.
లేదు, నిన్న మధురై, తిరుపరకుండ్రంలో దీపత్తూన్ స్తంభం మీద విజయ్ ప్రభుత్వం కార్తీక దీపం వెలిగించలేదు… ఇదీ క్లారిటీ… నిన్న అరుణాచలంలో వెలిగించిన జ్యోతి వేరు- మీడియాలో, సోషల్ మీడియాలో చాలామంది అదీ ఇదీ ఒకటే అనుకుని ‘దీపం వెలిగింది’ అని రాసేశారు… రెండూ వేర్వేరు, అదనంగా శబరిమల దీపం వేరు, అది మకరదర్శనం…
నిన్న కార్తీక పౌర్ణమి (కృత్తికా నక్షత్రం) కావడంతో అరుణాచలంలో కార్తీక మహాదీపం వెలిగింది… తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న 2,668 అడుగుల అరుణాచల కొండ శిఖరంపై ప్రతి కార్తీక మాసంలో (కృత్తికా నక్షత్రం రోజు) సాయంత్రం 6 గంటలకు వెలిగిస్తారు…
Ads
-
భారీ రాగి కొప్పరలో టన్నుల కొద్దీ నెయ్యి, వందల మీటర్ల వస్త్రంతో ఈ మహాదీపాన్ని వెలిగిస్తారు… ఇది 11 రోజుల పాటు నిరంతరాయంగా వెలుగుతూ, చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది… దీనికి ఎలాంటి కోర్టు వివాదాలు లేవు.., నిన్న ఎంతో వైభవంగా జరిగింది…
మరి మధురై..? ఈ తిరుపరంకుండ్రం వివాదం గురించి ‘ముచ్చట’లో పూర్తి వివరాలతో చెప్పుకున్నాం… హైకోర్టు అక్కడ దీపస్థంభం మీద దీపం వెలిగించుకోవచ్చునని చెప్పింది… సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… దీపం వెలిగాక రిపోర్ట్ చేయాలని మధురై కలెక్టర్‌కూ చెప్పింది… కానీ జోసెఫ్ విజయన్ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును తుంగలో తొక్కింది… స్టాలిన్ బాటలోనే నేను కూడా అని చాటుకుంది…
అధికారులు ఎప్పటిలాగే దీపత్తూన్ దిగువన ఉన్న ఉచ్చి పిళ్ళైయార్ మండపం వద్ద మాత్రమే దీపాన్ని వెలిగించారు… నిజానికి ఈ నెల 20న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలి ధర్మాసనం నవంబర్ 24న ఒకే ఒకసారికి (one-time arrangement) దీపత్తూన్ వద్ద దీపం వెలిగించడానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది…
అయితే, తమిళనాడు ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది… రివ్యూ పిటిషన్ పెండింగులో ఉంది కాబట్టి దీపస్థంభం మీద దీపం వెలిగించడం లేదని సాకులు చెప్పింది… కానీ రివ్యూ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఆపలేరని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ నిన్న మధ్యాహ్నం స్పష్టం చేసింది…
ఐనా సరే, విజయ్ ప్రభుత్వ అధికారులు సుప్రీం- హైకోర్టుల ఆదేశాలను ఖాతరు చేయలేదు… సాయంత్రం 6 గంటలకు ఆలయ అధికారులు ‘దీపత్తూన్’ స్తంభానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉండే ఉచ్చి పిళ్ళైయార్ మండపం వద్దే సంప్రదాయబద్ధంగా కార్తీక మహాదీపాన్ని వెలిగించారు…
-
ఉద్రిక్తతలు, అరెస్టులు…: కొండ పరిసరాల్లో ‘రెడ్ జోన్’ ప్రకటించారు, సుమారు 6,000 మంది పోలీసులను మోహరించారు… దీపత్తూన్ వద్ద దీపం వెలిగించకపోవడంపై భక్తులు, హిందూ సంఘాలు కొండ దిగువన నిరసనకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు…
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, మదురై జిల్లా కలెక్టర్ మూడు రోజుల్లోగా దీనిపై కోర్టుకు నివేదిక (Compliance Report) సమర్పించాల్సి ఉంది… ఈ కేసులో తుది వాదనలు 2027 జనవరి రెండో వారంలో జరగనున్నాయి… ఇక సుప్రీంకు ఏమని నివేదిక ఇస్తారో చూడాలి…
శబరిమల – మకరజ్యోతి పూర్తిగా వేరు… కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి ఎదురుగా ఉన్న పొన్నంబలమేడు కొండపై మకర సంక్రాంతి రోజున (జనవరి 14 లేదా 15న) సాయంత్రం కనిపిస్తుంది… దీనికి కార్తీక మాసానికి సంబంధం లేదు…
Share this Article