Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Dear You – రూపాయి పెడితే 150 రూపాయలు – గ్లేసియర్ బ్రేక్ బస్టర్ !!

September 2, 2026 by M S R

.

మనం ఇరుముడి, హనుమాన్ అంశ్… ఈ సినిమాల భారీ వసూళ్లు, లాభాల లెక్కలు చెప్పుకుంటున్నాం కదా… కానీ ఏకంగా 15,000 శాతం ప్రాఫిట్స్ కొట్టిన ఓ సినిమా గురించి తెలుసుకోవాలని ఉందా..? ఈమధ్యకాలంలో ఇదే అతి పెద్ద సెన్సేషనల్ హిట్… హెవీ బ్లాకెస్ట్ బస్టర్ లేదా గ్లేసియర్ బ్రేక్ అనాలేమో…

చైనాలో $300 మిలియన్లు… అమెరికాలో 86 స్క్రీన్లు! .‘Dear You’.. చిన్న సినిమాకు పెద్ద ప్రయోగం… చైనాలో ఓ చిన్న సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. భారీ బడ్జెట్ లేదు. పెద్ద అంతర్జాతీయ స్టార్లు లేరు. అయినా దాదాపు 300 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే సినిమా అమెరికా, కెనడా థియేటర్లలోకి అడుగుపెడుతోంది.

Ads

సినిమా పేరు ‘Dear You’…. చైనీస్ టైటిల్‌కు సుమారుగా “Love Letters for Grandma” అనే అర్థం వస్తుంది. సెప్టెంబర్ 4న ఉత్తర అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది.

అయితే ఇది అక్కడ ఏదో భారీ హాలీవుడ్ తరహా రిలీజ్ కాదు. అమెరికాలోని 23 రాష్ట్రాల్లో మొత్తం 86 స్క్రీన్లలో, కెనడాలో మరో రెండు లొకేషన్లలో ఈ సినిమా మొదట ప్రదర్శితం కానుంది. మార్కెట్ పరంగా చూస్తే ఇది చిన్న రిలీజ్. కానీ సినిమా వెనుక ఉన్న కథ, చైనాలో సాధించిన విజయం చూస్తే మాత్రం ఇది ఆసక్తికరమైన ప్రయోగమే.

అప్పుల బాధలో మొదలైన ప్రయాణం… ‘Dear You’ కథలో ఓ యువకుడు ఉంటాడు. అప్పుల్లో కూరుకుపోయిన అతను, తన కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడని భావించే తాతను వెతుక్కుంటూ థాయ్‌లాండ్‌కు వెళ్తాడు. అతని ఉద్దేశం చాలా సింపుల్‌… తాతను కలిసి తన ఆర్థిక సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూడటం.

కానీ ప్రయాణం మొదలైన తర్వాత కథ డబ్బు చుట్టూ తిరగదు. అది కుటుంబం చుట్టూ తిరుగుతుంది. తమ కుటుంబ చరిత్రలో దాగిపోయిన విషయాలను అతను ఒక్కొక్కటిగా తెలుసుకుంటాడు. ముఖ్యంగా ‘qiaopi’ అనే పాత చైనీస్ లేఖల సంప్రదాయం ఈ కథలో కీలకంగా మారుతుంది.

విదేశాలకు వలస వెళ్లిన చైనీయులు తమ కుటుంబాలకు రాసే లేఖలను ‘qiaopi’ అంటారు. వాటితో పాటు స్వదేశంలోని కుటుంబాలకు డబ్బు కూడా పంపేవారు. అంటే అవి కేవలం ఉత్తరాలు కాదు… ఒక కుటుంబం, ఒక తరం, ఒక వలస చరిత్రను మోసుకెళ్లిన పత్రాలు.

ఆ లేఖల ద్వారా మనవడు తన తాత, అమ్మమ్మల మధ్య ఉన్న సంబంధాన్ని, కుటుంబం గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను తెలుసుకుంటాడు. అందుకే ‘Dear You’ ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామా కంటే చైనీస్ వలస చరిత్ర, కుటుంబ బంధాలు, తరాల మధ్య దూరాన్ని కలిపిన కథగా నిలిచింది.

చైనాలో హిట్… అమెరికాలో? ఇక్కడే అసలు ప్రశ్న. చైనాలో సినిమా దాదాపు 300 మిలియన్ డాలర్లు సంపాదించింది. దక్షిణాసియాలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ చైనాలో హిట్ అయిన సినిమా అమెరికాలో కూడా హిట్ అవుతుందనే గ్యారంటీ లేదు.

చైనా, అమెరికా సినిమా మార్కెట్లు పూర్తిగా వేరు. చైనాలో కుటుంబం, వలస చరిత్ర, తాతయ్య- అమ్మమ్మల జ్ఞాపకాలు, పాత ఉత్తరాలు వంటి అంశాలు ప్రేక్షకులకు సహజంగా కనెక్ట్ కావచ్చు. కానీ అమెరికన్ మెయిన్‌స్ట్రీమ్ ఆడియన్స్‌కు అదే కథ ఎంతవరకు చేరుతుంది? అనేదే ‘Dear You’ ముందున్న అసలు పరీక్ష.

అందుకే 86 స్క్రీన్ల రిలీజ్‌ను కూడా ఒక రకంగా మార్కెట్ టెస్ట్గా చూడొచ్చు. సినిమాకు స్పందన బాగుంటే స్క్రీన్లు పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే చైనాలో సాధించిన భారీ విజయమే దాని అంతర్జాతీయ పరిమితిగా మిగిలిపోవచ్చు.

చైనా సినిమాలకు అమెరికాలో పెరుగుతున్న స్పేస్ … అయితే ‘Dear You’ ఒంటరిగా అమెరికా వైపు వస్తున్న చైనీస్ సినిమా కాదు. ఇటీవలి సంవత్సరాల్లో చైనీస్ సినిమాలు తమ స్వదేశ మార్కెట్‌ను దాటి ఇతర దేశాల్లోకి వెళ్లే ప్రయత్నం పెంచుకున్నాయి.

2025లో అక్టోబర్ 20 వరకు చైనీస్ సినిమాలు విదేశీ బాక్సాఫీస్ మార్కెట్లలో 140 మిలియన్ డాలర్లు సంపాదించాయని చైనా నేషనల్ ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ఆ సినిమాలు 46 దేశాలు, ప్రాంతాల్లో విడుదలయ్యాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన 20 సినిమాల్లో 15 సినిమాలు విదేశాల్లోనూ విడుదలయ్యాయి. అంటే చైనీస్ సినిమా ఇక కేవలం చైనా ప్రేక్షకుల కోసం మాత్రమే తయారవుతున్న కంటెంట్ కాదు. పాన్ వరల్డ్ సినిమాలు…

అమెరికాలో చైనీస్ సినిమాలకు మార్కెట్ పెరుగుతోందా? అమెరికాలో కూడా ఆ మార్పు కనిపిస్తోంది. 2025లో 54 కొత్త చైనీస్ సినిమాలు ఉత్తర అమెరికాలో విడుదలయ్యాయని, అవి కలిపి 38.44 మిలియన్ డాలర్లు వసూలు చేశాయని చైనా ప్రభుత్వ అనుబంధ మీడియా ‘Global Times’ పేర్కొంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 158 శాతం పెరుగుదల.

అయితే ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో చైనీస్ సినిమాలకు ప్రేక్షకులు ఉన్నారంటే… ప్రతి చైనీస్ సినిమా అక్కడ కమర్షియల్ హిట్ అవుతుందని అర్థం కాదు. ఒకప్పుడు విదేశీ భాషా సినిమాలంటే ఫిల్మ్ ఫెస్టివల్స్, ఆర్ట్‌హౌస్ థియేటర్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్, హారర్, క్రైమ్ వంటి విభిన్న జానర్ల సినిమాలు కూడా ఉత్తర అమెరికా మార్కెట్‌లోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు చైనాలో విడుదలైన సమయానికి దగ్గరగానే అమెరికాలోనూ విడుదలవుతున్నాయి.

అసలు ఆట సినిమా కంటే మార్కెటింగ్‌దేనా? ఇదే ‘Dear You’ విషయంలో ఆసక్తికరమైన అంశం. ఒక సినిమా ఎంత గొప్పగా ఉన్నా… దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా విడుదల చేయాలి? ఎవరిని టార్గెట్ చేయాలి? ఎలా ప్రమోట్ చేయాలి? ఏ థియేటర్లలో వేయాలి? అనే విషయాలు కూడా దాని విజయాన్ని నిర్ణయిస్తాయి.

2025లో హాంకాంగ్, జర్మనీ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని సూచించింది. 1992 నుంచి ఉత్తర అమెరికాలో చైనీస్ భాషా సినిమాల ఉనికి క్రమంగా పెరిగిందని, వాటి పరిధి ఫిల్మ్ ఫెస్టివల్స్‌ దాటి వాణిజ్య జానర్ల వరకు విస్తరించిందని పరిశోధకులు గుర్తించారు.

అంతేకాదు… ఏ సినిమాను కొనాలి? ఎలా మార్కెట్ చేయాలి? ఎప్పుడు, ఎన్ని స్క్రీన్లలో విడుదల చేయాలి? అనే నిర్ణయాల్లో డిస్ట్రిబ్యూటర్ల పాత్ర చాలా కీలకమని వారు పేర్కొన్నారు. అంటే చైనీస్ సినిమా అమెరికాలో ఎంత దూరం వెళ్తుందనేది కేవలం చైనా ప్రేక్షకులు ఎంతగా ఆదరించారు అన్నదానిపై ఆధారపడదు. అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ దాన్ని అమెరికన్ ప్రేక్షకుడికి ఎలా పరిచయం చేశాడన్నదీ అంతే ముఖ్యం.

చెప్పనే లేదు కదూ… డియర్ యు నిర్మాణవ్యయం జస్ట్ 19 కోట్ల రూపాయలు మన కరెన్సీలో… కానీ సంపాదించింది 2900 కోట్లు… అంటే 150 రెట్లు… 15 వేల శాతం లాభాలు… ఆగిపోలేదు, ఇంకా ఉంది దాని వసూళ్ల కథ… అమెరికా వసూళ్లు కలిపాక చివరి లెక్కలు తేలతాయి…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Dear You – రూపాయి పెడితే 150 రూపాయలు – గ్లేసియర్ బ్రేక్ బస్టర్ !!
  • ఇది మునుపటి ఇండియా కాదు ! రెండు బలమైన తాజా తార్కాణాలు !!
  • నెహ్రూకు ఓ ఆదివాసీ భార్య… ఆమెది కలిచివేసే ఓ విషాద కథ…
  • ప్రశాంత్ రెడ్డి ! అంతటి కేసీయార్‌కే హితవు చెప్పేంత ‘పెద్దరికమా !?
  • ఎడారిలో దారితప్పిన ఓ మనిషి… దూరంగా కనిపిస్తున్న ఓ శిథిల గుడిసె…
  • గడీ పాలన నుంచి ప్రజాపాలన దిశలో… చెప్పుకోదగిన ఈ 1000 రోజులు…
  • మోనోపలీ (monopoly) అంటే తెలుసు… డుయోపలీ (duopoly) తెలుసా మీకు !?
  • ఇదేం ‘యాక్షన్? – హైకమాండ్‌లోనే మద్దతు? ఏం సంకేతాలు ఇవి?
  • బిగ్‌బాస్ క్రాస్ ఓవర్ యాడ్ – కన్ఫ్యూజన్ ఫుడ్… లాజిక్‌లెస్ మూడ్!
  • ఏం చిల్లర గాళ్లురా మీరు..? పాకిస్థాన్ మురికి యాటిట్యూడ్ మారదు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions