Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సముద్రపు అలల సాక్షిగా మత్స్యకార ప్రాణాలపై వివక్ష !!

August 19, 2026 by M S R

.
సముద్రపు అలల సాక్షిగా వివక్ష: కోనసీమ మత్స్యకారుల గల్లంతు విషాదం వెనుక చేదు వాస్తవాలు… Srinivas Ganjivarapu

సముద్రం అందరికీ ఒక్కటే, దాని ఉగ్రరూపమూ ఒక్కటే. ప్రాణాల కోసం తపించే కన్నతల్లుల కన్నీటి ఉప్పెనా ఒక్కటే. కానీ ఆ కన్నీటి విలువను కొలిచే వ్యవస్థల త్రాసులో మాత్రం వర్గ, ప్రాంతీయ వివక్ష పచ్చిగా కనిపిస్తోంది.

విశాఖ తీరంలో బోటు మునిగినపుడు .. ఓబీ వ్యాన్లు క్షణక్షణం ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. అధికార యంత్రాంగం రాత్రికి రాత్రే కదిలింది.. హెలికాప్టర్లు గాల్లోకి లేచాయి. సంఘాలు.. మంత్రులు తీరానికి పరుగులు తీశారు. కానీ అదే బంగాళాఖాతంలో, కోనసీమ ఓడల రేవుకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతైతే మునుపటి రీతిన స్పందన ఏదీ?

Ads

అల్లవరం తీరంలో బిడ్డల కోసం గుండెలు బాదుకుంటున్న ఆ తల్లుల రోదనలు వ్యవస్థల గోడలను ఎందుకు తాకడం లేదు? నగర తీరమైతేనే ఉలిక్కిపడే సమాజం, మారుమూల పల్లె జాలర్ల ప్రాణాలను కేవలం రికార్డుల్లోని సంఖ్యలుగానే లెక్కగడుతుందా?

ఈ వివక్ష వెనుక ఏళ్ల తరబడి పేరుకుపోయిన వ్యవస్థాగత నేరం దాగి ఉందనే విషయాన్ని ఎందుకు పరిశీలన చేయడం లేదు. తీరానికి 50 నుంచి 100 నాటికల్ మైళ్ల దూరం వెళ్లే బోట్లకు శాటిలైట్ ఫోన్లు, అత్యవసర బీకాన్లు, జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయడంలో మత్స్యశాఖ ఘోరంగా విఫలమైంది.

ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో ఏ బోటు ఎప్పుడు వెళ్లిందో, ఎంతమంది ఉన్నారో నమోదు చేసే నాథుడే లేడు. అల్లవరం సముద్ర తీరం నుంచి బోటు వేటకు బయల్దేరి పక్షం రోజులు గడిచినా గుర్తించలేని ధోరణి క్షమార్హం కాదు…ఒకరకంగా ఆ నెల్లూరు తీరంలో పట్టపు వారి తీరే సమంజసం ఏమో!

రొయ్యల చెరువుల అనుమతులు, ఫీడ్/ మందుల మాఫియాల ముడుపుల లెక్కల్లో మునిగితేలే మత్స్య శాఖ అధికారులకు సముద్ర వేటలో మనుషుల భద్రత పట్టదా? నగరాలకే పరిమితమైన ఆధునిక రెస్క్యూ నెట్‌వర్క్ గ్రామీణ తీరాలకు ఎందుకు చేరదు?

​సముద్రపు వేట, ఆక్వా సాగు ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం, ఆదాయం సమకూరుతోంది. ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని కేవలం ఆదాయ వనరుగా చూడటం మానేసి, మత్స్యకారుల రక్షణను ప్రాథమిక హక్కుగా గుర్తించాలి.

ఇందుకోసం సంపూర్ణ అధికారాలు, జవాబుదారీతనం కలిగిన స్వయంప్రతిపత్తి గల ప్రత్యేక శాఖను .. అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, ఈ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అత్యవసర సమయమిది.

#KonaseemaFishermen
#FishermenSafety
#SaveFishermen
#MarineSafety
#OdalarevuTragedy
#Allavaram
#Konaseema
#AndhraPradesh
#FisheriesDepartment
#CoastalCommunities
#HumanRights
#SystemicNeglect
#SocialJustice
#TeluguJournalism
#GroundReport

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సముద్రపు అలల సాక్షిగా మత్స్యకార ప్రాణాలపై వివక్ష !!
  • సోషల్ జస్టిస్ Vs ఫ్యామిలీ జస్టిస్ – కేసీయార్ క్యాంపు నోరెత్తితే ఒట్టు !!
  • విజయ శాంతికి కవిత సర్టిఫికెట్ ! రేవంత్ రెడ్డికి ఇక తప్పేట్టు లేదు పాపం !!
  • ఈ ఖండిత శిరస్సు కథేమిటో పాఠంగా చెప్పాలి… చరిత్ర లిఖించబడాలి…
  • తన జన్మస్థలి- తన రాజధాని ఖిలాషాపూర్… అక్కడ తన కోట…
  • రేవంత్ నేరాలు- ఓ నిశిత విశ్లేషణ ! ఈ సంఖ్య కేసీయార్ వేధింపుల పుణ్యమే !!
  • పెదరాయుడు రజినీకాంత్ ! అత్యంత సహృదయ స్నేహశీలి !
  • ఫేక్ న్యూస్‌పై కేంద్ర ప్రభుత్వం ‘యుద్ధం’ ప్రారంభించింది !
  • ఓ ప్రియురాలి వేదన – ఈ ఒక్క పాటతో గుల్జార్ వెనక్కి చూసుకోలేదు ఇక !!
  • తడి తడిమే ఓ ఆర్ద్రగీతం- కర్కశ హృదయుల కళ్లూ చెమర్చాల్సిందే

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions