.
పాపం సాయిపల్లవి… పాపం శ్రీలీల… ఇద్దరూ ఏదో సినిమా ఫంక్షన్లో డాన్స్ చేస్తూ కనిపించారు మొన్న… ఇద్దరూ మంచి డాన్సర్లే… కలిసి నటించారు… శ్రీలీలకు ఎలాగూ ఐరన్ లెగ్ ముద్ర పడిపోయి ఉంది… రామాయణం తప్ప సాయిపల్లవికీ చాన్నాళ్లుగా ఓ హిట్ లేదు… పైగా బాలీవుడ్ డెబ్యూ అట్టర్ ఫ్లాప్…
మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి… తమిళ స్టార్ ధనుష్… గ్రేట్ నసీరుద్దీన్ షా… ఇంద్రాన్స్… ఇలా ఒక సినిమాలో ఇంతమంది ప్రముఖ నటీనటులు ఉంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… అందులోనూ ధనుష్ నటించడంతో పాటు తనే నిర్మించిన సినిమా కావడంతో ‘ఓం’ (OM) విడుదలకు ముందే ఆసక్తి రేకెత్తించింది… మరి సినిమా ఎలా ఉంది..?
Ads
ముఖ్యంగా సాయిపల్లవి ఓ ఐపీఎస్ అధికారిగా నటించడం… శ్రీలీల ధనుష్ భార్య పాత్రలో కనిపించడం సినిమాపై మరో రకమైన ఆసక్తిని పెంచాయి…
సాయిపల్లవి పోలీస్ ఆఫీసర్.. కానీ ఆ పవర్ ఎక్కడ? ఈ సినిమాలో సాయిపల్లవి నిత్యారెడ్డి అనే ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించింది… ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను పట్టుకునే బాధ్యత ఆమెపై ఉంటుంది… ఆపరేషన్ మోల్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి స్మగ్లింగ్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది…
సాయిపల్లవికి నటనలో మంచి పేరుంది… బలమైన పాత్రలు దొరికితే తన పెర్ఫార్మెన్స్తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగలదు… ఈ సినిమాలోనూ ఆమెకు ఒక పవర్ఫుల్ ఐపీఎస్ పాత్ర ఇచ్చారు… గతంలో విజయశాంతి చేసిన పోలీస్ పాత్రలను గుర్తు చేసేలా నిత్యారెడ్డి పాత్రను తీర్చిదిద్దే ప్రయత్నం కనిపిస్తుంది… అయితే పోలీస్ అధికారిగా సాయిపల్లవి తెరపై కనిపించినప్పుడు ఆ పాత్రకు కావాల్సిన పవర్ పూర్తిస్థాయిలో కనిపించదు… గెటప్ కూడా ఆమెకు అస్సలు సూట్ కాలేదు…

శ్రీలీలకు దక్కింది ఎంత? ఇక శ్రీలీల విషయానికి వస్తే, తన ధనుష్ భార్య పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు… కొన్ని కుటుంబ సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది… పైగా ఆమె డబ్బింగ్ కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది… ఒకటో తరగతి పిల్ల మాట్లాడుతున్నట్టుగా ఉండే కొన్ని డైలాగ్ డెలివరీలు ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తాయి… శ్రీలీలకు ఉన్న నటన, డ్యాన్స్ సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాలో ఆమెకు దక్కిన అవకాశం చాలా పరిమితమే…
ఒకవైపు సాయిపల్లవి వంటి నటి పోలీస్ అధికారిగా.. మరోవైపు శ్రీలీల వంటి క్రేజీ హీరోయిన్ ధనుష్ భార్యగా ఉన్నా కథలో వీళ్లిద్దరి పాత్రలు బలంగా నిలబడలేకపోయాయి… పెద్ద తారాగణం ఉండటం వేరు… వాళ్ల ప్రతిభను కథకు ఉపయోగించుకోవడం వేరు అనే విషయం మరోసారి గుర్తుకొస్తుంది…
మమ్ముట్టి ఉన్నా.. ఆ కిక్కు లేదు! ఈ సినిమాకు ఉన్న ప్రధాన ఆకర్షణల్లో మమ్ముట్టి ఒకరు… కార్తికేయన్ అనే ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా నాయకుడి పాత్రలో నటించాడు… అయితే మమ్ముట్టి నుంచి ప్రేక్షకులు ఆశించే భారీ ఎలివేషన్లు, పంచ్ డైలాగులు, నటనలోని ప్రత్యేకమైన హుందాతనం ఈ సినిమాలో పెద్దగా కనిపించవు… (మోహన్‌లాల్, మమ్ముట్టి మలయాళ సూపర్ స్టార్లు, తమ స్థాయి తగ్గించుకుని, ఏ భేషజాలూ లేకుండా మామూలు నటుల్లా వేరే భాషల సినిమాల్లో నటిస్తే, అన్నీ ఫ్లాపులే…)
ఇటీవల వచ్చిన జైలర్ 2లో రజనీకాంత్‌ను దర్శకుడు ఏ స్థాయిలో ఉపయోగించుకున్నాడో చూస్తే ఒక స్టార్ ఇమేజ్ను తెరపై ఎలా వాడుకోవచ్చో అర్థమవుతుంది… కానీ ‘ఓం’లో మమ్ముట్టిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు… అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్ నెట్వర్క్ నడిపే వ్యక్తి పాత్రలో ఆయన కనిపించినా, ఆ స్థాయికి తగ్గట్టుగా పాత్రను తీర్చిదిద్దలేదు… ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్ మాదిరిగానే ఎక్కువగా కనిపిస్తాడు…
ధనుష్ ఉన్నాడు.. కానీ కథలో సస్పెన్స్ లేదు! ధనుష్ నటన ఎప్పటిలాగే బాగుంది… ఫోటోగ్రాఫర్ పేరుతో మమ్ముట్టికి దగ్గరయ్యే తిరు పాత్రలో తనదైన శైలిలో నటించాడు… ఒక పాటలో ప్రభుదేవా స్టైల్లో వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటాయి… అయితే దర్శకుడు కథలోని ప్రధాన ట్విస్టును చాలా ముందుగానే బయటపెట్టేయడంతో ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లో ఉత్కంఠ తగ్గిపోతుంది…
అసలు ధనుష్ పాత్ర ఏంటో ప్రేక్షకులకు తెలిసిపోయిన తర్వాత కథలో మిగిలిన ఆసక్తి ఏముంటుంది? పోకిరి సినిమాలో పూరి జగన్నాథ్ చివరి వరకు దాచిపెట్టిన సస్పెన్స్‌ను గుర్తు చేసుకుంటే ఇలాంటి కథల్లో ట్విస్టులను ఎప్పుడు బయటపెట్టాలో దర్శకుడికి ఎంత స్పష్టత ఉండాలో అర్థమవుతుంది…
అసలు కథ కూలీలదే.. కానీ చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నారు! ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ సాగుతుంది… పెద్ద తలకాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే, చెట్లను నరికే కూలీలు మాత్రం పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఎదుర్కొంటుంటారు… ఈ అసమానతను దర్శకుడు బలంగా చూపించే ప్రయత్నం చేశాడు…
ముఖ్యంగా సెకండాఫ్‌లో ధనుష్ తండ్రి ఎన్కౌంటర్లో చనిపోవడం, ఎర్రచందనం చెట్లను నరికే కూలీల జీవితాలు, వారి కష్టాలు, ధనుష్ ప్రతీకార భావన వంటి అంశాలపై దృష్టి పెట్టాడు… నిజానికి దర్శకుడు చెప్పాలనుకున్న అసలు విషయం ఇదేననిపిస్తుంది… అయితే ఈ పాయింట్‌ను మొదటి నుంచే కథలో భాగం చేసి ఉంటే బాగుండేది…
నసీరుద్దీన్ షా పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది… తననూ వాడుకోలేకపోయాడు దర్శకుడు… మమ్ముట్టి భార్యగా రేణు దేశాయ్ నటించింది… ఈ సినిమా ఎందుకు ఒప్పుకుందో ఆమెకే తెలియాలి…
ఒక మంచి కథాంశం ఉంది… మమ్ముట్టి, ధనుష్ వంటి స్టార్ హీరోలు ఉన్నారు… సాయిపల్లవి, శ్రీలీల వంటి క్రేజీ హీరోయిన్లు ఉన్నారు… నసీరుద్దీన్ షా, ఇంద్రాన్స్ వంటి ప్రతిభావంతులైన నటులు ఉన్నారు… ఇంతటి భారీ తారాగణం ఉన్నప్పుడు తెరపై అద్భుతాలు జరుగుతాయని ప్రేక్షకులు ఆశించడం సహజం… ఆ ఆశల్ని భగ్నం చేసిందే ఓం సినిమా..!
ప్యారడైజ్ సినిమాలో కేసీయార్ వంటి పాత్రను ప్రవేశపెట్టినట్టుగా ఇందులో చంద్రబాబు నాయుడి వంటి పాత్రను ప్రవేశపెట్టారు... కానీ పంచ్ లేదు, పేలలేదు..!!
Share this Article