Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వందేళ్ల నాటి తమిళ భక్తి పాట- గ్రామీ అవార్డుకు పరిశీలన…

November 19, 2026 by M S R

.

గ్రామీ వేదిక వరకూ చేరిన వందేళ్ల నాటి భక్తి పాట!   (  రమణ కొంటికర్ల  )
వందేళ్ల నాటి తమిళ కవిత్వానికి గ్రామీ వేదికపై అరుదైన గుర్తింపు!

కృష్ణుడిని ఆహ్వానిస్తూ సుబ్రహ్మణ్య భారతి రాసిన కవిత.. ఆధునిక సంగీత రూపంలోనూ ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనంగా నిల్చింది. గ్రామీకి నామినేట్ అయిన తొలి తమిళ పాటగా వరువాయ్ చరిత్ర సృష్టించింది.

Ads

శతాబ్దం క్రితం ఓ కవి కలం నుంచి జాలువారిన భక్తి కవిత.. ఇప్పుడు ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రామీ అవార్డుల వేదిక వరకూ చేరింది. తమిళ సాహిత్య, సంగీత ప్రపంచానికి ఇదో అరుదైన సందర్భం.

ప్రముఖ తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి రచించిన వరువాయ్ అనే భక్తి గీతం ఆధునిక ఫ్యూజన్ మ్యూజిక్ రూపం సంతరించుకుని 69వ గ్రామీ అవార్డులకు నామినేట్ అయింది.

సంగీత దర్శకుడు, గాయకుడు దేవన్ ఏకాంబరం స్వరపరిచిన ఈ పాటలో గాత్రాన్ని అందించిన సుభిక్ష రంగరాజన్ అలియాస్ సుషా కూడా ఈ గుర్తింపులో ఓ భాగస్వామి. 2027 ఫిబ్రవరి 7న లాస్ ఏంజెలిస్‌లో జరగనున్న 69వ గ్రామీ అవార్డుల్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో ఈ పాట పోటీపడనుంది. ఈ విభాగంలో షకీరా, బర్నా బాయ్, రోసాలియా వంటి అంతర్జాతీయ సంగీత ప్రముఖుల పాటలతో వరువాయ్ పోటీ పడటం ఓ విశేషం. (దురంధర్ పాటల్లో ఒక్కటీ పరిశీలనకు నోచుకోలేదు)

varuvai

కృష్ణుడిని ఆహ్వానించిన కవిత!

ఈ పాట వెనుక ఉన్న అసలు ప్రత్యేకతంతా దాని సాహిత్యంలోనే ఉంది. సుబ్రహ్మణ్య భారతి వందేళ్ల క్రితం రచించిన భక్తి గీతం ఇది. ఇందులో కృష్ణుడిని మానవ మేధస్సులోకి, ఆలోచనల్లోకి రావాలని కవి ఆహ్వానిస్తారు. కేవలం భక్తిభావంతోనే కాకుండా, అప్పటి సమాజంలోని చీకట్లను, రాక్షస శక్తులను తొలగించాలనే అంతరార్థం ఆ రచన భావన.

బ్రిటిష్ వలస పాలన నుంచి తప్పించుకునేందుకు భారతి పుదుచ్చేరిలో గడిపిన ప్రవాస జీవిత కాలంలో.. వరువాయ్ కవిత రాసి ఉండవచ్చన్నది చరిత్రకారుల భావన. ఆ కాలంలో ఆయన రచనల్లో భక్తితో పాటు స్వేచ్ఛ, సామాజిక మార్పు, సమానత్వం వంటి భావాలూ బలంగా వ్యక్తమయ్యాయి.

సంప్రదాయానికి.. ఆధునికత జోడింపు!

వరువాయ్ పాటను దేవన్ ఏకాంబరం.. రాగ్ దేశ్‌లో రూపొందించారు. కర్ణాటక సంగీతంలోని సంప్రదాయ స్వరసౌందర్యానికి ఆధునిక సంగీత వాద్యాలు, శైలీ జోడించారు. సుషా గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ.

ప్రముఖ పియానిస్ట్ అనిల్ శ్రీనివాసన్, స్లైడ్ గిటారిస్ట్ ప్రకాశ్ సోంటక్కెతో పాటు.. ఇతర సంగీతకారులు కూడా ఈ ప్రయోగంలో భాగమయ్యారు. సంప్రదాయ కర్ణాటక సంగీతాన్ని.. దాని సహజత్వాన్ని కోల్పోకుండా కొత్త తరానికి, అంతర్జాతీయ శ్రోతలకు చేరువ చేసే ఆలోచనతో ఈ రూపకల్పన జరిగింది.

దేవన్ ఏకాంబరం సంగీత ప్రయాణం!

దేవన్ ఏకాంబరం పేరు తమిళ సినీ సంగీత ప్రియులకు కొత్తది కాదు. ఏఆర్ రెహమాన్, హారిస్ జయరాజ్, ఇళయరాజా వంటి సంగీత దర్శకులతో కలిసి ఆయన పనిచేశారు. ప్రేమదేశం ఫేమ్, ప్రముఖ దర్శకుడు కదిర్ దర్శకత్వంలో వచ్చిన కాదలర్ దినం.. తెలుగులో ప్రేమికుల రోజు సినిమాలో ఓ మారియా.. మణిశర్మ సంగీతం చేసిన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలోని ప్రేమంటే సులువు కాదురా వంటి పాటలతో గుర్తింపు పొందారు.

500కు పైగా సినిమాల్లో పాటలు పాడిన దేవన్ ఏకాంబరం.. సంగీత దర్శకుడిగానూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. గతంలోనూ అంతర్జాతీయ సంగీత ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు వరువాయ్ నామినేషన్.. ఆయన వ్యక్తిగత సంగీత ప్రయాణంలో ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.

ఇక సుషా విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచే కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. అనంతరం టొరంటో విశ్వవిద్యాలయంలో జాజ్ సంగీతాన్ని అభ్యసించారు. భారతీయ సంగీత సంప్రదాయాలు, జాజ్ ప్రయోగాలు, ఆధునిక సంగీత ధోరణులను కలిపి నేటి ఆధునిక శైలిని రూపొందించుకున్నారు. 2019లో ఏఆర్ రెహమాన్, క్లింటన్ సెరెజో నిర్వహించిన నెక్సా మ్యూజిక్ కార్యక్రమంలో ఎంపికైన కళాకారుల్లో సుషా కూడా ఒకరు.

భాషకు హద్దుల్లేవు.. సంగీతానికి సరిహద్దుల్లేవు!

ఒకప్పుడు తమిళ సంగీత సభల్లో, కర్ణాటక సంగీత కచేరీల్లో వినిపించిన ఓ భక్తి కవిత.. ఇప్పుడు ప్రపంచ సంగీత రంగంలో ఓ చర్చ. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కొత్తగా సృష్టించిన ఓ పాటకు కాకుండా.. ఇప్పటికే ఉన్న గొప్ప సాహిత్య సంపదను సమకాలీన సంగీతంతో కొత్తగా ఆవిష్కరించడం.. అది గ్రామీ వరకూ వెళ్లడం మరో విశేషం.

అయితే, గ్రామీ నామినేషన్ కు వెళ్లినంత మాత్రాన… గెలిచినట్టుకాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వందలాది పాటల్లో… తుది జాబితాలోని ఐదు నామినేషన్లలో చోటు సంపాదించడం కూడా చిన్న విషయమేం కాదు. ముఖ్యంగా తమిళ భాషలోని ఒక శతాబ్దం నాటి కవిత్వం ఇంతటి అంతర్జాతీయ గుర్తింపు పొందడం విశేషం.

సుబ్రహ్మణ్య భారతి కలం నుంచి పుట్టిన పదాలు.. నేటి తరం సంగీతకారుల సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని పలకరిస్తున్నాయి. కాలం మారినా మంచి కవిత్వానికి, మంచి సంగీతానికి ఆదరణ తగ్గదని వరువాయ్ నిరూపించింది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వందేళ్ల నాటి తమిళ భక్తి పాట- గ్రామీ అవార్డుకు పరిశీలన…
  • ఇండియాకు వస్తున్నారా… బీ అలర్ట్, ఎబోలా డిక్లరేషన్ తప్పనిసరి!
  • The son who stole his mother’s night…
  • అమెరికాలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజల పరుగులు!
  • ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…
  • సకల తీర్థాల్లో మునిగి పుణ్యం చేసుకున్న ఆ సొరకాయ చివరికి..?!
  • ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు- రాముడి వారసులు మాత్రం సైలెంట్ !!
  • ఈసారి భద్రతా వ్యవస్థలోనే..! కొనసాగుతున్న అమెరికా *టెక్ కష్టాలు !!
  • ప్రతి పేద ఇంటికీ సర్కారీ భరోసా – రేవంత్ రెడ్డి గుర్తుండిపోతాడు
  • ఎవరి కోసం… ఈ హఠాత్ వరుస టెక్ ఇక్కట్లు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions