Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కామెడీ కళ్యాణ్ ! రెనిగేడ్ కళ్యాణ్ ! నక్సలైట్లూ కామెడీ సరుకైపోయారా ?!

October 10, 2026 by M S R

.

సినిమా వాళ్లు కదా… దేన్నయినా వెకిలి చేయగలరు… ఇంగితం లోపిస్తే అంతే… కామ్రేడ్ కల్యాణ్ చూశాక మదిలో అనిపించేది అదే… వేల ప్రాణాలు బలైన నక్సలైట్ల ఏళ్ల సాయుధ పోరాటం.. చివరకు సినిమా వాళ్లకు కామెడీ సరుకై పోయింది… మిత్రుడు రంగావఝల భరధ్వాజ అన్నట్టు… ఇది రెనిగేడ్ కల్యాణ్… బహుశా ఈ పదానికీ అర్థం ఈ దర్శక నిర్మాతలకు తెలిసి ఉండు…

‘కామ్రేడ్ కళ్యాణ్’లో నవ్వుల మాటున నక్సలిజం విషాదం! సినిమాలో కామెడీ చేయొచ్చు. ఎంతటి సీరియస్ సబ్జెక్టునైనా వినోదాత్మకంగా చెప్పొచ్చు. కానీ ఒక అంశాన్ని వినోదంగా చూపించడానికి, దాని వెనుక ఉన్న చరిత్రను, రక్తాన్ని, త్యాగాలను కూడా తేలికగా తీసుకోవచ్చా? వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఒక సాయుధ పోరాటాన్ని తెరమీద నవ్వుల కోసం ఉపయోగిస్తే.. ఆ నవ్వుల వెనుక ఉన్న విషాదాన్ని ఎవరు గుర్తుచేస్తారు? ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా చూసిన తర్వాత కలిగే ప్రధానమైన ప్రశ్న ఇదే!

Ads

శ్రీవిష్ణు సినిమా అంటే కామెడీకి కొంత భరోసా ఉంటుంది. ఆయనకు ఉన్న కామెడీ టైమింగ్, సన్నివేశాలను తనదైన శైలిలో నడిపించే తీరు ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. అందుకే ‘కామ్రేడ్ కళ్యాణ్’ మీద కూడా వినోదాన్ని ఆశించడం సహజమే. అయితే ఈసారి దర్శకుడు ఎంచుకున్న నేపథ్యం మాత్రం సాధారణమైనది కాదు. నక్సలిజం!

తెలుగు నేల చరిత్రలో దశాబ్దాలపాటు తీవ్ర చర్చకు కారణమైన ఒక సాయుధ ఉద్యమం. దాని వెనుక భూస్వామ్య దోపిడీ, సామాజిక అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ఉన్నాయి. అదే సమయంలో హింస, ప్రాణనష్టం, కుటుంబాల విచ్ఛిన్నం, ప్రభుత్వ బలగాలతో ఘర్షణలు, ప్రజల భయాందోళనలు కూడా ఉన్నాయి.

ఇంతటి సంక్లిష్టమైన నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు సినిమాకు మరింత బాధ్యత అవసరం. ఉద్యమాన్ని సమర్థించాలా, విమర్శించాలా అన్నది వేరే చర్చ. కానీ దాని తీవ్రతను అర్థం చేసుకుని కథ చెప్పడం మాత్రం ముఖ్యం. ఆ బాధ్యతను పక్కనపెట్టి, నక్సలైట్లను కామెడీ సన్నివేశాలకు అనువైన పాత్రలుగా మార్చేస్తే మాత్రం అసలు సమస్య మొదలవుతుంది.

కథలో సీరియస్‌నెస్ ఉంది.. తెరమీద మాత్రం నవ్వుల వేట! ‘కామ్రేడ్ కళ్యాణ్’ కథ విషయానికి వస్తే.. అనకాపల్లి పరిసరాల్లోని ఓ పల్లెటూరిలో థియేటర్ నడిపే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. హీరోయిన్‌తో ప్రేమ, ఆమెకు ఎదురైన సమస్యను పరిష్కరించే ప్రయత్నం, అనుకోకుండా నక్సలైట్ల మధ్య చిక్కుకోవడం.. అక్కడి నుంచి పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఇరుక్కుని బయటపడే ప్రయత్నం కథలోని ప్రధాన అంశాలు.

కథలో ఆసక్తి కలిగించే అంశాలున్నాయి. హీరో ఒకవైపు పోలీసులకు, మరోవైపు నక్సలైట్లకు చిక్కకుండా ఎలా బయటపడతాడన్న ఉత్కంఠను పెంచడానికి మంచి అవకాశముంది. ప్రేమకథకు, థ్రిల్లర్‌కు, నక్సలిజం నేపథ్యానికి మధ్య సమతూకం సాధిస్తే ఇదొక ఆసక్తికరమైన సినిమాగా నిలిచే అవకాశం కూడా ఉంది. కానీ ఈ మూడు అంశాల మధ్య ఎలాంటి సమన్వయం ఉండాలనే విషయంలోనే సినిమా తడబడింది… తేడా కొట్టేసింది…

నక్సలైట్ల మధ్య చిక్కుకున్న హీరో పరిస్థితిలో సహజంగానే ప్రమాదం ఉంటుంది. ప్రాణాలు పోయే భయం ఉంటుంది. ప్రతి మాటను, ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనే కామెడీని ఇరికిస్తే.. ఆ ప్రమాదం తీవ్రత తగ్గిపోతుంది. ప్రేక్షకుడు హీరో ఏమవుతాడోనని ఉత్కంఠతో చూడాల్సిన చోట, తర్వాత ఏ కామెడీ సీన్ వస్తుందా అని ఎదురుచూస్తాడు. ఫలితంగా కథలోని సీరియస్‌నెస్ దెబ్బతింటుంది.

నక్సలిజం అంటే కేవలం ఒక సినిమా సెటప్ కాదు! నక్సలిజం చరిత్రను ఏకపక్షంగా చూడాల్సిన అవసరం లేదు. ఆ ఉద్యమం పుట్టుకకు దారితీసిన సామాజిక పరిస్థితులు, దాని పేరుతో జరిగిన హింస, ప్రభుత్వ ప్రతిస్పందన, అమాయకుల ప్రాణనష్టం.. ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే. ఉద్యమంలో పాల్గొన్నవారి జీవితాలు, వారి కుటుంబాల బాధలు, ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాల విషాదాలు.. ఇలా ఎన్నో కోణాలున్నాయి.

అందుకే నక్సలిజాన్ని నేపథ్యంగా ఎంచుకున్న దర్శకుడికి అపారమైన కథా అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది. ఉద్యమాన్ని గొప్పదిగా చూపించాలన్నా, దాని పద్ధతులను ప్రశ్నించాలన్నా, అందులోని వ్యక్తుల జీవితాలను ఆవిష్కరించాలన్నా బలమైన రచన అవసరం. కానీ దాని తీవ్రతను తగ్గించి, కేవలం హీరో కామెడీకి ఉపయోగపడే పరిస్థితిగా మార్చేస్తే.. ఓ పిచ్చి ప్రేమకథకు నేపథ్యంగా మలిస్తే… అదొక విషాదం…

సినిమా అనేది చరిత్ర పాఠం కాదు. ప్రతి సినిమాలో సామాజిక సందేశం ఉండాలని కూడా ఎవరూ పట్టుబట్టరు. పూర్తిస్థాయి వినోదాన్ని అందించే హక్కు దర్శకుడికి ఉంది. అయితే ఒక చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకున్నప్పుడు దానిని ఎలా ఉపయోగిస్తున్నామన్నది కూడా ముఖ్యం. కామెడీ చేయడం తప్పు కాదు. కానీ ఆ కామెడీ కథలోని సహజత్వాన్ని, పాత్రల ప్రాణభయాన్ని, నేపథ్యంలోని విషాదాన్ని పూర్తిగా మింగేస్తే మాత్రం అది రచనలోని బలహీనతగా కనిపిస్తుంది.

శ్రీవిష్ణు నవ్వించాడు.. కానీ కథ నిలబడిందా? సినిమాలో శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటాడు. సుదర్శన్‌తో సన్నివేశాలు, సత్య ఎంట్రీ తర్వాత వచ్చే కామెడీ, ఇంటర్వెల్ భాగం ప్రేక్షకులకు కాస్త వినోదాన్ని అందిస్తాయి. రాధిక బాలయ్య ఫ్యాన్ పాత్రలోని మాస్ హడావుడి, వెన్నెల కిషోర్ కనిపించే సన్నివేశం కూడా నవ్వించే విఫల ప్రయత్నం చేస్తాయి. అసలు రాధిక ఈ పాత్రను ఎందుకు అంగీకరించింది..?

comrade kalyan

ఫొటోగ్రఫీ బాగుంది. ఏజెన్సీ ప్రాంతంలోని అడవి అందాలను తెరమీద చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. విజయ్ బుల్జానిన్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ఎటొచ్చీ దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఎంచుకున్న కథే అభ్యంతరకరం…

ఇక రచనలోనూ కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. కథ 1994లో జరుగుతుందని చెబుతూ, ఇప్పటి ట్రెండ్‌కు సంబంధించిన సినిమాల ప్రస్తావనలు, ఆధునిక కాలపు డైలాగులు ఉపయోగించడం కామెడీ కోసం చేసిన ప్రయత్నమే కావొచ్చు. కానీ అవి కథాకాలానికి సరిపోతున్నాయా లేదా అన్నది కూడా చూడాలి. కొన్ని చోట్ల ఈ తరహా ప్రయోగాలు నవ్వించవచ్చు. మరికొన్ని చోట్ల మాత్రం కథలోని సహజత్వాన్ని దెబ్బతీస్తాయి.  హీరోయిన్‌తో ప్రేమకథ కూడా బలంగా పండకపోవడంతో భావోద్వేగ పరమైన అనుబంధం ఏర్పడదు.. వెరసి ఈ కామెడీ కల్యాణ్ తేడా కొట్టేసింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కామెడీ కళ్యాణ్ ! రెనిగేడ్ కళ్యాణ్ ! నక్సలైట్లూ కామెడీ సరుకైపోయారా ?!
  • పాపం రాహుల్ ! మాటల్లో, వ్యవహార శైలిలో ఏదో భారీగానే తేడా కొడుతోంది !
  • ఈ అందాల జాస్మిన్ యువరాణి! మూలాలు వెతుక్కుంటూ ముంబైకి !!
  • న్యూయార్క్ సిటీ నిద్రపోదు.. టైమ్ స్క్వేర్ అస్సలు అలసిపోదు! 
  • బ్రాడ్‌వే షో – ఓ రంగస్థల అబ్బురం..! సురభి నాటకాలకు వంద మెట్లు పైన !!
  • స్టాక్ మార్కెట్… మహా పతనం వైపా? తాత్కాలిక సర్దుబాటా?
  • అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!
  • ఇదొక ‘PRESS’ దందా ! ఐడీ కార్డులిస్తారట – స్టిక్కర్లు కూడా ఇస్తారట !!
  • ఎలన్ మస్క్ Vs ముఖేష్ అంబానీ ! స్టార్‌లింక్‌ అడ్డుకునే ఆలిగార్కులు !!
  • తన స్టెప్పులతో రష్యన్లను మరోసారి షేక్ చేసిన డిస్కో డ్యాన్సర్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions