.
1400 సినిమాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు… ప్రతిభ ఒక్కటే సరిపోదు, ఓపిక, అదృష్టం, అవకాశాలు అన్నీ కలిసి రావాలి… అలాంటి ఓ రికార్డు స్థాయి నటి ఇప్పుడు ఏం చేస్తోంది మరి..? ఓ మారుమూల పల్లెలో అన్నీ వదిలేసి, మరిచిపోయి, అనామకంగా అజ్ఙాత జీవితం గడుపుతోంది… అదీ అసలు విశేషం… డెస్టినీ ఎవరిని ఎటువైపు తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు కదా…
తెలుగు, తమిళ సినీ రంగాలలో హాస్యానికి ఒక ప్రత్యేకమైన నిర్వచనంలా నిలిచిన పేరు ‘రమాప్రభ’. 1400కు పైగా చిత్రాల్లో నటించి, వాణిశ్రీ వంటి అగ్ర నటీమణులతో సమానమైన స్టార్‌డమ్ పొందిన ఆమె ప్రస్థానం ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, విషాదాలు, అద్భుత విజయాలతో నిండి ఉంది. అసలు ఈమె జీవితమే ఓ సినిమా కథ…
Ads
రమాప్రభ అసలు పేరు రమాదేవి. ఆమె పుట్టింది అనంతపురం జిల్లా కదిరి… నెలల పసికందుగా ఉన్నప్పుడే మేనత్త- మేనమామలకు దత్తత వెళ్లింది… ఆమె బాల్యం కదిరి, ఊటీలలో గడిచింది. చదువు పెద్దగా అబ్బకపోయినా, 14 ఏళ్ల వయసులో మద్రాస్ చేరుకున్న తర్వాత నాటకరంగం పట్ల ఆకర్షితురాలైంది. ఆర్.ఎస్. మనోహర్ నాటక కంపెనీలో చేరి, తమిళ నాటకరంగంలో లబ్ధప్రతిష్ఠురాలిగా ఎదిగింది. ఎంత పెద్ద డైలాగ్ అయినా విని ఇట్టే చెప్పేసే ‘ఏకసంథాగ్రాహి’గా ఆమె పేరు పొందింది.
సినీ ప్రవేశం- అద్భుత జ్ఞాపకశక్తి:
తమిళంలో దాదాపు 30 చిత్రాల్లో నటించిన తర్వాత, ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. దర్శకుడు ప్రత్యగాత్మ ‘చిలకా గోరింక’ చిత్రంలో కృష్ణంరాజును హీరోగా పరిచయం చేస్తూ, పద్మనాభం సరసన రమాప్రభను ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేశారు. షూటింగ్‌లో పద్మనాభం డైలాగ్ పేపర్ ఇచ్చి చదువుకోమని చెప్పాడు, తనకు తెలుగు చదవడం రాదని ఆమె భయపడ్డది. కానీ, పద్మనాభం ఒకసారి చదివి వినిపించగానే, రమాప్రభ తడుముకోకుండా డైలాగులు చెప్పి సింగిల్ టేక్‌లో షాట్ ఓకే చేయించుకుంది. ఇది ఆమె అద్భుత జ్ఞాపకశక్తికి నిదర్శనం.
రాజబాబుతో సంచలన జోడి:
రమాప్రభ కెరీర్‌లో హాస్య నటుడు రాజబాబుతో ఆమె జోడి ఒక సంచలనం. వందకు పైగా చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వీరిద్దరూ సినిమాలో ఉన్నారని తెలిస్తే చాలు, థియేటర్ల వద్ద టిక్కెట్లు తెగేవి. నిర్మాతలు హీరోని ఖరారు చేయకముందే వీరి డేట్స్‌ను బ్లాక్ చేసుకునేవారు. రోజుకు 20 గంటల పాటు పని చేసిన రోజులు వారికి చాలా ఉన్నాయి. రాజబాబు మరణం తన జీవితంలో అతిపెద్ద నష్టమని రమాప్రభ పలుమార్లు పేర్కొన్నది ఇందుకే.
వ్యక్తిగత జీవితం – శరత్ బాబుతో అనుబంధం:
రమాప్రభ వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. నటుడు శరత్ బాబుతో ఆమె ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే, వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు, ఆ తర్వాత విడిపోవడం ఆమె జీవితంలో ఒక పెద్ద లోటుగా మిగిలిపోయింది. ఈ సంఘటనలు ఆమెను మానసికంగా, ఆర్థికంగా ఎంతో ప్రభావితం చేశాయి. తన జీవితంలో ఎదురైన ఈ ఆటుపోట్లను ఆమె ధైర్యంగానే ఎదుర్కొన్నది. తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని నటుడు రాజేంద్రప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేయడం ద్వారా ఆమె తన బంధుత్వాలను మరింత పెంచుకున్నది.
నిర్మాతగా పునర్వైభవం:
రమాప్రభ నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ‘గాంధీనగర్ రెండవ వీధి’, ‘అప్పుల అప్పారావు’, ‘వింత ఇల్లు సంతగోల’ వంటి చిత్రాలను నిర్మించింది. అయ్యప్పమాల ధరించిన తొలి తెలుగు నటి రమాప్రభే కావడం విశేషం. అవకాశాలు తగ్గిన ఒక దశలో ఆమె భక్తిమార్గం పట్టినప్పటికీ, దర్శకుడు కృష్ణవంశీ ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో మళ్లీ ఆమెకు పునర్వైభవం కల్పించాడు.
ప్రస్తుత జీవనం:
ప్రస్తుతం ఆమె చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సమీపంలోని వాయల్పాడులో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. అవకాశాలు తగ్గిన వేళ, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెకు ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆమె ఓ సందర్భంలో వెల్లడించింది. ఎన్నో వందల పాత్రల్లో నటించి, నవ్వుల రాణిగా పేరుతెచ్చుకున్న రమాప్రభ, నేడు సినీ గ్లామర్‌కు దూరంగా తన నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తున్న తీరు విశేషమే… అందుకే ముందే చెప్పింది- ఆమె జీవిత కథ కూడా ఓ సినిమా కథే…
#ramaprabha #UntoldStories #actresses #actresslife #TollywoodUpdates #entertainmentnews #entertaiment #tollywood
Share this Article