.
ఒక సినిమా వస్తోంది… నేరుగా ఓటీటీలోకే… అందులో హీరో పేరు YugR.Ai … చిత్రం పేరు ఏకలవ్య… ఎస్, ప్రజెంట్ ట్రెండ్ అంతా పౌరాణికాలదే కదా… అందులోనూ ఏకలవ్యుడి కథ ఎప్పుడూ పఠనీయమే, దర్శనీయమే… గుడ్… కానీ ఈ హీరో ఎవరో తెలుసా..? ఎఐ హీరో… అవును, AI నడిపించే హీరో… ఓ టీజర్ రిలీజ్ చేశారు…
ఎక్కడా హీరో ఒక ఎఐ క్రియేటెడ్ హీరో అన్నట్టుగా లేడు… అచ్చం ‘హీరో’లాగే ఉన్నాడు.., పర్ఫెక్ట్ క్రియేషన్… టీజర్ కూడా బాగుంది… మరీ కృతకంగా ఏమీ అనిపించలేదు… ఆ సినిమా విశేషాలు చదువుతుంటే మరికొన్ని అంశాలు చకచకా గుర్తొచ్చాయి… అవీ చెప్పుకుందాం…
Ads
ప్రముఖ ఓటీటీ సంస్థ లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play) ఈ దిశగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది… ఓ వెబ్‌సిరీస్ రూపొందిస్తోంది… విభు పురి దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్కు రానుంది… తాజాగా యుగ్ను పరిచయం చేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు…
ఇక ఇతర అంశాల్లోకి వెళ్తే… సినిమా తీయాలంటే కథ ఒకటి ఉంటే సరిపోదు. దానికి తగ్గ హీరో కావాలి. హీరోకు తగ్గ హీరోయిన్ కావాలి. వాళ్ల ఇమేజ్‌కు తగ్గ కథ కావాలి. వాళ్ల మార్కెట్‌కు తగ్గ బడ్జెట్ కావాలి. ఇక హీరోగారి కాల్షీట్లు, పారితోషికాలు, డేట్లు, డిస్ట్రిబ్యూషన్ హక్కులు, అభిమానుల అంచనాలు… ఇలా దర్శకుడి సృజనాత్మకత కంటే హీరోగారి చుట్టూ తిరిగే వ్యవహారాలే ఎక్కువైపోతున్నాయి.
కానీ రాబోయే రోజుల్లో ఈ తలనొప్పులన్నింటికీ ఏఐ ఒక పరిష్కారం చూపించబోతోందా? హీరో కావాలంటే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, ఎవడి కాళ్ల దగ్గరా సాగిలబడే దురవస్థ లేకుండా దర్శకుడే తనకు నచ్చిన హీరోను సృష్టించుకుంటే ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఆసక్తికరమైన ప్రశ్న.

హీరోల పారితోషికాలు, హక్కుల గొడవలు ఉండవు! ఒకసారి ఊహించుకోండి. దర్శకుడికి తన కథలో హీరో ఆరడుగుల ఎత్తు ఉండాలనిపిస్తే అలాగే సృష్టించుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన రూపం కావాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. వయసు ఎంత ఉండాలో అంతే ఉంటుంది. కండలు తిరిగిన శరీరం కావాలంటే అదీ సిద్ధం. అవసరమైతే యాక్షన్ సీన్లలో ఎన్ని అంతస్తుల భవనాల నుంచి అయినా దూకించవచ్చు. డూప్ అవసరం లేదు. రిస్కీ స్టంట్లు వద్దని హీరో గారు పేచీ పెట్టే పరిస్థితి ఉండదు. కథలో హీరో ఓడిపోవాలన్నా, చనిపోవాలన్నా, మళ్లీ పుట్టాలన్నా దర్శకుడి ఇష్టం!
ముఖ్యంగా వంద కోట్లు తీసుకునే హీరోలకూ మొహాల్లో భావాలు పలికి చావవు, ఆ బాధ నుంచీ సినిమా రంగానికి ఓ విముక్తి… అన్నింటికంటే ముఖ్యంగా భారీ పారితోషికాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చి హీరోలను ప్రసన్నం చేసుకోవాల్సిన పని లేదు. సినిమా కథ కంటే ముందు హీరో ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకోవాల్సిన అవసరం ఉండదు. హీరోగారి ఎలివేషన్ల కోసం కథను పక్కదారి పట్టించాల్సిన అవసరం కూడా అస్సలు ఉండదు. కథకు అవసరమైనప్పుడు హీరో కనిపిస్తాడు. అవసరం తీరగానే మాయమవుతాడు. దర్శకుడికి అంతకంటే స్వేచ్ఛ ఏముంటుంది?
https://www.instagram.com/reels/DgJ9QyKsJtc/
ముసలి హీరోలకు మేకప్ అవసరం లేదు! ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తెరమీద హీరో వయసు దర్శకుడి చేతిలో ఉంటుంది. యాభై, అరవై ఏళ్ల హీరోలు కూడా కాలేజీ కుర్రాళ్లుగా కనిపించాలంటే మేకప్ మీద గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. వెన్నెముకలకు బద్దలు కట్టి యాక్షన్ సన్నివేశాలు చేయించాల్సిన అవసరం లేదు. హీరోగారి వయసును తగ్గించడానికి కథలో ప్రత్యేకమైన జిమ్మిక్కులు అవసరం లేదు. దర్శకుడు కోరుకున్న వయసు, రూపం, శరీరాకృతి తెరమీద ప్రత్యక్షమవుతాయి.
హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడానికి ప్రత్యేకమైన సన్నివేశాలు, అభిమానుల కోసం ప్రత్యేకమైన డైలాగులు, ఇమేజ్‌కు ఇబ్బంది కలగకుండా కథలో మార్పులు… ఇలాంటి వ్యవహారాలన్నీ క్రమంగా పాతబడిపోవచ్చు. దర్శకుడు హీరోను సృష్టించుకుంటాడు కాబట్టి హీరో దర్శకుడి మాట వినాల్సిన పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఆ హీరోకు సొంతంగా ఒక స్టార్డమ్ ఉండదు. అభిమాన సంఘాలు ఉండవు. సినిమా విడుదలకు ముందు ట్వీట్లు పెట్టే పీఆర్ వ్యవస్థ ఉండదు!
యుగ్ ఆర్.ఏఐ ప్రయోగం విజయవంతమైతే అది కేవలం మరో కొత్త టెక్నాలజీ పరిచయం మాత్రమే కాదు. సినిమా నిర్మాణంలో నటీనటుల పాత్ర, దర్శకుడి స్వేచ్ఛ, స్టార్డమ్ విలువ, పారితోషికాల వ్యవస్థ… అన్నింటిపైనా చర్చ మొదలవుతుంది. అయితే దీనివల్ల నటీనటుల అవసరం పూర్తిగా తీరిపోతుందని ఇప్పుడే చెప్పలేం. ఏఐ పాత్రలతో పాటు నిజమైన నటుల అవసరం కూడా కొనసాగవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఇన్నాళ్లూ దర్శకుడు తన కథకు తగ్గ హీరోను వెతుక్కునేవాడు. రేపు తన కథకు తగ్గ హీరోను తనే తయారు చేసుకునే రోజులు రావచ్చు.
మొత్తానికి... హీరోల కోసం కథలు మారవు, కథలకు తగ్గ హీరోలు కనిపిస్తారు... వావ్...
Share this Article