరిక్ష నౌక ‘వాయేజర్ 1’ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ నెల 18 నాటికి భూమి నుంచి సరిగ్గా ఒక లైట్ డే డిస్టెన్స్ (ఒక రోజులో కాంతి ప్రయాణించే దూరం – 2,590 Cr కి.మీ) చేరుకోనుంది.
ఇప్పటివరకు మానవుడు తయారు చేసిన ఏ వస్తువూ భూమి నుంచి ఇంత దూరం ప్రయాణించలేదు. ఈ ఘనత సాధించిన తొలి వస్తువు ఇదే కానుంది. ఈ స్పేస్ ప్రోబ్‌ను 1977 SEP 5న అంతరిక్షంలోకి పంపారు. 49 ఏళ్లుగా అది భూమికి సిగ్నల్స్ పంపుతోంది.
దూరం… కాంతి సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలా 24 గంటల పాటు (ఒక రోజులో) కాంతి ప్రయాణించే దూరమే వన్ లైట్ డే. ఇది సుమారు 2,590 కోట్ల కిలోమీటర్లు (25.9 billion km లేదా 16.1 billion miles).
సమయం… 2026 నవంబర్ 18న (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:46 గంటలకు) వాయేజర్ 1 ఈ దూరాన్ని తాకనుంది. ప్రయోగించిన 49 ఏళ్ల 2 నెలల 11 రోజుల తర్వాత ఇది సాధ్యమవుతోంది.
దీనివల్ల కలిగే మార్పులు & విశేషాలు
సిగ్నల్ ఆలస్యం…. వాయేజర్ 1 ఒక లైట్ డే దూరంలో ఉండటం వల్ల భూమి నుంచి నాసా శాస్త్రవేత్తలు ఏదైనా కమాండ్ పంపితే అది నౌకను చేరడానికి సరిగ్గా 24 గంటలు పడుతుంది. అక్కడి నుంచి తిరిగి సమాధానం భూమికి రావడానికి మరో 24 గంటలు పడుతుంది. అంటే ఒక చిన్న సందేశం మార్పిడికి మొత్తం 48 గంటల సమయం పడుతుంది.
ప్రస్తుత వేగం…. ఇది గంటకు సుమారు 61,000 కిలోమీటర్ల వేగంతో సౌర కుటుంబం దాటి నక్షత్రాంతర రోదసి (Interstellar Space) లోకి దూసుకుపోతోంది…. మీ నేతాజీ కుమార మంగళం
Share this Article