.
ఈఎన్ఈ రిపీట్… అంటే ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్, అంటే రిపీట్… అసలు టైటిల్ చదవడానికే ఇబ్బందిగా ఉంది… ఎవరు డిజైన్ చేశారో పాపం… అది ఫస్ట్ అండ్ మెయిన్ మైనస్ పాయింట్ సినిమాకు…
ఎనిమిదేళ్ల క్రితం వచ్చింది ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా… అంటే పార్ట్-1 అన్నమాట… అప్పట్లో తరుణ్ భాస్కర్‌కు మంచి పేరే తెచ్చింది.,. అదొక డిఫరెంట్ జానర్… ఆ పాత హిట్ సినిమా పేరుతో మరో ప్రయత్నం చేశారు తరుణ్ భాస్కర్, విశ్వక్‌సేన్ తదితరులు… కానీ ఆ పాత పార్ట్-1 సినిమాతో పోలిస్తే ఇది పెద్దగా నచ్చదు…
Ads
ప్రధానంగా కామెడీని బేస్ చేసుకుని కథను అలా అలా నడిపించేశారు తప్ప పెద్దగా కథాబలం అంటూ ఏమీలేదు ఇందులో… కథాకాకరకాయ, లోతు, గాఢత, ఎమోషన్స్ మన్నూమశానం ఏమీ పెట్టుకోలేదు, ఏదో సరదాగా పదీపదిహేను షార్ట్స్, రీల్స్ కలిపి ఒక్కచోట కుట్టేసినట్టుగా… సినిమాను చుట్టేశారు… అఫ్‌కోర్స్ ప్రజెంట్ జనరేషన్ ప్రేక్షకులు కూడా ఈ ధోరణినే ఇష్టపడుతున్నారేమో… అందుకే ఈ సినిమా టీమ్ కూడా అదే పంథాలో వెళ్లిపోయిందేమో…
పాపం, విశ్వక్‌సేన్… కథానాయకుడు తనే… కానీ తనను మిగతా నటులే డామినేట్ చేశారు… ప్రత్యేకించి అభినవ్ గోమఠం… నిజానికి తనే ఉన్నంతలో ఈ సినిమాకు బలం… ఇందులో ఆ ఇద్దరితోపాటు ప్రియదర్శని రామ్, శ్రీరామచంద్ర, శివాత్మిక తదితరులూ ఉన్నారు… మనం కూడా కథాకాకరకాయ ప్రస్తావన లేకుండా విషయం చెప్పాలంటే…
‘ఈ నగరానికి ఏమైంది?’లోని ప్రధానమైన పాత్రలు తప్ప… ఆ కథతో ఈ సినిమాకి సంబంధం ఏమీ ఉండదు… దీని దారి దీనిదే… ఆ పాత పేరు వాడుకునే ప్రయత్నం చేశారు… సోషల్ మీడియాలో చూసే రీల్స్‌లో కూడా అంతే కదా… నాటకీయత, లాజిక్‌రాహిత్యం ఎట్సెట్రా… ఇందులోనూ అంతే… పీటల వరకూ వెళ్లిన కూతురు పెళ్లి ఆగిపోయినా సరే, ఎవరో చెప్పిన కథ విని ఓ తండ్రి ఫ్లైట్ ఎక్కడం దగ్గర నుంచి అనేక లాజిక్‌రాహిత్యాలు… కాకపోతే కామెడీ జోరులో ఆ లోపాలన్నీ కొట్టుకుపోతాయి…

చెంపదెబ్బల స్టార్ అభినవ్ గోమఠం, ఆయన మేనేజర్ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు, వెంకటేశ్ కాకుమాను పాత్ర చుట్టూ మలిచిన సినిమా ఎడిటర్ కష్టాలు బాగానే నవ్వించాయి… ఫ్లైట్‌లో ఎయిర్ హోస్టెస్‌కి శిక్షణ ఇవ్వడం చుట్టూ సాగే సన్నివేశాలు సాగదీత… ఫ్లైట్ దిగాక కథంతా సినిమా తీయడం చుట్టూనే సాగుతుంది… అది పెద్దగా ప్రేక్షకుడిని కనెక్ట్ కాదు…
సినిమా రంగంలోని కొన్ని సెంటిమెంట్లతో ముడిపడిన సెట్టైర్లూ నవ్వించాయి… రాజీవ్ కనకాల చనిపోయే పాత్రని పోషిస్తే సినిమా హిట్ అనేది అందులో ఒకటి… ఐదు నిమిషాలు ఊపిరి ఆపుకోండి… అంటూ ఆయనకి చెప్పడం, నాగుపాము కథతో దర్శకుడు మళ్లీ తిరిగి ఎంట్రీ ఇవ్వడం లాంటి సన్నివేశాలతో ఆఖర్లోనూ నవ్విస్తుందీ చిత్రం… పలువురు తెలుగు సినిమా దర్శకులు చేసిన అతిథి పాత్రలు పక్కాగా కుదిరాయి…
కీర్తన పాత్రలో శివాత్మిక బాగుంది… బతుకమ్మ పాటలో ఆమె ఆటా పాటా ఆకట్టుకుంటుంది… డైలాగ్స్ రాసింది తరుణ్ భాస్కరే కావచ్చు… కొన్ని బాగున్నాయి.,. ‘ఈకలు గుచ్చుకుంటే నెమలి కాదు.., చాలామంది 25 ఏళ్లకు చనిపోతారు. కానీ వాళ్లను 80 ఏళ్లకు పూడ్చి పెడతాం’ వంటివి… సంగీతం సో సో…
Share this Article