Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

HIV రోగుల్లో పక్షవాతంపై కాకినాడ ప్రజావైద్యుడి మరో పరిశోధన!

November 21, 2026 by M S R

.

అరుదైన ‘జీబీఎస్’ పక్షవాతానికి హెర్పిస్ వైరస్ కారణమా? హెచ్ఐవి రోగుల్లో డాక్టర్ యనమదల పరిశోధనలో కొత్త కోణం

హెచ్ఐవి రోగుల్లో వచ్చే అరుదైన నరాల సంబంధిత పక్షవాతం ‘గిల్లయిన్ – బారీ సిండ్రోమ్’ (జీబీఎస్ – GBS) పై కాకినాడకు చెందిన ఎయిడ్స్, సాంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్ మురళీకృష్ణ యనమదల తాను చేసిన కీలకమైన పరిశోధన వివరాలను ప్రకటించారు.

Ads

ఈ అధ్యయనం ప్రపంచ ప్రఖ్యాత ‘సేజ్’ (SAGE) సంస్థ నిపుణుల సమీక్షతో ప్రచురించే ‘జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొవైడర్స్ ఆఫ్ ఎయిడ్స్ కేర్’ (JIAPAC) లో తాజాగా ప్రచురితమైంది. జీబీఎస్ సాధారణంగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకిన తర్వాత బయటపడుతుంది.

హెచ్ఐవి రోగులు తరచుగా అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నప్పటికీ, వారిలో జీబీఎస్ కేసులు ఇప్పటివరకు తగిన స్థాయిలో నమోదు కాలేదు. తన వైద్య కేంద్రంలో ఆరు నెలల వ్యవధిలో చేరిన 139 మంది హెచ్ఐవి రోగులను పరిశీలించగా, ఎనిమిది మందిలో క్లినికల్ జీబీఎస్ లక్షణాలను డాక్టర్ యనమదల గుర్తించారు.

hiv gbs

వీరంతా యాంటీ- రెట్రోవైరల్ చికిత్స (ART) తీసుకోని, వ్యాధి ముదిరిన హెచ్ఐవి రోగులు. ఈ ఎనిమిది మందిలో హెర్పిస్ కుటుంబానికి చెందిన వైరస్‌ల వల్ల వచ్చే సమస్యలైన, అన్నవాహికలో పుండ్లు (హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ HSV), సర్పి (వేరిసెల్లా జోస్టర్ వైరస్ VZV), దీర్ఘకాలిక విరేచనాలు (సైటోమెగలోవైరస్ CMV) కనిపించాయి.

అయితే ఈ రోగులు ఇతర ఇన్ఫెక్షన్లతో కూడా బాధపడుతున్నారు. వనరుల పరిమితుల మూలంగా, హెర్పిస్ వైరస్‌లను పూర్తి స్థాయిలో నిర్ధారించలేదు. అందువల్ల జీబీఎస్‌కు హెర్పిస్ వైరస్ కారణమని ఈ పరిశోధన కచ్చితంగా తేల్చలేదు. వెన్నుపాము ద్రవ పరీక్షలు (CSF), నరాల పనితీరు పరీక్షలు, వైరస్ పీసీఆర్ వంటివి అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా రోగుల లక్షణాలను సమగ్రంగా పరిశీలించి, జీబీఎస్ ను త్వరగా గుర్తించడం, తగిన వైద్య సహాయం అందించడం కీలకమని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.

ఈ అధ్యయనంలో సకాలంలో చికిత్స అందించగా, ఎనిమిది మందిలో ఏడుగురు రోగులు కోలుకున్నారు, ఒకరు మరణించారు. డాక్టర్ యనమదల మాట్లాడుతూ, “ఈ పరిశోధన హెర్పిస్ వైరస్‌లే జీబీఎస్‌కు కారణమని కచ్చితంగా తేల్చడం లేదు. క్లినికల్ ప్రాక్టీసులో పదేపదే గమనించిన ఒక నమూనాను (Pattern) అంతర్జాతీయ శాస్త్రీయ చర్చకు తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిపై భవిష్యత్తులో మరింత నిర్దారణాత్మక పరిశోధనలు జరగాల్సి ఉంది” అని తెలిపారు.

2000వ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఐవి / ఎయిడ్స్ వైద్య నిపుణుడిగా పేద రోగులకు అందుబాటు ధరలో వైద్యం అందిస్తున్న డాక్టర్ యనమదల పరిశోధనలు ఇటీవల పలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

ఈ పరిశోధన పత్రం: Clinically Probable Guillain-Barré Syndrome and Herpesvirus-Associated Syndromes in Advanced Untreated HIV: A Retrospective Case Cluster From India.

జర్నల్: Journal of the International Association of Providers of AIDS Care (JIAPAC).

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • HIV రోగుల్లో పక్షవాతంపై కాకినాడ ప్రజావైద్యుడి మరో పరిశోధన!
  • రేవంత్ పాలనకు కేవలం 6.5 రేటింగ్ మాత్రమే ఎందుకంటే..?
  • “నో.. నో.. పి.వి. ఈజ్ ఓకే” అందామె! కానీ ఏడేళ్ల తరువాత..?
  • ఈఎన్ఈ రిపీట్ కాలేదబ్బా- అసలు ఈ తరుణ్ భాస్కర్‌కేమైంది..?
  • రాధిక ఆప్టే వెటకారం… బాలయ్యపైనా..? మేనరికాలపైనా..? కీర్తి వివరణ దేనికి.?
  • తమిళ ‘కార్తీకదీపం’ వెలిగించడానికి మోదీ లేదా షా మధురై వెళ్తారా..?
  • Largest Statue Of A Bird… ఈ జటాయువు స్మారకం గురించి మీకు తెలుసా..?
  • అంతా అతను చెప్పినట్టే జగన్ అడుగులు … భారతి చేతికి పగ్గాలు …
  • కాంగ్రెస్‌ను కాదని… ఇండి కూటమి ప్రాంతీయ పార్టీల సపరేట్ బాట !!
  • పాపం సాయిపల్లవి..! తోడుగా శ్రీలీల ఉన్నా ప్రయోజనం ఓ గుండు సున్నా!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions