Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Ramoji film city – ఓ కేజీఎఫ్ మార్క్ చాకిరీ అనుభవం !!

November 20, 2026 by M S R

.

 Chakri Rao …. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా నాకిది రెండో సినిమా. లొకేషన్ రామోజీ ఫిల్మ్ సిటీ. మా కాలేజీ సీనియరే ఈ మలయాళ థ్రిల్లర్‌కి సినిమాటోగ్రాఫర్. ఇరవై పైచిలుకు రోజుల షెడ్యూల్, అంతా అక్కడే ఉండాలి. “కావలసిన దుస్తులు, వస్తువులన్నీ తెచ్చుకో, మధ్యలో వెనక్కి రావడం కుదరదు” అన్నారు. సరేనన్నాను.

కోఠి బస్టాండ్ దగ్గర నన్ను పికప్ చేసుకున్నారు. ఫిల్మ్ సిటీ గేటు బయటే కొన్ని భవనాలున్నాయి, వాటిలోనే మా వసతి. ప్రతి గదిలో రెండు బెడ్లు, అటాచ్డ్ బాత్. గీజర్ లాంటివేమీ లేవు.

Ads

“రేపు ఉదయమే షూటింగ్ మొదలు. ఆరింటికల్లా రెడీగా ఉండండి, వెహికల్ వస్తుంది” అని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు. నేనూ, అక్కడే పరిచయమైన మరో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ ఒకే గదిలో చేరాం. అప్పటికే పన్నెండు దాటింది. కొత్త చోటు కావడంతో నిద్ర పట్టక అటు ఇటు దొర్లాను. ఐదింటికి అలారం మోగి పక్కవాడు లేచాడు. (ఇక్కడి గమ్మత్తు సంగతులు తర్వాత చెప్తాను, ఇప్పటి విషయం వేరే.)

ఆరింటికి తయారయ్యాం. పదిహేను సీట్ల వాహనం వచ్చింది. కేరళ నుంచి వచ్చిన ఆర్ట్ అసిస్టెంట్లు, మేకప్ వాళ్లు, ఇంకా రకరకాల విభాగాల వాళ్లు కలిపి పదిమంది వరకు ఉన్నారు. అందరం ఎక్కాం. వాహనం గేటు దాటి లోపలికి వెళ్ళింది. కుడివైపు ఒక పెద్ద తెల్ల భవనం ఉంది, అదే మా ప్రధాన లొకేషన్. షూటింగ్ అనుభవాలు తర్వాత చెప్తాను.

ఇప్పటి విషయం తిండి గురించి. ఉదయం ఐదింటికే లేవడం వల్ల ఆకలి దంచేసేది, కానీ టిఫిన్ వచ్చేది ఎనిమిదికి. పైగా మిగతా షూటింగుల్లా కాకుండా ఇక్కడ పరిమితంగానే పెడతారు: రెండు ఇడ్లీ, ఒక వడ, కాస్త సాంబార్ రైస్, అంతే. మధ్యాహ్న భోజనమూ దాదాపు అంతే.

అప్పటికే ఒక పండితుడు నాకు ఎనిమిది శనివారాలు ఉపవాసం చేయమని చెప్పాడు. కావాలంటే ఉప్పు లేని పెరుగన్నం తినొచ్చట. ఆరు శనివారాలు షూటింగ్‌కి ముందే పూర్తయ్యాయి. ఏడవది షూటింగ్‌లో వచ్చింది. ఆ రోజు టిఫిన్ మానేశాను. అలసట, ఆకలితో మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని ఎదురుచూశాను.
ఎట్టకేలకు ఒంటిగంట అయింది. అక్కడ భోజనానికి టోకెన్ సిస్టమ్. టోకెన్ తీసుకుని వరుసలో నిలబడితే ప్లేట్ మీల్స్ లాగా కూర, పప్పు, చారు, సాంబారు, పెరుగు కప్పుల్లో ఇస్తారు.

నా వంతు రాగానే, “అయ్యా, నాకు కూరలేవీ వద్దు, ఒక పెరుగు కప్పు ఎక్స్‌ట్రా ఇస్తే చాలు” అన్నాను. కుదరదన్నాడు. “ఈ రోజు నేను కేవలం పెరుగుతోనే తినాలి, ప్లీజ్. కూరలు వేరే వాళ్లకు ఇవ్వండి” అన్నా వినలేదు. “డబ్బులిస్తాను బాబూ” అన్నా, “అందరికీ ఒక్కొక్క పెరుగే. మీకు రెండివ్వడం కుదరదు” అన్నాడు.

కొత్తగా వచ్చిన నాకు ఎవరూ పెద్దగా తెలియదు, ఏం చేయాలో తోచలేదు. దగ్గర్లో ఏదైనా షాపు ఉంటే వెళ్లి తెచ్చుకుందామంటే, అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. రూమ్‌మేట్ కోసం వెతికాను. వాడు ఎక్కడో కూర్చుని తింటున్నాడు. అందరూ ఆకలితో తింటున్నారు. వాళ్ల ముఖాలు చూస్తే పెరుగు వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరనిపించింది. అయినా ఎవరిని, ఏమని అడగాలి? చివరికి చేసేదిలేక, ఉన్న పెరుగుతో ఎంత తినగలిగితే అంత తిని, అర్ధాకలితోనే ఆ రోజు షూటింగ్ ముగించాను.

ఆ తర్వాత చుట్టుపక్కల షాపుల గురించి ఆరా తీస్తే తెలిసింది ఇది: ఫిల్మ్ సిటీలో షాపులు ఒకటీ రెండే, అవీ వసతి భవనాల దగ్గరే. ఎక్కడా పెరుగు దొరకదు. భోజనంలో ఇస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఎవరూ అమ్మరు. కొనుక్కుందామన్నా వీలుండని ఈ పరిస్థితి నాకు చాలా విచిత్రంగా అనిపించింది.

ఇక ఎనిమిదవ, చివరి శనివారం ఎలా అని బెంగ పడుతుండగా, అదృష్టవశాత్తు కొత్తగా వచ్చిన మరో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మంచి మిత్రుడయ్యాడు. అతడు ఆ రోజు తన పెరుగు త్యాగం చేసి పుణ్యం కట్టుకున్నాడు. అతని వల్లే నా ఉపవాసం పూర్తయింది.

rfc

ఫిల్మ్ సిటీలో నాకెదురైన అనుభవం ఇది. తిండి పరిమితంగా పెడతారు, కొనుక్కుందామన్నా వీలుండదు. నాకు తెలిసినంత వరకు అక్కడి ఉద్యోగులకూ గొప్ప జీతాలుండవు. లైట్‌మెన్‌కి కూడా బయటివాళ్ల కంటే తక్కువే ఇస్తారని విన్నాను, ఎందుకంటే దాన్ని ఉద్యోగంలా తీసుకుంటారట. (ఇది అప్పటి సమాచారం, ఇప్పటి పరిస్థితి నాకు తెలియదు.)

క్రియేటివ్ ఫీల్డ్ అంటే హాయిగా, స్వేచ్ఛగా ఉంటుందనుకున్న నాకు ఇది పెద్ద షాక్. పొద్దున్నే బస్సెక్కడం, చాలీచాలని తిండితో చీకటి పడేవరకు పని చేయడం, అరకొర నిద్రతో తెల్లవారుజామున కాస్త కునుకు పడుతుండగానే అలారం మోగడం… రాక్షసుల సినిమాల్లో చూపించే బానిస బతుకే గుర్తొచ్చింది – అది “రామోజీ” ఫిలింసిటీ ఆకలి వ్యవస్థ!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Ramoji film city – ఓ కేజీఎఫ్ మార్క్ చాకిరీ అనుభవం !!
  • చైనా, పాకిస్థాన్ మనకు యుద్ధ సంకేతాలు ఇస్తున్నయ్..! ఇలా…
  • ఒకేలాంటి పాట ఒకేలాంటి సందర్భాల్లో రెండు సినిమాల్లో…
  • Qatar Vs Indigo… వోల్వో బస్సు దిగి ఎర్ర బస్సు ఎక్కినట్టు..!
  • చాణక్యుడిగా రణ్‌వీర్.. చంద్రగుప్తుడిగా యశ్.. నిజమైతే మరో సంచలనమే!
  • వందేళ్ల నాటి తమిళ భక్తి పాట- గ్రామీ అవార్డుకు పరిశీలన…
  • ఇండియాకు వస్తున్నారా… బీ అలర్ట్, ఎబోలా డిక్లరేషన్ తప్పనిసరి!
  • The son who stole his mother’s night…
  • అమెరికాలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజల పరుగులు!
  • ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions