Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఊగే మోదుగు పూలూ, త్యాగమూ… సారంగపాణీ… దాశరథి కృష్ణమాచార్యా…

November 26, 2026 by M S R

.

‘గోదావరిఖనిలో ఎండకు నీడ కూడా సొమ్మసిల్లుతుంది’– అని మొదలవుతుంది కావూరి శారద కథ ‘పులుపు’… ‘అవతల కొండ శిఖరమ్మీద లోయలోకి వాలుతున్న మరొక తపసిని దర్శించాను’– అని ముగుస్తుంది జయంతి లోహితాక్షన్‌ ‘తపసి’ కథ.

‘నన్ను పెద్దకానిగ సెట్టు అంటారు. రెండు వూళ్ళ మద్దెలో ఉంటా నేను. నా అంత కాండం సూల్లేదు అంటారు జనం. నా మొద్దు గురించి శానామంది శానా గొప్పగా చెప్తార్లే. అట్టా సెప్పిన పతీసారి గాల్లో తేలుతున్నట్టు ఉంటాది నాకు’– అంటాడు సురేంద్ర శీలం ‘కానిగసెట్టు సెప్పిన కథ’లో…

Ads

ఇలాంటి పచ్చని ఆకుల్లాంటి, విచ్చిన పువ్వుల్లాంటి, వూగే కొమ్మల్లాంటి ఇర్రెసిస్టబుల్‌ కథలతో వచ్చిన కొత్త పుస్తకం ‘చెట్టు కథలు 50’. ఇందులో జూపాక సుభద్ర, మానస ఎండ్లూరి నుంచి వాడ్రేవు వీరలక్ష్మీదేవి, ఝాన్సీ పావుదేశి దాకా పన్నెండు మంది రచయిత్రుల కథలున్నాయి.

‘నా చేతులకు గోరింటాకు పండదులేమ్మా’ అని అమర్‌ అహ్మద్‌ అంటే, ‘ఈ చెట్టు తప్ప’ అంటున్నారు తల్లావఝల పతంజలి శాస్త్రి. పూడూరి రాజిరెడ్డి, గొరుసు జగదీశ్వరరెడ్డి, యాజి, నక్కా విజయరామరాజు, తగుళ్ళ గోపాల్‌… ఇలా ఎన్ని పేర్లయినా చెప్పవచ్చు.

ఏం కథలివి! ఎంత మంచి కథలు! ఎంపిక, కూర్పు, ప్రెజెంటేషన్‌… టూమచ్‌ అసలు. పాఠక జన హృదయాల మీద ఈ పారిజాత పూల వాన కురిపించినవాడు మహమ్మద్‌ ఖదీర్‌బాబు. ఎంత శ్రద్ధగా చేశాడో… ప్రతీ రచయిత గురించీ ఒక పేరా, మంచి పరిచయం. ప్రతి కథకీ ఒక ఫోటో, మంచి సెలక్షన్‌. అలనాటి లెజెండరీ చాసో నుంచి ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న కుర్రకుంక వివేక్‌ లంకమల దాకా…

తెలుగు సాహితీ గుమ్మం మీద వెన్నెల దీపాల్లా వెలిగే కథలివి. కరివేపాకు చెట్టుని ‘మా కల్పవృక్షం’ అన్నాడు ఆర్‌.ఎం.ఉమామహేశ్వరరావు. ‘మిద్దె మీదకి వెళ్ళి కరింపాకు రెమ్మ తుంచినప్పుడంతా మా అమ్మ వాసన గుబాళిస్తూ వుంటుంది ఇప్పటికీ’ అంటాడు రచయిత.

మరపురాని ఈ కథా సంకలనం కొని, చదవదగ్గది. చదివి, దాచుకోదగ్గది. చలం అన్నట్టు ‘సాటి మిత్రుడికి ప్రెజెంటేషన్‌గా ఇవ్వదగ్గది’. ఇంతకీ ఈ 500 పేజీల పెద్ద పుస్తకం ధర 395 రూపాయలు మాత్రమే. ఒక అమూల్యమైన కథానిధి ఇంత చవగ్గా దొరకడం ఏం అదృష్టం!

ఖదీర్‌బాబు అనే ఒక అసాధారణమైన రచయిత పడిన కష్టం గునుగు పూలై వికసించింది. పొగడపూలై పరిమళించింది. ఉసిరి చెట్టయి విరగ్గాసింది.

తెలంగాణా పోరాటం గురించి దాశరథి రంగాచార్య నవల ‘మోదుగుపూలు’ మనందరికీ తెలుసు. మరి అదే పేరుతో మహాకవి దాశరథి కృష్ణమాచార్య 1949లోనే ఒక గొప్ప కథ రాశారని తెలుసా? ‘పూచిన మోదుగులు’ అనే ఆ కథ ఆనాటి ‘తెలుగు స్వతంత్ర’లో వచ్చింది’.

ఆ సారంగపాణి.. జైలు… బైట ఎర్రగా విచ్చుకున్న మోదుగులు… రక్తం కక్కుతున్న దృశ్యం… ఆ రెండున్నర పేజీల చిన్న కథని చదివి, తట్టుకుని, ప్రశాంతంగా వుండడం అసాధ్యం. ఒక భయంకరమైన జీవన వాస్తవాన్ని యింత సున్నితంగా చెప్పడం, కథన చాతుర్యమూ, శిల్ప నైపుణ్యమూ కలిపి ఆ పూల చుట్టూ అల్లడం.. ఒకే ఒక్క దాశరథికి మాత్రమే సాధ్యం. త్యాగం రంగు ఎరుపని కథలో ఎక్కడా చెప్పడు రచయిత. ట్రూలీ ఏ డివాస్టేటింగ్‌ షార్ట్‌ స్టోరీ.

ఇందులో ట్యాంక్‌బండ్‌ మీద చెట్టు గురించి ఆర్టిస్ట్‌ మోహన్‌ రాసింది, ఆర్టికల్‌ మాత్రమే, కథ కాదు. అందమైన వొయ్యారపు చెట్టుని చూసిన ఒక భావుకుడి అనుభూతిని ఒక మంచి కథలాగా మోహన్‌ రాశాడు, తన ఇన్మిటబుల్‌ స్టయిల్‌లో. ఇది చాలా సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి ‘ఆదివారం’లో వచ్చిందే.

ఖదీర్‌బాబు ఒక బాధ్యతతో ఈ కథలు సేకరించాడు. కొందర్ని అడిగి మరీ కథలు రాయించాడు. ఏముందీ ఇది తేనెటీగలు చేసే పనేగా. తేనెని కనిపెట్టి సేకరించడమేగా! ఒకప్పుడు రేడియోలో వెన్నెల పాటలు, వీణ పాటలు, వాన పాటలు అని వేసేవాళ్ళు. ఇందులో పెద్ద విశేషం ఏముందీ? అని తేలిగ్గా తీసిపారేయొచ్చు. ఈ పుస్తకం చదివితే, ముఖ్యంగా 50 కథలూ చదివే శ్రద్ధా, వోపికా మీకుంటే మీరా మాట అనలేరు.

‘మరల వేర్లలోనికి’ (బ్యాక్‌ టు రూట్స్‌) అంటూ ఖదీర్‌బాబు ఈ పుస్తకానికి అర్థవంతమైన ముందుమాట రాశాడు. ఇందులోని ఖదీర్‌ రాసిన చివరి కథ ‘మాయమ్మ పూల యాపారం’ ఎంత వేదనతో మన హృదయాన్ని నింపుతుందో, అంత దుఃఖాన్నీ మన కళ్ళముందు పరుస్తుందీ ముందు మాట. మన ఉమ్మడి బాధ్యతని గుర్తు చేస్తుంది. ఇందులో ఒక్క కథా వదలకుండా చదవాలి. ఖదీర్‌ ముందు మాటని అస్సలు మిస్‌ కాకండి.

నాకెందుకో, ‘ది లాస్ట్‌ లీఫ్‌’ అనే ఓ హెన్రీ కథ గుర్తుకొచ్చింది…. – తాడి ప్రకాశ్‌. 9704541559

చెట్టు కథలు

  • ‘చెట్టు కథలు 50’ ఆవిష్కరణ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో… కాపీలు తెలుగుబుక్స్‌డాట్‌ఇన్‌ లేదా నవోదయ, కాచిగూడ నుంచి తెప్పించుకోవచ్చు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఊగే మోదుగు పూలూ, త్యాగమూ… సారంగపాణీ… దాశరథి కృష్ణమాచార్యా…
  • కొత్త ట్విస్ట్! సుప్రీంకు జోసెఫ్ విజయ్ సర్కారు తప్పుడు నివేదిక?
  • ముసలోడే గానీ… మహా కర్కోటకుడు! ఓ భారీ రాక్షస ముఠా బద్దలు !!
  • పాప స్కూల్లో చేరితే బ్రేకింగ్ న్యూసా..? సెలబ్రిటీ ఆరాధనలో ‘అతి’…!
  • ఆకాశంలో ఒక తార… ఇది మన పాలకొల్లు జాహ్నవి కథేనా..?
  • ‘‘గాంధీ ఇంటిపేరు సుగంధీ నుంచి… రాజీవ్ కూలిపని చేసేవాడు’’
  • ఈ ఇద్దరు నటడాక్టర్లు కలిసి ఎంత షో చేసినా… చివరకు బొమ్మ ఫ్లాపే..!!
  • తెలంగాణ కర్రసాముకు జాతీయ గుర్తింపు! ఖేలో ఇండియాలో చేర్పు!!
  • జోసెఫ్ విజయ్ తెలివైన డ్రామా- ఏకంగా సుప్రీంకోర్టుకే బురిడీ…
  • రాహుల్ చెప్పబోయే పేర్లు ఎవరివి..? గుర్తొస్తున్న చంద్రస్వామి పాత కథ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions