Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంతకు తెగించావురా..? ఆ ‘యావ’తో జీవిత ఖైదీనే వదిలేశావు!!

October 6, 2026 by M S R

.

అవును, హెడింగ్ కరెక్టే… ఆ ‘యావ’తో సుప్రీంకోర్టు నకిలీ తీర్పు తయారు చేయించి, ఓ జీవిత ఖైదీనే బయటికి పంపించేశాడు… అందుకే… ఎంతకు తెగించావురా అనే శీర్షిక పెట్టింది… విషయం ఏమిటంటే..?

సుప్రీంకోర్టు తీర్పు అనిపించే ఓ నకిలీ తయారు చేయించాడు.. జీవిత ఖైదీని జైలు నుంచి బయటకు పంపించాడు.. జైలు అధికారిగా ఉండి నిబంధనలనే పక్కన పెట్టాడు.. చివరికి ఆ ఖైదీ భార్యతో లైంగిక వ్యవహారంలోనూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇది పాతదే, కొత్తగా బయటపడింది… కలకలం రేపుతోంది…

Ads

ఒక నేరస్థుడు జైలు నుంచి బయటపడటానికి నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వును తయారు చేయించుకున్నాడంటేనే షాకింగ్. ఆ నకిలీ పత్రాన్ని నమ్మి జైలు అధికారులు ఒక జీవిత ఖైదీని బయటకు పంపించారంటే ఇంకా పెద్ద షాక్. కానీ ఈ కథలో అసలు ట్విస్ట్ అక్కడితో ఆగలేదు.

ఆ వ్యవహారంలో అప్పట్లో జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న వ్యక్తే ఇప్పుడు కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ స్థాయికి ఎదిగాడు. అదే అధికారి ఇప్పుడు ఆ జీవిత ఖైదీని అక్రమంగా విడుదల చేయడంలో తన పాత్రపై కేసు ఎదుర్కొంటూ అరెస్టయ్యాడు.

అంతేకాదు.. ఖైదీ భార్య చేసిన ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత కలచివేస్తున్నాయి. 2018లో పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శంకర్‌కు ఒక్కసారిగా బయట ప్రపంచంలోకి వచ్చే అవకాశం వచ్చింది. అందుకు ఆధారం.. సుప్రీంకోర్టు ఉత్తర్వు!

కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయంటే జైలు అధికారులు విడుదల చేయాల్సిందే. కానీ ఇక్కడే అసలు మోసం దాగి ఉంది. ఆ ఉత్తర్వు సుప్రీంకోర్టు ఇచ్చింది కాదు. నకిలీ పత్రం. అయినా ఆ పత్రం ఆధారంగా శంకర్ జైలు నుంచి బయటకు వచ్చేశాడు.

ఇది జరిగినప్పుడు పరప్పన అగ్రహార జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నది ఎం. సోమశేఖర్. ఇప్పుడు ఆయన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ. కాలం గడిచిపోయింది. శంకర్ బయటే ఉన్నాడు. నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వుతో బయటకు వచ్చిన విషయం కూడా బయటకు రాలేదు.

కానీ నకిలీ పత్రాల మోసం ఎప్పటికీ దాగదు. ఈ ఏడాది వ్యవహారం వెలుగులోకి రావడంతో సుప్రీంకోర్టు రికార్డులను పరిశీలించారు. అసలు అలాంటి ఉత్తర్వే కోర్టు నుంచి రాలేదని తేలింది. దీంతో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ విడుదల వెనుక ఎవరున్నారు? జైలు అధికారులు ఎలా నమ్మారు? ఎవరు పత్రాలు తయారు చేశారు? ఎవరి సహకారం ఉంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

విచారణలో జైలు సిబ్బందిలోని కొందరి పాత్ర బయటపడింది. నకిలీ పత్రం తయారీలో ఒక జైలు ఉద్యోగి పాత్ర ఉందనే ఆరోపణలూ వచ్చాయి. కానీ కథలో మరో కోణం ఇప్పుడు బయటకొచ్చింది.

శంకర్ భార్య చేసిన ఆరోపణలు… తన భర్తను బయటకు తీసుకొస్తాననే పేరుతో అప్పటి జైలు అధికారి తనపై లైంగికంగా ఒత్తిడి చేశాడని ఆమె ఆరోపించింది… ఆమెతో సోమశేఖర్‌కు సంబంధం ఉందన్న ఆరోపణలు, ఆమె కోసం తను అలా తప్పుడుపనికి పాల్పడ్డాడనేదీ విచారణలో ప్రస్తావనకు వచ్చాయి.

ఆ ఆరోపణలతోపాటు నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వు, జీవిత ఖైదీ విడుదల, జైలు అధికారుల పాత్ర, పెరోల్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలు అన్నీ కలిసినప్పుడు ఈ కేసు సాధారణ జైలు అక్రమాల కేసుగా మిగలడం లేదు. ఎందుకంటే ఒక జైలు అధికారి చేతిలో ఉండాల్సింది తాళంచెవి మాత్రమే కాదు.. చట్టం కూడా.

ఆ తాళంచెవి చేతిలో పెట్టుకుని చట్టాన్నే పక్కన పెట్టేస్తే? జీవిత ఖైదీని బయటకు పంపించేందుకు నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వు వస్తే.. దాన్ని ఒక్కసారి కూడా సరిచూసుకోకుండా విడుదల చేస్తే.. పెరోల్ విషయంలోనూ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వస్తే.. చివరికి అదే ఖైదీ భార్య నుంచి వ్యక్తిగత ఆరోపణలు కూడా వస్తే..

అప్పుడు సామాన్యుడి నోట ఒక్క మాటే వస్తుంది. “ఎంతకు తెగించావురా..?” జైలులో ఉన్నవాడికి బయటకు రావాలనే కోరిక ఉండటం సహజం. నేరస్థుడు చట్టంలో ఉన్న ప్రతి లొసుగును వెతుక్కోవడం కూడా కొత్తేమీ కాదు. కానీ జైలును కాపాడాల్సిన అధికారులే ఆ లొసుగులకు తలుపులు తెరిస్తే?

అది కేవలం ఒక ఖైదీని అక్రమంగా విడుదల చేయడం కాదు. వ్యవస్థకు వేసిన తాళాన్ని వ్యవస్థలోని మనిషే తీసి పారేయడం. ఇంకా దారుణం ఏమిటంటే.. నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వుతో బయటకు వచ్చిన వ్యక్తి ఎనిమిదేళ్లు స్వేచ్ఛగా తిరిగాడు. అంటే ఒక నకిలీ కాగితం అంతకాలం ఒక జీవిత ఖైదీకి స్వేచ్ఛ ఇచ్చింది.

ఇప్పుడు ఆ కాగితం నకిలీ అని బయటపడింది. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా పెద్దదే. ఆ కాగితం నకిలీ అని గుర్తించాల్సిన వ్యవస్థ.. ఎనిమిదేళ్లు ఏం చేసింది? ఆ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ కేసులో అసలు కథ ముగిసినట్టే కాదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!
  • “ఖాన్‌తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయ్”
  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!
  • నేను రెడీ’ అని స్మృతి చెప్పింది.. మూడు నెలలకే హర్మన్ తప్పుకుంది!
  • అబ్బురపరిచే సినిమాటిక్ ‘ఎదుగుదల’..! ఎవరీ ‘పవర్‌ఫుల్ కేరక్టర్..?
  • అనుకుంటాం గానీ… రెహమాన్ సంప్రదాయ రాగాల్లోనూ దిట్ట !!
  • చో – ఎవడినీ లెక్కచేయలేదు- నమ్మిన ఏ మాటనూ దాచుకోలేదు…!!
  • SIR ప్రకంపనలు- న్యాయవ్యవస్థలోనూ చర్చ – భిన్నాభిప్రాయాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions