.
40 ఏళ్ల ఒంటరితనం.. మరణం తర్వాత కూడా కొనసాగుతున్న అన్వేషణ! …. ముంబైలో కన్నుమూసిన లలితా కృష్ణమూర్తి.. ఇద్దరు కుమార్తెల కోసం వెతుకులాట.. చివరి ప్రయాణంలో తోడుగా నిలిచిన పొరుగువారు! (సాంతం చదివి కంటతడి పెడతారో, ఈరోజుల్లో కామనే కదాని వదిలేస్తారో మీ ఇష్టం)
కన్నతల్లికి చివరి వీడ్కోలు చెప్పేందుకు కూడా పిల్లలు అందుబాటులో లేకపోతే..? నాలుగు దశాబ్దాలుగా ఒంటరిగా జీవించిన ఒక మహిళ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ వాళ్లు ఎక్కడున్నారు? ఏ పరిస్థితుల్లో ఉన్నారు? తల్లి మరణవార్త వారికి చేరిందా? అన్నది కూడా తెలియదు. చివరకు ఆ ఇద్దరు కుమార్తెల ఆచూకీ కోసం వార్తాపత్రికలో ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
Ads

ఎవరీ లలితా కృష్ణమూర్తి?
లలితా కృష్ణమూర్తి స్వస్థలం చెన్నై. దాదాపు 40 ఏళ్లుగా ఆమె ముంబైలో ఒంటరిగా జీవిస్తున్నట్టు సమాచారం. నవంబర్ 13, 2026న ఆమె ముంబైలో కన్నుమూసింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఇతర బంధువులు ఉన్నప్పటికీ వారి ప్రస్తుత చిరునామాలు, ఆచూకీ తెలియని పరిస్థితి. దీంతో ఆమె మరణానంతరం అవసరమైన లాంఛనాలు, అంత్యక్రియల ఏర్పాట్ల బాధ్యతను పొరుగువారు, బంధువులైన ఓ దంపతులు తీసుకున్నారు.
కుమార్తెల కోసం వార్తాపత్రికలో ప్రకటన!
లలితా మరణవార్తను తెలియజేస్తూ, ఆమె కుమార్తెలు, దగ్గరి కుటుంబ సభ్యులు, బంధువులు లేదా వారి ఆచూకీ తెలిసినవారు సంప్రదించాలని కోరుతూ ఒక వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చారు. ఉషా లక్ష్మీనారాయణ్, పవన్ శెట్టి అనే ఇద్దరి సంప్రదింపు వివరాలను అందులో పొందుపరిచారు.
ఈ ప్రకటనను చూసిన కిషోర్ సుబ్రమణియన్ అనే వ్యక్తి అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి పవన్ శెట్టితో మాట్లాడారు. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాంతో లలితా కృష్ణమూర్తి కథ చాలామందిని కదిలించింది.
ఒంటరితనం ఒక్క లలిత కథేనా?
ఈ ఘటనను కేవలం ఒక మహిళ విషాదగాథగా చూడలేం. పెద్ద నగరాల్లో పిల్లలు ఉద్యోగాలు, ఉపాధి, ఇతర కారణాలతో దూర ప్రాంతాలకు వెళ్లిపోవడం సాధారణమైంది. తల్లిదండ్రులు మాత్రం సొంత ఇళ్లలోనే ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఫోన్లో పలకరింపులు, అప్పుడప్పుడు పంపే డబ్బు.. ఇవి అవసరమే. కానీ వృద్ధాప్యంలో పక్కన ఉండే మనిషి ఇచ్చే ధైర్యానికి అవి ప్రత్యామ్నాయం కాలేవు.
లలితా విషయంలో ఆమె కుమార్తెలు 40 ఏళ్లుగా ఎందుకు దూరంగా ఉన్నారు? వారితో సంబంధాలు ఎలా ఉండేవి? అసలు వారికి తల్లి మరణవార్త తెలుసా? వంటి ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. అయితే ఈ ఘటన ఒక విషయాన్ని మాత్రం గుర్తుచేస్తోంది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం వారిని పలకరించడం, వీలైనప్పుడు దగ్గరుండటం ఎంత ముఖ్యమో చెబుతోంది.
చివరకు లలితకు చివరి ప్రయాణంలో తోడుగా నిలిచింది రక్తసంబంధం కాదు.. ఆమెతోపాటు నివసించిన పొరుగువారి మానవత్వం. ఆమె ఇద్దరు కుమార్తెల ఆచూకీ కోసం అన్వేషణ మాత్రం కొనసాగుతోంది…!!
Share this Article