Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ సమస్య పరిష్కారానికి చేపట్టిన ప్రయోగమే.. మరో సమస్యగా మారితే..?

November 23, 2026 by M S R

.
30 ముంగిసలతో మొదలైన ప్రయోగం.. 45 ఏళ్ల తర్వాత కానీ ముగియని పోరాటం… కొండ నాలుకకు మందు వేస్తే… ఉన్న నాలుక ఊడిపోయిందట అనేది ఓ సామెత. అలా ప్రకృతిసిద్ధమైన సమస్యలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తే అవి ఆ సమస్యను నివారించకపోగా… కొత్త సమస్యలకూ ఎలా దారితీస్తాయో జపాన్ ప్రయోగం ఓ పాఠంగా నిల్చేది.

1979లో పాములు, ఎలుకల బెడదను తగ్గించేందుకు కేవలం 30 ముంగిసలను ఒక ద్వీపంలోకి వదిలారు జపాన్ శాస్త్రవేత్తలు. అయితే అవి అక్కడ విపరీతంగా విస్తరించాయి. వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు శాస్త్రవేత్తలకు దాదాపు 45 ఏళ్లు పట్టింది. ఇది ప్రకృతిలో మనుషులు చేసే జోక్యం ఎలాంటి అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశాలుంటాయో చెప్పే ఓ పర్యావరణ కథనం.

ఈ పర్యావరణ కథనం గురించి తెలుసుకోవాలంటే మనమోసారి జపాన్ లోని అమామి ఓషిమా ద్వీపానికి వెళ్లిరావాలి.

Ads

పాములు, ఎలుకలను నియంత్రించేందుకు ఉపాయం! జపాన్‌లోని ర్యూక్యూ దీవుల సమూహంలో ఉన్న అమామి ఓషిమా ద్వీపం.. జీవవైవిధ్యానికి ప్రసిద్ధి. అక్కడ ప్రపంచంలో మరెక్కడా కనిపించని కొన్ని అరుదైన జంతు జాతులున్నాయి. అయితే విషపూరితమైన హాబు పాములు, ఎలుకల సమస్య స్థానికులను ఇబ్బంది పెట్టేది. దాంతో వాటిని నియంత్రించేందుకు.. 1979లో పొరుగున ఉన్న ఒకినావా ద్వీపం నుంచి సుమారు 30 చిన్న ముంగిసలను తీసుకువెళ్లి అమామి ఓషిమాలో వదిలారు. ముంగిసలు పాములను, ఎలుకలను వేటాడతాయనే అంచనాతో ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా కొత్త సమస్యకు కారణమైంది. కోతుల కోసం కొండెంగలను, అంటే కొండముచ్చులను పట్టుకొచ్చినట్టు..!

snakes

30 నుంచి 10 వేలకు పెరిగిన ముంగిసల సంఖ్య! ముంగిసలు కొత్త వాతావరణానికి అలవాటుపడి వేగంగా సంతానోత్పత్తి చేశాయి. వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. 2000 నాటికి వాటి జనాభా సుమారు 10 వేలకు చేరినట్లు జపాన్ పర్యావరణ శాఖ అంచనా వేసింది. వాటి ఆహారంలో పాములు, ఎలుకలే కాకుండా కప్పలు, కీటకాలు, చిన్న క్షీరదాలు, కుందేళ్లు ఉన్నాయి. దాంతో జీవవైవిధ్యానికి వేదికైన ద్వీపంలో కనిపించే అరుదైన జీవులకు ముప్పు ఏర్పడింది.

ముఖ్యంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న అమామి కుందేలు, అమామి స్పైనీ ర్యాట్ వంటి స్థానిక జీవుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. పాముల సమస్యను పరిష్కరించాలన్న ప్రయత్నం.. స్థానిక జీవవైవిధ్యానికే ప్రమాదంగా మారింది.

ముంగిసల కోసం ప్రత్యేక బృందం! 1990వ దశకంలోనే ముంగిసల ప్రభావాన్ని గుర్తించిన జపాన్ ప్రభుత్వం.. వాటిని పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. 2005లో ప్రత్యేకంగా అమామి ముంగూస్ బస్టర్స్ పేరుతో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం సాధారణంగా ఉచ్చులు పెట్టి ముంగిసలను పట్టుకోవడంతోనే ఆగిపోలేదు. ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగించింది.

ద్వీపవ్యాప్తంగా వేలాది ఉచ్చులను ఏర్పాటు చేసింది. ఆటోమేటిక్ కెమెరాలతో వాటి కదలికలను పర్యవేక్షించింది. ముంగిసల వాసనను గుర్తించే ప్రత్యేక శునకాలను రంగంలోకి దించింది. అడవుల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ విస్తృతంగా గాలింపు చేపట్టింది. ఆ ప్రయత్నాలతో ముంగిసల సంఖ్య గణనీయంగా తగ్గింది. చివరిసారిగా 2018 ఏప్రిల్‌లో ఒక ముంగిసను పట్టుకున్నారు. ఆ తర్వాత కెమెరాలు, ఉచ్చులు, కుక్కల ద్వారా కూడా.. ఆ తర్వాత వాటి ఉనికిని గుర్తించలేకపోయారు.

45 ఏళ్ల తర్వాత అధికారిక ప్రకటన! 2018 తర్వాత ముంగిసలు కనిపించకపోయినా, వాటిని పూర్తిగా నిర్మూలించినట్లు వెంటనే ప్రకటించలేదు. ఎందుకంటే ఒక పెద్ద ద్వీపంలోని ప్రతి అడవిలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఒక్క ముంగిస కూడా మిగల్లేదని నిర్ధారించడం అంత సులభం కాదు. దాంతో జపాన్ పర్యావరణ శాఖ శాస్త్రీయ గణాంకాలు, నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక గణన పద్ధతుల ఆధారంగా వాటి ఉనికిని అంచనా వేసింది. చివరకు 2024 సెప్టెంబర్ 3న అమామి ఓషిమా ద్వీపం నుంచి.. చిన్న భారతీయ ముంగిసలను పూర్తిగా నిర్మూలించినట్లు అధికారికంగా ప్రకటించింది.

మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్న ప్రకృతి! ముంగిసల సంఖ్య తగ్గడంతో అమామి కుందేలు సహా.. పలు స్థానిక జీవజాతుల సంఖ్య, విస్తరణలో మెరుగుదల కనిపించింది. ద్వీపంలోని సహజ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు ముంగిసలను తగ్గించే చర్య దోహదపడింది. 2021లోనే అమామి ఓషిమా సహా.. మరికొన్ని జపాన్ దీవులకు యునెస్కో ప్రపంచ సహజ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు లభించింది.

  • ఒకప్పుడు పర్యావరణ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం మరో సమస్యను సృష్టించింది. దాన్ని సరిదిద్దేందుకు మాత్రం మూడు దశాబ్దాలకు పైగా.. అక్కడి పర్యావరణ శాస్త్రవేత్తలు నిద్రలేకుండా నిరంతర కృషి చేయాల్సి వచ్చింది. ప్రకృతిలోని ప్రతి జీవి ఒక యూనిక్. వాటికంటూ ఓ ప్రత్యేక పాత్ర ఉంటుంది. మనకు సమస్యగా కనిపించే జీవిని మరోచోటికి తీసుకెళ్లడం… కొత్త ప్రాంతాల్లో వదిలేయడం వల్ల కలిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అమామి ఓషిమా అనుభవం ప్రపంచానికి చెబుతోంది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ సమస్య పరిష్కారానికి చేపట్టిన ప్రయోగమే.. మరో సమస్యగా మారితే..?
  • ఆమె హానీట్రాప్‌లో ఆ ’హాట్ చిప్’..! ఆదానీ, అంబానీలకు భలే చాన్స్ !!
  • బిస్లరీ నీరు నిజంగానే అంత డేంజరా..? ఇదీ అసలు కథ..!!
  • The Lakshmana – ప్రయోగం వికటిస్తే దర్శకుడి ముక్కూచెవులు జాగ్రత్త !!
  • ఒక వేర్పాటువాది- ఒక ఉగ్రవాది …! ఇండియా వ్యవహారాల్లో అమెరికా జోక్యం !?
  • అసలు ఆమె ఎవరు..? ఈ పోలీస్ అతి భద్రతలు, బందోబస్తులు దేనికి..?
  • ఓ మలయాళీ హీరోకు తెలుగులో ఇంత మంచి స్పేస్ ఎలాగంటే..?
  • ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ… ఆ పొగల చాయ్ తాగితేనే కదా అసలు మజా !!
  • కులగణన, స్కిల్ డెవలప్మెంట్… మోదీ నోట రే-రె (Re-Re) మాట..!!
  • ఎఐ రంగులు అద్దుకుని కొత్తగా వినిపిస్తున్న ఆపాత మధురాలు !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions