Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

“శాంతము లేక సౌఖ్యము లేదు” … “తన కోపమే తన శతృవు” …

May 19, 2026 by M S R

.

Gottimukkala Kamalakar …. కొంపల్ని తగలెయ్యడానికి తాటాకు మంటలు చాలు. క్షణికావేశం అర్హతో, బలహీనతో కాదు. అదో మానసికవైకల్యం..!
“చూశారూ.., నాక్కొంచెం ప్రధమకోపం..! ఆట్టే గణించకండేం..!” అంటాడు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు.

పెళ్లాం నెత్తిన పెరుగన్నం బోర్లించేంత కోపం. ఒక్కగానొక్క కొడుకుని పెయ్యకట్టుతో వీపుసాపు చేసేంత కోపం. పెరటిగోడ కోసం వ్యాజ్యం వేసి ఎకరం పొలవమ్ముకునే కోపం. కూతుర్ని కునిష్టి ముసలాడికి పెళ్లి చేయడానికి నిర్ణయం చేసుకుని, అడ్డొచ్చిన తల్లిని ” ఆడముండల్తోనా ఆలోచన..! తాంబోలాలిచ్చేసాను. తన్నుకు చావండ”నేంత కోపం, మూర్ఖత్వం.

Ads

దుర్యోధనుడూ; ద్రౌపదీ; ద్రోణుడూ; ద్రుపదుడూ; అశ్వద్ధామా; పరీక్షిత్తూ; తక్షకుడూ..! వీళ్ల కోపం లేకుండా భారత, భాగవతాల్లేవు.
ఎంత తపస్సు చేసినా విశ్వామిత్రుడు; భృగువూ; దుర్వాసుడూ; అగస్త్యుడూ కోపాన్ని వాళ్ళ అహంకారం వల్ల జయించలేకపోయారు. అవమానాల పాలయ్యారు.

కొరకొరచూపులూ; చురచురమాటలూ; మూతివిరుపులూ సంసారంలో కూడా ఈ రోజుల్లో చెల్లని పరిస్థితి. గీజర్ స్నానాలగదిలో ఆన్‌లో లేదని, కర్రీపాయింట్ కూరలే రోజూ తినాల్సిన పరిస్థితి ఏంటని, బాక్సర్స్ వేసుకోకుండా లుంగీ కడతావేంటనీ, గొడవలు మొదలై విడాకులు తీసుకున్న శాంతమూర్తులు కొందరు తెలుసు నాకు.

“అసమర్ధో సాధూనాం..!” అన్న భర్తృహరి సుభాషితం పాతమాట. కోపం తగ్గాలంటే బాత్రూంలో గట్టిగా బూతులు తిట్టి; అద్దం ముందు నుంచుని అరిచేస్తే సగం కష్టం తీరిపోతుంది.
రెండు పుచ్చొంకాయలున్నాయని మొత్తం కూరల్ని బైట పోసుకోకూడదు. కొంచెం తెగులుందని చేను; రంగు తగ్గిందని మేను తగలబెట్టుకోకూడదు. ఏవో చిన్న అభిప్రాయబేధాలొచ్చాయని మనుష్యుల్ని దూరం చేసుకోకూడదు. మనం ముందు పలకరిస్తే మన కొమ్ములేం ఊడిపడవు. నిరంతరం ఎత్తుకు తిరగడానికి మన తలేం జాతీయపతాకం కాదు.

“శాంతము లేక సౌఖ్యము లేదు” అన్నాడు కృతికారుడు..
“తన కోపమె తన శతృవు” అన్నాడు శతకకారుడు..
ఐనా మా గుణం మానుకోం.. ధుమధుమలాడుతూనే ఉంటాం అంటారా…?
“కర్మణ్యేవాధికారస్తే” అన్నాడు గీతకారుడు.
స్వస్తి.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!
  • నా ముఖం వీడియో తీయనివ్వకండి… మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
  • Not Appropriate – రేవంత్ USA పర్యటనపై కేంద్రానికి డౌట్లు అర్థరహితం..!
  • ఈమె గుర్తుందా ? అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ కెరీర్ ఎంచుకుని ఫ్లాప్ !!
  • ఓహ్, ఈమెను తరిమేయడం వెనుక ఇంత ‘స్పిరిట్’ ఉందా?
  • Awarapan-2 … అనూహ్యంగా హిట్ – భారీగానే వసూళ్లు !!
  • Prakash Raj … ‘స్పిరిట్’ నుంచి తరిమేశారు – మరి వారణాసి మాటేమిటి !?
  • ఓడలు బళ్లు – బళ్లు ఓడలు … వెస్టిండీస్ – బంగ్లాదేశ్ మంచి ఉదాహరణ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions